నాగార్జున విషయంలో ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావు గారూ..!

2019 Latest Telugu Film News, Happy Birthday Nagarjuna, Nagarjuna A very Happy Birthday, nagarjuna Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu FilmNagar Wishes King Akkineni Nagarjuna, Telugu FilmNagar wishes King Nagarjuna A very Happy Birthday, Tollywood Cinema News, Wishing King Nagarjuna a Very Happy Birthday

పరుగులు పెట్టటం కాలం నైజం. రోజులు, గంటలు, నిమిషాలు, క్షణాలుగా కరిగిపోయే కాలప్రవాహంలో
మధుర క్షణాలుగా, మధురానుభూతులుగా నిలిచి పోయే సందర్భాలు, సంఘటనలు ఎవరి జీవితంలో ఎక్కువగా ఉంటాయో అవే వారి ఆనంద, ఆరోగ్య రహస్యాలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి ఆనందమయ జీవితాన్ని ఆసాంతం ఆస్వాదిస్తూ ఆరు పదుల వయసులో కూడా నిత్య యవ్వన శోభలతో శోభిల్లుతుండటం అందరికీ సాధ్యం కాదు… ఎవరో ఒక అక్కినేని నాగార్జున లాంటి ” వయో విజేత”కు తప్ప. అయితే… అక్కినేని నాగార్జున  60నిండి 61లోకి అడుగుపెడుతున్నారట…నిజమేనా?

ఇదేమి చోద్యం…
ఇదేమి వింత….
ఇదేమి విడ్డూరం…
నాగార్జునది షష్టిపూర్తి వయసా?
ఆయనకు అప్పుడే 60 నిండాయా ?
చోద్యం కాకపోతే… !?
అయినా తప్పంతా నాగార్జునది కాదు… నాగేశ్వరరావు గారిది. దివంగత మహానటులు నాగేశ్వరరావు గారు  మా చిన్నబ్బాయి నాగార్జున పుట్టిన తేదీ 1959, ఆగస్టు 29- అని డైరీలో రాసుకుని స్కూల్ రిజిస్టర్లో నమోదు చేయించకపోయి ఉంటే ఈజీగా ఓ 20 ఏళ్లు నొక్కేసినా అడిగే వాడు ఉండడు.ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావుగారూ…! అయినా 60 ఏళ్లు పైబడిన వయసులో కూడా అందాల భామలతో యుగళ గీతాలలో ఆడిపాడిన నిత్య యవ్వనులు మీరు. మీకు వయసులు ప్రకటించే ధైర్యమే తప్ప వయసును నొక్కేసే అవసరము… అగత్యము లేదాయె!. అందుకేనేమో మీ తండ్రి కొడుకుల కళ్ళలో ” వయో విజేతలం”
అన్న కాన్ఫిడెన్స్ తొంగిచూస్తుంటుంది.

ఎనీ హౌ… ఇది అక్కినేని నాగార్జున షష్టిపూర్తి జన్మదినమన్న ‘తియ్యని చేదు’ ను దిగమింగుతూ పుట్టినరోజు శుభాకాంక్షల ప్రత్యేక అక్షరాభినందనను  అందిస్తుంది మీ ‘ ద తెలుగు ఫిలిమ్ నగర్.కమ్’.

1986 మే 23 న అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిచయమైన నాగార్జున తొలి చిత్రం ‘ విక్రమ్’ విడుదలైంది. అప్పటికి తెలుగువారితో 42 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడి తొలి సినిమా ఎలా ఉంటుందో ?

అతను ఎలా ఉన్నాడో..? ఎలా చేసాడో..? చూద్దాం అన్న క్యూరియాసిటీ  నేపథ్యంలో విడుదలైన తొలి పరీక్ష  ‘విక్రమ్’ లో నాగార్జునకు 90 మార్కుల డిస్టిక్షన్ రాలేదు.60 మార్కుల ఫస్ట్ క్లాస్ మాత్రమే దక్కింది.

మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడు అన్న ‘ట్యాగ్ లైన్’ పరిచయం వరకు పనికొచ్చిందే తప్ప ఆ తరువాత నాగార్జున జయాపజయాలకు , మూడు దశాబ్దాల పైబడిన సుదీర్ఘ ప్రస్థానానికి అది ఏ మాత్రం ఉపకరించే లేదు. ఒక ప్రముఖుడి వారసుడు అయినంత మాత్రాన సక్సెస్, స్టార్ డమ్, పేరు ప్రఖ్యాతులు వడ్డించిన విస్తరిలా వళ్లో వచ్చి వాలిపోతాయి అనుకునేవారికి అది ఏమాత్రం నిజం కాదు అని చెప్పటానికి నాగార్జున కెరీర్ నే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే  అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జునకు వచ్చిన ఏకైక సక్సెస్ తొలి చిత్రమైన’ విక్రమ్’ మాత్రమే. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ చిత్రాల ఫెయిల్యూర్ ను తప్పించ లేకపోయింది వారసత్వ ముద్ర.
ఆ సమయంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన విషాద ప్రేమ కథ’ మజ్ను’ నాగార్జునకు మంచి స్టాండింగ్ ఇవ్వగా కలెక్టర్ గారి అబ్బాయి, కిరాయి దాదా చిత్రాలు కొంతమేర గట్టెక్కించాయి. కాగా కెరీర్లో  తొలి ఘనవిజయంగా 1988 లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ మంచి ఊపునిస్తే చినబాబు, మురళీ కృష్ణుడు, జానకి రాముడు , విజయ్, విక్కీ దాదా చిత్రాలు ‘బాల్ రోలింగ్’ కు ఉపకరించాయి. ఇలాంటి దశలో సంచలన దర్శకుడు ‘మణిరత్నం’ దర్శకత్వంలో వచ్చిన ‘ గీతాంజలి’ నాగార్జున కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన రాంగోపాల్ వర్మ’ శివ’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అంటే 15 వ సినిమా ‘గీతాంజలి’ 17వ సినిమా’ శివ’ వరకు నాగార్జున కెరీర్లో ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టన్స్ ‘ కనిపిస్తూనే ఉంది.

సో… దీన్ని బట్టి  అక్కినేని నాగేశ్వర రావు అనే మహానటుడి వారసుడిగా పరిచయం అయినప్పటికీ నాగార్జున కెరీర్ చాలా ఈజీగా, కేక్ వాక్ లాగా సాగిపోయింది అనుకోవటానికి వీలులేదు. ఎవరి వారసుడు అయినప్పటికీ ఎవరి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కు వారే బాధ్యులు అవుతారు కాబట్టి వారసత్వ హీరోయిజం మీద ఉన్న  విమర్శలు, విసుర్లు నిజం కాదని చెప్పటానికి తన కెరీర్ నే ఉదాహరణగా మలుచుకున్న స్టైలిష్ హీరో నాగార్జున.

కార్పొరేట్ కార్మికుడు 

అలా ఒక   ప్రతిష్టాత్మక కుటుంబ నట  వారసుడు అయినప్పటికీ ఆ ట్యాగ్ లైన్ ను పరిచయానికి తప్ప ప్రోగ్రస్ కు  వాడుకోకపోవడం నాగార్జున కెరీర్లో ప్రశంసార్హమైన తొలి విశేషం కాగా… ఇంకా ఎన్నో విషయాల్లో తనను తాను విస్తృత పరుచుకున్న’ కార్పొరేట్ కార్మికుడు ‘గా నాగార్జునను  అభినందించవచ్చు.

అదెలాగంటే…. అష్టైశ్వర్యాల మధ్య పుట్టి పెరిగిన నాగార్జునకు గీతాంజలి, శివ చిత్రాల తరువాత గొప్ప స్టార్ డమ్ వచ్చి పడింది. ఇక కాలుమీద కాలేసుకుని సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ జల్సాగా కాలక్షేపం చేయవచ్చు.  కానీ ఇక్కడే నాగార్జున విభిన్నంగా, విలక్షణంగా, విశిష్టంగా ఆలోచించారు. మనిషి ఎదుగుదలకు హద్దులు, ఎల్లలు పెట్టుకుంటే అది ఎదుగుదలే కాదు అని నిరూపిస్తూ తన వ్యాపక పరిధిని విశేషంగా విస్తరింప చేసుకున్నారు నాగార్జున. నిర్మాతగా, పంపిణీదారుడు గా, నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల పరిచయ కర్తగా సినిమా సంబంధిత వ్యాపకాలను పెంచుకుంటూ పోయిన నాగార్జున టీవీ, రియల్ ఎస్టేట్ అండ్ అడ్వర్టైజింగ్ రంగాలలో కూడా గొప్ప ఎంటర్ప్రెన్యూర్ గా విజయ బావుటా ఎగురవేసారు.

ఒకవైపు అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి, సుద్దాల హనుమంతు, ఆచార్య పద్మపాణి, హథీరామ్ బావాజీ వంటి ఆధ్యాత్మిక, చారిత్రాత్మక పాత్రలతో ఉత్తమ నటుడిగా ఉన్నత శిఖరాల వైపు పయనిస్తూ, మరోవైపు  నిన్నే పెళ్ళాడతా, నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, సంతోషం, మన్మధుడు, మనం, సోగ్గాడే చిన్ని నాయన వంటి ఫ్యామిలీ క్లాసిక్స్ తో సకుటుంబ కథానాయకుడిగా అలరిస్తూ శివ, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, సూపర్, మాస్, బాస్, డాన్,కింగ్, గగనం, ఊపిరి వంటి యాక్షన్ క్లాసిక్స్ తో కమర్షియల్ స్టార్ గా హిట్స్ కొడుతూ మోస్ట్   సక్సెస్ఫుల్ సీనియర్ స్టార్ గా సాగుతున్నారు నాగార్జున.

ఈ క్రమంలో నాగార్జున ద్వారా చిత్ర పరిశ్రమకు అందిన కాంట్రిబ్యూషన్ ఏమిటి? నాగార్జున నిర్మించిన చిత్రాలు ఏమిటి? నాగార్జున ద్వారా పరిచయం అయిన సాంకేతిక నిపుణులు ఎంతమంది? చిత్ర పరిశ్రమలో నాగార్జున ఎంతమంది జీవనోపాధికి ఉపయుక్తంగా ఉన్నారు వంటి అంశాలను పరిశీలిస్తే ఆయన కెరీర్ లో “live and let live” అనే గొప్ప సామాజిక కోణం కనిపిస్తుంది. ఆస్తులు, సంపాదన పరంగా  గొప్ప పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా సాధించాలి అన్న పట్టుదల, శ్రమ, కృషి కారణంగా ఎంతోమంది జీవనోపాధికి ఆలంబనగా ఎదిగారు నాగార్జున. ఒకవైపు తన వ్యక్తిగత జీవితానందాన్ని గొప్పగా  ఆస్వాదిస్తూనే మరోవైపు వందలాది సిబ్బంది జీవనోపాధికి ఆసరాగా నిలవడం నాగార్జునలోని ఎంటర్ప్రెన్యూర్షిప్ కు గొప్ప ఉదాహరణ. అలాగని కష్టపడటం అంటే 24 గంటలు ఒళ్ళు హూనం చేసుకుని చెమటలు కక్కడం కాదు. ఒక మంచి నిర్ణయం ద్వారా ఒక సంస్థను, ఒక వ్యవస్థను నెలకొల్పడం… విజయవంతంగా నడిపించడం. నాగార్జున ఎన్ని  అదనపు ఏక్టివిటీస్ టేకప్ చేసినప్పటికీ తన లైఫ్ స్టైల్ లో మాత్రం ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండదు.కాలర్ నలగని వైట్ కాలర్ స్టైల్ తో హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఎంటర్ప్రెన్యూర్ గా మంచి విజయాలను అందుకున్న నాగార్జునను కార్పొరేట్ కార్మికుడుగా అభినందించవచ్చు.

గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్ 

ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నాగార్జున అందించినంత న్యూ టాలెంట్ ను మరే హీరో అందించ లేదన్నది నిజం. సీనియర్ స్టార్స్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ తరువాత నెక్స్ట్ జనరేషన్ హీరోలలో నాగార్జున తీసుకున్నంత రిస్క్ మరి ఏ హీరో తీసుకోలేదన్నది నిర్వివాదాంశం. టాప్ హీరో గా ఎదిగిన తరువాత  ఒక కొత్త  దర్శకుడితో పని చేయాలి అంటే ఆ హీరోకు చాలా గట్స్ కావాలి. కొత్త దర్శకుల దర్శకత్వంలో హీరోగా  చేయడానికే చాలామంది హీరోలకు ధైర్యం చాలని నేపథ్యంలో హీరో కం ప్రొడ్యూసర్ గా న్యూ టాలెంట్ ను వెల్కమ్ చేసిన గట్స్ నాగార్జున సొంతం. మొన్నటి రాంగోపాల్ వర్మ దగ్గర నుండి నిన్నటి కల్యాణ కృష్ణ కురసాల వరకు దాదాపు 12 మంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో నాగార్జున. ఇక ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ విషయానికి వస్తే నాగార్జున ద్వారా, ఆయన నిర్మించిన సినిమాల ద్వారా కొత్తనీరు ఒక వెల్లువలా చిత్ర పరిశ్రమలోకి ప్రవహించింది అని చెప్పవచ్చు. కొత్తవారికి అవకాశం ఇచ్చే సందర్భాలలో ‘ రిస్క్ అండ్ రిజల్ట్’ క్యాలిక్యులేషన్ లో నాగార్జున ఆలోచనలు చాలా భిన్నంగా, సాహసోపేతంగా ఉంటాయి. రిస్క్  తీసుకున్న ప్రతిసారీ అద్భుతమైన రిజల్ట్ సాధించిన నాగార్జునకు కొన్ని సందర్భాలలో చేదు అనుభవాలు కూడా  ఎదురయ్యాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ప్రయత్న లోపం లేని తన సాహస నైజాన్ని నాగార్జున ఎప్పుడు వదులుకోలేదు. అందుకే నాగార్జునను ‘ ద గేట్ వే ఆఫ్ న్యూ టాలెంట్ ‘ అని పరిశ్రమ ప్రశంసిస్తుంది.

రిచ్ ఇన్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్

ఒక నటుడికి లభించే ఆదరణకు రివార్డ్స్  కొలమానం అయితే అతని ప్రతిభకు కొలమానంగా నిలుస్తాయి అతన్ని వరించిన అవార్డ్స్. ఈ విషయంలో నాగార్జున బాగా రిచ్ అని చెప్పవచ్చు. సమకాలీన నటులలో నాగార్జునకు వచ్చినన్ని అవార్డులు మరే ఇతర నటుడికి రాలేదు అనటానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఆయన ఇంట్లోని  అవార్డుల గ్యాలరీ. నటుడిగా, నిర్మాతగా 9 ప్రతిష్టాత్మక  నంది అవార్డ్స్ అందుకున్న నాగార్జునకు నిన్నే పెళ్ళాడుతా, రాజన్న చిత్రాల ద్వారా జాతీయ పురస్కారాలు కూడా లభించాయి. 1997లో  నిన్నే పెళ్ళాడతా చిత్ర నిర్మాతగా ఉత్తమ ప్రాంతీయ చిత్ర నిర్మాతగా అవార్డు అందుకున్న నాగార్జున అదే చిత్రానికి గాను నంది అవార్డ్స్ లో ‘అక్కినేని సకుటుంబ  చిత్రం’ అవార్డును అందుకున్నారు. అలాగే  ప్రేమ కథ, యువకుడు, మన్మధుడు చిత్రాలకు కూడా నిర్మాత హోదాలో అవార్డులు అందుకున్న నాగార్జున ఉత్తమ నటుడిగా మూడు సార్లు నంది అవార్డును స్వీకరించడం విశేషం.1997లో అన్నమయ్యకు, 2002లో సంతోషం కు, 2006లో శ్రీరామదాసు కు బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్న నాగార్జున 2011లో రాజన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.

ఇక ప్రైవేట్ అవార్డ్స్ విషయానికి వస్తే శివ, అన్నమయ్య చిత్రాలకు బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్న నాగార్జున నిన్నే పెళ్ళాడతా కు నిర్మాతగా బెస్ట్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అలాగే సినీ ‘ మా’ అవార్డ్స్, వంశీ బర్కిలీ, భరతముని, సినిమా ఎక్స్ప్రెస్,  ఏపీ ఫిలిం జర్నలిస్ట్ అవార్డ్స్, సుబ్బరామిరెడ్డి కళారత్న అవార్డ్, సినీగోయర్స్ వంటి పలు సాంస్కృతిక సంస్థల నుండి లెక్కకు మించిన అవార్డులు అందుకున్న ఉత్తమ నటుడు, ఉత్తమ నిర్మాత నాగార్జున. అలాగే అంతర్జాతీయ ప్రమాణాల ఫోర్బ్ స్ పత్రిక నిర్వహించిన ‘ 100 టాప్ సెలబ్రిటీస్’ లిస్టులో 2012, 13 సంవత్సరాలకు గాను 36, 43 స్థానాలలో నిలిచారు నాగర్జున.

ఇక ఎంటర్ప్రెన్యూర్ గా చూస్తే టాలీవుడ్ లో టాప్ బిజినెస్ మ్యాన్   నాగార్జునే అన్నది జగమెరిగిన సత్యం. ఎన్ కన్వెన్షన్, ఎన్.గ్రిల్, ఎన్. డిస్ట్రిక్ట్ వంటి వ్యాపారాల స్థాపన తో పాటు అన్నపూర్ణ స్టూడియో నిర్వహణ, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్వహణ వంటి కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే నాగార్జున సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా నాగార్జున బిజీ గురించి చెప్పనవసరం లేదు. కళ్యాణ్ జువెలరీస్, ఘడి డిటర్జెంట్ పౌడర్ వంటి చాలా వ్యాపార సంస్థల పాపులర్ అంబాసిడర్ గా టీవీ చానల్స్ లో హౌస్ హోల్డ్ నేమ్ అయ్యారు నాగార్జున.

ఇక టీవీ హోస్ట్ గా గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ను అద్భుతంగా నిర్వహించిన నాగార్జున ప్రస్తుతం’ బిగ్ బాస్ సీజన్ 3′ హోస్ట్ గా సూపర్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. నిజానికి విమర్శలతో, నిరసనల మధ్య ప్రారంభమైన’ బిగ్ బాస్ సీజన్ 3′ ఈ రోజున ఇన్క్రెడిబుల్ రేటింగ్ తో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తుంది అంటే అందుకు నాగార్జున హోస్టింగ్ స్టైల్ ను ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

ఒక వ్యక్తి వ్యవస్థగా ఎదిగి పదిమంది ఎదుగుదలకు, జీవనభృతికి ఆధారంగా నిలబడటం అభినందనీయం. హీరోగా నా జీవితం నా వరకు కంఫర్టబుల్ గా ఉంది … ఇంక నాకేం అవసరం లేదు అనుకోకుండా మల్టిపుల్ యాక్టివిటీస్ తో తనను తాను విస్తృత పరుచుకుంటూ 33 వసంతాల సినీ జీవిత ప్రస్థానాన్ని అన్ని విధాల సుసంపన్నం చేసుకుంటున్న నాగార్జునకు అరవై వసంతాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ‘ద తెలుగు ఫిలిమ్ నగర్.కమ్’.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =