నా తొలి ప్రాధాన్యత రాజకీయాలకే- విశ్వనటభారతి విజయశాంతి

Legendary Actress And Politician Vijayashanthi Interview,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Legendary Actress Vijayashanthi Interview,Politician Vijayashanthi Latest Interview,Vijayashanthi New Movie Updates

తమ అద్భుత, అభినయ చాతుర్యంతో, సామర్థ్యంతో తెలుగు తెరను ఏలిన కథానాయికలు ఎందరో ఉన్నారు. కంటి చూపుతో, కొంటె నవ్వుతో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్లకు కొదవలేదు. అయితే కథానాయికగా ఒక కమాండింగ్ పొజిషన్ను ఎంజాయ్ చేసిన హీరోయిన్లు చాలా తక్కువ. పురుషాధిక్య రంగమైన చిత్ర పరిశ్రమలో అందచందాల ఆరబోతకు మాత్రమే పరిమితమయ్యే సెట్ ప్రాపర్టీ లాగా కాకుండా అన్నీ తానై కథను నడిపించి రెండున్నర దశాబ్దాల అత్యున్నత వైభవాన్ని చవి చూసిన కథానాయిక ఒకరున్నారు. బాక్సాఫీస్ హీరోలకు దీటైన స్టార్ డమ్ ను, ఇమేజ్ ని, క్రేజ్ ను సొంతం చేసుకొని హీరోయిన్ పాత్రల నేచర్ ను,స్టేచర్ ను, స్టేటస్ ను మార్చేసిన ఆ శిఖరాగ్ర స్ధాయి కథానాయిక జాతీయ ఉత్తమ నటి విజయశాంతి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన పేరుకు ముందు విశ్వ నట భారతి, కలైమామణి, అభినయ సామ్రాఘ్ని,లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ వంటి బిరుదులు జత చేసే స్థాయికి తిరుగులేని హీరోయి’నిజాన్ని’ ప్రదర్శించిన విజయశాంతి 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్త సినీ రాజకీయ రంగాలలో సంచలనం సృష్టించింది.సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు” చిత్రం నుండి విడుదలైన విజయశాంతి ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.ఈ నేపథ్యంలో ఆ జాతీయ ఉత్తమ నటిని ఇంటర్వ్యూ చేయాలని సంకల్పించింది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”. అడిగిన వెంటనే అంగీకరిస్తూ ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇచ్చారు విజయశాంతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా రంగానికి, సినిమా వాతావరణానికి, సినిమా మీడియాకు 13 ఏళ్ల పాటు దూరంగా ఉన్న విజయశాంతి అంతరంగ ఆవిష్కరణ కోసం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆమె స్వగృహానికి చేరుకుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”. చిరకాలం తరువాత తన సొంత మనుషులను కలిసిన తాలూకు అభిమానం, ఆప్యాయత ఆ లేడీ సూపర్ స్టార్ కళ్లలో కనిపించింది. సాదరంగా ఆహ్వానించి యోగక్షేమాలు అడిగిన తరువాత ఇంటర్వ్యూకు సిద్ధమయ్యారు విజయశాంతి.సినీ రాజకీయ రంగాలలో తనదైన ప్రత్యేకతను, ప్రతిష్టను, పాపులారిటీని ఆవిష్కరించుకున్న ఆల్ ఇండియా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పునరాగమన విశేషాలను ఆమె మాటల్లోనే ఆస్వాదిద్దాం…

* విజయశాంతి గారూ ! నమస్తే… ఎలా ఉన్నారు?

వి.శా: బాగున్నాను… మీరెలా ఉన్నారు?

* బాగున్నాం… మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి, ఇంటర్వ్యూ ఇచ్చి చాలా కాలమైంది. 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత తొలిసారిగా మా “తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”కు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థాంక్స్.

వి.శా: ఇట్స్ ఓ కే… 2006లో చేసిన ‘ నాయుడమ్మ’ నా చివరి సినిమా. ఆ సినిమాను తమిళంలో’ ‘వీర నాచియార్ ‘ అని, కన్నడలో ‘గౌడతి’ అని స్సైమల్టేనియస్ గా చేసాం. ఆ సినిమా తరువాత నేను పూర్తిగా రాజకీయాలకు డెడికేట్ అయ్యాను. ఆ సినిమా టైంలో ఇచ్చినవే నా లాస్ట్ ఇంటర్వ్యూలు. అప్పట్లో ఈ వెబ్సైట్స్ , యూట్యూబ్ చానల్స్ లేవు. ఇప్పుడు మీడియా అంటేనే సోషల్ మీడియా అన్నంత స్థాయిలో నెటిజన్ షిప్ పెరిగిపోయింది. మొత్తానికి రీ ఎంట్రీ తరువాత ఒక వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం ఇదే ఫస్ట్ టైం.

* ఆ క్రెడిట్ మా “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కాం” కు ఇచ్చినందుకు థాంక్స్ మేడమ్. ఇక ఇంటర్వ్యూ లో కి వెళ్దాం. 1979లో కెరీర్ ప్రారంభించిన మీరు 2006 వరకు 27 సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అన్నేళ్ల అనుబంధం ఉన్న సినిమా ఫీల్డ్ ను వదిలి రాజకీయ రంగంలోకి వెళ్తున్నప్పుడు ఏం ఫీల్ అయ్యారు? అప్పటి మీ ఆలోచనలు ఏమిటి?

వి.శా: సినిమా రంగమైనా రాజకీయ రంగమైనా ప్రజలతో, ప్రజా జీవితంతో ముడిపడినవే. సినిమాలలో నేను చేసిన కొన్ని పాత్రలు, కొన్ని సినిమాలు నన్ను చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. నా రాజకీయ రంగ ప్రవేశం మీద కొన్ని పాత్రల ప్రభావం చాలా వరకు ఉంది. ముఖ్యంగా’ ఒసేయ్ రాములమ్మ’ లాంటి సినిమాలు జన జీవితంలోని చీకటి కోణాలను చూపించాయి. రాజకీయంగా, భౌగోళికంగా ఆంధ్ర ప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా, ప్రాంతీయ అసమానతలను నివారించే దృష్ట్యా చిన్న రాష్ట్రాలు అయితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది నా గట్టి నమ్మకం. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలోని ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబాటుతనం పట్ల నాలో ఒక అవగాహన ఏర్పడింది. అందుకే ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంతో నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. 1998 జనవరి 26న నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అప్పటికి టిఆర్ఎస్ పార్టీ పుట్టలేదు… తెలంగాణ ఉద్యమమే ప్రారంభం కాలేదు. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న సదుద్దేశంతో నేను ఉద్యమాన్ని ప్రారంభించాను. సినిమా అయినా రాజకీయ రంగమైనా ప్రజా సంబంధమైనవే కాబట్టి సినిమా రంగం నుండి రాజకీయ రంగం వైపు వెళ్లేటప్పుడు నేనేమి ఫీల్ కాలేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నేను ప్రజలలో, ప్రజలతో ఉన్నానా లేదా అన్నదే నా కన్సెర్న్.

* పదమూడేళ్ల విరామం తరువాత, వియోగం తరువాత విజయశాంతి ఒక పాత్రను అంగీకరించి సినిమా చేస్తున్నారు అంటే ఆ పాత్ర, ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అనే అభిప్రాయం, అంచనా ప్రేక్షకుల్లో ఏర్పడతాయి. హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పాత్రల ఎంపిక పట్ల ఒక రిజర్వుడ్ యాటిట్యూడ్ మెయింటెన్ చేసిన మీరు ఇప్పుడు ఈ పాత్రను యాక్సెప్ట్ చేయటానికి టెంప్ట్ అయిన కారణం ఏమిటి?

వి.శా: టెంప్ట్ అవటం వేరు… ఇంప్రెస్ అవ్వటం వేరు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈ కథ చెప్పినప్పుడు రెండున్నర గంటలపాటు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వాను. ఆ తరువాత నా పాత్ర గురించి మరలా చెప్పండి అని అడిగి రెండవసారి చెప్పించుకుని విన్నాను. ఇందులో నేను చేస్తున్న ప్రొఫెసర్ భారతి పాత్ర చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ఓవరాల్ గా కథ మొత్తాన్ని ఎలా ఎంజాయ్ చేశానో నా పాత్రను కూడా అంతగా ఎంజాయ్ చేశాను. పాత్ర గురించి ఇంతకుమించి చెప్పను కానీ మీరు అడిగినట్లు ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత నా రీఎంట్రీకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్యారెక్టర్ ఇదే అన్న నమ్మకం మాత్రం నాలో ఏర్పడింది.

* మీరు రెండున్నర గంటల పాటు పడిపడి నవ్వాను అని చెబుతున్నారు…. సీరియస్ అండ్ కమిటెడ్ ఇమేజ్ ఉన్న మీరు ఇన్నేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ అలాంటి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేయటం కరెక్టేనా?

వి.శా: నేను నవ్వాను అని చెప్పింది మొత్తం కథ గురించి… నా పాత్ర గురించి కాదు. నా పాత్ర చాలా హుందాగా, డిగ్నిఫైడ్ గా సాగుతుంది.

* ఇందులో మీ పాత్రకు మహేష్ బాబు పాత్రకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు వంటి చాలెంజింగ్ అట్మాస్పియర్ ఉంటుందా? మీ ఇద్దరి పాత్రలు ఒకరికొకరు పాజిటివ్ గా ఉంటాయా ? నెగిటివ్ గా ఉంటాయా ?

వి.శా: మా పాత్రల మధ్య అలాంటి సవాళ్లు, నెగిటివ్ అప్రోచ్ ఏమీ ఉండదు. రెండు పాత్రలు పాజిటివ్ యాంగిల్ లోనే ఉంటాయి. ‘ఉయ్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్’ అన్నట్లుగా ఉంటాయి మా పాత్రలు.

* విజయశాంతికి ఒక మేల్ స్టార్ కు ఉన్నంత యాక్షన్ ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. మరి మీరు చేస్తున్న ఈ పాత్రలో ఆ ఇమేజ్ ని సేఫ్ గార్డ్ చేసే యాక్షన్ అండ్ డైనమిజం ఉంటాయా?

వి.శా: డిష్యుం డిష్యుం ఫైట్స్ చేయటాన్నే యాక్షన్ ఇమేజ్ అనుకోవటం పొరపాటు. నాకున్న యాక్షన్ ఇమేజ్ అన్నది నేను చేసిన పాత్రల ఔన్నత్యం వల్ల వచ్చింది తప్ప కేవలం ఫైట్స్ చేయడంవల్ల రాలేదు.
కాబట్టి ఇందులో నా పాత్ర నా ప్రీవియస్ ఇమేజ్ ని, రెస్పెక్ట్ ను,
డైనమిజాన్ని అన్ని విధాల కీప్ అప్ చేస్తుంది .

* ‘సరిలేరు నీకెవ్వరు ‘ చిత్రం నుండి విడుదలైన మీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 1989లో వచ్చిన కొడుకు దిద్దిన కాపురం నాటి విజయశాంతి ఎలా ఉన్నారో 2019 నాటి విజయశాంతి అలా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ వినిపించాయి. ఈ మేకోవర్ ఎలా సాధ్యపడింది?

వి.శా: చాలా కష్టపడితేనే సాధ్యపడింది. రోజుకు రెండు గంటలు జిమ్ లో ఒంటిని వింటిలా ఇరగదీసాను. ఒకవైపు డైట్ కంట్రోల్ చేసుకుంటూ మరోవైపు ఎక్సర్సైజులు చేస్తూ కష్టపడితే రెండు నెలల్లో 10 కేజీలు తగ్గాను. డైరెక్టరు, కెమెరామెన్ చూసి ఇంతగా తగ్గ అవసరం లేదు అన్నారు. అప్పుడు మరలా కొంచెం వెయిట్ పుటప్ చేశాను. నిజానికి రాజకీయాల్లో అయితే ఇవన్నీ అవసరం లేదు… సినిమా అంటేనే గ్లామర్, సినిమా అంటే హార్డ్ వర్క్, సినిమా అంటే డిసిప్లేన్- డెడికేషన్. మరలా ఈ రంగానికి వచ్చినప్పుడు కేవలం ఒళ్లు ఒకటి తగ్గిస్తే సరిపోదు.. ఇక్కడి పద్ధతులు అన్నింటిని ఆచరించాలి, గౌరవించాలి.

* చాలా కాలం తరువాత కెమెరాను ఫేస్ చేసినప్పటి అనుభూతి ఎలా అనిపించింది.?

వి.శా: అప్పటిదాకా బ్రెయిన్ లో ఉన్న రాజకీయాలు అనే చిప్ తీసేసి సినిమా అనే చిప్ తగిలించుకున్నా. వెంటనే పాత విజయశాంతిని అయిపోయా.

* సెట్లో వాతావరణం ఎలా అనిపించింది?

వి.శా: చాలా కాలం తర్వాత చేస్తున్నాను ఎలా ఉంటుందో అనుకుని వెళ్లాను. కానీ సెట్లో అందరూ నన్ను చాలా అభిమానంగా, ఆదరంగా చూశారు. అందరూ చాలా పాజిటివ్ పీపుల్. వండర్ఫుల్ వర్కింగ్ అట్మాస్పియర్ కనిపించింది.

* కొడుకు దిద్దిన కాపురం లో మీతో కలిసి నటించిన బాలనటుడు మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారు. తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?

వి.శా: ఈ బాబు సూపర్ స్టార్ అవుతాడు అని నేను అప్పట్లోనే అనుకున్నాను… ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కూడా. అప్పట్లో క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ఎంత సెన్సేషనల్ గా దూసుకు వచ్చాడో ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో మహేష్ బాబు అంతే సంచలనంగా దూసుకు వచ్చాడు. సచిన్ ఎంత గొప్ప బ్యాట్స్మన్ అయ్యాడో…. మహేష్ బాబు అంత పెద్ద హీరో అవుతాడని నేను అన్నది అనుకున్నది.. ఇప్పుడు నిజం అయింది.

* సెట్లో మహేష్ బాబు ఎలా ఉంటారు?

వి.శా: కృష్ణ గారి లాగానే మహేష్ బాబు కూడా చాలా కామ్. ఎక్కువగా మాట్లాడరు.

* అదేంటి? మహేష్ బాబు చాలా చిలిపి అని, సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని, బాగా నవ్విస్తాడు అని అందరూ అంటారు. మీరేమో చాలా కామ్ అంటున్నారు?

వి.శా: నిజమా! నాకు తెలియదు… మహేష్ బాబు అంత చిలిపి అని మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మరి నాతో వర్క్ చేసిన ఈ 50 రోజుల్లో నా దగ్గర ఎప్పుడూ అలా ఉండలేదు. చాలా కామ్ గా, కూల్ గా ఉన్నారు. అయితే నిజంగా మీరు చెప్పినట్లు మహేష్ బాబు అంత జోవియల్ గా ఉంటే మంచిదేగా.

* మహేష్ బాబు మిమ్మల్ని ఏమని పిలుస్తారు?

వి.శా: అమ్మా అంటారు… లేదంటే మేడం అంటారు.

* మరి మీరు మహేష్ బాబుని ఏమని పిలుస్తారు?

వి.శా: బాబు అంటాను… మీరు అంటాను. ఎవరినైనా మర్యాదగా మీరు అని సంబోధించడం నా అలవాటు. అందులోనూ హీరోను పదిమందిలో ఉన్నప్పుడు గౌరవంగా మీరు అని అడ్రస్ చేయాలి. ఇంట్లో ఉన్నా సెట్లో ఉన్నా మర్యాద ఇచ్చి పుచ్చుకోవటం అవసరం.

* చాలా సంవత్సరాల తర్వాత మీరు సినిమా ఒప్పుకోవటం సినీ రాజకీయ రంగాల్లో సెన్సేషన్ అయింది. అసలు మీ రీ ఎంట్రీకి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా?

వి.శా: రాజకీయాల్లోకి వెళ్ళినప్పటి నుండి సినిమా రంగం నుండి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తెలుగు తమిళ కన్నడ హిందీ రంగాలు అన్నింటి నుండి ఆఫర్స్ వచ్చాయి. కానీ రాజకీయం అన్నది ఒక డెడికేటెడ్ జాబ్. అందులో నేను టేకప్ చేసింది మామూలు రాజకీయం కాదు. ఒక ఉద్యమం.. నిత్యం పోరాటాలు, ఉద్యమాలు, అరెస్టులు, కోర్టులు, జైళ్లు – అలాంటి ఉద్యమంలో సీరియస్ గా పనిచేస్తున్న నేను అన్ని ఆఫర్లను రిజెక్ట్ చేశాను. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయంగా కొంత గ్యాప్ రావడం జరిగింది. దర్శకుడు అనిల్ గతంలో రెండు మూడు సార్లు ఈ క్యారెక్టర్ మీరే చేయాలి… మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాశాను అన్నారు. అప్పుడు క్యారెక్టర్ విన్నాను. నిజంగా నచ్చింది… నచ్చినప్పుడు చెయ్యను అని చెప్పటం
నాకు సబబుగా అనిపించలేదు. అందుకే రిజెక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నాను. అంతేకాకుండా నా రీ ఎంట్రీకి ఇది సరైన క్యారెక్టర్ అనే నమ్మకం కూడా కుదిరింది. ఒక పెద్ద కమర్షియల్ సినిమాలో హీరోకు ప్యారలల్ గా సరిసమానమైన ఇలాంటి పాత్ర దొరకటం చాలా రేర్.

* హీరోకు పాత్ర ప్యారలల్ క్యారెక్టర్ అంటున్నారు… ఈ పాత్ర కోసం ఎన్ని రోజులు వర్క్ చేశారు.?

వి.శా: ఇప్పటికి 50 రోజులు వర్క్ చేశాను… ఇంకా 25 రోజులు చేయాలి. అంటే మొత్తం 75 రోజులు వర్క్ చేసే పాత్ర హీరోకు సరిసమానమైన కేరక్టరే కదా! క్యారెక్టర్ పరంగా అలాంటి ప్రాధాన్యత లేకపోతే నేను ఎందుకు చేస్తాను?

* అనిల్ రావిపూడి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైనా చూశారా?

వి.శా: పటాస్, ఎఫ్.2 చూశాను. చాలా బాగా తీశారు.

* అవి చూశాకే ఈ సినిమా ఒప్పుకున్నారా?

వి.శా: అవి చూడటానికి ఈ సినిమా ఒప్పుకోవడానికి సంబంధమే లేదు. ఈ సినిమా కథ, అందులో నా పాత్ర నచ్చటంతో ఒప్పుకున్నాను.

* మీ పదమూడేళ్ల సినిమారంగ వియోగంలో ఏదైనా గొప్ప క్యారెక్టర్ చేయాలి అనే ఆలోచన ఏమైనా, ఎప్పుడైనా వచ్చిందా?

వి.శా: రుద్రమదేవి పాత్ర చేయాలి అన్న ప్లానింగ్ చాలాకాలం క్రితమే చేశాను. అందుకు సంబంధించిన పూర్తి పరిశోధన కూడా చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. 34 వ యేట పట్టాభిషేకం జరిగినది మొదలు 84 ఏళ్ల వయసు వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి చరిత్ర మొత్తం చిత్రీకరించాలని అనుకున్నాం.
నా సొంత బ్యానర్లో ఆ సినిమా చేయడం కోసం అన్ని విధాల సిద్ధమయ్యాం గాని రాజకీయ పరమైన ఒత్తిళ్లు, టెన్షన్స్ కారణంగా అది మెటీరియలైజ్ అవలేదు.

* అగ్రశ్రేణి కథానాయికగా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లి సాధించింది ఏమిటి… అంటే ఏం చెప్తారు?

వి.శా: నేను అనుకున్నది సాధించాను. ప్రత్యేక తెలంగాణ సాధన అన్నదే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రారంభించాను. ఆ లక్ష్యం నెరవేరింది. ప్రత్యేక తెలంగాణ వచ్చింది. దానికి కారకులం మేమే అని ఎవరెవరో చెప్పుకోవచ్చు.
కానీ వాళ్ళ అందరి కంటే ముందే 1998 జనవరి 26న నేను రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉద్యమాన్ని ప్రారంభించాను. ఈ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు చూశాను. జైలు కి వెళ్లాను… పార్టీ పరంగా ఎన్నో కీలక పదవులు నిర్వహించాను… మొత్తానికి రాజకీయంగా నాదొక సంచలనాత్మక ప్రస్థానం అని మాత్రం చెప్పగలను.

* మీ జైలు జీవిత అనుభవాల గురించి చెప్పండి.

వి.శా: ఈ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒకసారి కాదు… రెండు సార్లు కాదు… ఎన్నో సార్లు అరెస్టు అయ్యాను.. జైలు కి వెళ్ళాను. చంచల్ గూడా జైల్లో ఎన్నోసార్లు ఖైదీల పక్కన కూర్చుని అక్కడ కూడా ఉద్యమం గురించి చర్చలు చేశాను. నేను జైల్లో ఉండి ఉద్యమాన్ని కొనసాగిస్తే ఆ క్రెడిట్ నాకు ఎక్కడ దక్కుతుందో అని బెయిల్ తెప్పించి మరీ విడుదల చేయించారు.

* సినిమాల్లో అష్ట ఐశ్వర్యాలు అనుభవించిన మీరు జైలు జీవితాన్ని ఎలా ఫేస్ చేశారు?

వి.శా: ఉద్యమం అంటూ ఉరకలెత్తిన తరువాత మన గత జీవితం తాలూకు
భోగభాగ్యాల ఆలోచనే రాదు…రాకూడదు. అక్కడ ఏవీ మన సినిమాల్లోలాగా ఉండవు. ఎలాంటి రాయల్ ట్రీట్మెంట్ లు ఉండవు. కోర్టుల్లో ‘యువరానర్ మై లార్డ్’ అంటూ పెద్దగా అరవటాలు, బల్లలు చరచటం వంటివి ఉండవు .ఈడ్చి తీసుకెళ్లి పోలీస్ వానుల్లో పడేస్తారు.. కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు తిప్పుతారు. అన్నిటికి సిద్ధపడ్డాను కాబట్టే ప్రజల్లో రాజకీయంగా నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, స్థానాన్ని సంపాదించుకున్నాను.

* మీరు తెలంగాణ, ఆంధ్ర , రాయలసీమ అనే మూడు ప్రాంతాల ప్రజలు ఆదరిస్తేనే ఒక లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు? అలాంటి మీరు ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమానికి పరిమితమైతే మిగిలిన ప్రాంతాల్లో మీకు ప్రతికూలత ఏర్పడుతుందన్న భయం లేదా?

వి.శా: నేను తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టటం వెనుక ఉన్న అసలు ఉద్దేశం, లక్ష్యం అన్ని ప్రాంతాల వాళ్లకు అర్థమైంది. చిన్న రాష్ట్రాల వల్ల కలిగే మేలు ఏమిటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. దీన్ని ఆనాడే ఊహించి ఉద్యమాన్ని నడిపించాను.
రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజలు విడిపోలేదు. రెండు రాష్ట్రాల ప్రజల అభిమానాలు, ఆప్యాయతలు ఏమాత్రం సడలి పోలేదు. ఈ నిజాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు గ్రహించారు కాబట్టే నా పట్ల అందరిలోనూ అదే అభిమానం ఉంది.

* మీరు సినిమాల్లో చేస్తున్నప్పుడు తెలుగు సినిమా నిర్మాణ వ్యయం ఐదారు కోట్లకు మించి లేదు. ఇప్పుడు అరవై డెబ్భై కోట్ల నుండి 100 కోట్ల వరకు పెరిగింది. ఈ పరిణామం మీకు ఎలా అనిపిస్తుంది?

వి.శా: చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కాలంతో పాటు వచ్చిన మార్పు. నిర్మాణ వ్యయంతో పాటు మార్కెట్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది. అలాగే ఇంత భారీ పెరుగుదలకు తగినట్లుగా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా పెరిగింది.

* ప్రస్తుతం ఉన్న యువ దర్శకుల మీద మీ అభిప్రాయం ఏమిటి?

వి.శా: చాలా చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు… డిఫరెంట్ జోనర్స్ లో, డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో సినిమాలు తీస్తున్నారు. గతంలో మన సినిమాలు
ఒకటి,రెండు జోనర్స్ కు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు మన దర్శకుల క్రియేటివ్ స్టాండర్డ్స్ బాగా పెరిగాయి. ఇది చాలా ఆనందించాల్సిన పరిణామం.

* బాహుబలి సిరీస్, సాహో, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదగటం పట్ల మీ స్పందన ఏమిటి?

వి.శా: ఇది ఎవరిమైనా ఆనందించాల్సిన, గర్వించ వలసిన డెవలప్మెంట్. ఇండియన్ సినిమా అంటే నార్త్ సినిమా ఒక్కటే కాదు… సౌత్ ఇండియా సినిమా.. ముఖ్యంగా తెలుగు సినిమా అని సగర్వంగా చెప్పినట్లు అనిపించే గొప్ప డెవలప్మెంట్ ఇది.

* చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లి మరలా సినిమారంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చి “ఖైదీ నెంబర్ 150″తో సంక్రాంతి హిట్ కొట్టారు… ఇప్పుడు మీ రీ-ఎంట్రీ ఫిలిం” సరిలేరు నీకెవ్వరు” కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. పాలిటిక్స్ నుండి సినిమాల్లో రీ ఎంట్రీకి సంక్రాంతి కలిసి వస్తుందనే సెంటిమెంట్ ఏదైనా ఉందా?

వి.శా: నిజమే కదా… ఇదేదో బాగుందే..
( నవ్వుతూ) మా హీరో చిరంజీవి గారికి వచ్చినట్లే నాకు కూడా సంక్రాంతి ఖచ్చితంగా కలిసి వస్తుంది… ‘సరిలేరు నీకెవ్వరు’ ష్యుర్ హిట్…సూపర్ హిట్. ఇవన్నీ సరదాగా అనుకునే సెంటిమెంట్స్. నిజానికి సినిమాలో విషయం ఉంటే ఎప్పుడు రిలీజ్ అయినా విజయం తథ్యం.

* ఒకప్పుడు సెన్సేషనల్ హిట్ పెయిర్ అయిన మీరు చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒకరికొకరు ప్రత్యర్థులు అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా?

వి.శా: (పెద్దగా నవ్వుతూ) … ఇది చిరంజీవి గారిని అడగాల్సిన ప్రశ్న. ప్రస్తుతం సినిమాలు తీస్తుంది ఆయనే. ఆ సందర్భం, ఆ అవకాశం రావలసింది ఆయన వైపు నుండే… అలా వస్తే చేయటానికి అభ్యంతరం ఏముంటుంది?

* ‘ సరిలేరు నీకెవ్వరు ‘ తరువాత ఏమైనా సినిమాలు ఒప్పుకున్నారా?
వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?

వి.శా: ఇంకా ఏమీ అనుకోలేదు… వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఏమీ లేదు. అలాంటి న్యూస్ ఏమైనా ఉంటే ముందుకు మీతోనే కదా షేర్ చేసుకుంటాం. ఏవో వెబ్ సైట్స్ లో కొన్ని వార్తలు వస్తున్నాయి.. అవేవీ నిజం కాదు.

* భవిష్యత్తులో విజయశాంతి ప్రాధాన్యత ఇచ్చేది సినిమాలకా ? రాజకీయాలకా ?

వి.శా: రాజకీయాలకే… ఇందాకనే చెప్పా… రాజకీయం అన్నది ఒక ఫుల్ టైం డెడికేటెడ్ జాబ్. సినిమాల్లో నాకు నచ్చిన పాత్ర వస్తే చేస్తాను… లేకపోతే లేదు. పాలిటిక్స్ లో అలా ఉండదు. సినిమా అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం… పాలిటిక్స్ అంటే జనం కోసం పని చేయడం.
కాబట్టి విజయశాంతి ఎప్పటికీ రాజకీయాల్లోనే ఉంటుంది… ఎప్పుడైనా ఒక్కసారి సినిమాల్లో నటిస్తుంది… అంటూ ఇంటర్వ్యూ కు ముగింపు పలికారు జాతీయ ఉత్తమ నటి , ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ విజయశాంతి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here