పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు

Power Star Pawan Kalyan Sensational Blockbuster Movie Gabbar Singh Completes 8 Years.

“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా అదే బాట పట్టింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో పవన్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది. అంతేకాదు.. ఈ సినిమాతోనే శ్రుతి తన కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకోవడం విశేషం. సుహాసిని, అజయ్, అభిమన్యు సింగ్, తనికెళ్ళ భరణి, అలీ, నాగినీడు, కోట శ్రీనివాసరావు, రావురమేష్, బ్రహ్మానందం, గాయత్రీ రావు, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, ప్రవీణ్, ‘సత్యం’ రాజేష్ ముఖ్య భూమికలు పోషించగా.. బాలీవుడ్ ఐటమ్ గ‌ర్ల్ మలైకా అరోరా ప్రత్యేక గీతంలో నర్తించింది.

ఈ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించగా చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, సాహితి, దేవిశ్రీప్రసాద్ సాహిత్యం స‌మ‌కూర్చారు. “ఆకాశం అమ్మాయైతే”, “పిల్లా నువ్వులేని జీవితం”, “దిల్ సే”, “దేఖో దేఖో గబ్బర్ సింగ్”, “కెవ్వు కేక”, “మందుబాబులం”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. అలాగే, ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం.. ఉత్తమ నటుడు(పవన్ కళ్యాణ్), ఉత్తమ సంగీత దర్శకుడు(దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ గాయకుడు(వడ్డేపల్లి శ్రీనివాస్ – “పిల్లా నువ్వు లేని జీవితం”) విభాగాల్లో ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డులను సొంతం చేసుకుంది. 2012 మే 11న విడుదలై ఘన విజయం సాధించిన ‘గబ్బర్ సింగ్’.. నేటితో 8 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here