కిశోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమాతో శర్వా తన హిట్ ఖాతాను మళ్లీ తెరిచాడా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. శర్వానంద్, రష్మిక మందన్న, రాధికా శరత్‌కుమార్, ఖుష్బు, ఊర్వశీ, వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ
దర్శకత్వం..కిషోర్ తిరుమల
నిర్మాత..సుధాకర్ చెరుకూరి
బ్యానర్స్.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్
సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ.. సుజిత్ సారంగ్
కథ
రాధికా శరత్‌కుమార్, ఊర్వశి వల్ల శర్వానంద్ (చిరు) పెళ్లి కాకుండా బ్యాచిలర్‌గా ఉంటాడు. అదే సమయంలో చిరుకు ఆద్య (రష్మిక మందన్నా) ఎదురుపడుతుంది. ఆద్య మీద ఇష్టం పెరిగి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు చిరు. కానీ ఆద్య తల్లి వకుళ( ఖుష్భూ)కు తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కారణాలవల్ల పెళ్లి పట్ల మంచి అభిప్రాయం ఉండదు. ఆ కారణం చేతనే ఆద్య కి పెళ్లి చేయాలన్న ఇష్టం ఉండదు. దీంతో చిరు, ఆద్యను, వారి కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించాడు, ఎలా ఆద్యను దక్కించుకున్నాడు అనేది కథ.
విశ్లేషణ..
కిషోర్ తిరుమల సినిమాల గురించి తెలిసిందే. నేను శైలజ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో పరిచయమైన కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో మంచి అనుభవమే ఉంది.
తన సినిమాలన్నీ చాలావరకు ఆడియన్స్ కాసేపు చూసి నవ్వుకునేలానే ఉంటాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా అదే కేటాగిరికి చెందుతుంది. ఈసినిమాలో కూడా కామెడీకే పెద్ద పీట వేశాడు. అదే ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయింది. అంతేకాదు ఇందులో సీనియర్ నటులను తీసుకున్నా కిషోర్ అందరికీ సమానంగా ప్రాధాన్యత దక్కడం లాంటి విషయాలను చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ఇక ఇలాంటి కథలు మనకు పరిచయమే అయినా కిషోర్ తిరుమల టేకింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా ఉంటుంది.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శర్వానంద్ కూడా ఒకడని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఈమధ్య కాలంలో మాత్రం శర్వాకు టైమ్ అస్సలు కలిసిరావడం లేదు.. వరుసగా అపజయాలను మూటగట్టుకుంటున్నాడు. అయినా కూడా ఎక్కడా నిరాశచెందకుండా వరుసగా అయితే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక అదే నమ్మకంతో నేడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఉన్న ఓ అబ్బాయికి తన కుటుంబంలోని మహిళల వలన పెళ్లిళ్లు సెట్ కాకపోవడం.. నచ్చిన అమ్మాయి రిజెక్ట్ చేయడం.. దీంతో ఆ అమ్మాయిని తన ప్రేమను ఒప్పించేందుకు శర్వానంద్ ప్రయత్నాలు చేయడం ఇదీ ఈ సినిమా కథ. ఇక ఈసినిమా విషయంలో శర్వా నమ్మకం నిజమైనట్టే అనిపిస్తుంది. ఈసినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.
ఇక ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాల్లో నటించడం శర్వాకు కొత్తేమి కాదు. గతంలోనే ఇలాంటి పాత్రలు చేశాడు. ఇప్పుడు చిరు పాత్రలో కూడా ఒదిగిపోయాడు శర్వా. కామెడీ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించాడు. ఇక రష్మిక కూడా తన పాత్రలో బాగానే నటించింది. తనకు ప్రపంచంలో తల్లి తప్ప ఇంకేదీ ముఖ్యం కాదనుకునే అమ్మాయిగా రష్మిక నటన బావుంది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్యకృష్ణన్ ఎవరి పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. వెన్నెలకిశోర్ కామెడీ, ఊర్వశి స్టీల్ డబ్బా కామెడీ, బ్రహ్మానందం రైల్వే స్టేషన్ పెళ్లిచూపులు నవ్వించాయి.
ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. టైటిల్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా బావుంది. నేపథ్య సంగీతం బావుంది. సుజిత్ కెమెరా వర్క్ బావుంది. సన్నివేశాల్లో ఓ ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ తో వచ్చిన శర్వా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: