తెలుగు వారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావును వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘మనదేశం’. జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్లకు కట్టిన మొట్టమొదటి చిత్రరాజం కూడా ఇదే.! ఈ చిత్ర నిర్మాత, కథానాయకి, తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మేకా కృష్ణవేణి ఆదివారం కన్నుమూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చలనచిత్ర పరిశ్రమ తొలితరం నటి, తొలి మహిళా నిర్మాత సి. కృష్ణవేణి ఆదివారం హైదరాబాద్‌లో పరమపదించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రకు సంబంధించినంతవరకూ శతాయుష్కురాలైన ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. కృష్ణవేణి తొలితరం నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా.. ఇలా ఎన్నింటిలోనో ప్రతిభను చూపి తనదైన ముద్రను వేశారు. తన సినీ జీవితంలో ఎన్నో ఘనతలు సాధించారు. ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
ఈ నేపథ్యంలో ఈ లెజెండరీ పర్సనాలిటీ జీవితవిశేషాలను ఓసారి పరికిద్దాం.. 1924వ సంవత్సరం డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించిన కృష్ణవేణికి బాల్యం నుంచి నాటకాలంటే మక్కువ. ఈ క్రమంలో పది సంవత్సరాల వయస్సులో ఆమె రాజమండ్రిలో నటించిన ’తులాభారం’ అనే నాటకాన్ని చూసిన ప్రముఖ దర్శకుడు సి. పుల్లయ్య తాను చిన్న పిల్లలతో తీయతలపెట్టిన ’అనసూయ’ సినిమాలో టైటిల్ రోల్‌కు ఆమెను ఎంపిక చేశారు.
ఇలా తొలిసారి సినీరంగంలో బాలనటిగా అవకాశం అందుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం నాటి కలకత్తాలో (నేటి కోల్‌కతా) జరిగింది. ఇక చిన్నవయస్సులోనే తండ్రి (డాక్టర్ కృష్ణారావు) మరణంతో తల్లి, చిన్నాన్నల పెంపకంలో పెరిగిన ఆమె, దిగ్గజ నటుడు సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సహకారంతో 1937లో చెన్నయ్ వెళ్లి ’తుకారం’ అనే సినిమాలో నటించారు. దీనితోపాటుగా మరికొన్ని చిత్రాలలో బాల నటిగా రాణించారు.
అనంతరం కృష్ణవేణి 1938లో వచ్చిన ’కచదేవయాని’ అనే చిత్రంలో తొలిసారిగా హీరోయిన్ వేషం అందిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమె ఎన్నో అరుదైన ఘనతలు సాధించారు. ఇక్కడినుంచి దాదాపు 20 సినిమాలలో కథానాయికగా నటించారు. అయితే నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచీ కృష్ణవేణి తన పాటలను తానే పాడుకోవడం గమనార్హం. అక్కినేనిని హీరోగా నిలబెట్టిన ’కీలుగుర్రం’ సినిమాలో కథానాయిక అంజలీ దేవికి ఆమె ప్లేబ్యాక్ పాడటం విశేషం.
ఈ క్రమంలో 1939లో ’మహానంద’ అనే మూవీలో నటిస్తున్న సమయంలో ప్రసిద్థ దర్శక, నిర్మాత మీర్జాపురం రాజా గారితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారి 1940లో వారు విజయవాడలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహానంతరం భర్త కోరిక మేరకు కృష్ణవేణి కేవలం సొంత చిత్రాలలోనే నటించారు. ఇంకా తమ హోం బ్యానర్ ‘శోభనాచల స్టూడియోస్’ వ్యవహారాలను పర్యవేక్షించడంతోపాటు పలు చిత్రాలను నిర్మించారు.
కాగా ఈ బ్యానర్ లో తెరకెక్కిన తొలి తెలుగు సాంఘీక చిత్రం ’జీవనజ్యోతి’ తో నాటి ప్రముఖ నటుడు చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అవడం విశేషం. 1947లో వచ్చిన ’గొల్లభామ’ సినిమా నటిగా కృష్ణవేణికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. అలాగే శోభనాచల స్టూడియోస్ లో వచ్చిన ’లక్ష్మమ్మ’ చిత్రంతో ఆమె జనాదరణ పొందారు. కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని తపించారు. ఆమె ’తిరుగుబాటు’ సినిమాలో వ్యాంప్ పాత్రను పోషించారు.
ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసింది కృష్ణవేణే
1942లో కృష్ణవేణి, మీర్జాపురం రాజా దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆ పాప పేరు (అనూరాధాదేవి)పై ఎం.ఆర్.ఎ. అనే బ్యానర్ ను స్థాపించి పలు హిట్ చిత్రాలను నిర్మించారు. ఇదే బ్యానర్ పై అప్పటి అగ్ర దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ రూపొందించిన ’మనదేశం’ సినిమా ద్వారానే దిగ్గజ నటుడు ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) చిత్రసీమకు పరిచయం అవడం విశేషం. బెంగాలీ నవల ’విప్రదాసు’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అలాగే ఈ చిత్రంతో మరెందరో ప్రముఖులు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. లెజెండరీ సింగర్స్ ఘంటసాల, పి. లీల, జిక్కీ, సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు, దర్శకుడు ఎర్రా అప్పారావు తదితరులకు తొలి అవకాశం కల్పించింది కృష్ణవేణే! ఇక తొలితరం నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి కూడా ఆమే. అప్పట్లోనే రూ. 45 వేల పారితోషికం తీసుకోవడం గమనార్హం. నటిగా కృష్ణవేణి చివరి సినిమా ’సాహసం’ కాగా.. నిర్మాతగా ఆమె ఆఖరి చిత్రం 1957లో వచ్చిన ’దాంపత్యం’.
తెలుగు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ అవార్డుతో ఆమెను సత్కరించింది. ఇటీవల విజయవాడలో ’మనదేశం’ వజ్రోత్సవ వేడుకలు జరుగగా.. వీల్ చైర్ లో వచ్చిన ఆమెను వేదికపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. కాగా కృష్ణవేణి కన్నుమూశారని తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఆదివారం మహా ప్రస్థానంలో కృష్ణవేణికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: