తప్పుడు ఆరోపణలతో నా క్యారెక్టర్‌ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్టార్ హీరో అల్లు అర్జున్. తాజాగా ఆయన సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అర్జున్ ఏమన్నారంటే..? “తొక్కిసలాట జరిగినప్పుడు నేను తప్పుగా ప్రవర్తించానని అనేక ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు. నాపై నిందలు మోపే వారు చెప్పినట్లు నేను తప్పుగా ప్రవర్తించలేదు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిస్ కమ్యూనికేషన్ జరుగుతోంది. అందుకే మీడియా ముందుకు వచ్చాను. అయితే ఈ వ్యవహారంలో నేను ఎవరినీ దూషించదలచుకోవడం లేదు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా..? నేను ఎవరినైనా ఏమైనా అంటానా?”
“అసలు ఆ తొక్కిసలాట ఘటన తర్వాతి రోజు వరకు నాకు తెలీయలేదు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనుకున్నా. కానీ, అక్కడికి రావొద్దని పోలీసులు సూచించారు. ఈ బాధలో సక్సెస్ మీట్‌ను కూడా రద్దు చేసుకున్నా. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, ఇప్పుడిప్పుడే కదులుతున్నట్లు వైద్యుల ద్వారా తెలిసింది. ఇంత బాధాకరమైన వాతావరణంలో ఆ ఒక్క విషయం కాస్త ఊరట కలిగిస్తోంది. నాకు కూడా అదే వయసున్న కొడుకు ఉన్నాడు. ఆమాత్రం ఆలోచన కూడా చేయనా?”
“నేను ఆరోజు సంధ్య థియేటర్ వద్ద ఎలాంటి రోడ్ షో, ఎలాంటి ఊరేగింపు చేయలేదు. నేను పర్మిషన్ లేకుండా వెళ్లా అనేది పచ్చి అబద్ధం. ఆ సమయంలో నా కారు ఆగిపోయింది. నేను కనిపిస్తేనే జనం జరుగుతారని భావించి కారు నుంచి బయటకు వచ్చాను. ఫ్యాన్స్‌కు నేను చెబితే వింటారని.. అందుకే బయటకు వచ్చి అందరిని వెళ్లమని చెప్పాను. ఇక థియేటర్‌లో సినిమా చూస్తున్న సమయంలో నన్ను ఏ పోలీస్ కలువలేదు. బయట జనం ఎక్కువగా ఉన్నారు, కంట్రోల్ చేయడం కష్టమని థియేటర్ మేనేజర్ వచ్చి చెబితే థియేటర్ నుంచి వెళ్లిపోయాను.”
“కానీ, అప్పుడు బయట అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. అదొక హ్యూమన్ యాక్సిడెంట్. ఎవరి కంట్రోల్ లో లేదు. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణలు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతి గంటకు నేను అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.”
“థియేటర్లకు వచ్చిన వారిని నవ్వించి బయటకు పంపించాలని అనుకునే వ్యక్తిని. థియేటర్ అనేది టెంపుల్ లాంటిది. అక్కడ యాక్సిడెంట్ జరిగితే నా కంటే బాధ పడే వ్యక్తి ఎవరైనా ఉంటారా? గతంలో ఎన్నోసార్లు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులను పరామర్శించేందుకు ఎంతో దూరం వెళ్లా. అలాంటిది నా అభిమానులు గాయపడితే వెళ్ళనా? పుష్ప-2 సినిమా హిట్టయినా తాను ఇంట్లోనే కూర్చుని బాధపడుతున్నా.”
“థియేటర్ వద్ద రేవతి మృతి విషయం.. బాబు ఆరోగ్య పరిస్థితి మరుసటి రోజు తెలిస్తే వెంటనే బన్నీ వాసును పంపించాను. నేను కూడా వస్తానని చెప్పాను, కానీ అప్పటికే నా మీద అప్పటికే వాళ్లు కేసు ఫైల్ చేశారని చెప్పారు. అయినప్పటికీ వెళ్తామని ముందుకు వచ్చినా లీగల్ టీమ్ వద్దని చెప్పడంతో ఆగిపోయాను. ఘటన జరిగిన విషయం తెలిసి ఇంకా షాక్‌లోనే ఉన్నా. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టా. డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదు. నేను, సుకుమార్, మైత్రీ వాళ్ళు అందరం కలిసి భారీ అమౌంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం.”
“ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పా, కానీ అది కుదరదని అన్నారు. కుదిరితే సుకుమార్‌గారిని వెళ్లమని చెప్పా.. అయితే అదీ కుదరలేదు. నేను ఒకవైపు తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు అనవసర వివాదంలో నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుండటం బాధగా అనిపిస్తోంది. మనసుకి కష్టంగా ఉంది, తీసుకోలేకపోతున్నా. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారు.. అందుకు ఎంతో బాధగా ఉంది.”
నేను ఎవరినీ నిందించడానికి మీడియా సమావేశం పెట్టలేదు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవు. మా సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది. అందుకు ధన్యవాదాలు చెబుతున్నా. కానీ, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఉన్నందున మీడియా ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం చెబుతా” అని ముగించారు అల్లు అర్జున్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: