బాలకృష్ణకు స్టార్‌డమ్‌ కట్టబెట్టిన ‘మంగమ్మ గారి మనవడు’కు 35 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 35 Years for Balakrishna Blockbuster Mangammagari Manavadu, Mangammagari Manavadu Telugu Movie, Balakrishna Starrer Mangammagari Manavadu Movie, Mangammagari Manavadu Movie Completed 35 Years, Balakrishna Latest Movie News

నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏడు చిత్రాలు తెరకెక్కగా… వాటిలో సింహ‌భాగం విజ‌యం సాధించిన‌వి కావ‌డం విశేషం. అలాంటి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. బాలకృష్ణ సరసన సుహాసిని కథానాయికగా నటించగా… “మంగమ్మ” గా విల‌క్ష‌ణ న‌టి భానుమతి రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇత‌ర పాత్ర‌ల్లో గోకిన రామారావు, గొల్లపూడి మారుతీరావు, బాలాజీ, ఏలేశ్వరం రంగ, వై.విజయ, అనిత తదితరులు న‌టించారు. తమిళ చిత్రం ‘మన్‌ వాసనై’కి రీమేక్‌గా ‘మంగమ్మ గారి మనవడు’ని రూపొందించారు కోడి రామకృష్ణ.

డా.సి.నారాయణరెడ్డి కలం నుంచి జాలువారిన పాటలకు… లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కె.వి.మహదేవన్ ఆక‌ట్టుకునే బాణీలు అందించారు. “దంచవే మేనత్త కూతురా”, “వంగ తోట కాడ ఒళ్ళు జాగర్తా”, “గుమ్మా చూపు నిమ్మా ముల్లు”, “చందురుడు నిన్ను చూసి”, “శ్రీ సూర్యనారాయణ మేలుకో”… ఇలా ఈ సినిమాలోని అన్ని పాటలు విశేషాదరణ పొందాయి. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.గోపాల్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం… బాలకృష్ణకు స్టార్‌డమ్‌ కట్టబెట్టింది. 1984 సెప్టెంబర్ 7న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ ‘మంగమ్మ గారి మనవడు’… నేటితో 35 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘మంగమ్మ గారి మనవడు’ – కొన్ని విశేషాలు:
* ‘మంగమ్మ’ పాత్రలో జీవించిన భానుమతి పుట్టినరోజు సందర్భంగా (సెప్టెంబర్ 7) ‘మంగమ్మగారి మనవడు’ విడుదలైంది.
* “మంగమ్మ”గా తన నట విశ్వరూపాన్ని చూపిన భానుమతి… బసవయ్యను ఎదిరించే సన్నివేశంలో “నీ మూతికి మీసం ఉంటే… ఈ మంగమ్మ ముంజేతికి మీసం ఉంది, ఇది మంగమ్మ చేతి కర్రరా… దమ్ములుంటే దాటి రండి. మీ రక్తంతో ఈ ఊళ్ళో ముగ్గులు పెడతాను” అంటూ పలికిన డైలాగ్‌కి ఫిదా కాని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.
* ‘సాహసమే జీవితం’(1984) సినిమాతో తొలిసారిగా సోలో హీరోగా సందడి చేసిన బాలయ్య… ఆ తరువాత ‘డిస్కోకింగ్’, ‘జననీ జన్మభూమి’ వంటి చిత్రాల్లో నటించినా హీరోగా ఆశించిన విజయం దక్కలేదు. అయితే… నాలుగో చిత్రమైన ‘మంగమ్మ గారి మనవడు’తో తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నాడు.
* బాలకృష్ణ కెరీర్‌లో తొలి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ కావడమే కాకుండా… అప్ప‌ట్లో హైదరాబాద్‌లో 332 రోజులు, గుంటూరులో 500 రోజులు, మాచర్ల‌లో అయితే ఏకంగా 1000 రోజులు దిగ్విజ‌యంగా ప్రదర్శితమైన‌ సినిమా ఇది. అంతేకాదు… కర్నాటకలోనూ 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవడం విశేషం.
* బాలకృష్ణ, భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రమిది. ఆ తరువాత వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here