రివ్యూ: L2 ఎంపురాన్

L2 Empuraan Movie Review in Telugu

నటీనటులు: మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, సచిన్ ఖేడ్కర్ తదితరులు
సంగీతం: దీపక్ దేవ్
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్
ఎడిటింగ్: అఖిలేష్ మోహన్
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్స్
నిర్మాత: సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్
దర్శకత్వం: పృథ్వీరాజ్‌ సుకుమారన్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‌మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్‌’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మలయాళ పరిశ్రమకు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావడం గమనార్హం. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించారు మేకర్స్.

ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రీ సేల్స్ బుకింగ్స్ తోనే రూ.70కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ లూసిఫర్‌ 2: ఎంపురాన్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో దీనిని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

‘ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లి’ అనే పాత్రలో మోహన్ లాల్ మెప్పించాడా? పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకుడిగా మరోసారి సక్సెస్ అందుకున్నాడా? వరల్డ్ వైడ్‌గా అలరించిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఎలాంటి పాత్ర పోషించాడు? మూడు భాగాలుగా రాబోతున్న లూసిఫర్ సిరీస్‌లో రెండో భాగంగా వచ్చిన L2 ఎంపురాన్ ప్రేక్షకులను అలరించిందా? మూడో పార్ధుకి సంబంధించి ఏదయినా హింట్ ఇచ్చారా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథ:-

తొలి భాగం లూసిఫర్‌లో.. తండ్రి హఠాన్మరణంతో తన సవతి సోదరుడు జతిన్‌ రాందాస్ (టొవినో థామస్)కు అధికారం అప్పగించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను అధిగమించి తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగేలా చేస్తాడు స్టీఫెన్ (మోహన్ లాల్). ఈ రెండో భాగం లూసిఫర్‌ 2: ఎంపురాన్‌లో.. జతిన్ రాందాస్ ని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత స్టీఫెన్ విదేశాల్లో స్థిరపడినట్లు చూపిస్తారు.

కానీ అనూహ్యంగా జతిన్ సీఎం పదవిలో ఉండగానే తండ్రి వారసత్వాన్ని, ఆయన పార్టీని వదిలి కొత్త పార్టీ స్థాపిస్తాడు. హిందుత్వ వాది బాబా భజరంగీ (అభిమన్యు సింగ్)తో చేతులు కలుపుతాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శిని (మంజూ వారియర్) వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని కాపాడడానికి స్టీఫెన్ తిరిగి ఇండియా రావాలని చాలా మంది కోరుకుంటారు. ఇదే సమయంలో ఇరాక్‌లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన ఒక దాడిలో స్టీఫెన్ చనిపోయినట్టు వార్తలు వస్తాయి.

అయితే అయితే స్టీఫెన్ నిజంగానే చనిపోయాడా? అసలు స్టీఫెన్ నడుంపల్లిగా కేరళ ప్రజలకు తెలిసిన ఖురేషి అబ్రహం గత చరిత్ర ఏమిటి? పూర్వాశ్రమంలో విదేశాల్లో ఏం చేసేవాడు? అతని కోసం ఇతర దేశాల గూఢచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి? శ‌త్రువులంద‌రూ ఏక‌మై ఒక్కసారిగా చుట్టుముడితే స్టీఫెన్ ఏం చేశాడు? శత్రువుల వ్యూహాలకు ఎలాంటి ప్రతివ్యూహాలు రచించాడు?

మధ్యలో జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? బాబా భజరంగీ మరియు జయేద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) మధ్య శత్రుత్వానికి కారణం ఏంటి? అలాగే సోదరి ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్)తో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడ్డాయా? సీనియర్ నేత గోవర్దన్ (ఇంద్రజిత్ సుకుమారన్) రాజకీయంగా ఎలాంటి పథకాలు రచించారు? సైతాన్‌ను ఎందుకు సహాయం కోరాల్సి వచ్చింది? వీటన్నింటినీ దాటుకుని చివరికి స్టీఫెన్ త‌న రాజ్యాన్ని, ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడుకున్నాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

తొలి భాగం లూసిఫర్‌లో స్టీఫెన్, తన సవతి తల్లి బిడ్డలతో అనుబంధం, రాజకీయ ప్రత్యర్ధులను పరిచయం చేసిన దర్శకుడు పృథ్వీరాజ్.. ఈ చిత్రంలో స్టీఫెన్ గత జీవితం ఏంటి? అతను ఎంత పవర్‌ఫుల్, తాను తలుచుకుంటే రాష్ట్రాన్ని ఎలా శాసించగలడు? అనే విషయాలను డిటైల్డ్‌గా చూపించాడు. ఈ క్రమంలో ఇందులో లూసిఫర్‌ని మించిన ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశాడు.

దీనిలో భాగంగా సినిమాలో కీలక పాత్రల మధ్య భవ వైరుధ్యాలు, రాజకీయ వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు, వాటిని తిప్పి కొట్టే ప్ర‌తి వ్యూహాలు, హీరోయిజాన్ని ఎలేవేట్ చేసే సీన్స్, వావ్ అనిపించే డైలాగ్స్,, నిర్మాణాత్మ‌క విలువ‌లతో L2E: ఎంపురాన్ రూపొందింది. ముఖ్యంగా ఈ మూవీలో స్టీఫెన్ శక్తి,సామర్ధ్యాలు ఏంటి? అనే విషయాలను ప్రజెంట్ చేయడానికి దర్శకుడు ప్రధానంగా దృష్టిపెట్టాడు.

ఆడియెన్స్‌కి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ తెలిసి ఉండటంతో దర్శకుడు మిగిలిన పాత్రలను పరిచయం చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు. జతిన్ పొలిటికల్ కెరీర్, ఎన్నికలకు సమాయత్తం కావడం, ప్రత్యర్ధులు మూకుమ్మడిగా కలిసిరావడం, దీంతో లూసిఫర్ ఎంట్రీ, వంటి సీన్స్‌తో ఫస్టాఫ్ మొత్తం క్రిస్పీగా సాగుతుంది. అద్భుతమైన ఇంటర్వెల్ ఎపిసోడ్ అలరిస్తుంది. దీంతో సెకండాఫ్‌పై ఆసక్తి మొదలవుతుంది.

ఖురేషి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రివీల్ చేసే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ఆ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఇక్కడ హీరోయిజం ఎలేవేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. ఇందులో గ్రాఫిక్స్ వినియోగం తక్కువ అయినప్పటికీ మంచి అవుట్ ఫుట్ రాబట్టాడు దర్శకుడు. సమఉజ్జిల మధ్య వచ్చే డైలాగ్ వార్ మెప్పిస్తుంది. యూకే, దుబాయ్, అమెరికాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు, బాంబ్ బ్లాస్టింగ్ సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. అదిరిపోయే క్లైమాక్స్ మూడో భాగానికి లీడ్ ఇచ్చేలావుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకుని మలయాళంలో అగ్ర హీరోగా వెలుగొందుతున్నారు. ‘దృశ్యం’ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఆయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం ఆయన తెరపై కనిపిస్తే చాలు, స్టోరీ ఎలా ఉన్నా ప్రేక్షకులు చూసేస్తారు అని కేరళలో ఉవాచ. ఈ సినిమాలోనూ ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ని మురిపిస్తారు.

కేవలం తన కళ్ళతో, ముఖంలో హావభావాలతో అద్భుతమైన నటనను ప్రదర్శించే మోహన్ లాల్.. సరైన కథ దొరికితే విశ్వరూపమే చూపిస్తాడు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. మూవీ ఆద్యంతం బరువైన పాత్రలో సీరియస్ నటనను అలవోకగా కనబరిచారు. ఇక ఆయనలోని నటుడిని డైరెక్టర్ పృథ్వీరాజ్ సంపూర్ణంగా వాడుకున్న తీరు ప్రశంసనీయం. ఇలాంటి పాత్రలలో లాల్‌ని తప్ప మరెవరినీ ఊహించుకోలేం, అంత బాగా నటించారు.

అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సినిమాలో చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిసున్నా, తన పాత్రకు సంబంధించి ఆయన ఎక్కడా ఛాన్స్ తీసుకోకపోవడం కథపై, సినిమాపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఇక టోవినో థామస్ పాత్ర ఫస్ట్ పార్టులో లాగే ఇందులోనూ కీలకంగా వుంటుంది. కథ ప్రకారం, సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదు. పొలిటికల్ డ్రామా కాబట్టి ఎక్కువగా ఎంటర్‌టైన్ మోడ్‌లో ఉండదు.

ఇంకా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుంటుంది. మిగిలినవారిలో అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, సచిన్ ఖేడ్కర్ తదితరులు ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ తదితరులు మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక సినిమా టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్‌లో ఉంది. టెక్నిషియన్స్ విషయానికొస్తే.. దీపక్ దేవ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. చాలా సన్నివేశాలను తన మార్క్ బీజీఎంతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బీజీఎం తోనే కొన్ని సీన్స్ హైలైట్ అయ్యాయి. అలాగే పాటల్లో సైతం తన మ్యాజిక్ చూపించాడు దీపక్ దేవ్.

సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ఇక L2 సినిమా 2 గంటల 59 నిమిషాల 52 సెకన్ల రన్ టైమ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందంటే దానికి ప్రధాన కారణం టేకింగ్ అయితే, మరో కారణం ఎడిటింగ్ అనే చెప్పాలి.

మలయాళంలో పలు హిట్ సినిమాలకు పనిచేసిన అఖిలేష్ మోహన్ ఈ చిత్రంతో మరోసారి తన పనితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండి సినిమాపై ఆసక్తిని కోల్పోకుండా చేసింది. ఇంకా ఆర్ట్ వ‌ర్క్ ఇంప్రెస్ చేస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్స్.. అదికూడా ముగ్గురు కలిసి తీసిన చిత్రం కావడంతో నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమా కేవలం యాక్షన్ ప్రియులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మోహన్ లాల్-పృథ్వీరాజ్ కాంబోలో మరో హిట్ పడినట్టే. మోహన లాల్ చెప్పే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌ ఆడియెన్స్‌తో విజిల్స్ వేయిస్తాయి. ఓవరాల్‌గా L2: ఎంపురాన్ ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.