అందచందాల కుందనపు బొమ్మ- హావభావాల అభినయపు రెమ్మ- “సౌందర్య” అర్ధాంతరంగా అంతర్ధానమై నేటికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. మహానటి సావిత్రి, వాణిశ్రీ, జయసుధల తరువాత అత్యున్నత అభినయ ప్రమాణాలతోపుష్కర కాలం పాటు వెండితెర మహారాజ్ఞిగా వెలుగొందిన సౌందర్య ఏప్రిల్ 17,2004 న అనూహ్యంగా, అత్యంత దారుణంగా దుర్మరణం పాలవ్వటంతో యావత్ దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆమెతో పాటు ఆమె అన్నయ్య అమర్ కూడా ఆ దుర్ఘటనలో అసువులు బాసారు.
రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా, రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా కొన్ని రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బిజెపి పార్టీకి ప్రచారం చేసే నిమిత్తం బయలుదేరిన సౌందర్య, అమర్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే హెలికాప్టర్ కుప్పకూలడంతో మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతి అయ్యారు.
అందం, అభినయం, అణుకువ, ఆత్మ విశ్వాసం వంటి గొప్ప లక్షణాల ఒప్పులకుప్ప సౌందర్య క్షణాల్లో బూడిద కుప్పగా మారిపోయింది. నిజానికి ఆనాటి దుర్ఘటన క్షణాల్లో దావానలంలా వ్యాపించడంతో ఆ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది… కళ్ళు చమర్చాయి. ఆ అద్భుత సౌందర్యరాశి జీవితం అలా అర్ధాంతరంగా ముగిసినప్పటికీ ఆమె నటించిన సినిమాలు, పోషించిన పాత్రలు, పంచిన స్నేహ పరిమళాలు అందరి మనసుల్లో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. 1992లో “గంధర్వ” అనే కన్నడ చిత్రం ద్వారా పరిచయమైన సౌందర్య 2004లో చనిపోయే నాటికి కేవలం 12 సంవత్సరాలలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషలలో 120కి పైగా చిత్రాలలో నటించి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంది.
ముఖ్యంగా తెలుగులో ఆమె అందరు అగ్రహీరోలతో అఖండ విజయాలను సాధించింది. ఆమె పోషించిన అన్ని పాత్రలు చిరస్మరణీయం అయినప్పటికీ వాటిలో కొన్ని తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఈరోజు ఆమె 15వ వర్థంతిని పురస్కరించుకుని సౌందర్య జ్ఞాపకాల నేపథ్యంలో ” ద బెస్ట్ ఆఫ్ సౌందర్య” గా నిలిచే సినిమా ఏదో మీరే నిర్ణయించండి. నిజానికి ఇది మనం రెగ్యులర్ గా ఆడుకునే ‘పోల్ గేమ్’ కాదు. చేజారిన అభినయాల అమృత భాండం లాంటి ఒక అసమాన నటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మాత్రమే. సో.. ఈ కింద ఇస్తున్న “సౌందర్య టాప్ టెన్ హిట్స్” లో మీరు బాగా కనెక్ట్ అయిన హిట్ ఏదో మీరే చెప్పండి.మీ ఈ రికలెక్షనే ఆ సౌందర్యరాశికి ఘన నివాళి.
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=75I8L6IDTFY]