వెంకటేష్, సౌందర్య… తెలుగునాట హిట్ పెయిర్‌గా రాణించిన జోడీ. `సూపర్ పోలీస్`(1994)తో మొదలైన ఈ జంట ప్రయాణం… `దేవీ పుత్రుడు` (2001) వరకు ఏడు చిత్రాల పాటు కొనసాగింది. అయితే… వీరి కాంబినేషన్‌లో తొలి, తుది చిత్రాలు నిరాశపరిచినా… మధ్యలో వచ్చిన `ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు`, `పవిత్ర బంధం`, `పెళ్ళి చేసుకుందాం`, `రాజా`, `జయం మనదేరా` మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించాయి. ముఖ్యంగా… `రాజా` చిత్రంలో ఈ జంట అభిమానులకు కనుల పంట అయ్యింది. తమిళ చిత్రం `ఉన్నిడత్తిల్ ఎన్నై కొడుత్తేన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించగా… ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ విషయానికి వస్తే… తనకి దొంగగా పరిచయమైన కథానాయకుడిని వాల్మీకిలా చూడాలకునుకుంటుంది కథానాయిక. అయితే… రాయిలాంటి తనని అహల్యగా మలచి శ్రీరాముడు అయిన అతన్ని ఆరాధిస్తుంది (ఇక్కడ… కథ రీత్యా అయినవాళ్ళు ఉన్నా అనాథలా బతుకుతున్న నాయికని గొప్ప గాయనిగా మలిచేందుకు… దొంగ అయిన కథానాయకుడు అహర్నిశలు కష్టపడి ఆమె ఎదుగుదలకు దోహదపడతాడు). చివరికి అతనితోనే జీవితాన్ని పంచుకుంటుంది. వినడానికి చిన్న పాయింటే అయినా… ఆద్యంతం భావోద్వేగాలతో, కుటుంబసమేతంగా చూడదగ్గ వినోదంతో ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా… పతాక సన్నివేశాలకు కంటనీరు పెట్టని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఈ సన్నివేశాల్లో వెంకటేశ్ హావభావాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఎస్.ఎ.రాజ్‌కుమార్ స్వరసారథ్యంలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా… `ఏదో ఒక రాగం` (రెండు వెర్షన్స్), `కవ్వించకే ఓ ప్రేమా`, `పల్లవించు తొలి రాగమే`, `కన్నుల లోగిలిలో`, `మల్లెల వాన`… ఇలా ప్రతీ గీతమూ ఓ ఆణిముత్యమే.
`రాజా` కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ మూవీ కావడమే కాకుండా… మూడు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయిక, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో పురస్కారాలను అందుకుందీ సినిమా.
మార్చి 18, 1999న విడుదలైన మ్యూజికల్ హిట్ `రాజా`… నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[youtube_video videoid=3K3qNc2Ww-4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: