3 మంకీస్ మూవీ రివ్యూ

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్. ఇప్పుడు వీరు ముగ్గురు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘త్రీ మంకీస్’. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి జబర్దస్త్ లో తమ స్కిట్స్ తో అలరించిన వీరి ‘త్రీ మంకీస్’ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

నటీనటులు : సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, కారుణ్య చౌదరి
దర్శకత్వం : అనిల్ కుమార్
నిర్మాత‌ : నగేష్
సంగీతం : నిల్ కుమార్
సినిమాటోగ్రఫర్ : సన్నీ దోమల

కథ:

ఫణి,ఆనంద్, సంతోష్ (గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్) ముగ్గురూ స్నేహితులు. సంతోష్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తుండగా.. ఆనంద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇక ఫణి డైరెక్టర్ కావాలని చూస్తుంటాడు. ముగ్గురూ కలిసి ఆడుతూ పాడుతూ తమ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే అనుకోకుండా ఓ అమ్మాయి వల్ల వారు ఓ మర్డర్ కేసులో కూడా చిక్కుకుంటారు. మరి ఆ ముగ్గురి జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? తన వల్ల అప్పటిదాకా సరదాగా సాగే వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? మర్డర్ కేసు నుండి ఎలా తప్పించుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఏడేళ్లనుండి బుల్లి తెరపై జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను నవ్విస్తున్నారు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్. ఎన్నో వందల స్కిట్స్ చేసి తమ ఆటో పంచ్ లతో, కామెడీ తో ఎంత మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజమే.

ఇక ఈ సినిమా విషయానికొస్తే టైటిల్ కు తగ్గట్టే కథ మొత్తం వీరిముగ్గురి చుట్టే తిరుగుతుంది. డైరెక్టర్ తీసుకున్నది రొటీన్ కథే. మర్డర్ కేసు లో ఇరుక్కోవడం .. తర్వాత దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం. ఈ లైన్ పై ఇప్పటికి చాలా సినిమాలే వచ్చాయి. ఇక ఈ దర్శకుడు కూడా అదే పాయింట్ ను తీసుకున్నాడు.. కాకపోతే దానికి కాస్త కామెడీ ఎంటర్టైనర్ లో కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ లో వారి పంచులు బాగా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్ లో మర్డర్ కేసు లో చిక్కుకోవడం.. దానినుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం చూపించాడు.

ఇక సుధీర్, శ్రీను,రామ్ ప్రసాద్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అటు కామెడీ సీన్స్ లో తమదైన టైమింగ్ తో సూపర్ అనిపించారు. కామెడీ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలలో వీరి ముగ్గురి నటన ఆకట్టుకుంటుంది. శత్రు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలు మేర నటించారు. ఇప్పటివరకూ కామెడీ మాత్రమే చేసి నవ్వించగలరు అనుకున్నవారికి.. ఎమోషన్ సీన్స్ కూడా బాగా చేయగలరని నిరూపించారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. ఫోటోగ్రఫీ సినిమాకు రిచ్ నెస్ తీసుకువచ్చింది.

ఓవరాల్ గా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ ని ఎంజాయ్ చేసే వారికే ఈ ‘త్రీ మంకీస్’ చేసే కామెడీ నచ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here