నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, జగపతిబాబు, రావు రమేష్, ఫాహద్ ఫాజిల్, సునీల్, డాలీ ధనుంజయ, తారక్ పొన్నప్ప, అజయ్, శ్రీతేజ్, అనసూయ భరద్వాజ్ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణం: సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్
దర్శకత్వం: సుకుమార్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. 2021లో వీరి కాంబోలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. ఈ చిత్రం అల్లు అర్జున్ మరియు దేవిశ్రీ ప్రసాద్ లకు నేషనల్ అవార్డ్స్ అందించింది. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న పుష్ప 2 సినిమా కోసం కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో, ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు మేకర్స్. ఈ సినిమాపై క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్ లలో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఐమాక్స్ వెర్షన్ సహా మొత్తం 6 ఫార్మాట్ (డాల్బీ, డిబాక్స్, 4డిఎక్స్, ఐస్, 2డీ)లలో ఈ మూవీని విడుదల చేస్తుండటం గమనార్హం. అలాగే త్వరలోనే 3డీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.
ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచింది ఈ చిత్రం. అయితే ఈ మూవీ ఎలా ఉంది? పార్ట్ 1లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించిందా? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి మురిపించాడా? సుకుమార్ మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేయగలిగాడా? రిలీజ్‌కి ముందే రూ.1,000 కోట్ల బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను అలరించిందా? వంటి విషయాలు తెలియాలంటే మూవీ రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
కథ:-
ఎర్ర చందనం చెట్లను నరికి, ఆ దుంగలను స్మగ్లింగ్ చేసే కూలీగా జీవితం మొదలుపెట్టి ఆపై ఏకంగా సిండికేట్ లీడర్‌గా ఎదుగుతాడు పుష్ప రాజ్ (అల్లు అర్జున్). చిత్తూరు జిల్లాలో అతడి మాటే శాసనంగా చెల్లుబాటవుతుంది. అధికార పార్టీకి భారీగా ఫండ్ పంపిస్తుంటాడు. దీంతో పుష్పను కాదని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.
ఈ క్రమంలో ఒకసారి తమ ఊరికి వచ్చిన ముఖ్యమంత్రిని కలవడానికి పుష్ప వెళుతుంటాడు. అతడిని సీఎంతో ఓ ఫొటో తీసుకుని రా అని కోరుతుంది భార్య శ్రీవల్లి (రష్మిక). ‘సీఎంతో ఫొటోయే కదా, అదెంతపని అనుకుంటాడు పుష్ప. అయితే సీఎం పేషీలో అతడికి ఎదురు దెబ్బ తగులుతుంది. స్మగ్లర్లు కేవలం పార్టీ ఫండ్ ఇవ్వడం వరకే కానీ, ఫొటోలు తీసుకోవడానికి కాదంటూ సీఎం నిరాకరిస్తాడు.
ఆత్మాభిమానం మెండుగా గల పుష్ప ఈ సంఘటనను పెద్ద అవమానంగా భావిస్తాడు. దాంతో తమ స్మగ్లింగ్‌లో భాగం ఉన్న ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)తో ఓ ఫొటో తీసుకొని, ఆయననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు పుష్ప. అయితే అందుకుగానూ దాదాపు రూ.500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తారు. ఆ రూ.500 కోట్ల కోసం రెండు వేల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది.
మరోవైపు అప్పటికే ఆ జిల్లా ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజల్)తో పుష్ప గొడవపడి ఉండటంతో అతను ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. మరి.. భన్వర్ సింగ్ షెకావత్‌ని దాటుకొని పుష్ప ఆ రెండు వేల టన్నుల సరుకు స్మగ్లింగ్‌ను చేయగలిగాడా? సిద్ధప్పను సీఎం చేయడానికి పుష్ప రాజ్ ఏం చేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకొన్నాడు?
ఎలాగైనా సరే పుష్పను పట్టుకుని తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోన్న భన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు? సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి (జగపతి బాబు), అతని తమ్ముడి కొడుకు (తారక్ పొన్నప్ప)కు, పుష్పకు సంబంధం ఏమిటి?చిన్నప్పటినుంచీ ఇంటిపేరు కోసం పాకులాడే పుష్పకు అది దక్కిందా? అనేది మిగిలిన కథ. ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
పుష్ప సినిమాతో పుష్పరాజ్ క్యారెక్టర్, శేషాచలం అడవులు, ఎర్రచందనం స్మగ్లింగ్ ఇవ్వన్నీ ప్రేక్షకులందరికీ తెలుసు. దాంతో కొత్తగా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ సుకుమార్ ఎక్కువ టైం తీసుకోలేదు. అప్పటికే అవన్నీ తొలిభాగంలో చూసి ఉండటంతో ఆడియెన్స్ కూడా త్వరగా కనెక్ట్ అయిపోతారు. దీంతో నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు.
పుష్ప 2 కథ జపాన్‌లో మొదలవుతుంది. పుష్పరాజ్ ఓ కంటైనర్‌లో 40 రోజుల పాటు నీళ్లూ, ఆహారం లేకుండా జపాన్ వరకూ రావడం, దిగీ దిగగానే వందమంది ఫైటర్లతో ఓ రేంజ్‌లో ఫైట్‌తో హీరో ఎలివేషన్ షురూ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది. పుష్ప బాల్యంలో పడిన అవమానాల్ని చూపిస్తూ సాగే సీన్స్ మంచి ఎమోషన్ టచ్ ఇస్తాయి.
ఆ తరవాత కథలో కొన్ని క్యారెక్టర్స్ పరిచయమవుతాయి. పోలీస్ స్టేషన్‌లో ‘ఇది పుష్పగాడి రూలు..’ అని డిక్లేర్ చేసినప్పటి నుంచీ కథలో వేగం పుంజుకుంటుంది. చెప్పాలంటే, ఇక్కడినుంచే అసలైన జాతర మొదలవుతుంది. ఫ్యాన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్ సీన్లు విజిల్స్ వేయిస్తాయి. వీటిలో సుక్కు మార్క్ కనబడుతుంది. అలాగే మధ్యమధ్యలో పాటలు, వాటిలో బన్నీ స్టెప్పులు మెప్పిస్తాయి.
ఓ మాంచి ఎమోషన్, ఎలివేషన్ మిక్స్ చేసిన సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సన్నివేశంలో అల్లు అర్జున్ నటన పీక్స్‌లో ఉంటుంది. షెకావత్‌కు పుష్పరాజ్ సారీ చెబుతాడా, చెప్పాడా? చెబితే ఏంటి? చెప్పకపోతే ఏంటి? అనే సంశయం చుట్టూ ఉండే పాత్రలతోపాటు ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక్కడ ఆ సీన్‌ని మొదలెట్టిన తీరు, ముగించిన పద్ధతి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేలా సాగుతుంది.
ఇక ఏ సినిమాకైనా సెకండాఫ్ చాలా కీలకం. సినిమాను నిలబెట్టే ఓ మూడు ఎపిసోడ్స్ కనుక పండాయంటే బొమ్మ బ్లాక్ బస్టరే. ఇందుకు తగ్గట్టుగానే పుష్ప 2 సెకండాఫ్ మొదలవుతుంది. ముందునుంచి టీమ్ అంతా చెప్పినట్టే జాతర ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. చాలా హై ఇస్తుంది. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో తెలీదు అనేంతలా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసిన ఎపిసోడ్ అది.
ఈ జాతర పాటలో అల్లు అర్జున్ నటన అమోఘం. విశ్వరూపం చూపించాడనేది కూడా చాలా చిన్న మాటగా అనిపిస్తుంది. ఈ పాటలో అతడి ఎక్స్‌ప్రెషన్స్, ఆడిన తాండవం.. ‘న భూతో’. నిజంగానే అమ్మవారు పూనారా? అన్నట్టు థియేటర్లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి. దీనికి దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎమ్ తోడై పూనకాలు తెప్పిస్తుంది. ఈ ఎపిసోడ్ ఓ డికేడ్ పాటు గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి లేదు.
ఈ ఎపిసోడ్ ఓ హై పాయింట్‌తో మొదలై చివరివరకూ ఏమాత్రం తగ్గకుండా ముగుస్తుంది. ఇక్కడ సుకుమార్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. శ్రీవల్లితో ఎమోషనల్ సీన్ పెట్టి హై ఎండ్ ఇచ్చాడు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ నటన ఏ స్థాయిలో ఉంటుందో.. రష్మిక నటన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇలా ఓ ఎపిసోడ్ మొత్తం హీరో, హీరోయిన్లు పోటీ పడి నటించడం.. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం.
ఇక దీనికి తగ్గట్టే క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్.ఆర్ ఆ సీన్‌ని మరింతగా ఎలివేట్ చేసింది. అలాగే ప్రీ క్లైమాక్స్ ఫైట్ కూడా హై ఇస్తుంది. పార్ట్ 3కి అవసరమైన లీడ్ ఒక క్లిఫ్ హ్యాంగర్ (ఎగ్జైట్‌మెంట్)తో ఎండ్ అవుతుంది. మొత్తానికి ‘పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా’ అని హీరో చెప్పే డైలాగ్ ‘పుష్ప 2’కు అది టర్నింగ్ పాయింట్. అని చెప్పొచ్చు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ఎలాంటి నటుడో చెప్పక్కలేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకుని, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా నిలిచాడంటేనే తెలుస్తుంది తన యాక్టింగ్ కెపాసిటీ ఏంటో. దాదాపు ఐదేళ్లు ఈ పుష్పరాజ్ పాత్రకోసం ఆయన పడిన కష్టం, చూపిన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ క్యారక్టర్‌లో తన మార్క్ స్టైల్, గ్రేస్.. అన్నీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి.
హీరోయిన్ రష్మిక మందన్న కూడా శ్రీవల్లి పాత్రలో జీవించేసింది. పుష్పలో కన్నా ఈ మూవీలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆమె జీవితంలో మళ్ళీ ఇలాంటి క్యారక్టర్ వస్తుందో, లేదో చెప్పలేం. ఎమోషనల్ సన్నివేశాల్లో రష్మిక నటన హైలైట్. అలాగే శ్రీలీల కిస్సిక్ పాటలో తన డ్యాన్సింగ్ స్కిల్స్ పవర్ చూపిస్తుంది. బన్నీ పక్కన ఆమె ఏమాత్రం తగ్గకుండా ఫుల్ ఎనర్జిటిక్ గా స్టెప్స్ వేసింది.
ఇతర నటులలో ఫాహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు. పుష్పరాజ్‌ను ఢీకొట్టే భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తన మార్క్ నటనను ప్రదర్శించాడు. ఈ క్యారక్టర్ ఆయన తప్ప మరెవ్వరూ వేయలేరు అనేంతగా నటించాడు. అలాగే జగపతిబాబు, రావు రమేష్ ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. ఇంకా సునీల్, డాలీ ధనుంజయ, అనసూయ మరోసారి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
ఇక సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్ లో ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పుష్ప పార్ట్ 1 మాదిరే ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. సాంగ్స్ అన్నీ చాలా బావున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూజ్ బంప్స్ తెప్పించేలావుంది. చాలా సీన్స్ కేవలం బీజీఎమ్ వల్ల హైలైట్ అయ్యాయి. దేవి మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్ అంటే అతిశయోక్తి లేదు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. పోలాండ్ దేశానికి చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్ సుకుమార్ విజన్ ని బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించారు. పుష్ప సినిమాకు కూడా ఈయనే కెమెరా అందించిన విషయం తెలిసిందే. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ అందంగా ఉన్నాయి.
అలాగే ఎడిటింగ్ విషయానికొస్తే, నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రంతో తన ట్యాలెంట్ ఏంటో చూపించాడు. దాదాపు మూడున్నర గంటల నిడివి ఉన్నాకూడా మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందంటే అందుకు నూలి ఎడిటింగే కారణం. చాలా షార్ప్ గా ఉండి సినిమాపై ఆసక్తిని కోల్పోకుండా చేసింది.
మరోవైపు ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ సింగిల్ కార్డుతో అందించిన సాహిత్యం పాటలను మరో స్థాయిలో నిలబెట్టింది. ఎస్. రామకృష్ణ మరియు మోనికా నిగోత్రే ఆర్ట్ వర్క్ సహజత్వంతో ప్రతి ఫ్రేమ్ మనకి కనువిందు చేస్తుంది. నిర్మాతల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని తెలుస్తుంది.
ఓవరాల్‌గా పుష్ప 2 సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కమర్షియల్ సినిమానే అయినా డిఫరెంట్ ఫార్మాట్‌లో సాగుతుంది. యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే వారు ఈ మూవీని ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి పుష్ప 2 అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.
అల్లు అర్జున్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో పుష్ప 2 ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే ఈ పుష్పరాజ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నేమ్ వరల్డ్ వైడ్‌గా మారుమోగిపోతుంది. ‘పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే’ అని అన్ని దేశాల్లో వినిపించడం పక్కా. పుష్పరాజ్ డైలాగ్ వైల్డ్ ఫైర్ లెక్కే ఉంది మూవీ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: