నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, పృథ్వీ, ప్రకాష్ బెలవాడి తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: శామ్‌దత్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణం: గీతా ఆర్ట్స్ బ్యానర్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం: చందూ మొండేటి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. నాగచైతన్య తొలిసారిగా ఫిషర్ మ్యాన్ క్యారక్టర్ పోషించడం, ఆయనకు జోడిగా సౌత్ బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయింది.
దీనికితోడు మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో స్టార్ హీరోల సమక్షంలో ఈవెంట్స్ నిర్వహించడంతో మార్కెట్ లో ఈ చిత్రంపై హ్యుజ్ బజ్ క్రియేట్ అయింది. అలాగే ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోగా.. భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్ అయింది.
ఇంతకూ చిత్ర యూనిట్ ప్రకటించినట్టు తండేల్ ప్రేక్షకులను అలరించిందా? చైతన్య మత్స్యకారుడిగా మెప్పించాడా? సాయిపల్లవి మరోసారి తన ప్రతిభను చూపగలిగిందా? అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరి జంట ఆడియెన్స్ మదిని దోచుకుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం తండేల్ మూవీ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
తండేల్.. సముద్రంలో తప్పిపోయిన ఒక మత్స్యకారుడైన రాజు (నాగ చైతన్య) కథ. సత్య (సాయి పల్లవి) తో ప్రేమలో ఉంటాడు. రాజు నేతృత్వంలో చేపల వేటకోసం మరబోటులో సంద్రంలోకి వెళ్లిన కొందరు మత్స్యకారులు పొరపాటున భారత అధీనరేఖను దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్తారు. దీంతో పాకిస్తాన్ నేవి అధికారులు వీరిని భారతీయ ఏజెంట్లు అనే అనుమానంతో బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు.
అయితే రాజు తన బృందం వారి బారినుంచి తప్పించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తారు.కానీ, ఈ క్రమంలో వారు అనేక కష్టనష్టాలకు గురవుతారు. వీటన్నింటిని అధిగమించి చివరికి తమవారిని కలుసుకున్నారా? లేదా? ఈ సంఘటన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? సత్య భయాలు ఎలా నిజమవుతాయి? చివరికి వారి ప్రేమకథ ఏమవుతుంది? అనేదే మిగితా కథ.
విశ్లేషణ:-
వాస్తవిక సంఘటనల ఆధారంగా కథ రాసుకున్న చందూ మొండేటి దానిని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.చెప్పాలనుకున్న కథను ఎక్కడా తడబాటుకు గురికాకుండా నిజాయితీగా చూపించాడు. ప్రత్యేకించి జైలు సన్నివేశాల సమయంలో రెండు భాగాలలో మెరుగైన స్క్రీన్‌ప్లే ఆయన ట్యాలెంట్ చూపించింది. ప్రతి పాత్రకు జస్టిఫికేషన్ ఉండేలా తీర్చిదిద్దాడు దర్శకుడు.
చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. తొలిభాగంలో ఒక అందమైన ప్రేమ కథ పరిచయమైతే, ఇంటర్వెల్ తర్వాత కథ సీరియస్ నోట్‌లో నడుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సినిమా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ప్రధానపాత్రల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకే హైలైట్.
ఇద్దరు ప్రేమికులు, వారి జీవితాలలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వీరి స్వచ్ఛమైన ప్రేమకథలో భావోద్వేగాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశిస్తాయి.. ఇక సినిమాలో చివరి అరగంట సన్నివేశాలైతే పతాకస్థాయిలో ఉంటాయి. ప్రేమించిన మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటె, అవతలివారు పడే మానసిక వేదన, వారిని కలవాలని తపన ప్రేక్షకులను కదిలిస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటివరకూ ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్య ఈ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడు. ఆయన తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. సినిమాలో నాగ చైతన్య నెక్స్ట్ లెవెల్ నటనను ప్రదర్శించే సన్నివేశాలు కనీసం మూడు నాలుగు ఉన్నాయి.సెకండాఫ్‌లో ఎమోషనల్ బరస్ట్-అవుట్ సన్నివేశంలో ఆయన నటన పీక్స్. నిజమైన మత్స్యకారుడిగా కనిపించేందుకు ఆయన చూపిన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అలాగే సాయి పల్లవి నటన గురించి స్పెషల్ గా చెప్పనక్కరలేదు. ఇందులో కూడా మరోసారి తన మెస్మరైజింగ్ యాక్టింగ్ అబ్బురపరుస్తుంది. సత్య పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. కొన్ని సన్నివేశంలో కేవలం కళ్లతోనే హావభావాలను ప్రదర్శించిన తీరు అమేజింగ్. ఇంకా జాతర సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ చూడటానికి రెండు కళ్ళు చాలవు. చైతూ కూడా ఈ పాటలో పల్లవిని మ్యాచ్ చేయడానికి ఎంతో శ్రమించాడని అర్ధమవుతుంది. మిగిలినవారు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
ఇక సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్ లో ఉంది. టెక్నిషియన్స్ విషయానికొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఇటీవలి కాలంలో దేవి చేసిన బెస్ట్ వర్క్స్ లో తండేల్ తప్పకుండా ఉంటుంది. ఈ మధ్యే పుష్ప 2కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఆయన ఈ సినిమాలో మరోసారి తన సత్తా చాటాడు. తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో చాలా సాధారణ సన్నివేశాలను కూడా ఓ రేంజ్ లో నిలబెట్టాడు. ఎలివేషన్ సీన్స్, బిల్డప్ సీన్స్ పక్కనపెడితే, ఇలాంటి లవ్ స్టోరీకి ఎలాంటి సంగీతం కావాలో దేవి అదే చేసాడు.
శామ్‌దత్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు.సముద్రంపై వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. దీనిని బిగ్ స్క్రీన్‌పై చాలా అందంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా అనిపిస్తుంది. విజువల్స్, లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి.అలాగే ఎడిటింగ్ విషయానికొస్తే, నేషనల్ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఈ చిత్రంతో మరోసారి తన పనితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మూవీ చాలా షార్ప్‌గా ఉంది.నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతుంది.
మొత్తంగా చూస్తే, తండేల్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది.ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఈ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: