మూడు పాత్రల మాస్టర్ పీస్ స్క్రీన్ ప్లే

Screen Play Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Screen Play,Screen Play Movie,Screen Play Telugu Movie,Screen Play Movie Updates,Screen Play Telugu Movie Latest News,Screen Play Review,Screen Play Telugu Movie Review,Screen Play Movie Story,Screen Play Telugu Movie Live Updates,Screen Play Movie Public Talk,Screen Play Telugu Movie Public Response,Screen Play Movie Plus Points,Screen Play Telugu Movie Review And Rating

సినిమా అంటే అలాగే ఉండాలి.. ఇలాగే తీయాలి…
సినిమా తీయటానికి ఇవే పడికట్లు… సినిమా విజయానికి సూత్రాలు ఇవే…
ఇలా  తీస్తేనే సినిమాలు ఆడతాయి..

అనే ఫార్ములా బేస్డ్ ఆలోచనల చట్రం నుండి సగటు సినిమా బయటికి రావాలి అంటే “స్క్రీన్ ప్లే” లాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ అటెంప్ట్ లు అప్పుడప్పుడైనా రావాలి. నిజానికి కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు థియేటర్లోనే మర్చిపోతాం… కొన్ని బయటకు రాగానే మర్చిపోతాం… కానీ కొన్ని మాత్రం మనతోపాటే ఇంటికి వచ్చేస్తాయి… ఆలోచింపజేస్తాయి… ప్రేరేపిస్తాయి…

భారీ తారాగణం, భారీ సెట్టింగులు, హంగులు ఆర్భాటాలు వంటివేవీ లేని ఇంత చిన్న సినిమా ఇంతలా వెంటాడుతుంది ఏంటి? అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అది ఈ రోజు విడుదలైన “స్క్రీన్ ప్లే ”
అయి ఉంటుంది.

సినిమా రచయితగా, షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా  పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన కె ఎల్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన’ స్క్రీన్ ప్లే’ ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొన్ని లిమిటెడ్ థియేటర్స్ లో  విడుదలైంది. విడుదలకు ముందే నాలుగైదు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికై  బహుమతులను, అద్భుత ప్రశంసలను అందుకున్న “స్క్రీన్ ప్లే” ఎలా ఉందో చూద్దాం.

ఇది కేవలం మూడే మూడు పాత్రల వినూత్న ప్రయోగం.

హీరో: కాలేజీ రోజుల్లో ఉద్యమాలు, విప్లవాలు అంటూ అన్యాయాలను ఎదిరించి ఆవేశం ప్రదర్శించి ఆదర్శాలు వల్లించి చివరకు ఒక కాంప్రమైజ్డ్ కమర్షియల్ ఫిలిం డైరెక్టర్ గా సెటిల్ అవుతాడు.

హీరోయిన్: కాలేజీ రోజుల్లో హీరో ఉపన్యాసాలకు, ఆదర్శాలకు, మంచితనానికి, హీరోయిజానికి ఫిదా అయి  అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఒక ఆదర్శవంతమైన జంటగా సాగుతుంది అనుకున్న వాళ్ల కాపురంలో భావ వైరుధ్యం ఏర్పడుతుంది. హీరోలో ఏ ఆదర్శాలను, ఆవేశాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుందో ఇప్పుడతనిలో అవి లేవు. ఫక్తు వ్యాపార విలువల కమర్షియల్ సినిమాలు తీసి బాక్సాఫీస్ హిట్లు కొట్టే దర్శకుడయ్యాడతను. సమాజంలో ఇన్ని అన్యాయాలు, అకృత్యాలు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే అవేవీ పట్టని ధోరణితో కోట్ల సంపాదనలో మునిగి పోయిన అతని బాధ్యతారాహిత్యం ఆమెలో అసహ్యాన్ని నింపుతుంది. నీతో నేను కాపురం చేయలేను నాకు డైవర్స్ కావాలి అంటుంది.

అతను ఆదర్శాలను వదులుకున్నా ఆమె పట్ల అతని ప్రేమలో ఎలాంటి తేడా లేదు.. అదే ఆరాధన… అదే ప్రేమ… కానీ ఆమె నాకు ఈ రోజు విడాకులు ఇస్తావా లేదా అని మొండికేస్తుంది. అయితే ఒక్క 24  గంటలు నాతో మన గెస్ట్ హౌస్ లో గడుపు ఆ తర్వాత కూడా నీకు విడాకులు కావాలంటే అలాగే చేద్దాం.. అంటాడు… ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది? ఆమె కోరుకున్న విడాకులు ఆమెకు వచ్చాయా..? 24 గంటల్లో ఆమెకు అతను చూపించింది ఏమిటి? జరిగింది ఏమిటి? అనూహ్యంగా వాళ్ళ మధ్య కు వచ్చిన మూడో వ్యక్తి ఎవరు? అతని కారణంగా వీళ్ళ అనుబంధంలో చోటు చేసుకున్న పరిణామం ఏమిటి? ఆ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది” స్క్రీన్ ప్లే”.

మూడు పాత్రలు…
ఒక గెస్ట్ హౌస్
ఇదే సినిమా…
ఇందులోనే సినిమా..

సినిమా అంటే ఊహించని మలుపులు, ఊహకందని సంభవాలు కాదు… ఊహాతీతమైన భావోద్వేగాలు, భావ సంఘర్షణ అని నమ్మే వాళ్లకు స్క్రీన్ ప్లే ఒక గొప్ప సినిమాగా కనిపిస్తుంది. అలా కాకుండా సినిమా అంటే అందాల విందులు, ఆరు పాటల చిందులు, హద్దులు మీరిన పొందులు అనుకునేవాళ్ళు ఈ సినిమాకు వెళ్లకపోవడమే మంచిది.

ఇక ఈ మూడు పాత్రల్లో  ఫిమేల్ లీడ్ చేసిన ప్రగతి యాదాటి , మేల్ లీడ్ చేసిన విక్రం శివ, ఆగంతక వ్యక్తిగా ప్రవేశించిన చిత్ర దర్శకుడు కే.ఎల్. ప్రసాద్ ల పర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్.

ఛాయాగ్రహణ దిగ్గజం ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ, వన్ అండ్ ఓన్లీ లేడీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్
ఎం ఎం శ్రీలేఖ సంగీతం ఈ చిత్రానికి తెరవెనుక ఎస్సెట్స్.

ఇక ఈ సినిమాకు సూత్రధారి, ప్రధాన పాత్రధారి అయిన కే.ఎల్. ప్రసాద్ గురించి చెప్పాలంటే తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమాల మీద విపరీతమైన అవగాహన, అభిమానం కలిగిన గ్రేట్ లవర్ ఆఫ్ సినిమా. ఆలోచనలు రేకెత్తించి, ఆవేశాన్ని రగిలించే మంచి సినిమా ఊసు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే సినీ విహంగం కే.ఎల్. ప్రసాద్ చిరకాల స్వప్నానికి సెల్యులాయిడ్ రూపమే” స్క్రీన్ ప్లే”.
అన్ని సినిమాలు ఒకలా ఉండవు… అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.. రొటీన్ కు భిన్నంగా ఆలోచించే వాళ్లే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు… అలాంటి వాళ్లే ఇలాంటి సినిమాలు చూస్తారు. ఏది ఏమైనా మూస పోకడల తెలుగు సినిమా ప్రస్థానంలో ” స్క్రీన్ ప్లే” లాంటి అరుదైన ప్రయోగాత్మక ప్రయత్నాలు
విజయవంతం కావాలి… ఎందుకంటే విజయమే కాదు… అది సాధించ బడిన విధానం కూడా మంచిదై ఉండాలి అంటారు మహాత్మా గాంధీ…. ఫక్తు కమర్షియల్ ధోరణి వల్ల సిద్ధించే వ్యాపార విజయాల కంటే స్క్రీన్ ప్లే లాంటి  అరుదైన, ఆదర్శ ప్రయత్నాల వల్ల  సాధించే నైతిక విజయాలే తెలుగు సినిమాకు అపురూప జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి… ఇలాంటి అరుదైన, అద్భుత ప్రయత్నాలను రెగ్యులర్ రేటింగుల పారామీటర్ తో కొలవకూడదు. అభినందనకే తప్ప అభిశంసనకు అవకాశం లేని “స్క్రీన్ ప్లే ” కు అన్ని వర్గాల అభినందనలు దక్కుతాయని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here