తన విలక్షణ, విశిష్ట అభినయంతో నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విలక్షణ నటుడు మోహన్ బాబుకు రాజకీయ రంగంలో కూడా చెప్పుకోదగిన చరిత్ర ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా , ఆ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎంపిక కాబడిన పార్లమెంటేరియన్ గా, ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురై బీజేపీకి ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్ గా రాజకీయ చరిత్ర కలిగిన మోహన్ బాబు తాజాగా వై ఎస్ ఆర్ సి పి పార్టీలో చేరడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి కి కూడా సమీప బంధువైన మోహన్ బాబు చివరకు
వై ఎస్ ఆర్ సి పి తీర్థం పుచ్చుకోవటానికి కారణం ఏమిటి? మోహన్ బాబు చేరిక వైఎస్సార్ సీపీకి ఏ మేరకు లాభిస్తుంది? ఇత్యాది విషయాలపై మోహన్ బాబు స్పందన ఏంటో తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
* మోహన్ బాబు గారూ! ఎన్నికలు అతి సమీపంలో ఉన్న ప్రస్తుత తరుణంలో మీరు ఇంత హఠాత్తుగా వైయస్సార్సీపిలో చేరడానికి కారణం ఏమిటి ?
జ: హఠాత్తుగా హఠాత్తుగా అంటారు ఏంటండీ? ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. అంకుల్ మీరు పార్టీ లోకి రావాలి… అయితే మీరు ఎప్పుడు రావాలో నేనే చెబుతాను అని నాలుగు సంవత్సరాల క్రితం అన్నాడు జగన్.ఇప్పుడు మీరు రావాల్సిన సమయం వచ్చింది రండి అని అడిగాడు… వచ్చాను. అంతే తప్ప ఇందులో హఠాత్ నిర్ణయం ఏమీ లేదు.
* ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కూడా పూర్తయిన తరువాత మీరు పార్టీలోకి చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగానో, ఎంపీ గానో పోటీ చేసే అవకాశం కూడా లేదు. ఇలాంటి తరుణంలో మీరు ఏమి ఆశించి పార్టీలో చేరారు?
జ: ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి వస్తే నాకు ఎంపీ సీటు కావాలి, మా పిల్లలకు ఎమ్మెల్యే సీటు కావాలి లేకపోతే నాకు ఏం చేస్తావు అనే బేరసారాలతో వచ్చేవాణ్ణి. అలాంటి కిక్ బ్యాక్స్ ఆశించే వాడిని
అయితే ఎన్నికలు ప్రకటించగానే వచ్చి ఉండేవాణ్ణి. నాది ఏవో ప్రయోజనాలు ఆశించి నిర్ణయాలు తీసుకునే క్యారెక్టర్ కాదు.
* మీరు వ్యక్తిగతంగా ఏమీ ఆశించక పోయినప్పటికీ మీ చేరికకు ఒక పర్పస్ ఉంటుంది కదా? ఆ పర్పస్ ఏమిటి?
జ: చాలా పర్పస్ ఉంది. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. తన తండ్రి లాగానే ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. జీవితం అంటే దేవాలయం కాదు… యుద్ధభూమి అని ఖండే కర్ అన్నట్టుగా జగన్ కు జీవితమే పోరాటం అయింది. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అనే రెండు గొప్ప పథకాలతో పాటు, బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించటం తన బాధ్యత అనుకున్నాడు జగన్. రాష్ట్రానికి సంబంధించిన ఒక గొప్ప ప్రయోజనం విషయంలో సోనియా గాంధీతో విభేదించిన రాజశేఖర్ రెడ్డి గారు “నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినే కానీ బానిసను కాదు”.. అన్నారు. అలా ధిక్కార స్వరం వినిపించిన ఫలితంగా ఆయన జీవితమే అత్యంత దారుణంగా, అర్థంతరంగా ముగిసిపోయింది. ఆయన మరణం వెనుక ఉన్న కుట్ర కోణం గురించి ఇప్పుడు నేను మాట్లాడ దలుచుకోలేదు. అయితే జగన్ కూడా సోనియాగాంధీకి ఎదురు తిరిగి స్వతంత్రంగా వ్యవహరించడం వల్లేనే ఆయన మీద రకరకాల కేసులు బనాయించి జైలుకు కూడా పంపించారు. అయినా వాటికి బెదరకుండా జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే మరొకవైపు చంద్రబాబు నాయుడు దుష్ట పాలనలో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయి. భూమి, మట్టి, ఇసుక ఇలా ఒకటేమిటి అన్నింటినీ ఆక్రమించిచేస్తున్నారు… స్వాహా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతుగా నిలవాలని జగన్ కోరాడు… ఎన్నికల ముందు నా ప్రవేశం, నా ప్రచారం వైఎస్ఆర్ సీపీకి ఉపయోగపడతాయి అని జగన్ విశ్వసించాడు… అందుకే నన్ను రమ్మన్నాడు… వచ్చాను.
* జగన్ పాలసీల మీద, ఆయన చేస్తున్న వాగ్దానాల మీద మీకున్న నమ్మకం ఏమిటి?
జ: ఆయన తండ్రి రాజశేఖర్రెడ్డి గారి మీద ఉన్న నమ్మకమే జగన్ మీద, ఆయన కుటుంబం మీద ఉంది. ఇంత చిన్న వయసులో జగన్ సోనియా గాంధీ మీద తిరుగుబాటు ప్రకటించి ఇంత సమర్థవంతంగా తన వ్యాపారాలను,పార్టీని నడుపుతూ, అటు కాంగ్రెసు ఇటు- చంద్రబాబు నాయుడు సృష్టిస్తున్న ఆటంకాలను ఎదుర్కొంటూ ప్రతి పక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టిస్తున్నాడు. జగన్ లీడర్షిప్ క్వాలిటీస్ మీద నాకు ఎలాంటి సందేహం లేదు. నిజానికి లీడర్స్ అంటే ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు. నా దృష్టిలో చంద్రబాబునాయుడు లీడర్ కాదు.. అతనొక udc … జస్ట్ ఒక అప్పర్ డివిజన్ క్లర్క్. అతని తెలివితేటలు, అడ్మినిస్ట్రేషన్ అంత వరకే పరిమితం. తిమ్మిని బమ్మిని చేసే తెలివితేటలు వేరు… అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ వేరు. చంద్రబాబు నాయుడుకు తిమ్మినిబమ్మిని చేసే తెలివితేటలే తప్ప అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ లేదు.
* మీకు చంద్రబాబు నాయుడు కూడా బంధువే కదా…. తెలుగుదేశం పార్టీ నుండి మీకు ఆహ్వానం రాలేదా?
జ: జగన్ కంటే ముందు 2017 లోనే చంద్రబాబు నాయుడు పార్టీలోకి రమ్మని అడిగాడు. పదవి గాని , ఇంకేవైనా ప్రయోజనాల మీదగాని ఆశ ఉంటే అప్పుడే వెళ్ళే వాడిని. భగవంతుడి ఆశీస్సులు వల్ల నేను, నా పిల్లలు ఆనందంగా ఉన్నాం. పదవులు తీసుకోవటానికో, స్వప్రయోజనాలు నెరవేర్చుకోవటానికో అయితే అతని దగ్గరకు వెళ్లాలి కానీ ఆ అవసరం నాకు లేదు.
* ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీ వ్యాపార భాగస్వామి. హెరిటేజ్ లో మీరు చంద్రబాబు నాయుడు పార్ట్నర్స్. అంత సన్నిహితులైన మీకు చంద్రబాబు నాయుడుతో ఇంత తీవ్ర విభేదాలు రావడానికి కారణం ఏమిటి ?
జ: చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ పెట్టాలి అనే ప్రపోజల్ తో నా దగ్గరకు వచ్చాడు… నా సహాయాన్ని, భాగస్వామ్యాన్ని అర్థించాడు. నేను మేజర్ పార్ట్నర్ గా, డేగా అనే అతను, చంద్రబాబు నాయుడు మైనర్ పార్ట్నర్స్ గా 1992లో హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించాం. కానీ కొద్దికాలానికే చంద్రబాబు నాయుడు అసలు నైజం బయటపడింది. ఎకౌంట్స్ లో, క్వాలిటీ లో అన్నింటిలో అవకతవకలకు పాల్పడ్డాడు. అదేమని అడిగినందుకు నాకు ఉద్వాసన పలికే పథకాలకు వ్యూహ రచన చేశాడు. ఇది ఔనో..కాదో…చంద్రబాబు నాయుడుని తన భార్యాబిడ్డలతో రమ్మనండి… నేను నా భార్య పిల్లలతో వస్తాను… ఏ గుడిలో ప్రమాణం చేయమంటాడో ఆ గుడిలో ప్రమాణం చేద్దాం. రమ్మనండి…
తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనా ? కాణిపాకం వినాయకుడి గుడిలోనా ? ప్రమాణానికి ఎక్కడ సిద్ధమో చెప్పమనండి.. అతను ఆ రోజున నన్ను అలా మోసం చేసి హెరిటేజ్ నుండి బయటికి పంపకపోతే ఈ రోజున అందులో నా వాటా ప్రకారం నా షేర్స్ విలువ 2800 కోట్లు అయి ఉండేది. స్వయానా రాజశేఖర్ రెడ్డి గారు నన్ను అడిగారు.. “ఏమిటి మీ మధ్య గొడవ.. ఏం జరిగింది ” అని అడిగితే జరిగింది చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. అయినా కాళ్లు కడిగి పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబునాయుడుకు వ్యాపార భాగస్వామిని అయిన నన్ను మోసం చేయడం ఒక లెక్క.
* మరి అలాంటి చంద్రబాబు నాయుడుతోనే కదా మీరు చేతులు కలిపి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదోసింది.?
జ: ఈ విషయంలో ఇప్పటికీ నేను 100 సార్లు వివరణ ఇచ్చాను. అసలు ఆ రోజున ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వైస్రాయ్ హోటల్ దగ్గరకి వెళ్ళాను తప్ప నేను చంద్రబాబుతో చేతులు కలిపి చేసింది ఏమీ లేదు. ఏమైనా సమీకరణాలు చేశానా? ఏమైనా పదవులు ఆశించినా? ఆర్థికంగా ఏదైనా లబ్ధిపొందినా ? లక్ష్మి పార్వతి కారణంగా పార్టీ నాశనం అవుతుంది… అన్న గారి ప్రతిష్ట దెబ్బతింటుంది… ఆ విషయం అన్న గారి దృష్టికి వెళ్లే లాగా చేద్దాం.. అని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి నేను కానీ ఇంకెవరైనా కానీ అతని పక్కన నిలబడ్డమే తప్ప ఈ దుర్మార్గుడు అసలు అన్నగారి
అస్తిత్వానికే ఎసరు పెడతాడని ఎవరమూ ఊహించలేదు.
* మీరు ఇంకా చాలా విషయాలు బయట పెడతాం అంటున్నారు… మీరు బయటపెట్టే నిజాలు తెలుగుదేశం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి.?
జ: ఇప్పటికే చాలా విషయాలు చెప్పాం… చంద్రబాబు దుర్మార్గాలు చాలా బయట పెట్టాము… ఒకటారెండా ? ఆరోజున కుటుంబ సభ్యులెవ్వరికీ పదవులు ఇవ్వద్దు … అలా ఇస్తే బంధుప్రీతి అంటారు… కుల ప్రీతి అంటారు.. అని రామారావు గారికి లేనిపోనివి చెప్పి కుటుంబ సభ్యులు ఎవరిని ఎదగనీయకుండా చేశావు. కొన్ని వేల కిలోమీటర్లు చైతన్య రధాన్ని నడిపి అన్నగారి విజయంలో పాలుపంచుకున్న హరికృష్ణకు ఏ పదవి దక్కకుండా చేశావు. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరిలను మొదటి నుండి దూరంగా పెట్టించావు. కానీ ఈ రోజున ఏ అర్హత లేకపోయినా నీ కొడుకును క్యాబినెట్ లో కూర్చోబెట్టావు… కీలక పదవి ఇచ్చావు… పార్టీ పగ్గాలు అప్పజెప్పావు. ఇవన్నీ నిజాలు కావా?? ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. తప్పకుండా కీలెరిగి వాత పెట్టినట్టు ఈ ఎన్నికల్లో నీకు బుద్ధి చెబుతారు.
* వివేకానంద రెడ్డి హత్య విషయంలో తెలుగుదేశం- వై ఎస్ ఆర్ సి పి లు చేసుకుంటున్న పరస్పర ఆరోపణల మీద మీ స్పందన ఏమిటి?
జ: ఆ హత్య విషయంలో చట్టాన్ని తన పని తనను చేసుకోనివ్వకుండా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో జనం చూస్తూనే ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్యను జగన్మోహన్ రెడ్డి మీదనే నెడతారు… ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద జరిగిన దాడిని కోడి కత్తి అంటూ హేళన చేస్తారు… ఇలా అన్నింటిని అతని మీద నెట్టేస్తూ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు… మీవి నోర్లా డస్ట్ బిన్లా? ఇంత నిరాధారంగా, అన్యాయంగా ఎదుటి వారి మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నావే… నీకు నేరచరిత్ర లేదా చంద్రబాబు నాయుడు? ఆరోజున అన్న గారి మీద హత్యా ప్రయత్నం చేశాడు అంటూ మల్లెల బాబ్జీ అనే ఒక అమాయకుడితో డ్రామా ఆడించి…. ఆ తరువాత వాడిని దారుణంగా చంపించడం వెనుక అసలు సూత్రధారి నువ్వే అని అప్పట్లో మీడియాతో సహా అందరూ ఆరోపించారు. అది నిజం కాదా? చరిత్రలో ఔరంగజేబు కంటే నీచమైన చరిత్ర నీది. ఈ రోజున రాజధాని ఇక్కడే.. రాజధాని అక్కడే … అంటూ రకరకాల ఊర్ల పేర్లు మార్చి ఆ ఏరియాల్లో రైతుల నుండి పొలాలు అమ్మించి .. నీ ఏజెంట్ల ద్వారా కొనిపించి రైతులను నిలువునా ముంచావు. ఇప్పుడు అమరావతిలో రాజధాని అంటూ 30 వేల ఎకరాలు సేకరించి మూడు వేల ఎకరాల్లో కూడా నిర్మాణాలు చేయకుండా నాటకాలు ఆడుతున్నావు.
* రాబోయే ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి విజయావకాశాల మీద మీ అంచనాలు ఏమిటి?
జ: విజయవకాశాలు ఏమిటి? జగన్ సీఎం.. అంతే… నూటికి నూరుశాతం జగన్ సీఎం అవుతున్నాడు.. అంతే.. దీనికి తిరుగులేదు.
ఇవీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన అనంతరం విలక్షణ, నటుడు, నిర్మాత మాజీ పార్లమెంటేరియన్ మంచు మోహన్ బాబు నిష్కర్షగా వెలిబుచ్చిన అభిప్రాయాలు.
[youtube_video videoid=IrLNRt3tOxo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: