* దర్శకురాలిగా మీ విజయాలకు ప్రేరణ ఏమిటి? గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కే లక్ష్యంతోనే 43 చిత్రాలకు దర్శకత్వం వహించారా ?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయనిర్మల:
దర్శకురాలిగా నా సక్సెస్ కు ప్రధాన కారణం నాలోని కమర్షియల్ యాటిట్యూడే . నేను లేడీ డైరెక్టర్ ను అనే రిజర్వేషన్స్ పెట్టుకోకుండా ‘ఎనీ అదర్ కమర్షియల్ డైరెక్టర్ లాగానే ఆలోచించేదాన్ని.1979,80,83 సంవత్సరాలలో నా దర్శకత్వంలో నాలుగు సినిమాల చొప్పున రిలీజ్ అయ్యాయి. ఒక లేడీ డైరెక్టర్ ఇలా సంవత్సరానికి నాలుగు సినిమాలు డైరెక్ట్ చేసింది అంటే అది ఎంత హార్డ్ వర్క్ చేస్తే సాధ్యమో ఆలోచించండి.ఇక నేను దర్శకురాలిగా కెరీర్ ప్రారంభించినప్పుడు “గిన్నిస్ బుక్” అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేవలం సొంత చిత్రాలు చేసుకుంటూ పోతే ఇన్ని సినిమాలు చేయగలిగే దాన్ని కాదు. గతంలో దర్శకత్వం వహించిన భానుమతి గారు గానీ, సావిత్రిగారు గానీ సొంత సినిమాలకే పరిమితం అయ్యారు. నాలాగా వారికి బయట నిర్మాతల నుండి ఆఫర్స్ రాలేదు అంటే దానికి కారణం వాళ్లు దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకోలేదు. నాకు మాత్రం బయటి చిత్రాలు రావడానికి కారణం నాలో ఉన్న కమర్షియల్ అవుట్ లుక్ అండ్ స్పీడ్ వర్కింగ్ స్టైల్.
తెలుగులో నా తొలి చిత్రం మీనా డైరెక్ట్ చేస్తున్నప్పుడు తొలి రోజునే ఆరు సీన్లు ప్లాన్ చేశాను. నా స్పీడ్ చూసి గుమ్మడి గారు” నిర్మలా నువు తప్పు చేస్తున్నావు… ఇలా ఉరుకులు పరుగులు పెట్టిస్తే రిజల్ట్ బాగా రాకపోగా మేము చాలా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది.. నేను ఈ సినిమా చేయను” – అని విగ్గు తీసేసారు. అలా చెప్పటంలో ఆయనకు ఎలాంటి ఇగో లేదు. మంచి నవలా చిత్రాన్ని ఈ అమ్మాయి తొందరపడి పాడు చేస్తుందేమో అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా ఆందోళన పడ్డారాయన. నేను ఎంతో సహనంగా ఆయన సీనియారిటీని గౌరవిస్తూ ” సార్… నేను తీసింది రేపు మార్నింగ్ మీకు రష్ చూపిస్తాను.. మీకు నచ్చకపోతే మీరు యాక్ట్ చేయొద్దు… అని చెప్పి మరుసటి రోజున రష్ చూపించాను. రష్ చూసి వెళ్తూ” నువ్వు పనిరాక్షసివి” అని నవ్వుకుంటూ మేకప్ రూమ్ కి వెళ్లి రెడీ అయి వచ్చారు గుమ్మడి గారు. కాబట్టి దర్శకురాలిగా నేను తీసినవన్నీ గొప్ప చిత్రాలు అని చెప్పను గానీ సినిమా ఎకనామిక్స్ ను, బడ్జెట్ లిమిటేషన్స్ ను కరెక్ట్ గా ఫాలో అయ్యాను అని మాత్రం చెప్పగలను… అందుకే అన్ని చిత్రాలు తీయగలిగాను.
* ఒక లేడీ డైరెక్టర్ అయిన మీరు రేప్ సీన్స్ మగ డైరెక్టర్ ల కంటే దారుణంగా తీస్తారనీ, అలాగే హీరోయిన్స్ ను ఎక్స్పోజ్ చేయడం లో కూడా ఏ మాత్రం సంకోచించరనే విమర్శ ఒకటి ఉంది… దీనికి మీ సమాధానం ఏమిటి?
విజయనిర్మల:
రేప్ అనేదే ఒక దారుణం. ఇక దాన్ని చిత్రీకరించటంలో దారుణం ఏముంటుంది? తీసుకున్న కథాంశాన్ని, విలన్ క్యారెక్టర్ల దుర్మార్గాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సన్నివేశం తాలూకు రిక్వైర్మెంట్ మేరకు తీస్తాను.అలాగే హీరోయిన్లను గ్లామర్ గా చూపెట్టానే తప్ప అశ్లీలంగా నేను ఎప్పుడూ చూపెట్టలేదు. నా కథానాయిక పాత్రలన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవే. నిజానికి హద్దులు దాటిన అశ్లీలతను ఎవరు ప్రదర్శించినా అది తప్పే. దాంట్లో కూడా ఫిమేల్ డైరెక్టర్లు- మేల్ డైరెక్టర్లు అనే రిజర్వేషన్లు , వివక్ష ఎందుకు? నేనెప్పుడూ ఒక కమర్షియల్ డైరెక్టర్ గానే ఆలోచించాను తప్ప లేడీ డైరెక్టర్ ను అనే సెల్ఫ్ సింపతీతో ఆలోచించలేదు.
* ఈ మేల్ డామినేటింగ్ ఫీల్డ్ లో ఒక లేడీ డైరెక్టర్ గెలవటం, నిలవటం చాలా కష్టం అంటారు. మీ తరువాత మీలాగా ఇంత స్పాన్ ఉన్న లేడీ డైరెక్టర్స్ ఎవరూ రాకపోవటానికి కారణం ఏమిటంటారు?
విజయనిర్మల:
మీరన్నట్లు ఇది నిజంగా మేల్ డామినేటింగ్ ఫీల్డె. ఈ ఫీల్డ్ లో ముఖ్యంగా డైరెక్షన్ అండ్ అదర్ టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో ఆడవాళ్లు నిలదొక్కుకోవటం చాలా చాలా కష్టం. నేను డైరెక్టర్ గా ఎంత సక్సెస్ అయ్యాను.. ఎన్ని సినిమాలు తీశాను అనేది అలా ఉంచితే అసలు నేను డైరెక్టర్ కావటానికి దోహదపడిన రెండు ప్రధాన అంశాలను చెప్తాను. నేను ఒక ఎస్టాబ్లిషెడ్ అండర్ ఎక్స్పీరియన్స్ డ్ హీరోయిన్ ను కావటం ఒక కారణం అయితే… కృష్ణ గారి లాంటి సంస్కార సంపన్నులు భర్తగా దొరకటం రెండవ కారణం. కాబట్టి ఈ రంగంలో మహిళలు యాక్టింగ్ కాకుండా ఇతరత్రా శాఖలలో ఏదైనా సాధించాలి అంటే కచ్చితంగా సినిమా నేపథ్యం అవసరం. గతంలో సావిత్రి గారు, భానుమతి గారు, ఆ తరువాత నేను,ఈ తరంలో సుహాసిని, జీవిత, కలిదిండి జయ… ఇలా దర్శకులు అయిన ఆడవాళ్ళు అందరిరికీ ఏదో ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది… అది అవసరం కూడా.
* రాను రాను మన సినిమాలలో హీరోయిన్ పాత్రల ప్రాధాన్యత తగ్గి పోతుంది. అలాగే తెలుగు తెరమీద తెలుగు అమ్మాయిలు కనిపించని దుస్థితి ఏర్పడింది. దీని మీద ఒక లేడీ డైరెక్టర్ గా మీ అభిప్రాయం ఏమిటి?
విజయనిర్మల:
ఈ ప్రశ్నలో మీరు అడిగిన రెండు విషయాలు వాస్తవాలే. ఇక వాటి మీద భిన్నాభిప్రాయ0 ఏముంటుంది?
తెలుగులో ఒక గొప్ప కెరీర్ చూసిన చివరి హీరోయిన్ సౌందర్య అయితే తెలుగు తెర మీద కనిపించిన తెలుగుతనం ఉన్న లాస్ట్ హీరోయిన్ లయ అని చెప్పుకోవాలి. ఆ ఇద్దరి తరువాత తెలుగు తెర మీద తెలుగుదనంతో కనిపించే తెలుగు హీరోయిన్లు దాదాపు కనుమరుగైపోయారు. ఇక హీరోయిన్ల పాత్రల ప్రాధాన్యత విషయానికి వస్తే మా రోజుల్లో మేం చేసే క్యారెక్టర్స్ బాగా లేకపోతే, మాకు ఇంపార్టెన్స్ లేకపోతే గట్టిగా అడిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి వాయిస్ ను ఎవరు వినిపించలేకపోతున్నారు. బొంబాయి నుండి వచ్చే హీరోయిన్లకు వాళ్ల రేట్లు- డేట్లు మీద తప్ప క్యారెక్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే ధోరణిలో పడిపోయారు. అది వారి తప్పు కాదు… అలాగే తప్పు ఎవరిదో కూడా చెప్పలేం.
* విజయనిర్మల గారూ! చివరిగా ఒక ప్రశ్న..మీ ఇన్నేళ్ళ చలనచిత్ర జీవితాన్ని సమీక్షించుకుంటే మీకేమనిపిస్తుంది?
విజయనిర్మల:
నా అంత అదృష్టవంతురాలిని నేనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రంగంలో చాలామందికి దక్కని గుర్తింపు, గౌరవం, పురస్కారాలు నాకు దక్కాయి. హీరోయిన్ గా అయితే ఓ పాతికేళ్లకే కెరీర్ ముగిసిపోతుంది. కానీ దర్శకురాలిగా , నిర్మాతగా కూడా నన్ను నేను విస్తృత పరచుకోవడం వల్ల బాల నటి నుండి నేటి వరకు 50 సంవత్సరాల సుసంపన్నమైన సినిమా జీవితాన్ని చూడగలిగాను. సినిమా అనే ఈ గ్లామర్ ప్రపంచంలో వచ్చిన, వస్తున్న ఎన్నెన్నో టెక్నికల్ అండ్ క్రియేటివ్ ఎవల్యూషన్స్ చూశాను. ఈ రంగంలో ఎంతో మంది మహిళలు ఎంతో కాలంగా బతుకుతున్నారు… కానీ చాలా కొద్ది మంది మాత్రమే జీవించగలుగుతున్నారు.అలా నాదైన వ్యక్తిత్వంతో, నావైన విజయాలతో ఐదు దశాబ్దాల” నాటౌట్” కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్నందుకు,కృష్ణ గారి సమక్షంలో , సహచర్యంలో చాలా ఆనందంగా కొంచెం గర్వంగా కూడా ఫీల్ అవుతుంటాను. నా ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో తారసపడిన సహా నటీనటులకు, దర్శక నిర్మాతలకు, టెక్నీషియన్స్ కు, పాత్రికేయులకు అందరినీ మించి 250 పైగా చిత్రాలలో నన్ను చూసి ఆశీర్వదించిన తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు ఎప్పటికి రుణపడి ఉంటాను… అంటూ ముకుళిత హస్తాలతో తన సుదీర్ఘ అనుభవాల ఆత్మకథకు ముగింపు పలికారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తో ” లేడీ ఫ్రైడ్ ఆఫ్ ద ఇండియన్ సినిమా” గా ఎదిగిన విజయనిర్మల.
( ఇదీ 12 ఏళ్ల క్రితం విజయనిర్మల గారితో నేను చేసిన ఇంటర్వ్యూ. బాల నటి నుండి భారత దేశమే గర్వించే ఒక ఫిమేల్ ఫిలిం పర్సనాలిటీగా ఎదిగిన విజయనిర్మల నిష్క్రమణం వ్యవస్థగా చిత్రపరిశ్రమకు, వ్యక్తిగతంగా ఎన్నో కుటుంబాలకు తీరని నష్టం. తన వాళ్లనే కాకుండా … పని వాళ్లను కూడా తన వాళ్లుగా సొంత బిడ్డలుగా చూసుకునే సహృదయ అమృత మూర్తి విజయనిర్మల. “వస్తాడు నా రాజు ఈరోజు
తానై వస్తాడు నెలరాజు ఈ రోజు ” అని అభినయించి అలరించిన విజయనిర్మల కృష్ణ గారిని మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు.
నిన్ననే ఆమె దశదిన సంస్మరణ కార్యక్రమం కూడా ముగిసింది. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేజీలలో, సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో ఎన్నో పేజీలలో సువర్ణాక్షర లిఖితంగా నిలిచిపోయిన విజయనిర్మల ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూ అంజలి ఘటిస్తోంది “ద తెలుగు ఫిలిం డాట్ కాం”.
[youtube_video videoid=72rVsHTGnLQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: