నటీనటులు: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్, సునీల్, సుబ్బరాజు, సచిన్ ఖేడేకర్, అనసూయ భరధ్వాజ్ తదితరులు
సంగీతం: ఎంఎం. కీరవాణి
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస మరియు వీఎస్ జ్ఞానశేఖర్
ఎడిటింగ్: కె.ఎల్. ప్రవీణ్
నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్, శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్స్
నిర్మాతలు: ఎ. ఎం. రత్నం, ఎ. దయాకర్ రావు
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటించిన మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన తొలిసారి యుద్ధ వీరుడిగా కనిపించడం విశేషం. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్గా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.
కాగా పవన్ కళ్యాణ్‌కి ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం కావడం గమనార్హం. దీంతో ఈ చిత్రంపై పవర్ స్టార్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయింది.
అయితే పవర్ స్టార్ మొదటిసారిగా చేసిన ఈ యోధుడి క్యారక్టర్ ఫ్యాన్స్‌ని మురిపించిందా? నిధి అగర్వాల్ అందం, బాబీ డియోల్ విలనిజం సినిమాకు ప్లస్ అయిందా? ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం ఆకట్టుకుండా? అలాగే క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేవి తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఒక సాహసికుడు. దోచుకున్న డబ్బును దాచుకునే అలవాటు లేని అతను ఉన్నవారి దగ్గరనుంచి కొట్టేసి లేనివారికి పంచిపెట్టే ‘రాబిన్‌హుడ్’ తరహా క్యారక్టర్. ఒకసారి మచిలీపట్నం ఓడరేవులో బ్రిటీషర్స్ దగ్గర నుంచి వజ్రాలు కొట్టేస్తాడు. వీరమల్లు గురించి తెలిసిన చిన్న దొర (సచిన్ ఖేడేకర్) తన దగ్గరకు పిలిపించుకుంటాడు. గోల్కొండ నవాబుకు తాను కప్పంగా కడుతున్న వజ్రాలను దొంగిలించి తేవాలని కోరతాడు.
ఇక వీరమల్లు ధైర్యసాహసాలు చూసి దొర దగ్గర నాట్యకారిణి అయిన పంచమి (నిధి అగర్వాల్) అతనిని ఇష్టపడుతుంది. తనను దొర చెర నుంచి ఎలాగైనా విడిపించమని కోరుతుంది. ఈ క్రమంలో వజ్రాలతో పాటు పంచమిని ఎత్తుకెళ్ళే సమయంలో గోల్కొండ నవాబు సైన్యానికి చిక్కుతాడు వీరమల్లు. అయితే అతడిని చంపకుండా ఒక ఒప్పందం చేసుకుంటాడు నవాబు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ కొట్టేసి తీసుకొచ్చే పని అప్పగిస్తాడు.
దీంతో గోల్కొండ నుంచి ఢిల్లీలోని ఔరంగజేబు రాజ్యానికి బయలుదేరుతాడు వీరమల్లు. ఇక ఈ ప్రయాణంలో వీరమల్లుకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి ప్రమాదాలలు చుట్టుముట్టాయి? వీరమల్లు మళ్లీ పంచమిని కలుసుకోగలిగాడా?లేదా? మొఘల్ పాలనలోని ఢిల్లీలో హిందువుగా జీవించాలంటే ‘జిజియా’ పన్ను చెల్లించాల్సిందేనని ఔరంగజేబు చేసిన శాసనం, ఆయన సైన్యం చేసిన దమనకాండ చూసిన వీరమల్లు ఏం చేశాడు? అలాగే వీరమల్లుకు, అగ్రహారానికి ఏమిటి సంబంధం? సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీరమల్లు ఏం చేశాడు? చివరకి ఏం జరిగింది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:-
కథగా చూస్తే.. హరిహర వీరమల్లు చారిత్రిక నేపథ్యంలో కొనసాగే కల్పిత కథ. సాధారణంగా ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఎందుకంటే, భారీ సెట్టింగులు కావాల్సివుంటుంది. ఇక తారాగణం కోణంలో చూస్తే, ఈ తరహా పాత్రలలో నటించే సత్తా అందరికీ ఉండదు. కాస్ట్యూమ్స్ దగ్గరనుంచి ప్రతిదీ నేటి కాలానికి భిన్నంగా ఉంటాయి. ఇంకా చిత్రీకరణకు అనువైన లొకేషన్స్ గుర్తించడం కూడా బాగా కష్టం. దీంతో స్టూడియోలలోనే భారీ హంగులతో నిర్మాణం చేయాల్సివుంటుంది. అందుకే ఈరోజుల్లో ఈ టైప్ మూవీస్ చేయడానికి నిర్మాతలు అంతగా ఇష్టపడరు.
ఇందుకు తగ్గట్టే హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైనప్పటినుంచీ అనేక అడ్డంకులు, అవరోధాలు. కరోనా మహమ్మారి కారణంగా మొదటి రెండేళ్లు వృధా కావడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ నత్తనడకన నడిచింది. అయితే వీటన్నింటిని దాటుకుని మూవీ రిలీజ్ అయిందంటే ముఖ్య కారణం నిర్మాత ఎఎం. రత్నం గారు. ఆయన ధృడ సంకల్పానికి పవర్ స్టార్ సహకారం తోడు కావడంతో ఇవేవీ ఆపలేకపోయాయి. అందుకే అన్ని అవరోధాలను అధిగమించి చివరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైనప్పటినుంచీ అనేక అడ్డంకులు, అవరోధాలు. కరోనా మహమ్మారి కారణంగా మొదటి రెండేళ్లు వృధా కావడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ కావడంతో షూటింగ్ నత్తనడకన నడిచింది. అయితే వీటన్నింటిని దాటుకుని మూవీ రిలీజ్ అయిందంటే ముఖ్య కారణం నిర్మాత ఎఎం. రత్నం గారు. ఆయన ధృడ సంకల్పానికి పవర్ స్టార్ సహకారం తోడు కావడంతో ఇవేవీ ఆపలేకపోయాయి. అందుకే అన్ని అవరోధాలను అధిగమించి చివరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డైరెక్టర్ క్రిష్ మొఘలుల కాలం, కోహినూర్ డైమండ్ తదితర విషయాలపై ఎంతో రీసెర్చ్ చేసి ఇష్టంగా తయారుచేసుకున్న కథ ఇది. సినిమాను ఎక్కువభాగం ఆయనే డైరెక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న తప్పనిసరి పరిస్థితులు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు అందుకున్న జ్యోతికృష్ణ ఈ కథను విజయవంతంగా పూర్తిచేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. చిత్రం చూస్తున్న ప్రేక్షకుడికి ఇందులో ఇద్దరు దర్శకుల చేయి ఉందని ఎక్కడా తెలియనంతగా తీశారు. ఈ విషయంలో ఆయనను మెచ్చుకోవాలి.
సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. వీరమల్లు పాత్ర పరిచయం, అతని సాహసాలు అబ్బురపరుస్తాయి. పోరాట యోధుడిగా పవన్ ఎంట్రీ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక చిన్న దొర అతడిని పిలిపించుకోవడం, పంచమితో పరిచయం, ఇద్దరిమధ్యా ప్రణయం వంటివి ఆడియెన్స్‌ని అలరిస్తాయి. ఎప్పుడైతే పంచమి కోరిక మేరకు ఆమెను తనతో పాటు తీసుకెళ్లడం, నవాబు దగ్గరనుంచి వజ్రాలు కొట్టేసే పని ఒప్పుకుంటాడో అప్పటినుంచి కథలో వేగం పెరుగుతుంది.
ఇక ఈ ప్రయత్నంలో వీరమల్లు నవాబు సైన్యానికి దొరికిపోవడంతో ఉత్కంఠ తీవ్రస్థాయికి వెళ్తుంది. అయితే నవాబు అతడిని చంపకుండా మొఘల్ చక్రవర్తి దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని కోరడంతో కథలో మంచి ట్విస్ట్ అనిపిస్తుంది. ఇలా ఫస్టాఫ్ మొత్తం ఆసక్తిగా సాగుతుంది. కాకతీయుల కాలంలో నాటి ఆంధ్రప్రాంతంలో కనుగొనబడిన 186 క్యారెట్ల కోహినూర్ డైమండ్ పలువురు రాజుల చేతులు మారి చివరకు ఔరంగజేబు దగ్గర ఉందనే విషయం ఆడియెన్స్‌కి ఉత్సుకత కలిగిస్తుంది.
అయితే ఈ అరుదైన, అప్పటికి ప్రపపంచంలోనే అతిపెద్దదైన కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు దగ్గర నుంచి వీరమల్లు కొట్టేయాలని ప్రయత్నం చేయడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ నేపథ్యంలో వీరమల్లు ఢిల్లీకి పయనమవవడం, ఔరంగజేబు పాలనలోని మొఘల్ సామ్రాజ్యం, ఆయన పరిపాలనలో సాధారణ ప్రజలు పడే ఇబ్బందులు, బాధలు కళ్ళకు కట్టినట్టు చూపారు. అయితే సెకండాఫ్ నుంచీ కథ ఇంకొంచెం సీరియస్ మోడ్ లోకి వెళ్తుంది. కథ అంతా కోహినూర్‌ని చేజిక్కించుకోవడం చుట్టూనే తిరుగుతుంది.
ఈ విలువైన వజ్రాన్ని వీరమల్లు ఎలా తస్కరిస్తాడు అనే విషయాన్ని బాగా చూపించారు. ఈ నేపథ్యంలో మొఘల్ సైనికులతో వీరమల్లు చేసే పోరాటాలు, యుద్దాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమా మొత్తానికి ఆయువుపట్టు అని చెప్పుకోవచ్చు. ఇందులో పవన్ నటన కళ్ళను చెమ్మగిల్లించేలా చేస్తుంది. అలాగే చివరిలో ఇచ్చిన లీడ్ పార్ట్ 2పై అంచనాలను పెంచేలా ఉంటుంది. మొత్తానికి ప్రేక్షకుడు మంచి అనుభూతితో థియటర్ నుంచి బయటకు వచ్చేలా చేస్తుంది సినిమా.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు, వీరమల్లు పాత్రను నిజాయితీగా చేసినందుకు ముందుగా ఆయనకు అభినందనలు చెప్పితీరాలి. కెరీర్లో ఇప్పటివరకు ఆయన చేసినవాటికి ఈ పాత్రకు అస్సలు సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం అనే చెప్పాలి. ఎందుకంటే, ఈ క్యారక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడం అంటే కత్తి మీద సాము చేయడమే. అయినాకానీ పవన్ దీనిని అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయారు.
ఆయన గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ.. ఇలా ప్రతిదీ ఆకట్టుకునేలావుంది. కొన్నేళ్లపాటు సినిమాలకు, కెమెరాకు దూరంగా ఉండటం, అందులోనూ తొలిసారిగా ఇలాంటి క్యారక్టర్ ప్లే చేయడం, ఇందులో ఆయన ఎలా నటించారు? అని అభిమానులందరిలో ఎన్నో సందేహాలు. అయితే తన పవర్ ఫుల్ నటనతో ఆయన వీటన్నింటినీ పటాపంచలు చేసేశారు. వీరమల్లు పాత్రలో పవన్‌ని తప్ప మరెవరినీ ఊహించలేం అనేంతగా అందులో నటించారు, కాదు జీవించేశారు. వీరమల్లుగా వీరత్వం చూపారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసిన ఫలితం తెరపై కనిపిస్తుంది. ఆ పాత్రను ఆయన అవగాహన చేసుకుని అందులోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన నటన, పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేస్తాయి. కాగా ఈ క్లైమాక్స్ సన్నివేశాలను ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయడం విశేషం. మొత్తానికి వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పవర్ స్టార్ తెరపై కనిపించగానే థియేటర్ మొత్తం ఈలలు, కేరింతలతో ఊగిపోయిందంటే అర్ధం చేసుకోవచ్చు అభిమానులు ఆయన సినిమాలకోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో. ఇక మిగతా పాత్రధారులలో బాబీ డియోల్‌ది ఇంపార్టెంట్ రోల్. ప్రతినాయకుడు ఔరంగజేబుగా ఆయన అసాధారణ నటనను కనబరిచారు. సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత చెప్పుకోదగ్గ క్యారక్టర్ ఇది. ఔరంగజేబు పాత్రలో బాబీ భయపెట్టాడు. క్రూరమైన విలన్‌గా మెప్పించాడు. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు.
ఇక కథానాయిక పంచమి పాత్రలో నిధి అగర్వాల్ కనువిందు చేసింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా బావుంది. ఉండేది కొద్దిసేపే అయినా ఆడియెన్స్‌ని అలరిస్తుంది. అలాగే అనసూయ, పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. ఇంకా జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్, సునీల్, సచిన్ ఖేడేకర్ పాత్రలు కీలకమైనవి. ఈ సీనియర్స్ తమ నటనానుభవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే మిగిలినవారు వారి పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక సాంకేతికంగా చూస్తే, సినిమా చాలా బావుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా అద్భుతంగా ఉంది. చాలా సన్నివేశాలను బీజీఎమ్ ఎలివేట్ చేసింది. ప్రధానంగా యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లోని భావోద్వేగ సన్నివేశాలను ఈ ఆస్కార్ అవార్డ్ విన్నర్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో హృద్యంగా ఆవిష్కరించారు. ఇది ఆయనకు మరో బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.
అలాగే మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇలాంటి సినిమా ఆడియెన్‌కి కనెక్ట్ కావాలంటే ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో వీరిద్దరూ మ్యాజిక్ చేశారనే చెప్పొచ్చు. వీరు తమ ట్యాలెంట్‌తో థియటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయేలా చేసి మొఘలుల కాలానికి తీసుకెళ్లగలిగారు. వందల ఏళ్లనాటి వాతావరణం, ప్రకృతి అందాలను వీరి కెమెరా చక్కగా ఒడిసిపట్టింది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉండి విజువల్స్ అద్భుతంగా వున్నాయి.
ఇక 2:42 గంటల నిడివి కలిగిన హరిహర వీరమల్లు ఆడియెన్స్‌కి ఎక్కడా బోర్ కొట్టకుండా చేసిందంటే అందుకు కె.ఎల్. ప్రవీణ్ ప్రతిభే కారణం. తన షార్ప్ ఎడిటింగ్‌తో ఎక్కడా ఆ ఫీల్ కలుగకుండా చేశాడు. అలాగే నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాపై మంచి ప్యాషన్ ఉన్న నిర్మాతలు కావడంతో సూపర్ క్వాలీటీతో నిర్మించారు. కథకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ రేంజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతోంది. మొత్తానికి ఈ మూవీ టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు.
ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం వాటిని అందుకుందనే చెప్పొచ్చు. పవన్ నటన, నిధి అగర్వాల్, బాబీ డియోల్ క్యారక్టర్స్, కీరవాణి సంగీతం, డైరెక్టర్స్ ప్రతిభ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది హిస్టారికల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ చూడాలనే ఆసక్తి కలిగిస్తోంది. దీనికితోడు పవన్ కళ్యాణ్ తన స్టార్డమ్తో ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా, హరిహర వీరమల్లుతో పవర్ స్టార్ సాలిడ్ హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























