నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య
సంగీతం: రామ్ మిరియాల
సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్
నిర్మాణం: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
దర్శకత్వం: అంజి కె మణిపుత్ర
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ‘మ్యాడ్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోలో హీరోగా నటించిన తాజా చిత్రం‘ఆయ్’. ‘మేం ఫ్రెండ్సండి’ అనేది ట్యాగ్ లైన్‌గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే మరోవైపు డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్ చిత్రాలు కూడా నేడు థియేటర్లలోకి వచ్చాయి. ఇక ఇన్ని పెద్ద సినిమాల మధ్య వచ్చిన ఆయ్ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? మేకర్స్ ప్రకటించినట్టు థియేటర్లలో నవ్వులు పూయించిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ:
కార్తీక్ (నార్నె నితిన్) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. కరోనా వలన సొంతూరు అమలాపురానికి వస్తాడు. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ తన చిన్ననాటి ఫ్రెండ్స్ సుబ్బు (కసిరెడ్డి రాజ్‌కుమార్), హరి (అంకిత్ కోయా) లతో కాలక్షేపం చేస్తుంటాడు. ఇదే సమయంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా కార్తీక్ ప్రేమకు ఓకే చెప్పడంతో వారి ప్రేమ ప్రయాణం సాగిపోతుంటుంది.
అయితే ప్రాణం కంటే కులమే ఎక్కువగా భావించే దుర్గ (మైమ్ మధు) తన కూతురుకి తమ కులానికే చెందిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు కార్తీక్. దీనికి అతడి ఇద్దరు ఫ్రెండ్స్ సాయానికి ముందుకు వచ్చినా, తండ్రికి భయపడి వారి ప్రపోజల్‌ను పల్లవి తిరస్కరిస్తుంది.
ఇదిలావుంటే, మరోవైపు కార్తీక్, పల్లవిలను కలిపేందుకు సుబ్బు, హరి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ తర్వాత ఏమైంది? వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? వారి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని ఎలా పరిష్కరించారు? అనేది తెలియాలంటే, సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆయ్ సినిమాకి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్టుగానే సినిమాలో కామెడీకి పెద్దపీట వేశారు. ఇక టైటిల్ తోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఆయ్ సినిమాలో నటీనటులు అందరూ చాలాబాగా నటించారు. ప్రతి పాత్ర గోదావరి యాసలో మాట్లాడటం చిత్రానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. గోదావరి కుర్రోళ్ళ మాటతీరు, వారిమధ్య స్నేహం, సరదా సంభాషణలు హిలేరియస్‌గా ఉన్నాయి. అలాగే పల్లెటూరి జీవన విధానం, అక్కడివారి మనస్తత్వాలు, స్థానిక పరిస్థితులను చక్కగా చూపించాడు దర్శకుడు.
నార్నె నితిన్ హీరోగా సినిమా, సినిమాకు ఇంప్రూవ్ అవుతున్నాడు. తొలి సినిమాతోనే తనలో మంచి ఈజ్ ఉందని నిరూపించుకున్న ఆయన, ఈ ఆయ్ సినిమాలో మరింత ఇంప్రెసివ్‌గా నటించాడు. అలాగే డ్యాన్స్ లోనూ తాను ఇరగదీసాడు. ముఖ్యంగా రంగనాయకి పాటలో అయితే నితిన్ డ్యాన్స్ హైలెట్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, జూ. ఎన్టీఆర్ లను ఇమిటేట్ చేస్తూ చేసిన స్టెప్స్ ఆడియెన్స్‌ను అలరించాయి.
ఇక హీరోయిన్ నయన్ సారిక తెలుగు అమ్మాయి కాకపోయినా భాషను అర్ధం చేసుకుని చక్కగా నటించింది. తన గ్లామర్‌తో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలుగింటి పల్లెటూరి పిల్లగా సహజంగా కనిపించింది. నితిన్‌కి తగిన జోడీగా అనిపించింది. వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ యూత్‌ని అలరిస్తాయి. అలాగే రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
రామ్ మిరియాల అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. గోదావరి అందాలను, పల్లెసీమల్లోని ప్రకృతిని అందంగా ఒడిసిపట్టింది. ఎడిటింగ్‍లో కోదాటి పవన్ కళ్యాణ్ ట్యాలెంట్ కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
మొత్తానికి ఆయ్ సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తమ చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తుంది. పల్లెటూరి యువత చేసే చిలిపి పనులు ఒకవైపు నవ్విస్తుంటే.. మరోవైపు కులాల అంతరాలు వారిని, వారి ప్రేమను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: