లక్ష్య సాధనే లక్ష్యంగా బ్రతికిన శతాధిక చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు

#HBDDRN, 2019 Latest Telugu Movie News, Dr D Ramanaidu Birth Anniversary Today, Dr D Ramanaidu Latest News on His Birth Anniversary, Greatness of Dr D Ramanaidu, Remembering Dr D Ramanaidu on his Birth Anniversary, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Remembering Dr D Ramanaidu on his Birth Anniversary

జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే అందరూ ఆశించిన లక్ష్యాలను సాధించుకోలేరు. అతి కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాలను ముందుగా ప్రకటించి వాటి సాధనకు నిరంతరాయంగా కృషి చేస్తారు… చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి కార్య సాధకులలో దివంగత అగ్రనిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ముందు వరుసలో ఉంటారు. అయితే తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో రామానాయుడు సాధించాలనుకున్నది ఏమిటి? సాధించింది ఏమిటి? ఆయన సాధించాలి అని నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఏవైనా మిగిలిపోయాయా? అని ఆలోచిస్తే, ఆయన విజయాలను విశ్లేషిస్తే గొప్ప స్ఫూర్తిదాయకమైన ఫలితాలు, విజయాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు జూన్ 6 – రామానాయుడు జన్మదినం.. ఆయన 83 వ జయంతి. ఈ సందర్భంగా నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, ఆదర్శప్రాయంగా నిలిచిన డాక్టర్ డి.రామానాయుడు లక్ష్యాలను, అవి సాధింపబడిన తీరును ఒక్కసారి నెమరు వేసుకుందాం.

తొలుత కొందరు బంధుమిత్రుల భాగస్వామ్యంలో “అనురాగం” చిత్రాన్ని నిర్మించి నష్టపోయిన పిదప 1963లో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి సోలో ప్రొడ్యూసర్ గా నిర్మించిన “రాముడు భీముడు” అద్భుత విజయాన్ని సాధించడంతో తెలుగు చలన చిత్రరంగంలో రామానాయుడు జైత్రయాత్ర ప్రారంభమైంది. తొలి చిత్ర ఘన విజయంతో తొలిసారిగా విజయ మాధుర్యాన్ని చవిచూసిన రామానాయుడుకు సక్సెస్ ఒక వ్యసనం అయిపోయింది. రాముడు భీముడు తరువాత కొన్ని జయాపజయాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని” ప్రేమనగర్” నిర్మాణంలో చివరి రూపాయి వరకు ఖర్చుచేసి ఆ చిత్ర విజయం కోసం రిక్త హస్తాలతో ఎదురుచూసిన రామానాయుడిని అఖండ విజయం వరించింది. నిజానికి రామానాయుడు సినీ జీవితంలో “ప్రేమనగర్” నుండి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రేమనగర్ విజయం తరువాతే రామానాయుడు తన జీవితానికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు .

* “నెంబర్ 1”- తొలి లక్ష్యం : 

ఎప్పటికైనా “నెంబర్ 1” ప్రొడ్యూసర్ అనిపించుకోవాలి అన్నది ఆయన తొలి లక్ష్యం. ఈ లక్ష్యం ఎలా సాధించబడిందో అందరికీ తెలుసు. సంఖ్యాపరంగా, సక్సెస్ పరంగా తిరుగు లేని ప్రస్థానాన్ని కొనసాగించి నెంబర్ వన్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ వంటి అభినందనలు అందుకుని ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగారు రామానాయుడు.

*శత చిత్ర నిర్మాత – రెండవ లక్ష్యం : 

నూరు చిత్రాలు నిర్మించి “తొలి శత చిత్ర నిర్మాత”గా పేరు తెచ్చుకోవాలి అన్నది రామానాయుడు రెండవ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా నిరంతరాయంగా చిత్ర నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగించి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషలలో చిత్రాలు నిర్మించి శత సంఖ్యను అవలీలగా అధిగమించారు రామానాయుడు. అయితే తాను వ్యక్తిగత సంతృప్తి కోసం నిర్దేశించుకున్న శతచిత్ర నిర్మాణ లక్ష్యం తనను ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల తొలి నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిస్తుందని రామానాయుడు ఊహించలేదు. మొత్తం 130కి పైగా చిత్రాలు నిర్మించి ప్రపంచ చలన చిత్ర చరిత్రలో మరి ఏ ఇతర నిర్మాత దరి చేరలేని వరల్డ్ రికార్డు నెలకొల్పారు రామానాయుడు.

* సమస్త భారతీయ భాషల్లో:

సమస్త భారతీయ భాషలలో చిత్రాలు నిర్మించాలి అన్నది రామానాయుడు నిర్దేశించుకున్న మూడవ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా మొత్తం 13 భారతీయ భాషల్లో 130కి పైగా చిత్రాలు నిర్మించారు రామానాయుడు. అయితే మొత్తం 22 భారతీయ భాషలలో చిత్రాలు నిర్మించాలన్న ఆయన లక్ష్యం దాదాపు 70 శాతం మాత్రమే పూర్తయింది. మిగిలిన తొమ్మిది భాషలలో కూడా చిత్రాలు నిర్మించే దిశగా రామానాయుడు ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన అర్ధాంతర మరణం ఆ లక్ష్య సాధనకు అవరోధం కల్పించింది. నిర్మాణ దక్షతలో తండ్రికి ఏ మాత్రం తీసిపోని తనయుడు డి.సురేష్ బాబు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తారేమో చూడాలి.

* A to Z స్టూడియో నిర్మాణం :

ఒక నిర్మాత స్క్రిప్ట్ తో తన స్టూడియో లోకి అడుగు పెడితే ఫస్ట్ కాపీ తో బయటకు వెళ్ళటానికి అవసరమైన సమస్త సదుపాయాలు, సాంకేతిక వసతులతో కూడిన కాంప్రహెన్సివ్ స్టూడియో నిర్మాణమే తన లక్ష్యమని పదే పదే చెప్పిన రామానాయుడు ఆ లక్ష్యాన్ని గొప్పగా నెరవేర్చుకున్నారు. కొండలను పిండి కొట్టి కళాత్మకంగా నిర్మించిన రామానాయుడు స్టూడియోస్ నిర్మాణాన్ని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి పథంలో ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు.

* మూడు విభాగాల్లో:

సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే మూడు విభాగాల సమాహారం అన్నది జగమెరిగిన సత్యం. నిర్మాతల సాధకబాధకాలతో డిస్ట్రిబ్యూటర్స్, వారి కష్టనష్టాలతో ఎగ్జిబిటర్స్ నిత్యం విభేదిస్తుంటారు.అలాంటి సమన్వయ లోపం తన సినిమాల విషయంలో తలెత్తకూడదనే లక్ష్యంతో తన వ్యాపకాలను పంపిణీ, ప్రదర్శన రంగాలకు కూడా విస్తరింపజేసి మూడు విభాగాలలోనూ అద్భుత విజయాలను సాధించిన కార్యశూరుడు డాక్టర్ డి.రామానాయుడు.

* బెస్ట్ పార్లమెంటేరియన్:

రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాలు, సమీకరణాల కారణంగా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 13వ లోక్ సభలో అడుగు పెట్టారు రామానాయుడు.1999 నుండి 2004 వరకు బాపట్ల పార్లమెంటు సభ్యునిగా నియోజకవర్గానికి ఎన్నెన్నో ప్రయోజనకరమైన సేవలందించారు రామానాయుడు. ఇది నిర్దేశిత లక్ష్యం కాకపోయినప్పటికీ యాదృచ్చికంగా ఎదురైన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ పార్లమెంటేరియన్ గా నియోజకవర్గ ప్రజల ప్రశంసలు అందుకున్నారు రామానాయుడు.

* దాతృత్వ ధీరుడు:

మనిషి ఎంత గొప్పవాడైనప్పటికి , ఎంత కార్యసాధకుడు అయినప్పటికీ, ఎంతటి ధీరోదాత్తుడు అయినప్పటికీ దాతృత్వ లక్షణం లేకపోతే అవన్నీ శుద్ధ దండగ. కానీ రామానాయుడులోనిండైన జాలి గుణం ఉంది. ఎదుటి వారి కష్టాలు కరిగిపోయే మంచి మనసు ఉంది. అపాత్రదానాలు చేసేంత అజాగ్రత్తపరులు కాదుకానీ అవసరాన్ని గుర్తెరిగి స్పందించే సహృదయత రామానాయుడులో మెండుగా ఉంది. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన రామానాయుడులోని సేవాతత్పరత ప్రశంసార్హమైంది.

శతచిత్ర నటుడు:

నటన మీద మంచి ఆసక్తి ఉన్నప్పటికీ తాను మంచి నటుడిని కాదు అన్న రియలైజేషన్ కూడా నిండుగా ఉన్న నటుడు రామానాయుడు. దాదాపు తాను నిర్మించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక చిన్న పాత్రలో కనిపించడం రామానాయుడికి అచ్చి వచ్చిన సెంటిమెంట్. నటుడిగా మీ రికార్డ్ ఏమిటి అని అడిగితే “నేను నిర్మించిన130 చిత్రాలలో కనీసం 100 సినిమాల్లో అయినా నటించి ఉంటాను”- అనేవారు రామానాయుడు. అయితే దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన” సూరి గాడు” చిత్రంలో జడ్జిగా ముఖ్య పాత్రను పోషించిన రామానాయుడు” హోప్” చిత్రంలో పూర్తిస్థాయి ప్రధాన పాత్రను పోషించి నటన పట్ల తనకు గల మక్కువను తీర్చుకున్నారు.

స్నేహశీలి- సరస ప్రియులు:

వృత్తిపరంగా ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినప్పటికీ, ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ వ్యక్తిగతంగా రామానాయుడు చాలా గొప్ప స్నేహశీలి, సరస ప్రియులు అన్నది ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. వయస్సు, హోదా తో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి తన మంచితనాన్ని, స్నేహ పరిమళాలను పంచిన సహృదయ శిఖరం డాక్టర్ డి.రామానాయుడు.

తెలుగు చలన చిత్రరంగంలో ఎందరెందరో మహామహులు ఉన్నప్పటికీ దగ్గుబాటి రామానాయుడు స్థాన విశిష్టత మాత్రం చెక్కుచెదరనిది… చరిత్ర మరువనిది. శతాధిక చిత్రాల ప్రస్తాన ఫలితంగా రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఫిలింఫేర్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులతో పాటు భారతదేశపు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు అందుకున్న భారతదేశ అత్యున్నత శ్రేణి చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ఆత్మ శాంతి ని ఆకాంక్షిస్తూ తన తరపున తన పాఠకుల తరపున 83వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” .

[subscribe]

[youtube_video videoid=1-izWHibKHU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =