2019 సంక్రాంతి తెలుగు సినిమా ప్రియులకు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా నలుగురి అగ్ర కథానాయకుల చిత్రాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి మరి. ఆ నలుగురు అగ్ర కథానాయకులు నటసింహ నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాగా… ఆ నాలుగు చిత్రాలు `యన్.టి.ఆర్. కథానాయకుడు`, `ఎఫ్ 2`, `పేట`, `వినయ విధేయ రామ`. వీటిలో `పేట` మినహా మిగిలినవన్నీ స్ట్రయిట్ ఫిల్మ్సే. అయితే… ఈ నాలుగు సంక్రాంతి చిత్రాలపైనా అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. అంతేకాదు… గతంలో ఈ నలుగురు హీరోలూ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించిన వారు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎవరి `సంక్రాంతి` సెంటిమెంట్ బలం ఎలా ఉందో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటసింహ బాలకృష్ణ:
నటసింహ నందమూరి బాలకృష్ణకి, సంక్రాంతికి మంచి అనుబంధమే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18 చిత్రాల్లో సందడి చేసిన ఘనత బాలయ్యది. తన తండ్రి యన్టీ రామారావుతో కలసి `వేములవాడ భీమకవి` (1976), `దానవీర శూరకర్ణ` (1977), `అనురాగదేవత` (1982) చిత్రాలతో పలకరించిన బాలయ్య… సోలో హీరోగా `భార్గవరాముడు` (1987), ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ (88), ప్రాణానికి ప్రాణం (90), వంశానికొక్కడు (96), పెద్దన్నయ్య (97), సమరసింహారెడ్డి (99), వంశోద్ధారకుడు (2000), నరసింహనాయుడు (2001), సీమ సింహం (2002), లక్ష్మీ నరసింహా (2004), ఒక్క మగాడు (2008), పరమ వీర చక్ర (2011), డిక్టేటర్ (2016), గౌతమిపుత్ర శాతకర్ణి (2017), జై సింహా (2018)తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. వీటిలో `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` ఇండస్ట్రీ హిట్స్ గా నిలవగా… `దానవీర శూరకర్ణ`, `అనురాగ దేవత`, `భార్గవ రాముడు`, `ఇన్స్‌పెక్టర్ ప్రతాప్`, `వంశానికొక్కడు`, `పెద్దన్నయ్య`, `లక్ష్మీ నరసింహా`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `జై సింహా` మంచి విజయం సాధించాయి. అంటే… బాలయ్యకి సంక్రాంతి సమయంలో సింహభాగం విజయాలే దక్కాయన్నమాట. తన తరం కథానాయకుల్లో `సంక్రాంతి`కి ఎక్కువ విజయాలు అందుకున్న కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలయ్య… తాజా చిత్రం `యన్.టి.ఆర్. కథానాయకుడు`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి. రేపు (జనవరి 9) ఈ సినిమా తెరపైకి రానుంది.
విక్టరీ వెంకటేశ్:
కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్‌ది 32 ఏళ్ళ నట ప్రస్థానం అయితే… వాటిలో 16 ఏళ్ళు సంక్రాంతి సీజన్‌లో సినిమాలు రిలీజ్ కావడం విశేషంగానే చెప్పాలి. `రక్త తిలకం` (1988), `ప్రేమ` (89), `శత్రువు (91), చంటి (92), పోకిరి రాజా (95), ధర్మ చక్రం (96), చిన్నబ్బాయ్ (97), కలిసుందాం… రా (2000), దేవీ పుత్రుడు (2001), లక్ష్మీ (2006), నమో వెంకటేశ (2010), బాడీ గార్డ్ (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), గోపాల గోపాల (2015), అజ్ఞాతవాసి (గెస్ట్) (2018)… ఇలా 15 సార్లు సంక్రాంతి సమయంలో తన చిత్రాలతో పలకరించిన వెంకీ… 16వ సారి `ఎఫ్ 2`తో అభిమానుల ముందుకు రానున్నాడు. సంక్రాంతికి విడుదలైన వెంకీ చిత్రాల్లో `చంటి`ఇండస్ట్రీ హిట్ కాగా… `శత్రువు`, `కలిసుందాం..రా!`, `లక్ష్మీ`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` ఘనవిజయం సాధించాయి. అలాగే `ప్రేమ`, `ధర్మ చక్రం`, `కలిసుందాం..రా!`తో ఉత్తమ నటుడిగా `నంది` పురస్కారాలను కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో… వెంకీకి కలిసొచ్చిన సంక్రాంతికే విడుదలవుతున్న `ఎఫ్ 2` ఫలితం ఆసక్తికరంగా మారింది. మరి… `ఎఫ్ 2`తోనూ వెంకీ తన సంక్రాంతి సెంటిమెంట్ బలాన్ని మరోసారి చాటుకుంటాడేమో చూడాలి. ఈ నెల 12న `ఎఫ్ 2` ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్:
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతంలో… `నాయక్` (2013), `ఎవడు` (2014) చిత్రాలతో సంక్రాంతి సీజన్‌లో ఘనవిజయాలను అందుకున్న చరణ్… ముచ్చటగా మూడోసారి `వినయ విధేయ రామ`తో సందడి చేయనున్నాడు. ఇప్పటికే రెండు సంక్రాంతి విజయాలను అందుకోవడంతో పాటు… `రంగస్థలం` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత చెర్రీ నుంచి వస్తున్న సినిమా కావడంతో `వినయ విధేయ రామ`పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి… సంక్రాంతి సెంటిమెంట్ బలంతో రామ్ చరణ్ మరో భారీ విజయాన్ని మూటగట్టుకుంటాడేమో చూడాలి. కాగా… `వినయ విధేయ రామ` ఈ నెల 11న థియేటర్లలో సందడి చేయనుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్:
దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ… అలాగే హిందీ చిత్ర పరిశ్రమలోనూ నటించి విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్… ప్రధానంగా తమిళ చిత్రాలతో అలరించాడు. ఇక తెలుగులోనూ నేరుగా కొన్ని చిత్రాలు చేసినా… సంక్రాంతికి మాత్రం ఆయన సినిమాలు విడుదల కాలేదనే చెప్పాలి. అయితే… రజనీ స్థాయిని తెలుగునాట పెంచిన సినిమా `బాషా` (1995)… తమిళంతో పాటు తెలుగులోనూ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఘనాతిఘన విజయం సాధించి… అప్పట్లో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాంటి `బాషా` తరువాత అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ 24 ఏళ్ళ తరువాత `పేట`తో పలకరించనున్న రజనీ… ఈ సారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇలా… సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమున్న ఈ నలుగురు అగ్ర కథానాయకులకు… తమ తమ కొత్త చిత్రాలు రికార్డు స్థాయి విజయాలను అందించాలని ఆశిద్దాం.
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: