తెలంగాణ సినీ కార్మికుల సమస్యలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినీ పరిశ్రమలో సమ్మెలకు బదులుగా, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా సీఎం వారికి సూచించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ హాలీవుడ్ స్థాయికి..
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి చిత్ర నిర్మాణ కేంద్రంగా, ముఖ్యంగా హాలీవుడ్ స్థాయికి తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ప్రయాణంలో సినీ కార్మికుల పాత్ర చాలా ముఖ్యమని, వారి సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
సినీ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్
సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు ఇప్పటికే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత నిర్మాతలపైనా ఉందని అన్నారు. అంతేకాకుండా, సినీ కార్మికులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని, త్వరలోనే ఈ విషయంలో ఒక శుభవార్త చెబుతామని హామీ ఇచ్చారు.
అపోహలు తొలగిపోయాయి – దిల్ రాజు
కాగా ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక భేటీ ద్వారా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయాయని, భవిష్యత్తులో పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తాము వారధిగా ఉంటామని దిల్ రాజు తెలిపారు.
మరోవైపు ఈ సమావేశంపై సంఘాల నాయకులు హర్షం వెలిబుచ్చారు. ఇన్ని ఏళ్లలో సినిమా కార్మికులను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరని సీఎం రేవంత్‌కి వారు తెలిపారు. మొత్తానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినీ కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతో, వారిలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక సలహాలు, సూచనలు..
- హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నా.
- ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలో చర్చించుకుని చెప్పండి.
- సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను.
- సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరాను.
- స్కిల్ యూనివర్సిటీలో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం.
- సినిమా కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి.
- అన్ని భాషల చిత్రాలు తెలంగాణలో షూటింగ్ జరిగేలా సహకరించాలి.
- చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి.
- పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దు.
- సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది.
- సమస్యను సమస్యగానే చూస్తా, వ్యక్తిగత పరిచయాలను చూసుకోను.
- సినిమా కార్మికుల తరపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.
- ఈ ప్రభుత్వం మీది..మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది.
- నేను కార్మికుల వైపు ఉంటాను.. అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం.
- సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం.
- సినిమా కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం..
- సినీ కళాకారులకు గద్దర్ అవార్డులను ఇచ్చాం.
- 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డులు కూడా ఇవ్వలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























