కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ. ఇక నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, రోహిణి, ప్రవీణ్, అనిత చౌదరి, గోవింద్ పద్మసూర్య, రంజిత్, నాగబాబు, దువ్వాసి మోహన్ తదితరులు
దర్శకత్వం.. కళ్యాణ్ కృష్ణ
బ్యానర్స్.. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
సంగీతం..అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫి.. యువరాజ్
కథ
సీక్వెల్ కాబట్టి సోగ్గాడే చిన్ని నాయనా ఎక్కడ ముగుస్తుందో అక్కడే సినిమా మొదలవుతుంది. మొదటి పార్ట్ లో చూసినట్టుగానే బంగార్రాజు చనిపోయి స్వర్గంలో ఉంటాడు. ఇక తాత మ్యానరిజమ్స్, తాత అంశతో పుడతాడు చిన్న బంగార్రాజు (నాగ చైతన్య). శివపురం గ్రామంలోనే ప్లే బాయ్ తరహాగా ఉండే చిన్న బంగార్రాజు.. లోకల్ సర్పంచ్ (కృతి శెట్టి) ప్రేమలో పడతాడు. ఇక మరోవైపు శివపురం శివాలయం సంపదపై కొంతమంది కన్ను పడుతుంది. ఈనేపథ్యంలో చిన్న బంగార్రాజు వారికి అడ్డుగా ఉండటంతో ఆ సంపదను దోచుకోవడానికి వీలుపడదు. అలాంటి క్రమంలో బంగార్రాజు (నాగార్జున) తిరిగి భూమి మీదకు వస్తాడు. మరి బంగార్రాజు తిరిగి భూమి మీదకు ఎందుకు వస్తాడు.. చిన్న బంగార్రాజుకి ఎలా సహాయం చేస్తుంటాడు.. శివాలయం సంపదను ఎలా కాపాడుతాడు అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ
నిజానికి సీక్వెల్ సినిమాలు టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఏదో పెద్ద సినిమాలు ఒకటి రెండు తప్పా. కానీ బంగార్రాజు విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈసినిమా నిజంగానే పండుగలాగ ఉంది అన్న టాక్ ను సొంతం చేసుకుంటుంది. కళ్యాణ్ కృష్ణ స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ లో కామెడీ రొమాంటిక్ సీన్స్, నాగ్ మరియు నాగ చైతన్యల పెర్ఫామెన్స్ ఇలా అన్ని సన్నివేశాలు చాలా బాగా రాసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ ను, ఎమోషన్ యాంగిల్ ను చూపించాడు. క్లైమాక్స్ కూడా ఎమోషనల్ గా ముగుస్తుంది. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ కూడా ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్ గానే కథను నడిపిస్తూ.. అక్కడక్కడా ట్విస్ట్ లు చూపిస్తూ.. అందులోనే కామెడీ ని కూడా ఎక్కడా తగ్గించకుండా.. అలానే ఎమోషనల్ యాంగిల్ ను కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి బంగార్రాజును తీశాడు. ఆ విషయంలో కళ్యాణ్ కృష్ణ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున చేసిన సందడి చూశాం. ఇప్పుడు నాగ్ కు తోడుగా తనయుడు నాగచైతన్య కూడా జోడీ కట్టడంతో స్క్రీన్ కలర్ ఫుల్ గా ఉంది. నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. యాక్టీవ్ గా ఉండే పాత్రలు గతంలో కూడా చాలానే చేశాడు. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా సోగ్గాడే చిన్ని నాయనాతో మళ్లీ ఎనర్జిటిక్ నాగ్ బయటకు వచ్చాడు. అయితే నాగచైతన్య కు మాత్రం ఇలాంటి పాత్ర కొత్తే అని చెప్పాలి. కాస్త సైలెంట్, లవర్ బాయ్ పాత్రలు, మాస్ పాత్రలు చేశాడు కానీ ఇలా ఫుల్ లెంగ్త్ యాక్టీవ్ గా ఉండే పాత్ర చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈసినిమాలో నాగచైతన్య.. నాగార్జునకు మనవడిగా నటించాడు. నాగచైతన్య కూడా వాసివాడి తస్సాదియ్యా అనే డైలాగ్ మేనరిజంతో అదుర్స్ అన్పించాడు. ఈసినిమాలో నాగ్ తో పోటీ పడి మరీ నటించాడు చై. మనం తరువాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇక నాగ్ కు జోడీగా నటించిన రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీక్వెల్ లో కూడా నాగ్ కు జోడీగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక సర్పంచ్ పాత్రలో చేసిన కృతిశెట్టి కూడా బాగా నటించింది. మిగిలిన నటీనటులు రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ఇంకా ఇతర నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలం అయ్యాయి. అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు ఇప్పటికే ఆకట్టుకోగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సినిమాటోగ్రాఫర్ గా చేసిన యువరాజ్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా చూపించాడు. పల్లెటూరి వాతావరణాన్ని చాలా కలర్ ఫుల్ గా చూపించాడు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దానికితోడు పోటీలో పెద్ద సినిమాలేవి లేకపోవడం ‘బంగార్రాజు’కు కలిసొచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: