వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, హేమ, అంటోని, రవిప్రకాష్ తదితరులు
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్ వీఎస్
కథ
కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లినా ఉద్యోగం రాకపోవడంతో మళ్లీ తన గ్రామానికే వెళ్లిపోతాడు. ఈ క్రమంలో తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా ఊరి గొర్రెల మందతో కొందరు ‘కొండపొలం’ చేస్తున్నారని, తమ గొర్రెలనూ తీసుకుని వారితో కలిసి నల్లమల అడవికి వెళ్లమని చెబుతాడు. ఇక తాత మాటలు విన్న రవీంద్ర కొండపొలం చేయడానికి వెళతాడు. ఆ సమయంలో పలు సమస్యలు ఎదుర్కోవడంతో పాటు అనేక విషయాలు తెలుస్తాయి. నెల రోజుల పాటు అడవితో సహజీవనం చేశాక రవీంద్రలో ఎలాంటి మార్పు వచ్చింది.. ఆ అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని అతను ఎలా విజయపథంలో సాగాడన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ
క్రిష్ సినిమాలు చూస్తే తన సినిమాలు ఏ రకంగా ఉంటాయో అందరికీ ఒక ఐడియా ఉంటుంది. సమాజంలో జరిగే కొన్ని నిజ సంఘటనలు బేస్ చేసుకొని ఒక మెసేజ్ ఒరియెంటెడ్ గా సినిమాలు తీయడంలో దిట్ట. ఇక ఈసినిమాతో పశువులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు క్రిష్. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను తీసినా దానికి తగ్గట్టు పాత్రలను తెరపై చూపించడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు. అడవుల నేపథ్యంలో పలు సినిమాలు వచ్చినా ఇలాంటి కథతో సినిమా రావడం ఇదే మొదటిది అని చెప్పొచ్చు. అడవికి వెళ్లే గొర్రెకాపరులు, అక్కడ వారి జీవన పద్దతిపై ఇంతవరకు ఏ చిత్రమూ రాలేదు. ప్రకృతితో, తోటి జీవులతో మనిషి మమేకం కావాలి తప్పితే, తన స్వార్థం కోసం వాటిని నాశనం చేయకూడదనే విషయాన్ని తెలియచేశారు.
రవీంద్ర పాత్రలో వైష్ణవ్ తేజ్ ఒదిగిపోయాడు. ‘ఉప్పెన’లో మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించి వైష్ణవ్… కొండపొలంలో గొర్రె కాపరుల సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కనిపించాడు. మొదటి నుండి వైష్ణవ్ తేజ్ కళ్ల పై అందరూ ఎలా అయితే ప్రశంసలు కురిపిస్తారో తెలిసిందే. తన కళ్లతోనే సగం ఎక్స్ ప్రెషన్స్ ను పలికించేస్తాడు.
నిజానికి హీరోయిన్ పాత్ర ఈసినిమా కోసమే రాసుకున్నారు. ఓబులమ్మ పాత్రను ఈ సినిమా కోసం స్పెషల్ గా క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టే ఓబులమ్మ పాత్రలో నటించిన రకుల్ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డీ గ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా ఓదిగిపోయింది.
ఎన్నో ఏళ్ల తరువాత ఫిదా సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సాయి చంద్ర్ ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అయిపోతున్నాయి. ఇక ఈసినిమాలో కూడా రవీంద్ర తండ్రి గురప్ప పాత్రలో సాయిచంద్ పరకాయ ప్రవేశం చేశాడు. ఓ గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అచ్చం అలానే తెరపై కనిపించాడు. రవీంద్రతో పాటు అడవికి వెళ్లే ఇతర పాత్రల్లో రవి ప్రకాశ్, హేమ, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఈసినిమాకు మరో ప్రధాన బలం సన్నపురెడ్డి సంభాషణలు. తాను రాసిన డైలాగ్స్ చాలా వరకూ హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాగే కీరవాణి ఈ చిత్రాన్ని తన సంగీతంతోనూ అలాగే జ్ఞానశేఖర్ తన కెమెరా పనితనంతోనే మరో మెట్టు ఎక్కించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే అందరికీ ఈసినిమా నచ్చుతుంది అని చెప్పలేం కానీ.. ప్రకృతిని ఇష్టపడే వారికి.. కాస్త కొత్త సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: