” కృతజ్ఞత” అనేది చాలా గొప్ప పదం. అది అందరిలోనూ దర్శనీయం కాని అరుదైన ఉదాత్త భావన. మాటల్లో కృతజ్ఞతను, చేతల్లో “కృతఘ్నత” ను ప్రదర్శించే నాటకీయ వ్యక్తులున్న ఈ రోజుల్లో తాను ఎవరి పట్లనైనా కృతజ్ఞతా రాహిత్యాన్ని చూపానేమోనని తన హృదయాన్ని పదే పదే తడిమి చూసుకునే వ్యక్తి దుక్కిపాటి మధుసూదనరావు. నలభై సంవత్సరాల మీ సుదీర్ఘ సినీ జీవితంలో మీరు కృతజ్ఞతలు తెలుపవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని మధుసూదనరావును అడిగితే ” ఈ ప్రశ్న అడిగి నా కృతజ్ఞతాభావాన్ని అక్షరబద్ధం చేస్తున్నందుకు ముందుగా మీకు నా కృతజ్ఞతలు”- అన్నారు మధుసూదనరావు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆపై తను కృతజ్ఞతలు చెప్పవలసిన వ్యక్తుల జాబితాను, వారి ప్రాధాన్యతా క్రమాన్ని ఇలా చెప్పుకొచ్చారు మధుసూదనరావు.
” అందరికంటే నేను ఎక్కువగా కృతజ్ఞతగా ఉండవలసినది మా అన్నపూర్ణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు”- అంటారు మధుసూదనరావు. వారి అభిమానానికి, ఈయన బాధ్యతాయుతమైన ఆలోచనకు దర్పణంగా నిలిచే ఒక సంఘటనను ఈ సందర్భం గా చెప్పుకోవచ్చు.
విజయవాడ అలంకార్ థియేటర్ లో” వెలుగునీడలు” శతదినోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించిన నవయుగా డిస్ట్రిబ్యూటర్స్ వేదిక మీద యూనిట్ మొత్తానికి కలిపి ఒక సన్మాన పత్రం అందజేశారు. నిర్మాత మధుసూదనరావు ప్రత్యేకంగా ఒక సన్మాన పత్రాన్ని సమర్పించారు. ఆ విజయానికి తాను మాత్రమే కారకుడి ననే భావన ఏ మాత్రం లేని మధుసూదనరావు తన ప్రసంగంలో ” ఈ విజయంలో నేను భాగస్వామిని మాత్రమే. ఈ విజయాన్ని సాధించడానికి దోహదపడిన మా అన్నపూర్ణ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు నా కృతజ్ఞతలు. నామీద నమ్మకంతో నా నిర్ణయాల పట్ల గురి, గౌరవంతో నాకు స్వేచ్ఛను ఇచ్చి ఈ విజయ సాధనకు తోడ్పడిన మా అన్నపూర్ణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఈ విజయోత్సవంలో సమానులే. ఇది నా వ్యక్తిగత విజయం కాదు. మా యూనిట్ విజయం”- అని ప్రత్యుత్తరం ఇచ్చారు.
నలుగురున్న సంస్థలో తాను ఒక్కడే ఫోకస్ అవ్వటం సమంజసం కాదు అంటారు మధుసూదన రావు. ఒకవేళ సమస్త ఇమేజ్ దృష్ట్యా అలా ఒక వ్యక్తిని ఫోకస్ చేయాలి అంటే అందుకు అర్హుడు ” మా అక్కినేని నాగేశ్వరరావే”- అంటారు దుక్కిపాటి.
” మా నాగేశ్వరరావు ఒక గ్లామర్ స్టార్. సంస్థ తరఫున అతను పబ్లిక్ లోకి వెళితే సంస్థ ఇమేజ్, గుర్తింపు పెరుగుతాయి. వ్యక్తిగతంగా నాగేశ్వరరావును ఉన్నత స్థితిలో చూడాలన్న నా ఆకాంక్ష నెరవేరుతుంది. అందుకే అన్నపూర్ణ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు వచ్చిన ప్రతిసారి వాటిని స్వీకరించటానికి నాగేశ్వరరావునే పంపించాను. ఇలా మా సంస్థ అవార్డులు, ఇతర చిత్రాల అవార్డులను స్వీకరించటానికి ప్రతియేడు ఢిల్లీ వెళ్లటంతో ఒక కేంద్ర మంత్రి” మీరు మా రెగ్యులర్ కస్టమర్”
అని నాగేశ్వరరావును అభినందించారు. ఆ అభినందన మా సంస్థకు, ముఖ్యంగా నాకు లభించినంత ఆనందాన్ని పొందాను”- అంటారు మధుసూదన రావు.
సంస్థ వ్యవహారాలలో అక్కినేని నాగేశ్వరరావు వ్యవహరించే తీరును ప్రత్యేకంగా ప్రశంసిస్తూ” నాగేశ్వరరావు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్, నా చిత్రాల కథానాయకుడు, నాకు అత్యంత ఆప్తుడు. ఏ విధంగా చూసుకున్నా సంస్థలో అతని మాట చెల్లుబడి కావటానికి అభ్యంతరం ఉండదు. కానీ ఎన్నడూ ఫలానా హీరోయిన్ను గాని, టెక్నీషియన్ను గాని బుక్ చేయమని, కథలో తనకే ప్రాముఖ్యం ఉండాలనిగాని జోక్యం చేసుకోవటం నేనెరగను”- అంటారు మధుసూదనరావు.
ఇక తమ సమస్త చిత్రాల్లో నటించడాన్ని ఒక చక్కని అనుభూతి గా, అనుభవంగా పేర్కొంటూ పత్రికా ముఖంగా తెలియపరచి తమ సంస్థ ఇమేజిని, కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన నటీనట సాంకేతిక వర్గం అందరికీ కృతజ్ఞతలు చెప్పడం మా కనీస కర్తవ్యం.” చదువుకున్న అమ్మాయిలు” షూటింగ్ హైదరాబాదులో చేయటానికి సంకల్పించి అందరికీ హోటల్ రూమ్స్ బుక్ చేస్తే’ అందరం కలిసి సారధి స్టూడియోలోనే ఉంటాం, హోటల్స్ ఎందుకు? డబ్బు దండగ- అని సహకరించిన నటీనటుల మంచితనాన్ని, మా సంస్థ పట్ల వారికి గల గౌరవాన్ని మర్చిపోలేము’ – అంటారు దుక్కిపాటి.
కొందరు వ్యక్తులకు కొన్ని సంస్థలకు మధ్య నియమ నిబంధనల ఒప్పందాలు, ఆర్థిక సంబంధాలు మాత్రమే ఉంటాయి. “డబ్బు తీసుకుంటున్నాం- పనిచేస్తున్నాం, డబ్బు ఇస్తున్నాం- పని చేయించుకుంటున్నాం”- అనే విధంగా యాంత్రిక ధోరణిలో ఉంటాయి చాలా మంది మధ్య రిలేషన్స్. కానీ కొంతమంది వ్యక్తులకు కొన్ని సంస్థల తో ఏర్పడే ఆత్మీయతానుబంధాలు వెలకట్టలేనివై ఉంటాయి.
అన్నపూర్ణ సంస్థతో అలాంటి సత్సంబంధాలు కలిగి సంస్థను తమ మాతృ సంస్థగా గౌరవించి, అభిమానించే వ్యక్తుల జాబితా ఒకటి ఉంది. ప్రారంభం నుండి అన్నపూర్ణ సంస్థ చిత్రాలలో పనిచేస్తూ సంస్థతో అత్యంత సన్నిహిత సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తుల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించటం ఎంతైనా అవసరం.
ఈ జాబితాలో ప్రధములు-
కె.వి.రెడ్డి గారు:
అన్నపూర్ణ వారి ప్రారంభ చిత్రం ” దొంగ రాముడు” కు మాత్రమే పనిచేసి సంస్థ పునాదులను పటిష్టం చేసి చిత్రానికి దర్శకుడుగా, సంస్థకు మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి కె.వి.రెడ్డి గారు. రెండున్నర సంవత్సరాల పాటు తమ నూతనోత్సాహాన్ని అణిచి పెట్టుకుని ఆయన కోసం నిరీక్షించినందుకు అంతకు రెట్టింపు ఫలితాన్ని చవిచూశారు అన్నపూర్ణ అధినేతలు.
అన్నపూర్ణ వారి ప్రారంభ చిత్రం దొంగ రాముడు విడుదలై అఖండ విజయాన్ని సాధించిన తరువాత కె.వి.రెడ్డి గారు తాను ఆ సంస్థకు పని చేయటానికిగల మూడు కారణాలను వెల్లడించారు.” నేను వాహినీ వారి నుండి బయటకు వచ్చాక ఎన్నో పెద్ద సంస్థల వారు బ్లాంక్ చెక్కులతో నన్ను ఆహ్వానించిన విషయం మీకు తెలుసు.కానీ నేను మీ సంస్థను ఎన్నుకోవటానికి మూడు కారణాలు ఉన్నాయి. నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇంతవరకు డైరెక్ట్ చేయలేదు. ఆయనకు నా డైరెక్షన్లో చేయాలని ఉంది. మా ఇద్దరి కోరిక నెరవేరుతుంది అన్నది మొదటి కారణం. నాటక కళాపరిషత్తు నుండి వచ్చిన మీ అభిరుచి నాకు తెలుసు.చక్కని విమర్శనాశక్తి, కార్య దక్షత కలిగిన మీరు మంచి చిత్రాన్ని నిర్మించ గలరన్న నమ్మకం నాకుంది. ఇక మూడవ కారణం నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ మీ పార్ట్నర్స్ కాబట్టి చిత్రాన్ని సజావుగా విడుదల చేయ గలరు. ఈ మూడు కారణాల దృష్ట్యా నేను మీ చిత్రాన్ని అంగీకరించాను”- అని కె.వి.రెడ్డి గారు మధుసూదన రావు గారికి చెప్పారు.
” కె.వి.రెడ్డి గారి వద్ద నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రొడక్షన్ వ్యవహారాలను, సృజనాత్మక విషయాలను ఎలా సంధానపరచుకోవాలో ఆయన నాకు నేర్పారు. నేను నాటకానికి సినిమాకు మధ్య గల వ్యత్యాసాన్ని ఒక విభిన్న కోణంలో దర్శించడానికి కారకులు కె.వి.రెడ్డి గారు. అందుకే ఆయన నాకు గురువు గారని సగర్వంగా చెప్పుకుంటాను. ఆయన మా ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసి ఉండకపోతే మేము, మా సంస్థ ఏమైపోయేవారమో “- అని పదేపదే చెప్పుకుంటారు మధుసూదనరావు.అన్నపూర్ణ సంస్థలో కె.వి రెడ్డి గారిది ఒక విశిష్ట స్థానం. ఆయన జ్ఞాపకాలు సంస్థ చరిత్రలో చిరకాలం వన్నె తరగని జ్ఞాపికలుగా మిగిలిపోతాయి. తమ రెండవ చిత్రానికి కూడా కె.వి.రెడ్డి గారు దర్శకత్వం వహించాలని కోరినప్పుడు ” మీరు నన్ను ఎంతో గౌరవించారు, అభిమానించారు… కానీ మీకు మరో సినిమా చేయలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నాను.. అంటూ తన నిస్సహాయతను వెల్లడించారు కె.వి.రెడ్డి.
ఆదుర్తి సుబ్బారావు:
ఒక దర్శకుడు ఒక సంస్థలో 12 చిత్రాలకు దర్శకత్వం వహించడం చాలా గొప్ప విషయం.Really it was first of its kind. నిజంగా ఏ దర్శకుడు ఏ సంస్థకు ఇన్ని విజయోత్సవ చిత్రాలను అందించలేదు. ఆదుర్తి సుబ్బారావు అన్నపూర్ణ సంస్థలో పనిచేసిన 12 చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ కావటం గొప్ప విశేషం. ఆదుర్తి సుబ్బారావు ప్రస్తావన వస్తే దుక్కిపాటి మధుసూదనరావు కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తుంది. నిర్మాత- దర్శకుల మధ్య ఉండవలసిన సత్సంబంధాలకు, సదవగాహనకు నిర్వచనంగా ఉంటుంది వీరి స్నేహం. వీళ్ళ మధ్య విభేదాలు కల్పించాలను కున్న కొందరు స్వార్థపరుల పన్నాగాలు ఫలించలేదు.
ఆదుర్తి సుబ్బారావు హృదయ ఔన్నత్యాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు మధుసూదన రావు.” ఇద్దరు మిత్రులు” చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన తరువాత దర్శకుడు ఆదుర్తికి, ఛాయాగ్రాహకుడు సెల్వరాజ్ కు డైమండ్ రింగ్స్ బహూకరించాలని మధుసూదన రావు అనుకున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని అద్భుతంగా చిత్రీకరించడంతో అన్నపూర్ణ సంస్థకు సృజనాత్మకంగా, సాంకేతికంగా గొప్ప పేరు వచ్చింది. అందుకు కారకులైన ఆదుర్తి సుబ్బారావు, సెల్వరాజ్ లకు ఈ బహుమతులు ఇద్దామనుకుని ముందుగా ఆదుర్తి సుబ్బారావుకు చెప్పారు మధుసూదన రావు.
దానికి ఆదుర్తి వారు ఏమన్నారో చూడండి.” బహుమతి” అనేది చాలా అరుదైనది- విలువైనది. ఈ సినిమాలో నా కన్నా ఎక్కువగా శ్రమించింది, ప్రతిభ చూపించింది సెల్వరాజ్. ఆయనతో పాటు నాకు కూడా ఇస్తే మీ బహుమతి లోని ప్రత్యేకత తగ్గిపోతుంది. కాబట్టి ఆయన ఒక్కరికే ఇవ్వండి”- అని చెప్పారట ఆదుర్తి.ఇతరులకు ఇచ్చే వాటిని అడ్డుకొని ఎగరేసుకుపోయే వాళ్ళకు- అరుదైన వ్యక్తిత్వం గల ఆదుర్తికి మధ్య ఎంతెంత దూరమో చూశారా.!
విజయాలు చేకూరే కొద్దీ వినయాన్ని, విజ్ఞతను పెంచుకున్న విజ్ఞుడు ఆదుర్తి సుబ్బారావు. ఒకసారి రాజమండ్రిలో అక్కినేని నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదుర్తి సుబ్బారావుకు ఘనమైన సత్కారం జరిగింది. లక్షమంది ప్రజలు పాల్గొన్న ఆ బహిరంగ సభలో ” సినిమాలో ఏం చెప్పాలి అన్నది అన్నపూర్ణ సంస్థలో మధుసూదనరావు గారి దగ్గర , ఎలా చెప్పాలి అన్నది ఉదయశంకర్ గారి దగ్గర నేర్చుకున్నాను . వారిద్దరికీ నేను సర్వదా కృతజ్ఞుణ్ణి”- అని ప్రకటించారు ఆదుర్తి.ప్రతిభ విషయంలోనే కాదు.. పంక్చువాలిటీ విషయంలోనూ, నిర్మాత సంక్షేమం గురించి ఆలోచించటంలోను కూడా ఆదుర్తి సుబ్బారావు అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తారు. ఒకసారి ఆదుర్తి సుబ్బారావు డార్జిలింగ్ లో సునీల్ దత్ హీరోగా చేస్తున్న ఒక హిందీ సినిమా షూటింగ్లో ఉన్నారు. వర్షాల కారణంగా అక్కడ లేట్ అయింది. ఇవతల అన్నపూర్ణ వారు ఊటీలో ” పూలరంగడు” షూటింగ్ ప్లాన్ చేసుకుని ఉన్నారు. డార్జిలింగ్ నుండి మధుసూదన రావు కు ఫోన్ చేసి ” పాటే కదా.. డాన్స్ డైరెక్టర్ తో కలిసి మీరే షూట్ చేయండి” అన్నారట. దానికి మధుసూదనరావు” వద్దండి.. డైరెక్టర్ లేకుండా అంతా మధుసూదనరావు చేసేస్తున్నాడు.. వాళ్లలో ఏవో అభిప్రాయబేధాలు వచ్చాయి అని పుకార్లు పుట్టిస్తారు. కాబట్టి మీరు అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నాకే ఇక్కడకు రండి”- అని చెప్పారు.
వెంటనే ఆదుర్తి డార్జిలింగ్ నుండి కలకత్తా, కలకత్తా నుండి మద్రాసుకు ఫ్లైట్ లో వచ్చారు. అక్కడ మద్రాసులో అందుకోవలసిన బ్లూ మౌంటెన్ ఎక్స్ప్రెస్ మిస్ కావటంతో కారు తీసుకుని రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం ఏడు గంటలకల్లా ఊటీ చేరారు. నిన్న మధ్యాహ్నం డార్జిలింగ్ నుంచి మాట్లాడి ఉదయానికల్లా ఊటీలో ప్రత్యక్షమైన ఆదుర్తిని చూసి అవాక్కయ్యారట మధుసూదన రావు.
” కనీసం ఒక పూట విశ్రాంతి తీసుకోమని చెప్పినా వినకుండా షూటింగ్ చేసిన ఆదుర్తి సుబ్బారావు సిన్సియారిటీకి హాట్సాఫ్”- అంటారు మధుసూదనరావు.
“ఇవే కాదు ఇంకా ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన సహృదయులు, మానవతా మూర్తి మా ఆదుర్తి సుబ్బారావు. ఆయన అకాల మరణం మా అన్నపూర్ణ సంస్థకు తీరని లోటు. ఆయన చిరస్మరణీయ స్మృతులు మా సంస్థ జ్ఞాపకాలుగా చిరకాలం నిలిచి పోతాయి”- అంటారు మధుసూదనరావు.
సెల్వరాజ్:
అన్నపూర్ణ సంస్థతో చక్కని అనుబంధం కలిగిన మరొక మంచి వ్యక్తి సుప్రసిద్ధ చాయాగ్రాహకుడు సెల్వరాజ్. అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన 12 చిత్రాలకు డి.యోగానంద్ దర్శకత్వం వహించిన జై జవాన్, కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం చిత్రాలను కలిపి మొత్తం 14 చిత్రాలకు పని చేశారు సెల్వరాజ్. అక్కినేని నాగేశ్వరరావు ముఖాన్ని సెల్వరాజ్ మౌల్డ్ చేసినంత అద్భుతంగా మరే ఛాయాగ్రహకుడు చేయలేదని ప్రతీతి. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చిత్ర నిర్మాణం ప్రారంభించి సెల్వరాజ్ ను తమ సంస్థకు ఆహ్వానించారు. నాగేశ్వరరావు ఆహ్వానం విషయం తెలుసుకున్న మధుసూదన రావు సెల్వరాజ్ ను అభినందించి ఆనందంగా అన్నపూర్ణ స్టూడియో కి పంపించారు.
” నేను నా సినిమాల స్క్రిప్ట్ చదువుకుంటూ నా కళ్ళలో ఎలాంటి విజువలైజేషన్స్ ఊహించుకుంటానో అంతకు మించిన ఫలితాన్ని చూపారు ఆదుర్తి సుబ్బారావు, సెల్వరాజ్. చిత్ర నిర్మాణంలో ఒక దర్శకుడికి, ఛాయాగ్రహకుడుకి మధ్య ఉండవలసిన అవగాహనకు నిదర్శనంగా, నిర్వచనంగా వారిద్దరి కాంబినేషన్ ను చెప్పుకోవాలి.. ఆ ఇద్దరూ నాకు రెండు
కళ్ళ లాంటివారు”- అంటారు మధుసూదనరావు.
(సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి జనవరి 5న చదవండి)
[youtube_video videoid=tjGnRo_TFHw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: