న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. నాని ఖాతాలో మరో హిట్ చేరిందో?లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటినటులు.. నాని, నజ్రియ నజిం, నరేష్, రోహిణి, నదియా, హర్ష వర్ధన్, అషగం పెరుమాళ్, నిక్కి తంబోలి, పృథ్వీ రాజ్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
డైరెక్టర్.. వివేక్ ఆత్రేయ
బ్యానర్స్.. మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు.. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
మ్యూజిక్ డైరెక్టర్.. వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ.. నీకేత్ బొమ్మి
కథ..
సుందర ప్రసాద్ (నాని) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అంతేకాదు ఆ కుటుంబానికి ఒక్క వారసుడు ఇతడే. ఇక తన కుటుంబం మూఢనమ్మకాలను బాగా నమ్ముతూ ఉంటుంది. ప్రతి ఒక చిన్న విషయం లో సుందర ప్రసాద్ ని మూఢనమ్మకాల పేరుతో ఆ కుటుంబం బాగా వేధిస్తూ ఉంటుంది. ఆ బాధలు తట్టుకోలేక సుందర్ అమెరికాకు వెళ్దామని అనుకుంటాడు. కానీ అతని జాతకంలో చిక్కులు, కొన్ని గండాలు ఉన్నాయి అని అతని కుటుంబం ఆపుతుంది. మరోవైపు సుందర్, లీలా థామస్ (నజ్రియా) చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్. ఇక వారి స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. దీంతో ఇద్దరూ విభిన్న కులాలకు సంబంధించిన వారు కావడంతో వారి ప్రేమ విషయాన్ని వారి కుటుంబ సభ్యులతో చెప్పడానికి భయపడతారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు కుటుంబాలని కలపడానికి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటి? అది ఎంతవరకు వర్కవుట్ అయింది? చివరికి వీరిద్దరి కథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లు ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. అయితే ఏ జోనర్ అయినా సరే తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించాలి. ఇక అంటే సుందరానికీ సినిమా కూడా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనరే. ఇక మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఈసినిమాను కూడా తన స్టైల్ ఆఫ్ నెరేషన్ తో చాలా బాగా మలిచారు. తన ముందు సినిమాల లాగానే ఈ సినిమాను కూడా ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. కథ మాత్రమే కాదు కథకు తగ్గట్టు నటీనటులను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాడు. అటు కామెడీకి పెద్ద పీట వేస్తూనే మరోవైపు ఎమోషన్ ను కూడా చూపించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల ఇంట్రడక్షన్, కథ ఎస్టాబ్లిష్ చేయడం, కామెడీ సన్నివేశాలతో అయిపోతుంది. ఇక ఇంటర్వెల్ అలానే సెకండాఫ్, క్లైమాక్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
ఒక రకంగా ఇది సెన్సిటివ్ టాపిక్.. సరిగ్గా చూపించకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి.. అయితే వివేక్ మాత్రం చాలా బాగా డీల్ చేశాడు. కులాంతర వివాహాల నేపధ్యంలో మనం చాలా సినిమాలే చూసాం.. అయితే దీనికి కామెడీని యాడ్ చేసి మంచి కామెడీ ఎంటర్ టైనర్ ను అందించడంలో సక్సెస్ అయ్యాడు వివేక్ ఆత్రేయ. సంప్రదాయాలు, కట్టుబాట్లు మనుషులకే కానీ మనసులకు కాదని ఈసినిమాతో చూపించాడు.
నాని గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కామెడీ టైమింగ్ కు నాని పెట్టింది పేరు. ఈమధ్య కాస్త సీరియస్ పాత్రలు చేస్తున్నాడు కానీ.. తెలుగు ప్రేక్షకులకు నానిలో నచ్చేది తన కామెడీ టైమింగే. ఇక ఈసినిమాతో మరోసారి నాని తన కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. నాని నటన మాత్రం అదుర్స్. తన డైలాగులతో, కామెడీ టైమింగ్ తోఅందర్నీ ఆకట్టుకున్నాడు. ఇక నజ్రియాకు తెలుగులో చేయడం ఇది మొదటి సారి అయినా కూడా తను ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో డబ్బింగ్ అయిన రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందే పరిచయమైన నజ్రియా.. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక ఈసినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది నజ్రియా. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ మరియు లీలా క్యారెక్టర్‌కి వాయిస్ కూడా ఇవ్వడం హైలెట్ అని చెప్పాలి. నాని తండ్రిగా నరేష్ చాలా బాగా చేసాడు మరియు శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి మరియు ఇతరులు తమ పాత్రల మేర నటించి ఆకట్టుకున్నారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రాఫీ బాగుంది. నికేత్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. వివేక్ సాగర్ సంగీతం కూడా చాలా బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: