మెగాస్టార్ చిరంజీవి సారథ్య సమర్ధతలకు నిదర్శనం సి సి సి

CCC Will Remain As A Standing Example For Mega Star Chiranjeevi Administrative Capabilities

సి సి సి…. కరోనా క్రైసిస్ చారిటీ…

ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవరి నోట విన్నా ఇదే మాట… నిజానికి కరోనా తీవ్రరూపం దాల్చి సమస్త ప్రపంచము స్తంభించి పోతుందని ఎవరూ ఊహించలేదు… సెంటినరీకి చేరువవుతున్న ఇండియన్ సినిమా టాకీ చరిత్రలో భారతీయ సినిమా ఇంత మూకీగా మారిపోవటం ఒక అనూహ్య పరిణామం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుద్యోగ నిస్సహాయతలోకి జారిపోయిన చిత్ర పరిశ్రమకు నిజమైన చేయూత కావాలి. కానీ ఆ చేయూత ఎలా లభిస్తుంది? ఎవరి ద్వారా లభిస్తుంది? గడప దాటకూడదు.. మనిషిని మనిషి తాకకూడదు… కరచాలనాలు… ఆలింగనాలు… పలకరింపులు పులకరింపులు నిషిద్ధమైన నికృష్ట పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ కార్యక్రమాలు జరగాలి అంటే అదెలా సాధ్యం…? ఇచ్చేవారు ఇల్లు దాటకూడదు… తీసుకునే వాళ్ళు గడప దాటకూడదు.. అనే దౌర్భాగ్య పరిస్థితులను కల్పించిన కరోనా రక్కసిని ఎదుర్కుంటూ సహాయ కార్యక్రమాలను ఉద్యమ రూపంలో నిర్వహించాలి అంటే ఎలా.. ?

అది ఎలాగో… చేసి చూపించింది సీసీసీ.

లాక్ డౌన్ ప్రతిష్టంభనతో చేష్టలుడిగిన చిత్ర పరిశ్రమలో ఆకలి కేకల ఆర్తనాదాలు తప్పవు అనుకున్న తరుణంలో “దరికి రాద తనే వసంతం” – అంటూ పరిశ్రమ ముందుకు వచ్చింది సి సి సి …

ఇంతకూ సిసిసి అనే ఆకస్మిక అక్షయ పాత్రకు రూపకల్పన ఎలా జరిగింది…? అసలు ఆ ఆలోచన ఎవరు చేశారు? ఒక ఆలోచన వచ్చినంత మాత్రాన అది ఉద్యమ స్థాయిలో కార్యరూపం దాల్చటం ఎలా సాధ్యమైంది.. ?  ఎలా అంటే మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి పిలిస్తే… పిలుపునిస్తేనే ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి. నిజానికి చిరంజీవి మనసులో ఈ ఆలోచన రూపుదిద్దుకున్న ముహూర్త బలం ఏమిటో గాని కోట్లాది రూపాయల విరాళ వర్షం కురిసింది. అయితే డబ్బు చేకూరినంత మాత్రాన ఇలాంటి విస్తృతస్థాయి సేవా కార్యక్రమాలు కార్యరూపం దాల్చవు.  చిరంజీవి పిలుపుమేరకు తమ్మారెడ్డి భరద్వాజ, సి.కళ్యాణ్, మెహర్ రమేష్, ఎన్.శంకర్, దాము, బెనర్జీ అనే ఆరుగురు సినీ ప్రముఖులు కార్యోన్ముఖులై కదం తొక్కడంతో సిసిసి అనే సేవా స్రవంతి చిత్ర పరిశ్రమలో పరవళ్ళు తొక్కింది. వారికి ఇంకెందరో సినీ శ్రామికులు జత చేరి 14 వేల సినీ కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు. ఆ అద్భుత సేవా కవాతు గురించి తెలుసుకున్న ఆలిండియా సూపర్ స్టార్ అమితాబచ్చన్ చిరంజీవికి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలియ చేయడమే కాకుండా 12 వేల మంది సినీ కార్మికులకు 1500 రూపాయల చొప్పున గిఫ్ట్ కూపన్స్ గిఫ్ట్ గా పంపించారు అంటే సి సి సి ఎంత నిబద్ధతతో ఈ సేవ ఉద్యమాన్ని నిర్వహిస్తుందో అవగతమవుతుంది. నిజానికి గతంలో చలన చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో సేవా సహాయ కార్యక్రమాలు జరిగినప్పటికీ ఇంత విస్తృత స్థాయిలో ఇంత నిబద్ధతతో జరగటం మాత్రం ఇదే ప్రథమం. అంతేకాకుండా గతంలో ప్రకృతి వైపరీత్యాల కష్టకాలంలో పరిశ్రమ ప్రజలను ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇలా ఒకవైపు భూరి విరాళాలతో ప్రజలను ఆదుకునే పర ధర్మాన్ని మరొకవైపు తమ కార్మికులను తాము కాపాడుకునే స్వధర్మాన్ని ఏకకాలంలో పాటించిన సందర్భం మాత్రం ఇదే. ఇలాంటి ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి మీద ఇప్పుడు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. “ఈ కరోనా విపత్తు ఒకటీ రెండు నెలల్లో సమసి పోయేది కాదు… ఈ కష్టం ఎంత కాలమున్నా అందుకు మనం సంసిద్ధులం కావాలి ” అంటున్నారట మెగాస్టార్ చిరంజీవి.

చిరంజీవి గారు లీడ్ తీసుకోవటంవల్ల పరిశ్రమకు చాలా మేలు జరిగింది:
సి.కళ్యాణ్ .

ఈ నేపథ్యంలో చిరంజీవి సారథ్య, నాయకత్వాలను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ గొప్పగా ప్రశంసించారు. మంగళవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో జరిగిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో సి.కళ్యాణ్ మాట్లాడుతూ ” ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనకు గుర్తు వచ్చే మొదటి పేరు మా గురువుగారు దాసరి నారాయణ రావు గారు. బిఫోర్ దాసరి ఆఫ్టర్ దాసరి అన్నట్లుగా గురువుగారి నాయకత్వంలో అందరం నడిచాం. ఇప్పుడు ఆ బాధ్యత చిరంజీవి గారి మీద పడింది. చిరంజీవి గారు లీడ్ తీసుకోవటంవల్ల పరిశ్రమకు చాలా మేలు జరిగింది. అయితే ఆయన మాకు ఏవో పనులు పురమాయించి ఊరుకుంటారులే అనుకున్నాం. కానీ చిరంజీవి గారు ఒక బాధ్యత అంటూ తీసుకున్న తర్వాత ఎంత బాధ్యతగా పని చేస్తారో మాకు ప్రతిరోజు అనుభవంలోకి వస్తుంది. నిత్యావసరాల కిట్స్ వాళ్లకు చేరాయా… వీళ్లకు చేరాయా… ఈ పని ఏమైంది..? ఆ పని ఏమైంది అంటూ నిత్యం ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ ల ద్వారా మమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఇక సి సి సి ద్వారా చేసిన కార్యక్రమాల వివరాలకు వస్తే ఇప్పటివరకు 14వేల కిట్స్ డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా ఆంధ్రాలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ,తిరుపతిలో కూడా సి సి సి  కిట్స్ అందించాము. అయితే ఈ సందర్భంలో కొన్ని అనూహ్య అనుభవాలు ఎదురయ్యాయి. నిజానికి చిత్ర పరిశ్రమలో వర్కింగ్ వర్కర్స్ సుమారు 22 వేల మంది మాత్రమే ఉంటారు. కానీ దాదాపు లక్షమంది ఈ కిట్స్ కోసం రావటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రోజుకు మూడు షిఫ్ట్ ల చొప్పున పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కూడా కార్లలో వచ్చి మరీ తీసుకువెళ్లడం దురదృష్టకరం. నిజంగా ఇండస్ట్రీలో పనిచేస్తూ యూనియన్ కార్డులు లేని సెట్ వర్కర్స్ కు, కార్మికులకు ఇవి అందాలి. అయితే బోగస్ కార్డులు, బోగస్ మెంబర్షిప్ ల వల్ల ఈ ప్రయోజనాలు అవసరం అయిన వారి కంటే అవసరం లేని వారికి వెళ్ళటం బాధాకరంగా అనిపిస్తుంది. అయితే అసోసియేషన్ల మెంబర్షిప్ ప్రకారమే మేము పంపిణీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిలో మెంబర్షిప్ ల ప్రక్షాళన కూడా జరగాల్సి ఉంది. ఈ సందర్భంలో ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే మేము ఎవరినీ విరాళాలు అడగలేదు… వచ్చిన ప్రతి రూపాయి స్వచ్ఛందంగా వచ్చిందే… అవసరం అయితే మన సొంత డబ్బులు పెట్టుకుందాం గాని ఎవరిని అడగవద్దు అని చిరంజీవి గారు చెప్పారు. ఇక కొంతమంది నిర్మాతలకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి రిటన్ బేసిస్ మీద డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు ఇచ్చిన డబ్బును ఆయన అభీష్టం మేరకు సద్వినియోగం చేయటం జరిగింది. అసోసియేషన్స్ లో ఎలాంటి అనుమానాలకు, అపోహలకు అవకాశం లేకుండా పారదర్శకంగా పనులు జరగాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సి సి సి నుండి మలిదశగా 25 కేజీల బియ్యం, 27 కేజీల సరుకులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ఒక నెలకు సరిపడా మందులు ఇచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమకు ఎలాంటి సహకారం కావాలన్నా నేనున్నాను అని ముందుకు వచ్చే గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి పరిశ్రమ తరపున కృతజ్ఞతలు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని మా మంత్రి గారికి తెలియజేస్తున్నాం… ఆయన సలహాలు సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ఈ కరోనా కష్టం తీరిన తరువాత పరిశ్రమ సమస్యల పట్ల దృష్టి సారిస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట ఇవ్వటం మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది.. వారికి మా కృతజ్ఞతలు.. అన్నారు సి. కళ్యాణ్.

ఇవి మెగాస్టార్ చిరంజీవి సారథ్య ,నాయకత్వంలో ఉద్యమ స్థాయిలో నడుస్తున్న ” కరోనా క్రైసిస్ చారిటీ” కార్యక్రమ వివరాలు, విశేషాలు. ఇంతటి బృహత్తర సేవా కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆయన సైన్యంగా కదం తొక్కుతున్న తమ్మారెడ్డి భరద్వాజ, సి. కళ్యాణ్, ఎన్.శంకర్, దాము, బెనర్జీలకు ఇతర సేవా కార్యకర్తలకు శుభాభినందనలు పలుకుతుంది ‘ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం’

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here