ఆయనను శంకరాభరణం తరువాతే కళాతపస్వి అనటం కరెక్ట్ కాదు

Director Vishwanath Needs To Honoured With A Better Title

ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా ఆయన్ను నిలువునా ముంచేసింది. ప్రశంసల వెల్లువలో ఆయన నిలువునా మునిగిపోయారు. తన ఉనికి తనకే అందనంతటి అభినందనలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ సినిమా కంటే ముందు ఆయన 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో అద్భుత విజయాలను సాధించిన అపురూప చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అద్భుత సృజనకు, అమలిన ప్రేమకు, భావ సంఘర్షణకు,  నైతిక , సామాజిక విలువలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసిన దిగ్దర్శకుడిగా ఆయనకు అప్పటికే  గొప్ప పేరు ఉంది. కానీ జనసామాన్యానికి ఆయనంటే తెలిసింది… ఆయనేంటో తెలిసింది మాత్రం ఆ అఖండ విశ్వవిఖ్యాత విజయం తరువాతే. ఈ ఉపోద్ఘాతాన్ని బట్టి ఆ సినిమా ‘శంకరాభరణం ‘ అనీ ,  ఆ దర్శకుడు కె.విశ్వనాథ్ అనీ మీకు అర్థమయ్యే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“ఏయ్… ఇదేంటి… ఆయన పేరుకు ముందు ” కళాతపస్వి ” అన్న బిరుదు పెట్టకుండా కేవలం కె.విశ్వనాథ్ అంటావేంటి? నీకేమైనా మతి పోయిందా? ఒళ్ళు పొగరెక్కిందా అని దయచేసి గర్హించకండి… గర్జించకండి. నిజమే ఆయన పేరుకు ముందు ‘ కళాతపస్వి ‘ అనే ప్రిఫిక్స్ చేర్చకపోతే మీకే కాదు… నాకు చాలా వెలితిగా ఉంటుంది. కానీ  నాతోపాటు ఆయన అభిమానులు కొందరు ‘కళాతపస్వి ‘ అనే పాయింట్ దగ్గర విభేదిస్తుంటారు. శంకరాభరణం చిత్రం తరువాత మాత్రమే ఆయనను కళాతపస్వి అనటం చాలా మందికి నచ్చదు.

ఎందుకంటే శంకరాభరణానికి కంటే ముందే ఆయన ఓ’ కళాసౌధం ‘…

శంకరాభరణానికి ముందే ఆయన ఓ విశిష్ట దర్శకుడు…

శంకరాభరణాని కంటే  చాలా ముందే వెలసిన ఓ సృజన శిఖరం.. కాశీనాథుని విశ్వనాథ్.

అందుకు ఎన్ని సాక్ష్యాలు చూపాలి ?
ఎన్ని అపురూప చిత్రాల ఊసులు చెప్పాలి ?
ఎన్ని అద్భుత విజయవిశేషాలు వివరించాలి?
దర్శకుడుగా అన్నపూర్ణావారి ‘ఆత్మగౌరవం ‘  తో ప్రారంభమైన ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్ని విజయ మాధుర్యాలు ఉన్నాయో…
ఎన్నెన్ని అద్భుత ఘట్టాలు ఉన్నాయో…

[custom_ad]

కళ- వ్యాపారం కలిసి నడవలేవు అంటూ సినిమాను కేవలం కళ లేని వ్యాపారంగా మాత్రమే చూస్తున్న రోజుల్లోనే ” చరణ కింకిరులు ఘళ్ళు ఘళ్లుమన కర కంకణములు గలగలలాడగ… అంటూ సినిమా వ్యాపారాన్ని కళాత్మకంగా మార్చిన, మలిచిన కె.విశ్వనాథ్ శంకరాభరణం కంటే చాలా ముందే ‘కళాతపస్వి ‘ అంటే ఎవరైనా కాదనగలరా?

” శారదా దరిచేరదా… ఏమిటమ్మా సిగ్గా.. ఎరుపెక్కే లేత బుగ్గ ” అనే పాట మకుటంగా సాగే  ‘శారద ‘ చిత్రంలో అమాయకత్వం నిండిన ఆడపిల్ల ఊసులకు, ఊహలకు అద్భుతమైన రూపకల్పన చేసినప్పుడే ఆయన కళాతపస్వి అయ్యారు అన్నది నిజం కాదా?

‘జీవన జ్యోతి ‘ చిత్రంలో  ‘ సిన్ని ఓ సిన్నీ..ఓ సన్నజాజుల సిన్ని ‘ వంటి యుగళ గీతాల పులకింతలను, గిలిగింతలను సరస శృంగారాత్మకంగా తెరకెక్కించినప్పుడే ఆయన కళాతపస్వి అయ్యారు అన్నది వాస్తవం కాదా?

[custom_ad]

ఇంకా ప్రైవేట్ మాస్టారు, ఉండమ్మా బొట్టు పెడతా, నిండు హృదయాలు, చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి, మాంగల్యానికి మరో ముడి, సిరిసిరిమువ్వ, జీవిత నౌక, సీతామాలక్ష్మి వంటి  చిత్రాలలో మంచితనాన్ని, మనిషితనాన్ని, మానవతా విలువలను, నైతిక మూల్యాలను నవనవోన్మేషన్గా ఆవిష్కరించి ఆనాడే ఆయన కళాతపస్వి అయ్యారు అనటంతో ఎవరైనా విభేదించగలరా ?

కాబట్టి ప్రారంభం నుండే తన కళాత్మక, సృజనాత్మక ప్రతిభతో తెలుగు సినిమాలో సున్నిత, సుందర, సుమధుర, సురుచిర, సౌమ్య, సౌహార్ద, సాత్విక, తాత్విక  భావ సౌందర్యాలను ఆవిష్కరిస్తూ, సంగీత, సాహిత్య, నృత్యాది లలిత కళలను సజీవంగా నిలుపుతున్న కాశీనాధుని విశ్వనాధ్ తొలి చిత్రం నుండే కళాతపస్వి అన్నది చాలా మంది నిశ్చితాభిప్రాయం.

అందుకే ఆయనను శంకరాభరణం నుండి మాత్రమే కళాతపస్వి అనటం కరెక్ట్ కాదు .  అయితే ఆ దర్శక శ్రేష్టు ని సుదీర్ఘ ప్రస్థానాన్ని నిలువునా రెండుగా చీల్చింది  ‘శంకరాభరణం ‘ … అందుకే బిఫోర్ శంకరాభరణం అండ్ ఆఫ్టర్ శంకరాభరణం గా మారింది ఆయన విజయ విశేషాల చరిత్ర.

[custom_ad]

శంకరాభరణానికి ముందు సమకాలీన సామాజిక కుటుంబ కథా చిత్రాలలో కళాత్మక విలువలను ఆవిష్కరించిన విశ్వనాథ్ శంకరాభరణం తరువాత కళాత్మకతను ప్రధాన వస్తువుగా తీసుకొని వాటిలో కుటుంబ అనుబంధాలను, నైతిక ముల్యాలను మిళితం చేసుకుంటూ వచ్చారు. అంటే శంకరాభరణానికి ముందైనా, ఆ తరువాత అయినా కళ అంటే కె.విశ్వనాధ్  కె.విశ్వనాథ్ అంటే కళ  అన్నది కాదనలేని వాస్తవం. ఇలా కళకు పర్యాయపదం కె.విశ్వనాథ్ కె.విశ్వనాథ్ కు పర్యాయపదం కళ  కావటం యాదృచ్చికం కాదు..  కాకతాళీయమూ  కాదు . ఇది ఆ మహామహుని మహోన్నత ప్రతిభా విశేషాల ఫలితంగా సిద్ధించిన అపురూప స్థాన  విశిష్టత.

దర్శకుడిగానే కాకుండా విశిష్ట నటుడిగా కూడా కె.విశ్వనాథ్ కనబరిచిన అభినయ ప్రమాణాలు ప్రతి నటుడికి ప్రామాణికంగా ఉపయుక్తం అవుతాయి అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు

ఇలా తెరవెనుక దర్శకత్వంలోనూ, తెరమీద అభినయంలోనూ, నియమబద్ధ నిజజీవితంలోనూ సౌమ్య, సాత్విక, సంస్కార సౌరభాలను వెదజల్లిన తొమ్మిది పదుల కళా సౌధం కె విశ్వనాధ్ గారికి 90వ జన్మదిన శుభాభినందనలు పలుకుతోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం “.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + one =