ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ! గోపీచంద్ మలినేని: లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అదే..!

Krack Director Gopichand Exclusive Interview
Krack Director Gopichand Exclusive Interview

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. మరి ప్రస్తుతం లాక్ డౌన్ లో కారణంగా ఇంట్లోనే ఉన్న గోపీచంద్ మలినేని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న గోపీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* మీ కొత్త ప్రాజెక్ట్ ‘క్రాక్’ గురించి చెప్పండి?

క్రాక్ గురించి చెప్పాలంటే రవితేజ గారి నుండి ఏం ఏక్స్ పెక్ట్ చేస్తున్నారో అలానే ఉంటుంది సినిమా.. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా ఇది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు రవితేజ గారు. ఒక యాక్షన్ అండ్ ఫామిలీ ఎంటర్టైనర్ ఇది. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక 10 డేస్ షూట్ మాత్రమే మిగిలుంది.

* మళ్ళీ బలుపు కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నారు. బలుపు తో హిట్ కొట్టినట్టు ఈ సినిమా కూడా హిట్ కొట్టాలనా..?

అంతేకదండి.. బలుపు కంటే ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను.

* ప్రస్తుతం టాలీవుడ్ లో పూజ హెగ్డే, రష్మిక ఇంకా కొత్త మంది టాప్ ప్లేస్ లో ఉండగా.. చాలా కాలం స్క్రీన్ కు దూరమైన.. ఫామ్ లో లేని శృతి హాసన్ నే మీ సినిమాలో హీరోయిన్ గా తీసుకోడానికి ఏమైనా కారణం ఉందా?

ఈ సినిమాకు శృతి హాసన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు నేనెందుకు శృతిహాసన్ నే తీసుకున్నానో. శృతిహాసన్ బేసిక్ గా కూడా మంచి ఆర్టిస్ట్. చాలా మంచి నటి. గ్లామర్ ఉంది.. యాక్టింగ్ ఉంది.. మంచి డాన్స్ చేస్తది. అన్నీ ఉన్నాయి. ఒక హీరోయిన్ కు కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. శ్రీదేవిగారి తర్వాత అన్ని క్వాలిటీస్ ఉన్న నటి శృతిహసన్ అని నేను నమ్ముతాను. అంతేకాకుండా శ్రుతీహాసన్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. బలుపు కాంబినేషన్ తర్వాత అందుకే కావాలని శృతిహాసన్ ని ఈ క్యారెక్టర్ కోసం వెతుక్కుంటూ వెళ్లి మరీ పెట్టుకున్నాను.

* క్రాక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ను కూడా తీసుకున్నారు. స్పెషల్ గా ఆమెనే తీసుకోడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా..?

ఈ సినిమాలో జయమ్మ అని ఒక పవర్ ఫుల్ రోల్ ఉంది. సినిమా చూసిన తర్వాత ఎందుకు నేను ఆమెను తీసుకున్నా అని మీకు అర్ధమవుతుంది. చాలా మంచి రోల్. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. తను కూడా అంతే బాగా నటించింది. అంటే నేను తీసుకున్నవి కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ నుండి తీసుకున్న క్యారెక్టర్స్ ఇవన్నీ. అందుకే ఇంకా మోర్ స్ట్రాంగ్ గా ఉండటానికి వరలక్ష్మీ ని తీసుకున్నాను.

* ప్రేక్షకుల సినిమా చూసే విధానం మారిపోయిందంటారా..? కొత్తదనం కోరుకుంటున్నారంటారా?

ఖచ్చితంగా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటివి వచ్చిన తర్వాత వరల్డ్ ఫిలిం అంతా ఇప్పుడు కళ్ళముందు ఉంది. సో కొత్త కొత్త కాన్సెప్ట్ లు అలానే మేకింగ్ స్టైల్ కూడా కొత్తగా ఉండటంతో.. సినిమా చూసే విధానం మారిపోయింది. సో కొత్తదనం కోరుకుంటున్నారు. దానితో పాటు మనకున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో.. ఆ ఎమోషన్స్ అనేవి సినిమాలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు.

* మీరు ఈ.వి.వి సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ గా చేశారు కదా… మరి అల్లరి నరేష్ కు కూడా ఈ మధ్య పెద్దగా ఆడిన సినిమాలు లేవు. మరి మీకు తనతో సినిమా చేయాలని ఎప్పుడూ ఆలోచన రాలేదా..?

ఈ.వి.వి గారి దగ్గర మూడు సినిమాలు చేశాను అసోసియేట్ గా. నరేష్ కూడా నాకు బాగా క్లోజ్ గా ఉంటాడు. చాలా మంచోడు. మేమిద్దరం కలిసినప్పుడల్లా.. సినిమా విషయాల కంటే కూడా ఫ్యామిలీ విషయాలే ఎక్కువగా మాట్లాడుకుంటాము. ఇంకా ఈ.వి.వి గారి తో గుడ్ మెమోరీస్ గురించి మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఏదో ఒక సినిమాలో నరేష్ అయితే ఉంటాడు. తను కూడా మంచి ఆర్టిస్ట్. మహర్షి సినిమాలో లాంటి మంచి క్యారెక్టర్ దొరికినా కూడా నేను వెళ్లి అప్రోచ్ అవుతాను.

* మీకు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ కు మంచి అనుబంధం ఉంది కదా..? అసలు ఎలా ఎంత అనుబంధం ఏర్పడింది..?

మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. చిరంజీవి గారి స్టాలిన్ మూవీకి నేను అసోసియేటివ్ గా పనిచేసాను. ఆ సినిమాలో నేను ఆయనతో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే ఆయన సినిమాను ప్రేమించే విధానం చూసిన తర్వాత నేను ఆయనకు ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సినిమాల గురించి ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం. స్టాలిన్ కు ముందు నేను చేసిన సినిమాలు.. స్టాలిన్ తర్వాత నేను చేసిన సినిమాల్లో స్టాలిన్ అనేది నన్ను అన్ని రకాలుగా మార్చింది. ఆయన నాకు ఒక బ్రదర్ లాగా.తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటారు. బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకు ఈ ఐడియా వచ్చినా తనతో షేర్ చేసుకునేంత చనువు ఉంది. మంచి అనుబంధం ఉంది.

* ఒకప్పుడు ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ అంటే కొంత మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ కొత్త కొత్త కథలతో ముందుకొస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది. యంగ్ డైరెక్టర్స్ మీకు పోటీ ఇస్తున్నారనిపిస్తుందా..?

నిజమనే చెప్పాలి. ఎందుకంటే చాలా యంగ్ టాలెంట్ వస్తున్నారు.. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ప్రతి డైరెక్టర్ కి సూపర్ హిట్ ఇచ్చినా.. హిట్ ఫిలిం ఇచ్చినా..రిలాక్స్ అవ్వకూడదు. అంత కాంపిటీషన్ ఉంది. ఏ సినిమాకు ఆ సినిమానే ఫస్ట్ సినిమా లాగ చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇది ఒక మంచి పోటీ వాతావరణం. దానితో పాటు ప్రతి డైరెక్టర్ కు ప్రెషర్ కూడా ఉంటది. ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా యంగ్ జనరేషన్ ను యాంకరేజ్ చేస్తుంది. మేము ఇండిస్టీ కి వచ్చినప్పుడు యంగ్ ఏ. ప్రతి డైరెక్టర్ కి ఇంకో డైరెక్టర్ తో ఇన్నర్ గా పోటీ అనే ఉంటుంది.

* క్రాక్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నారు..?

ప్రస్తుతం క్రాక్ మీదే నా ఫోకస్ వుంది. ఈ టైంలో రెండు స్క్రిప్ట్ లు అనుకుంటున్నాను. కరోనా వల్ల కాస్త టైం దొరికింది. ప్రస్తుతం దానిమీద వర్క్ అవుట్ చేస్తున్నాను.

* ఇప్పుడు ఒక హీరో కు పలానా డైరెక్టర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఉంటుంది. అలానే డైరెక్టర్స్ కు కూడా ఆ హీరో తో ఒక్క సినిమా అయినా చేయాలి అని ఉంటుంది. అలా మీకు ఎవరైనా ఉన్నారా…?

ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో చూస్తున్నాను. తప్పకుండా ఫ్యూచర్ లో ఆయనతో సినిమా చేస్తా. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. ఆయనతో సినిమా చేయాలన్నది నా కోరిక.

* ముందు కథ రాసుకున్నాక హీరో ను సెలెక్ట్ చేసుకుంటారా..? హీరో అనుకున్న తర్వాత కథ రాసుకుంటారా..?

రెండు రకాలుగా ఉంటుందండి. ఒక్కోసారి పలానా హీరోతో చేయాలనుకున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కు ఎలా ఉంటుంది.. బావుంటది అని కథ రాయడం ఒకటి ఉంటది.. టోటల్ గా ఒక మంచి కథ తయారు చేద్దామని అనుకొని.. కథ రాసి ఆ కథకు ఈ హీరో అయితే బావుంటది అని అనుకున్న సందర్భాలు రెండూ ఉన్నాయి. నేనైతే 90 శాతం కథ రాసుకొని దానికి ఎవరైతే బావుంటారు అనే సెలెక్ట్ చేసుకుంటా.

* మీ లైఫ్ ను మార్చేసిన ఏదైనా ఒక సంఘటన ఉందా..?

చిరంజీవి గారితో నేను అందరివాడు, స్టాలిన్ సినిమా చేస్తున్నప్పుడు చాలా దగ్గరిగా ఆయన్ని గమనించాను. అందరివాడు టైములో చిరంజీవిగారు ఒకరోజు ఆయన నా దగ్గరికి వచ్చి ఈ మూవీలో నేను నీకు తెలియకుండానే 20-24 టైమ్స్ వన్ మోర్ లు చేసాను నీ గురించే అన్నారు. నాకు అర్ధం కాలేదు. అప్పుడు ఆయన నీకు నచ్చకపోతే నే ఫేస్ లో తెలిసిపోద్ది.. ఆ కుర్రాడికి నచ్చలేదనుకుంటా అని వన్ మోర్ చెప్పేవాడిని అని అన్నారు. దానితో పాటు మరో మాట చెప్పారు. గోపి నువ్వు ఏదైనా అనుకుంటే బయటకి చెప్పు.. నీ మనసులోనే దాచుకుంటే.. నీ మనసులో ఏముందో అది అవతలి వాళ్లకు ఎలా తెలుస్తుంది. నీకు టాలెంట్ తెలియాలంటే నువ్వు మాట్లాడాలి.. ఏక్స్ప్రెస్ చేయాలి అని చెప్పారు. ఇది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అక్కడినుండి నేను ఏక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశా. నేను ఏదైనా అనుకుంటే డైరెక్ట్ గా వెళ్లి వాళ్లకు ఏక్స్ప్రెస్ చేసేవాడిని. అది అందరివాడు తరువాత స్టాలిన్ సినిమాకు బాగా ఉపయోగపడింది. మురుగదాస్ గారు ఈ విషయంలో నన్ను బాగా అపీప్రిషియేట్ చేసేవాళ్లు. పెద్ద డైరెక్టర్ అని ఏ మాత్రం అనుకోకుండా నాకు ఏది అనిపిస్తే అది చెప్పేవాడిని. ఒక రకంగా మాఇద్దరి బాండింగ్ కు కూడా ఒక కారణం అయింది.

* కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడంలో మీరు ఎక్స్పర్ట్. అలా కాకుండా ఇంకా వేరే జోనర్ లో ఏమన్నా ట్రై చేసే ఆలోచనలు ఉన్నాయా..?

ఖచ్చితంగా అంది. కమర్షియల్ ఎంటర్టైనర్ తో పాటు.. ఒక రియలిస్టిక్ అప్రోచ్ తో పాటు కమర్షియల్ సినిమా చేస్తున్నాను అదే క్రాక్. అంటే ఒక కమర్షియల్ యాంగిల్ లో ఉంటూనే.. రియలిస్టిక్ అప్రోచ్ తో వెళ్తుంది. దీనితో పాటు ఇంకా నేను డిసైడ్ అయింది ఏంటంటే… డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లతోటి.. డిఫరెంట్ జోనర్స్ అయితే కచ్చితంగా చేస్తాను.

* ఒక డైరెక్టర్ గా సినిమా ద్వారా మీరు చెప్పాలనుకునే పాయింట్ ఏంటి?

అంటే గోపీచంద్ మలినేని అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ అని ఉంది. నాకు బేసిక్ గా ఏంటంటే కమర్షిల్ ఫిలిమ్స్ తో పాటు..ఒక చిన్న సోషల్ మెసేజ్ ఉంటే బావుంటదని..నా కథలో ఏదో ఓక్ యాంగిల్ లో రాసుకుంటాను.. అవి ఒక్కోసారి కుదురుతాయి. ఒక్కోసారి కుదరవు. అయితే ఏంటంటే ఒక ఎంటర్ టైనర్ వే లో చెప్తూ.. ఒక చిన్న మెసేజ్ ఇస్తే.. ఒక డైరెక్టర్ గా మనం చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా. సో నేను జనాన్ని ఆనంద పరచడానికి ఎంటర్ టైన్ చేయడానికి ఉన్నాను. పెద్ద పెద్ద మెసేజ్ లు ఇవ్వడానికి కాదు.

* ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి…కాస్త అనుభవం వచ్చిన తర్వాతడైరెక్షన్ లోకి దిగేవారు. ఇప్పుడు అలా కాదు.. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కు పెద్దగా టైం పట్టట్లేదు.. దానికి కారణం ఏంటంటారు..?

నిజమే ఇది. అంటే ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ సంపాదించి.. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకొని.. మనం పర్ఫెక్ట్ గా ఈ సినిమా డైరెక్ట్ చేస్తాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళం. అది తప్పో.. రైటో మనం చెప్పలేం. ఇప్పుడేమైందంటే.. కథ బాగా చెప్పగలిగితే .. ఇతనే కథ బాగా చెప్పాడు కదా..డైరెక్షన్ కూడా ఇతనికే ఇస్తే అది డీవియేట్ అవ్వకుండా ఉంటుంది కదా అనే యాంగిల్ కొంత మందికి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ కథను ఇతను బానే డీల్ చేస్తాడు అని ఆ హీరోకు ఆ నిర్మాతకు నమ్మకం ఉన్నప్పుడు.. అవకాశం దొరుకుంతుంది. అందులోనూ ఇప్పుడు ఎక్కువ టైం కూడా పట్టట్లేదు. రెండు సినిమాలకు అసిస్టెంట్ గా చేసిన వాళ్ళు కూడా డైరెక్టర్స్ ఐపోతున్నారు. అది కొన్ని సందర్భాల్లో గుడ్.

* మీరు ఏ సినిమాలు ఎక్కువగా చూస్తారు.. ఏ సినిమా ద్వారా ఇన్స్పైర్ అవుతారు.

నేను కామెడీ సినిమాలు ఎక్కువగా చూడటానికి ఇష్టపడతాను. యాక్షన్ ఫిలిమ్స్ కూడా ఎక్కువగా చూస్తాను. నిజానికి నేను యాక్షన్ ఫిలిమ్స్ లవర్ ని. ఒక గ్లాడియేటర్, ఒక ఈక్వలైజర్, పోలార్ లాంటివి ఇలా యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ వుండే సినిమాలను ఎక్కువగా ఇష్టపడతా.

* మూవీ మేకింగ్ ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారా..? మూవీ సక్సెస్ ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారా..?

మూవీ మేకింగ్ నే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సక్సెస్ వచ్చింది అంటే.. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ ను నిలబెట్టుకోడానికి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుద్ది. మేకింగ్ టైం లోనే నేను మ్యాగ్జిమమ్ ఎంజాయ్ చేస్తాను..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =