రివ్యూ: మెకానిక్ రాకీ

Mechanic Rocky Review in Telugu

నటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌, నరేష్ వీకే, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్ర‌ఫీ: మనోజ్ కటసాని
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాణం: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్
నిర్మాత: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ ఏమిటి? డెబ్యూటెంట్ డైరెక్టర్‌తో విశ్వక్ ప్రయత్నం ఫలించిందా? అన్న విషయాలను ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

కథ:-

కథానాయకుడైన రాకీ ఉరఫ్ రాకేష్ (విశ్వక్ సేన్) హైదరాబాద్‌లో కాలేజీ స్టూడెంట్. ఫ్రెండ్ సిస్టర్, తన జూనియర్ అయిన ప్రియ (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో ఉంటాడు. అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు వలన తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజీ మానేయాల్సి వస్తుంది. మరోవైపు ప్రియ రాకీని దూరం పెడుతుంది. ఈ క్రమంలో తండ్రి రామకృష్ణ (నరేష్ వికె) అతడికి తమ వారసత్వంగా వచ్చిన ఆర్కే గ్యారేజ్ బాధ్యతలు అప్పగిస్తాడు.

అయితే ఈ గ్యారేజ్ ఉన్న స్థలం పైన లోకల్ రౌడీ రంకిరెడ్డి (సునీల్) కన్నేస్తాడు. దీంతో తన గ్యారేజ్ కాపాడుకోవడం కోసం రాకీ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతాడు. ఇదే సమయంలో మాయ (శ్రద్ధా శ్రీనాథ్) కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆర్కే గ్యారేజ్‌కి వస్తుంది. డ్రైవింగ్ పనిపై తరచుగా కలుసుకునే క్రమంలో రాకీ, మాయ మధ్య పరిచయం పెరిగి ప్రేమకు దారి తీస్తుంది.

ఈ నేపథ్యంలో రాకీ సమస్య తెలిసి మాయ ఆర్ధికంగా సాయం చేయడానికి ముందుకొస్తుంది. అయితే ఆమె రాకీకి ఎందుకు సాయం చేస్తుంది? ఇంతకూ రాకీ తమ గ్యారేజ్ కాపాడుకున్నాడా? లేదా? రాకీ జీవితంలోకి మళ్ళీ ప్రియ ఎందుకొచ్చింది? పోలీసులతో ఎందుకు సమస్యలు వచ్చాయి? అసలు తన జీవితంలోకి వచ్చిన వీరందరూ ఎవరు? ఈ ప్రాబ్లెమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయా? చివరకు ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

మెకానిక్ రాకీ కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్. డైరెక్టర్ రవితేజ కొత్తవాడైనా తొలి ప్రయత్నంలోనే ఒక మంచి మెసేజ్ చెప్పడానికి సిన్సియర్‌గా ట్రై చేసాడు. అందుకు అతడిని అభినందించాల్సిందే. ఇక కథ పరంగా చూస్తే ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయి. తన స్క్రీన్ ప్లేతో వాటిని రివీల్ చేసే తీరు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. దీనిని తెరపైన ప్రజెంట్ తీరు మెప్పిస్తుంది.

ఒక యువతి వర్షం పడుతున్న రాత్రివేళ నడుచుకుంటూ వెళ్తుండటంతో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరో 2 నిమిషాల్లో ఒక ట్విస్ట్ వస్తుంది. అది ఏంటనేది మూవీ క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. కథలో రాకీ సహా మిగిలిన మెయిన్ పాత్రలన్నింటినీ నెమ్మదిగా పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. దీంతో కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళని ఫీలింగ్ కలుగుతుంది.

తప్పులు చేసి తండ్రితో తిట్లు తినడం, కాలేజీలో ఫ్రెండ్స్‌తో సరదాగా లైఫ్‍ని ఎంజాయ్ చేయడం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. ఇలా ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత గానీ అసలు కథ మొదలుకాదు. సెకండాఫ్‍లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఎంగేజింగ్‌గా ఉంటుంది. శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ ట్విస్ట్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్‌ ఆడియెన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చేలావుంటుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. విశ్వక్ సేన్ మంచి నటుడని ఇప్పటికే పలు సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. తనకి బాగా సూటయ్యే కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇదే క్రమంలో మెకానిక్ రాకీ అతడి కెరీర్‌లో మరో మంచి సినిమా అనిపించుకోనుంది. ఇందులో తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్‌గా హుషారుగా నటించిన ఆయన, ఆ తర్వాత సమస్యల్లో చిక్కుకున్నప్పుడు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఎగ్రెసివ్ నటన చూపించాడు.

హీరోయిన్స్ విషయానికొస్తే.. మీనాక్షి చౌదరి సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. స్క్రీన్ పైన అందంగా కనిపించింది. మరో నాయిక శ్రద్ధా శ్రీనాథ్ ఛాలెంజింగ్ క్యారక్టర్ ప్లే చేసింది. తన పాత్ర ఇంటర్వెల్ వరకు ఒకలా, ఆ తర్వాత ట్విస్టులు రివీల్ అయ్యేక్రమంలో మరోలా ఉంటుంది. గుర్తుండిపోయే రోల్ చేసిందని చెప్పొచ్చు.

మిగిలిన వారిలో సీనియర్ నటుడు నరేష్ వికె రెగ్యులర్ ఫాదర్ పాత్రలో కనిపించి సందడి చేశారు. తన పంచ్ డైలాగ్స్, మేనరిజమ్స్ నవ్విస్తాయి. సునీల్ క్యారక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయి. ఒకవైపు సీరియస్ విలన్‌గా భయపెట్టిన ఆయన ఆ తర్వాత ట్విస్ట్ రివీల్ చేసే క్రమంలో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తాడు. చిత్రంలో ఇతర పాత్రల్లో కనిప్పించినా నటులు డీసెంట్‌గా నటించారు.

ఇక టెక్నికల్ అంశాలపరంగా చూస్తే.. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో బీజీఎమ్ మెప్పిస్తుంది. ఇంకా మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ బావుంది. సాంగ్స్ మరియు ఛేజ్ సీన్స్‌లో విజువల్స్ బావున్నాయి. అన్వర్ అలీ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా చూస్తే.. మెకానిక్ రాకీ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో ఫిజికల్‌గా కంటే డిజిటల్ గానే క్రైం ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. నేరస్తులు అనేక స్కామ్స్ రూపంలో ప్రజలను పలు విధాలుగా మోసగిస్తున్నారు. చదువుకున్నవారు కూడా వీరి స్కామ్స్‌కి బలవుతున్నారు. ఇలాంటి స్కామ్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించేలా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.