రివ్యూ: మా నాన్న సూపర్ హీరో

Maa Nanna Superhero Movie Telugu Review

నటీనటులు: సుధీర్ బాబు, ఆర్న వోహ్రా, సాయి చంద్, సాయాజీ షిండే, ఆమని, రాజు సుందరం, శశాంక్ తదితరులు
సంగీతం: జై క్రిష్
సినిమాటోగ్ర‌ఫీ: సమీర్ కళ్యాణి
నిర్మాణం: వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సునీల్‌ బలుసు
దర్శకత్వం: అభిలాష్ కంకర

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నవ దళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ మూవీ మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మేకర్స్ కంటెంట్‌పై నమ్మకంతో రెండు రోజుల ముందు నుండి ప్రీమియర్స్ వేశారు. ఈ నేపథ్యంలో దసరా కానుకగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ బాబు హిట్ కొట్టగలిగాడా? ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఇంతకూ సినిమా ఫలితం ఎలా ఉంది? వంటి అంశాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

కథానాయకుడైన జానీ (సుధీర్ బాబు) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుని పరిస్థితుల ప్రభావంగా చిన్నప్పటినుంచీ అనాథాశ్రమంలో పెరుగుతుంటాడు. కొంత వయసు వచ్చాక శ్రీనివాసరావు (సాయాజీ షిండే) అనే వ్యక్తి జానీని దత్తత తీసుకుంటాడు. అయితే జానీ వచ్చాక శ్రీనివాసరావు జీవితంలో అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆయన నిర్వహిస్తున్న వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఒక్కసారిగా కష్టాలు మొదలవుతాయి.

దీంతో చుట్టుపక్కలవారంతా జానీ నష్ట జాతకుడని, అతని వల్లే పెంపుడు తండ్రికి కష్టాలు వచ్చాయని సూటిపోటి మాటలు అంటుంటారు. కానీ, వారి కామెంట్లను శ్రీనివాసరావు అంతగా పట్టించుకోడు. అయితే ఆ తర్వాత కాలంలో అతడి జీవితం మరింతగా దిగజారుతుంది. జానీ ఎదుగుతున్న కొద్దీ ఈ నష్టాలు, కష్టాలు ఎక్కువవడం, భార్య (ఆమని)ను కోల్పోవడంతో శ్రీనివాసరావుకి కూడా నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది.

అందరూ అంటున్నట్టు జానీ నిజంగా నష్ట జాతకుడనే భావం ఏర్పడుతుంది. దీంతో శ్రీనివాసరావు జానీని ద్వేషించడం ప్రారంభిస్తాడు. ఇదిలాఉంటే మరోవైపు జానీకి మాత్రం తనని పెంచిన తండ్రి పైన విపరీతమైన ప్రేమ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తండ్రి చేసిన అప్పులను తీరుస్తూ ఆయనకు అండగా ఉంటుంటాడు.

ఈ క్రమంలో శ్రీనివాసరావు అనుకోని విధంగా ఒక పెద్ద ఆపదలో చిక్కుకుంటాడు. దీనినుండి తండ్రిని తప్పించడానికి జానీకి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడతాయి. ఆ సమస్య తీరాలంటే దాదాపు 1కోటి రూపాయలు కావాల్సి ఉంటుంది. దీంతో వేరే దారిలేక జానీ తన కన్న తండ్రి ప్రకాష్ (సాయి చంద్‌)ను కలుసుకుంటాడు. ఇక్కడ నుండి వీరిద్దరి మధ్య ఎమోషనల్ జర్నీ మొదలవుతుంది.

మరి శ్రీనివాసరావు ఆ సమస్య నుండి బయటపడగలిగాడా? జానీకి అవసరమైన కోటి రూపాయలు సమకూరాయా? కన్న తండ్రి అతడికి సాయం చేశాడా? పెంపుడు తండ్రితో జానీ రిలేషన్ ఏమైంది? ఎప్పుడో దూరమైన కన్న తండ్రి జానీని అక్కున చేర్చుకున్నాడా? జానీ ఏ తండ్రి దగ్గరకు చేరుకున్నాడు? వీరి జీవితాలు ఎలాంటి మలుపులు గురయ్యాయి? చివరకు ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

మా నాన్న సూపర్ హీరో.. కథ పరంగా చూసుకుంటే, చాలా సున్నితమైన భావోద్వేగాల సమాహారం. దీనిని దర్శకుడు అభిలాష్ కంకర నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫీల్ గుడ్ నేరేషన్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. అయితే ఇలాంటి కథలు చెప్పేటప్పుడు కథనం నెమ్మదిగా సాగుతుండటం అనేది మాములుగా జరిగేదే. ఆడియన్స్ దీనిని ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

సినిమా ప్రారంభం లోనే హీరో అనాథగా పెరుగుతుండటం, అతడిని దత్తత తీసుకోవడానికై సాయాజీ షిండే రావడం వంటి సన్నివేశాలతో నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అయితే తండ్రిపై కొడుకుకి ఉన్న ప్రేమని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీని తర్వాతే కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ టచ్ చేశాడు. ఇదే సమయంలో మరోవైపు ప్యారలల్‌గా సాయి చంద్ క్యారెక్టర్‌ని చూపిస్తూ ఓ మంచి ఎమోషనల్ జర్నీకి కావాల్సిన ట్రాక్ సెట్ చేసుకున్నాడు.

పెంపుడు తండ్రితో హీరో బాండింగ్, ఆ పాత్రలోని సంఘర్షణ ప్రేక్షకుడిని టచ్ చేస్తుంది. ఆ సన్నివేశాలతో చూస్తున్న ఆడియెన్స్ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఇలా సాగుతున్న సినిమా సాయాజీ షిండే అనుకోని ఆపదలో చిక్కుకోవడంతో ఒక్కసారిగా మరింత సీరియస్ టర్న్ తీసుకుంటుంది. దీంతో హీరో తరువాత ఏమి చేయబోతున్నాడా? అనే సస్పెన్స్‌తో ఇంటర్వెల్ బ్లాక్ పెట్టడం చాలా బావుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా సుదీర్ బాబు, సాయి చంద్ చుట్టూనే తిరుగుతుంది. ఈ ప్రయాణం ఒక ఎమోషనల్ జర్నీలా సాగిపోతుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. ఈ సన్నివేశాల్లో సుధీర్ బాబు, సాయి చంద్ యాక్టింగ్ హైలెట్ అనిపిస్తుంది. నిజాయితీగా ఉండే హీరో క్యారెక్టరే క్లైమ్యాక్స్ మొత్తాన్ని నడిపించింది. దీంతో ప్రీ క్లైమ్యాక్స్ నుండి ఎండ్ టైటిల్స్ వరకు ఎమోషనల్ సీన్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. మా నాన్న సూపర్ హీరో సినిమా విషయంలో ముందుగా మెచ్చుకోవాల్సింది హీరో సుధీర్ బాబుని. నమ్మిన కథ కోసం అతను తగ్గిన విధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఫుల్ ఎమోషనల్ షేడ్స్ లో ఉండే ఆ పాత్రలో అతను ఒదిగిన తీరు అద్భుతం. ఇప్పటివరకూ చేసిన సినిమాలకన్నా చాలా భిన్నంగా ఉండే పాత్రను ఇందులో పోషించాడు సుధీర్ బాబు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇందులో సుధీర్ బాబు నటన ఆయన కెరీర్ మొత్తం గుర్తుండిపోతుంది.

ఇక సుధీర్ బాబు తర్వాత అంతే స్థాయిలో సినిమాను నిలబెట్టింది సాయి చంద్. ఈ మూవీ చూసాక ఇలాంటి గొప్ప నటుడిని ఇండస్ట్రీ సరిగా వాడుకోవడం లేదేమో అనే సందేహం వస్తుంది. అలాగే సాయాజీ షిండే ఇంతకుముందెన్నడూ చేయనటువంటి పాత్రలో అద్భుతంగా నటించాడు. హీరోయిన్ ఆర్న వోహ్రా ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. అయితే ఆమె పాత్రకు సినిమాలో స్కోప్ తక్కువ. ఇక మిగతా నటులు ఆమని, రాజు సుందరం, శశాంక్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రాజు సుందరం ఉండేది కొద్దిసేపే అయినా కథనంలో ఒక జోష్ తీసుకొచ్చారు.

టెక్నికల్ పరంగా చూస్తే, జై క్రిష్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అస్సెట్ అని చెప్పొచ్చు. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ విజువల్ పరంగా సినిమాకు మంచి ఫీల్ రావడంలో ప్లస్ అయింది. ఎడిటింగ్ డీసెంట్‌గా ఉంది. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి సినిమాలతో మేకర్స్ అభిరుచి ఏంటో తెలుస్తుంది.

ఓవరాల్‌గా చూస్తే, మా నాన్న సూపర్ హీరో సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇద్దరు తండ్రుల కథ అనేది కొత్తగా ఉన్నప్పటికీ.. ఇందులోని తండ్రీ, కొడుకుల అనుబంధం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.