విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు
దివికేగి నేటికి 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1923 మే 28న జన్మించిన ఎన్టీ రామారావు1996 జనవరి 18 న తనువు చాలించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తన విశిష్ట విలక్షణ అభినయ చాతుర్యంతో అలరించి తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైన ఆ మహానటుడి మహాభినిష్క్రమణం తెలుగు వారందరికీ ఓ శరాఘాతమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా రంగంలో కథానాయకుడిగా, రాజకీయరంగంలో మహా నాయకుడిగా ఆ జగద్విఖ్యాత నేత సాగించిన ప్రస్థానం అనితర సాధ్యం. క్రమశిక్షణ,కార్యదక్షత ఉంటే ఒక వ్యక్తి తన్ను తాను ఎంతగా విస్తృత పరచుకోవచ్చో , ఎంతటి ఉన్నత శిఖరాలను అధిష్టించవచ్చో చెప్పటానికి ఎన్టీ రామారావు జీవితమే ఒక ఉదాహరణ.
ఎన్టీఆర్ వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలే ఆయనను చిరస్మరణీయుడుగా, ప్రాతః స్మరణీయుడుగా నిలబెట్టాయి. చాలామంది జీవితం ఎటు నడిపిస్తే, ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. దక్కిందే చాలు… దొరికిందే చాలు అనే పరిమిత ఆనందాలతో సంతృప్తి పడిపోతారు. కానీ తాను నిర్దేశించినట్లుగా, తాను శాసించినట్లుగా జీవిత గమనాన్ని సాగించటం ఎన్టీఆర్ లాంటి కార్యదక్షులకే సాధ్యం. ఏదో అదృష్టం కలిసి వచ్చి సినిమా హీరోని అయ్యాను… డబ్బుకు డబ్బు, గ్లామర్ కు గ్లామర్, పేరు ప్రఖ్యాతులతో కూడిన సకల భోగాల జీవితం దొరికింది చాలు అనుకొని ఉంటే ఎన్టీ రామారావు అనే ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరాన్ని మనం చూడగలిగే వాళ్ళం కాదు.
దేవుడిచ్చిన అదృష్టం కొంత అయితే దాన్ని కొండంతగా తీర్చిదిద్దుకున్న
Self Made personality ఎన్టీఆర్.
హీరోగా అన్ని విధాల సకల సౌఖ్యాలతో సాగిపోతున్న జీవితాన్ని అంతవరకే పరిమితం చేసుకోకుండా నిర్మాతగా,దర్శకుడిగా తన్ను తాను విస్తృతం చేసుకోవడం వల్లనే ఎన్టీఆర్ తెలుగు చలనచిత్రరంగంలో ఒక చరిత్రకారుడుగా నిలిచిపోయారు. సినిమా రంగంలో నిర్మాతలుగా మారిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ దర్శకుడిగా, నిర్మాతగా , హీరోగా ఏకకాలంలో అఖండ విజయాలను సాధించిన “వన్ అండ్ ఓన్లీ చాలెంజింగ్ పర్సనాలిటీ” ఒక్క ఎన్టీరామారావు మాత్రమే.
ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విశిష్టతను వివిధ కోణాలలో విశ్లేషిస్తుంది మీడియా. ఈ నేపథ్యంలో “ ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” ఎన్టీఆర్ ప్రస్థానంలోని ఒక ప్రత్యేక కోణాన్ని మీ ముందుకు తెస్తుంది. కేవలం నటనకే పరిమితమై దర్శకుడిగా, నిర్మాతగా మారకుండా ఉండి ఉంటే ఆయన జీవితానికి ఇంత పరిపూర్ణత, ఇంతటి సార్థకత లభించేది కాదు. అందుకే “దర్శకుడిగా ఎన్టీఆర్” అనే కోణంలో ఆయన సాగించిన ప్రస్థానాన్ని, సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
రావణాసురుడి పాత్ర పోషణ పట్ల విశేషమైన ఆసక్తితో ఆ పాత్రను నేను పోషిస్తాను అని కె.వి.రెడ్డి గారికి చెప్పినప్పుడు , రాముడిగా కృష్ణుడిగా నిన్ను డైరెక్ట్ చేసిన నేను ఒక రాక్షస పాత్రలో నిన్ను చూడలేను.. ఈ సినిమాకు నేను డైరెక్షన్ చేయను అని ఆయన తప్పుకున్న క్షణంలోనే ” ఎన్టీ రామారావు” అనే ఒక గొప్ప దర్శకుడు ఆవిర్భవించారు.
అలా కె.వి.రెడ్డి తిరస్కారానికి – తాను దర్శకుడు కావటమే పరిష్కారంగా భావించిన ఎన్టీఆర్ నుండి ఎలాంటి చిత్ర రాజాలు వచ్చాయో సర్వజన విధితమే. ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో “ సీతారామ కళ్యాణం” చిత్ర దర్శకత్వ బాధ్యతలను ఎన్టీఆర్ తీసుకోకపోయి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మహా దర్శకున్ని మిస్ అయి ఉండేది. కేవలం కె.వి.రెడ్డి సీతారామ కళ్యాణం కు నేను దర్శకత్వం వహించను అని తనంత తానుగా తప్పుకోవటం వల్ల దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన ఎన్టీ రామారావు ఆ చిత్రం టైటిల్స్ లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. ఆ తరువాత దర్శకత్వం వహించిన ” గులేబకావళి కథ” చిత్రానికి కూడా దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు.
ఈ పరిస్థితుల్లో “మీరు డైరెక్టర్ కార్డు వేసుకోకపోవడం దర్శకత్వ శాఖను అవమానించినట్లు అవుతుంది. అది దర్శకుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి మీరు దర్శకత్వం వహించిన చిత్రాలకు మీ పేరు వేసుకోండి”- అని కొందరు పెద్దలు చెప్పటంతో మూడవ చిత్రమైన
” శ్రీకృష్ణ పాండవీయం” నుండి దర్శకుడిగా తన పేరు వేసుకోవడం ప్రారంభించారు ఎన్టీ రామారావు.
ఇక్కడ అభినందించాల్సిన విషయం ఏమిటంటే కె.వి.రెడ్డి గారు నేను డైరెక్ట్ చేయను అన్నప్పుడు ఎన్టీఆర్ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఆ ప్రాజెక్టును విరమించుకోవటమో లేక మరొక దర్శకుడిని ఆశ్రయించటమో జరిగేది. కానీ ఆత్మవిశ్వాస ధనుడైన ఎన్టీ రామారావు ఆ పరిస్థితిని ఒక సవాలుగా స్వీకరించడం వల్లనే ఇండియన్ స్క్రీన్ మీద ఒక మహా “నట దర్శక నిర్మాత” ఆవిర్భవించారు.
అలా సీతారామ కళ్యాణం తో దర్శకుడిగా మారిన ఎన్టీరామారావు నుండి గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా పెళ్లామా, తాతమ్మకల, దానవీర శూర కర్ణ, చాణక్యచంద్రగుప్త, శ్రీరామ పట్టాభిషేకం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, చండశాసనుడు, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ వంటి 16 అపురూప చిత్రాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రశంసార్హమైన విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సాంఘిక, పౌరాణిక, జానపద, చరిత్రాత్మక అనే నాలుగు జోనర్స్ లో దర్శకత్వం వహించి నాలుగింటిలోనూ అద్భుత విజయాలను సాధించిన మహా దర్శకుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఎన్టీ రామారావు.
పౌరాణికాల విషయానికి వస్తే సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వం , సాంఘికలకు వస్తే వరకట్నం, తల్లా పెళ్లామా, చండశాసనుడు, జానపదానికి వస్తే గులేబకావళి కథ, చారిత్రాత్మక చిత్రాలకు వస్తే చాణక్యచంద్రగుప్త, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాలు గొప్ప ప్రయత్నాలుగా, అఖండ విజయాలుగా నిలిచాయి.
ఇలా నాలుగు జోనర్స్ లో సినిమాలు తీసిన దర్శకులుగా కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, సి.ఎస్.రావు, ఎన్టీరామారావులు చరిత్రలో నిలిచిపోయినప్పటికీ వీరిలో అన్ని జోనర్స్ లోను విజయాలు సాధించిన ఏకైక దర్శకుడు ఎన్టీ రామారావు మాత్రమే.
దర్శకుడుగా ఎన్టీ రామారావు ప్రతిభా విశేషాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్క్రిప్ట్ లో దమ్ము, నటుడి లో సత్తా ఉన్నప్పుడు చిన్న చిన్న సాంకేతిక లోపాలను ప్రేక్షకులు పట్టించుకోరు. దర్శకుడి దృష్టి, ఏకాగ్రత సన్నివేశ పటిష్టత మీద ఉండాలి తప్ప అదనపు హంగుల మీద కాదు అన్నది దర్శకుడుగా ఎన్టీ రామారావు ప్రతిపాదించి, ఆచరించిన గొప్ప సూత్రం.
అవసరం ఉన్నా లేకపోయినా ఫారిన్ లొకేషన్స్, భారీ తారాగణం, భారీ సెట్టింగులు, నెంబర్ ఆఫ్ కాల్ షీట్స్, హంగు ఆర్భాటం వంటి ఆర్టిఫిషియల్ హంగామా ఉంటే తప్ప డైరెక్షన్ చేయలేని కొందరు ఆర్భాట ప్రియులు ఎన్టీరామారావు లోని directorial simplycity ని అలవరచుకుంటే చిత్ర పరిశ్రమ బాగుపడుతుంది, బాగుంటుంది.
ఈరోజు మహా నటుడిగా , దర్శక నిర్మాతగా ఆ సినీ దిగ్గజం వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విజయ ప్రస్థానంలోని దర్శకత్వ కోణాన్ని ఇలా స్మరించుకోవటం నేటి తరం దర్శకులకు మార్గదర్శకం అవుతుందని ఆశిస్తూ దివంగత దిగ్దర్శకుడు ఎన్టీ రామారావు ఆత్మ శాంతి ని ఆకాంక్షిస్తూ తన తరఫున, తన పాఠకుల తరఫున అంజలి ఘటిస్తోంది ‘ద తెలుగు ఫిలింనగర్ డాట్ కాం’.
[youtube_video videoid=fuGa2ixxirE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: