తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ , రిలీజస్ , రిజల్ట్స్ వంటి సమస్త విశేషాలను, వివరాలను మీ “దతెలుగుఫిలింనగర్.కాం” ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను విహంగ వీక్షణంగా అందించడం కోసం మేము చేస్తున్న తాజా ప్రయత్నమే” ఫిల్మ్ నగర్ లో ఈ వారం”. ఏ రోజుకారోజు అందిస్తున్న విశేషాలను అప్పుడప్పుడు మిస్ అయినప్పటికీ ఈ వీక్లీ రౌండప్ లో ప్రధాన విషయాలను, సంఘటనలను మీ ముందు మరోమారు ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నమే “ఫిల్మ్ నగర్” లో ఈ వారం. సో.. ముందుగా ఈ శీర్షికలో ఈ వారంటాలీవుడ్ లో జరిగిన కొన్ని విశేషాలను మీ ముందు ఉంచుతున్నాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* మహేష్ బాబు “కాలర్ ఛాలెంజ్”:
సాధారణంగా హెవీ స్టేట్మెంట్స్ కు దూరంగా ఉండే మహేష్ బాబు ” మహర్షి” సక్సెస్ మీట్ లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తన అభిమానుల్లో జోష్ నింపింది.మహర్షి సాధిస్తున్న ఎపిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులకు ఈ స్టేట్ మెంట్ మరింత ఊపునిచ్చింది.” మహర్షి రిలీజ్ అయ్యాక నాన్న గారి అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు అని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పాను . ఇప్పుడు వాళ్లే కాదు నేను కూడా కాలర్ ఎత్తుతాను” – అంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పారు మహేష్ బాబు.
25 చిత్రాల తన ప్రస్థానంలో అద్భుత విజయాలను చూసిన మహేష్ బాబు తన విజయాలకు సమాధానంగా ఒక అందమైన చిరునవ్వు చిందించారే కానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. దీన్నిబట్టి మహర్షి ఎంత పెద్ద హిట్టో , మహేష్ బాబు కు ఈ విజయం ఎంత స్పెషలో అర్థమవుతుంది. తన కెరీర్ లో ల్యాండ్ మార్కింగ్ ఫిగర్ అయిన 25 వ చిత్రం కావడంతో మహేష్ బాబు ఈ విజయాన్ని చాలా ఇన్స్పైరింగ్ హిట్ గా భావించారు. సో…. ఇది నిజంగానే కాలర్ ఎగరేయాల్సిన హిట్. “ఈ స్టేట్మెంట్ తో మా అభిమానులకు గొప్ప ‘కిక్’ ఇచ్చినందుకు మహేష్ బాబు కు థాంక్స్” అంటూ తెగ సంబరపడిపోతున్నారు సూపర్ స్టార్అభిమానులు. సో.. మహేష్ బాబు ఎగరేసిన కాలర్ బాక్సాఫీస్ టాప్ మీద కలకాలం ఎగరాలని ఆశిద్దాం.

* Reading is a good challenge అంటున్న రానా:
నటుడిగా విలక్షణ పాత్రలతో రాణిస్తున్న రానా తన వెంచరింగ్ నేచర్ తో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో సంచలనం సృష్టించిన బకెట్ ఛాలెంజ్, ప్లాంటింగ్ ఛాలెంజ్ వంటి కాన్సెప్ట్స్ తరహాలో ఇప్పుడు రానా ఒక సరికొత్త తరహా ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టాడు. అదే రీడింగ్ ఛాలెంజ్. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిపోయిన ఈ రోజుల్లో రీడింగ్ హాబిట్ తగ్గిపోవడం ఒక ఆందోళన కలిగించే విషయం. ఈ నేపథ్యంలో యూత్ లో రీడింగ్ హాబిట్ ను పెంచేందుకు రానా “రీడింగ్ ఈస్ ఏ గుడ్ ఛాలెంజ్” అంటూ” రీడింగ్ ఛాలెంజ్” అనే కాన్సెప్టును ప్రచారం చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే- “అమర చిత్ర కథ బుక్ హౌస్”తోనూ మరియు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియాని తో టై అప్ అయిన రానా “రీడింగ్ ఈజ్ ఏ గుడ్ ఛాలెంజ్ ”కాన్సెప్ట్ ను పాపులర్ చేస్తున్నారు. ముగ్గురు ప్రముఖులకు రీడింగ్ ఛాలెంజ్ విసిరితే ఆ ముగ్గురు మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరే ఈ కాన్సెప్ట్ ద్వారా రీడింగ్ హాబిట్ ను inculcate చేసేందుకు రానా కృషి చేయటం అభినందనీయం. కాగా రానా తనకు అత్యంత ఆత్మీయులైన కరణ్ జోహార్,శోభు యార్లగడ్డ, రాంప్రసాద్ లకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ కాన్సెప్ట్ కు అద్భుత స్పందన రావటంతో ఇది టాలీవుడ్ లో ప్రస్తుతం బాగా ప్రచారం అవుతుంది.

* రాళ్లపల్లి కన్నుమూత:
ఈ వారం సంఘటనల్లో ప్రముఖ నటుడు రాళ్లపల్లి కన్నుమూత ఒక విషాద సంఘటన. కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్సపొందుతున్న రాళ్ళపల్లి వెంకట నరసింహారావు మే 17 ఉదయం 6 గంటల 15 నిమిషాలకు కన్నుమూశారు. వందలాది నాటకాల్లో, 800కు పైగా సినిమాలలో నటించి ఐదు సార్లు ప్రతిష్టాత్మక నంది అవార్డులు పొందిన రాళ్లపల్లి మరణం తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించుకున్న రాళ్లపల్లి మరణం పట్ల తెలుగు చలనచిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

* అక్కినేని- దాసరి విగ్రహాల కూల్చివేత:
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ వారం జరిగిన సంఘటనల్లో అక్కినేని- దాసరి విగ్రహాల కూల్చివేత అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. వైజాగ్ బీచ్ రోడ్డు లో సరైన అనుమతులు లేకుండా ప్రముఖ రచయిత, పార్లమెంటు మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రతిష్టించినపద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ విగ్రహాలను వైజాగ్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేసిన సంఘటన చిత్ర పరిశ్రమ వర్గాలను కలవరపరిచింది. అనుమతి లేకుండా పెట్టిన ఆ విగ్రహాలను తక్షణమే తొలగించవలసిందిగా ఒక వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు వారు ఆదేశించినప్పటికీ వైజాగ్ కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవాడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గా పరిగణించటంతో కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా మే 15 వ తేదీ రాత్రికి రాత్రే ఆ విగ్రహాలను కూల్చివేశారు. అనుమతులు లేకుండా ఆ విగ్రహాలను ప్రతిష్టించడంతో అక్కినేని- దాసరి వంటి ప్రముఖుల ప్రతిష్టకు తీరని అవమానం జరిగింది అంటూ పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కూల్చింది అక్కినేని దాసరి విగ్రహాలను కాదు… వారి ప్రతిష్టను అంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.

* చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ !?
మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు అనే వార్త ఒకటి ఈ మధ్య సంచలనం సృష్టించింది. ప్రముఖ నటుడు, విద్యావేత్త మంచు మోహన్ బాబు కు పోటి గా చిరంజీవి విద్యా రంగం లోకి వస్తున్నారనీ, రాష్ట్రం అంతటా విద్యాలయాలు ప్రారంభిస్తారని మే 17న కొన్ని వెబ్ సైట్స్ ఆర్భాటంగా వార్తలు రాసాయి. అయితే ఇందుకు సంబంధించిన ఖండన ఒకటి అదేరోజు వెలువడింది.శ్రీకాకుళంలో కొందరు చిరంజీవి అభిమానులు” చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్”- పేరుతో ఒక స్కూలు ప్రారంభిస్తున్న వార్త వాస్తవమే. కానీ దానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మేరకు అదే రోజు ఆ స్కూల్ నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అయితే పూర్తిస్థాయి వివరాలు, వాస్తవాలు తెలుసుకోకుండా స్వయాన చిరంజీవే ఉభయ రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్కూల్స్ ప్రారంభిస్తున్నారని, అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయని మీడియా సృష్టించిన హడావుడి అటు మెగా కాంపౌండ్ లోనూ, ఇటు అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది.

ఇక ఈ వారం సినీ విశేషాలలోకి వెళితే…
– నాని “గ్యాంగ్ లీడర్” రిలీజ్ డేట్ ను మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గా మైత్రి మూవీ మేకర్స్ మే 17న ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

– రామ్ పోతినేని హీరోగా స్వీయ నిర్మాణంలో ప్రముఖ దర్శక నిర్మాతపూరి జగన్నాథ్ నిర్మిస్తున్న “ఇస్మార్ట్ శంకర్” టీజర్ ను మే 15 న తమ puri connects అనే ప్రొడక్షన్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాను అంటున్నారు పూరి జగన్నాథ్.

– తమిళంలో సూపర్ హిట్ అయిన “గోలి సోడా” చిత్రాన్ని తెలుగులో “ఎవడు తక్కువ కాదు”- పేరుతో రీమేక్ చేస్తున్నారు లగడపాటి శ్రీధర్. తన కుమారుడు విక్రమ్ లగడపాటిని హీరోగా పరిచయం చేస్తూ రఘు జయ దర్శకత్వంలో హరి గౌర సంగీత సారథ్యంలో నిర్మించిన ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేస్తున్నట్లుగా లగడపాటి శ్రీధర్ ప్రకటించారు.

– కొన్ని ప్రత్యేక తరహా పాత్రల ద్వారా ప్రత్యేక తరహా ఇమేజ్ ని సొంతం చేసుకున్న హాట్ బ్యూటీ “తాప్సీ” ప్రధాన పాత్ర పోషించిన “గేమ్ ఓవర్”చిత్రాన్ని జూన్ 14 న విడుదల చేస్తున్నట్లుగా “వై నాట్ స్టూడియో” ప్రకటించింది. హర్షిత్ శర్వానన్ దర్శకత్వంలో “వై నాట్ స్టూడియో- రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్” సంయుక్తంగా నిర్మించిన ” గేమ్ ఓవర్”- హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది.

ఇవీ ఈ వారం విశేషాలలో కొన్ని ముఖ్యాంశాలు. వచ్చేవారం మరిన్ని విశేషాలు, వివరాలతో మీ ముందుకు వస్తుంది ” ఫిల్మ్ నగర్ లో ఈ వారం”.
[subscribe]
[youtube_video videoid=SejV9ADR0Nw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: