గేమ్ ఓవర్ రివ్యూ – వన్ ఉమెన్ షో

అటు హిందీ తో పాటు ఇటు తెలుగు, తమిళ్ లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపుతెచ్చుకుంటుంది తాప్సీ. ఇప్పుడు మరోసారి గేమ్ ఓవర్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గేమ్ ఓవర్ సినిమా ఈరోజు విడుదలైంది. తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

నటీనటులు – తాప్సీ, వినోదిని వైద్యనాథన్‌, అనీష్ కురివిల్లా, సంచనా నటరాజన్,
దర్శకత్వం – శరవణన్
బ్యానర్ – వై నాట్ స్టూడియోస్
నిర్మాత – ఎస్.శశికాంత్
సంగీతం – రోన్ ఏహాన్ యోహాన్

కథ:

స్వప్న ( తాప్సీ) ఓ వీడియో గేమ్ డిజైనర్. రెట్రో గోమ్స్ డిజైన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటుంది. ఈ క్రమంలో అనుకోకుండా ఒక రోజు తాప్సీ యాక్సిడెంట్ కు గురవుతుంది. ఆ యాక్సిడెంట్ తరువాత.. చీకటంటే భయపడటం.. కలలు రావడం.. విచిత్రంగా ప్రవర్తించడం.. ఇలా ఎన్నో విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అంతేకాదు ప్రతి ఏడాది యాక్సిడెంట్ జరిగిన రోజు నైక్టోఫోబియా( అంధకార భీతి)కి గురవుతూ వుంటుంది. అయితే ఆ పరిస్థితుల నుండి బయటకు రావడానికి ఆశ్చర్యంగా ఆమె అనుకోకుండా వేసుకున్న ఓ టాటూ సహకరిస్తుంది.. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ మహానగరంలో వరుసగా అమ్మాయిలను అతి కిరాతకంగా హత్య చేస్తుంటారు గుర్తు తెలియని ఆగంతకులు. ఆ హత్యలు చేస్తున్నది ఎవరు ? స్వప్న కు వస్తున్న కలలు ఏంటి ? అసలు టాటూకు కలలకు ఉన్న సంబంధం ఏంటి..? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి టాలీవుడ్ లో ఇప్పటివరకూ లేడీ ప్రాధాన్యత ఉన్న పాత్రను చేయలేదు తాప్సీ. హిందీలో ఆమె చేసిన సినిమాలు హిట్టవ్వడంతో ఇక ఈసినిమాపై కూడా అదే అంచనాలు ఉన్నాయి. తాప్సీ కూడా తనకు అచ్చొచ్చిన జోనర్ లో సౌత్ లో తన లక్ ను పరీక్షించుకోవడానికి గేమ్ ఓవర్ అనే వైవిధ్యమైన కథను ఎంచుకుంది. ఇక తనకు ఎలాగూ ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి ఈసినిమాలో కూడా స్వప్న పాత్రకు తనదైన నటనతో ప్రాణంపోసింది. లుక్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ ఇలా ప్రతీ విషయంలో పర్ఫెక్షన్‌ చూపించిన తాప్సీ సినిమాను తన భుజాల మీదే నడిపించారు. ఈ సినిమా ఆద్యంతం తాప్సీపైనే ఆధారపడి నడిచే కథాంశం కావడంతో తాప్సీకి నటించే స్కోప్ ఎక్కువగా లభించింది. ఒక విధంగా చెప్పాలంటే `గేమ్ ఓవర్` తాప్సీ వన్ ఉమెన్ షో. ఇక మిగతా పాత్రల్లో నటించిన వినోదిని వైధ్య నాధన్, అనిష్ కురువిల్లా, సంచనా నటరాజన్, రమ్యసుబ్రహ్మణ్యన్ తమ తమ పాత్రల పరిథిమేరకు నటించి పూర్తిగా న్యాయం చేశారు.

ఇక దర్శకుడు అశ్విన్ శరవణన్ తీసుకున్న పాయింట్ చిన్నదే కానీ.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. అజ్ఞాత వ్యక్తులతో పోరాడేందుకు ధైర్యం చేయాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ప్రేక్షకుడికి విసుగురాకుండా చేయాలి.. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూసుకోవాలి… దానితో పాటు సాగతీత ఉండకూడదు.. ఇలా అన్ని విషయాల్లో శరవణన్ జాగ్రత్తలు తీసుకున్నాడనిపిస్తుంది తన స్క్రీన్ ప్లే చూస్తుంటే. శరవణన్, కావ్య అందించిన స్క్రీన్‌ప్లేనే సినిమాకు ప్రధాన బలం.

ఫస్ట్ హాఫ్ మొత్తం తాప్సీ గురించి.. తాప్సీ ఎందుకు భయపడుతుంది.. అనే విషయాలు చూపిస్తూ.. దానితో పాటు సస్పెన్స్ కూడా మెయింటైన్ చేయడం ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటే బావుండేది. నిడివి తక్కువగా ఉండటంతో.. ట్రిమ్ చేయడంతో.. కొన్ని సన్నివేశాల్ని అర్థం చేసుకోవడంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా వుంది. ఇంకాస్త నిడివి ఎక్కువగా ఉన్నట్టైయితే ఇంకా ఓ రేంజ్ లో ఉండేది.

ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కు ముఖ్యంగా కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాటోగ్రఫి. ఈ సినిమాకు ఆ రెండు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఏ వసంత్ అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డార్క్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని వసంత్ తన ఫొటోగ్రఫీతో మరింత ఆసక్తికరంగా మలిచాడని చెప్పొచ్చు. ఇక రోన్ ఎతాన్ యోహన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకు వెన్నముకగా నిలిచి ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా చేయడం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్స్:
తాప్సీ
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:
నిడివి

ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారితో పాటు ప్రతి సినీ ప్రేక్షకుడు చూడదగిన సినిమా అని చెప్పొచ్చు గేమ్ ఓవర్.

 

Game Over Telugu Movie Review
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here