రివ్యూ: కన్నప్ప

Kannappa Telugu Movie Review

నటీనటులు: విష్ణు మంచు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, అరియానా, వివియానా, మాస్టర్ అవ్రామ్ తదితరులు
సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
సినిమాటోగ్ర‌ఫీ: షెల్డన్ చౌ
ఎడిటింగ్: ఆంథోనీ
నిర్మాణం: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్
నిర్మాత: మోహన్ బాబు
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కన్నప్ప’. ఆయన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రను పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించారు.

హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకుముందే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో మార్కెట్‌లో మంచి బజ్ ఏర్పడింది. దీనికితోడు హైదరాబాద్ లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై వంటి పెద్ద నగరాలలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్స్‌తో ఇతర రాష్ట్రాలలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తద్వారా దేశవ్యాప్తంగా హైప్ తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారీ అంచనాల మధ్య నేడు అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే విష్ణు మంచు చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా? కన్నప్పగా ఆయన నటన ఎలావుంది? ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్ ఆడియెన్స్‌కి మజా ఇచ్చిందా? మహా శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ మెప్పించాడా? బాలీవుడ్ డైరెక్టర్ తన దర్శకత్వ ప్రతిభ చూపించాడా? ఇంతకూ కన్నప్ప ఎలావుంది? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

బోయవాడైన తిన్నడు (విష్ణు మంచు) ఓ గిరిజనుడు. చిన్నవయస్సులోనే తల్లిని కోల్పోయిన తిన్నడిని తండ్రి, తెగ నాయకుడు (శరత్ కుమార్) ప్రేమగా పెంచుతాడు. వేట ప్రధానంగా బ్రతికే ఈ తెగ అడవిలో ప్రశాంతమైన జీవనం గడుపుతుంటుంది. అయితే మంచి విలుకాడైన తిన్నడికి దేవుడిపై నమ్మకం ఉండదు. తన గూడెం వారందరూ పూజించే శివలింగాన్ని కేవలం ఒక రాయిలా భావిస్తుంటాడు. కానీ, ఆ తర్వాత జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో తిన్నడు శివ భక్తుడిగా మారతాడు. తిన్నడు భక్తుడిగా మారడానికి వాయు లింగం కారణమవుతుంది.

మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వాయులింగాన్ని మహదేవశాస్త్రి (మోహన్ బాబు) పరులకంట పడనీయకుండా రహస్యంగా పూజిస్తుంటాడు. ఆ వాయు లింగాన్ని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో ఏకంగా అక్కడున్న జనాన్ని, గూడాన్ని కూడా తగలబెట్టాలని అనుకుంటారు. దీంతో తన గూడెం వాళ్లని కాపాడుకునేందుకు తిన్నడు నడుం బిగిస్తాడు. ఈ క్రమంలో అతడు పెద్ద యుద్ధమే చేస్తాడు.

మరోవైపు నెమలి రాణి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు తిన్నడు. ఆమె శివుడి భక్తురాలు. ఈ నేపథ్యంలో అనాదిగా వస్తున్న ఒక ఆచారానికి తిన్నడు అడ్డుతగులుతాడు. అయితే దేవత మాట ధిక్కరించేవాడికి, పెద్దల మాటకి విలువ ఇవ్వనివాడికి ఈ గూడెంలో చోటు లేదంటూ నాథనాథుడు తిన్నడిని వెలివేస్తాడు. తిన్నడిని ప్రేమించిన నెమలి కూడా అయినవారందర్నీ వదిలి అతడిని అనుసరిస్తుంది.

ఈ క్రమంలో ఓ మహాశివరాత్రి పర్వదినాన భార్య నెమలితో గొడవ పడ్డ తిన్నడు, వేటకోసం అడవికి బయలుదేరతాడు. కానీ శివుడాజ్ఞ లేకపోవడంతో అతనికి వేట దొరకదు. ఈ నేపథ్యంలో అతడి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఒకటి జరుగుతుంది. తిన్నడికి పరిచయం అవుతాడు రుద్ర (ప్రభాస్). కొద్దిసేపు అతడి సహచర్యంలో తిన్నడి మనసు మారి మహా శివభక్తుడిగా మారతాడు.

అప్పటినుంచి శివుడికి (అక్షయ్ కుమార్) మహా భక్తుడు అవుతాడు తిన్నడు. అసలు రుద్ర ఏం చెప్పి తిన్నడి మనసు మారుస్తాడు?వాయు లింగం కోసం ఎందుకు అంత పోరాటం జరిగింది? ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు ఈ కథలో కిరాత (మోహన్ లాల్) పాత్ర ఏంటి? శివ లింగం కళ్ళ నుంచి రక్తం ఎందుకు కారుతుంది? దీనిని నివారించడానికి తిన్నడు ఏం చేశాడు? తిన్నడు చివరికి కన్నప్పగా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

తెలుగు సినిమా చరిత్రలో ‘భక్త కన్నప్ప’ సినిమాకి సుస్థిర స్థానం ఉంది. లెజెండరీ దర్శకుడు బాపు సారథ్యంలో, స్వీయ నిర్మాణంలో రూపొందించిన ఈ చిత్రంలో హీరోగా నటించారు ప్రముఖ దివంగత నటుడు కృష్ణంరాజు. వాణిశ్రీ హీరోయిన్‌గా.. ప్రముఖ నటుడు బాలయ్య శివుడిగా నటించారు. అలాగే రావు గోపాలరావు, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆరోజుల్లో హైయెస్ట్ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేయడమే కాకుండా కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది.

అలాంటి సినిమాని రీమేక్ చేయడం అంటే మాటలు కాదు. నటీనటుల దగ్గరనుంచీ సాంకేతిక నిపుణుల వరకూ ప్రతిదీ పాత సినిమాతో పోలిక వస్తుంది. అయితే నేటి తరం ప్రేక్షకులకు భక్త కన్నప్ప చిత్రం అంతగా తెలిసిఉండదు. ఇది ఒకందుకు ప్లస్ అవుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో విజువల్ పరంగా కూడా అప్పటి మూవీ కన్నా బెటర్ గానే తీయొచ్చు. అయితే దర్శకత్వం విషయమే కీలకం. ప్రజెంట్ జెనరేషన్ ఆడియెన్స్‌కి ఈ సినిమా రీచ్ అవ్వాలంటే అది దర్శకుడి చేతుల్లోనే ఉంటుంది. అందుకే విష్ణు దీనికోసం బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్‌ని ఎంచుకున్నాడు.

అయితే డైరెక్టర్ ముఖేష్ కుమార్ గురించి మన తెలుగువారికి అంతగా తెలియదు. కానీ భాగవతం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాల సీరియల్స్‌తో హిందీ జనాలకు ఆయన బాగా సుపరిచితమే. అందుకే విష్ణు తన కలల ప్రాజెక్ట్‌కి డైరెక్టర్‌గా ముఖేష్‌ని ఎంచుకున్నాడు. అయితే విష్ణు నమ్మకాన్ని ముఖేష్‌ నిలబెట్టుకున్నాడు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తన దర్శకత్వ ప్రతిభతో విజువల్ వండర్‌గా తెరకెక్కించి సినిమాకి భాషతో సంబంధం లేదని, హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కడైనా ఒక్కటేనని నిరూపించాడు ముఖేష్ కుమార్ సింగ్.

కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగే కథతో సినిమా ప్రారంభమవుతుంది. కథానాయకుడి పాత్ర పరిచయం, అతడి తెగ నివసించే ప్రాంతం, వారి జీవన విధానం, వారికి ఇతర తెగలతో నిరంతరం జరిగే ఆధిపత్య పోరాటం.. వంటివాటితో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఇలా ఫస్టాఫ్ మొత్తం గిరిజనులు చేసుకునే యుద్దాలు, తిన్నడు, నెమలి మధ్య ప్రేమ సన్నివేశాలతో ఉత్కంఠగా సాగుతుంది. ఇవన్నీ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతినిస్తాయి. ఇక సెకండాఫ్ నుంచి కథ ఒక్కసారిగా భక్తి వైపుకి టర్న్ తీసుకుంటుంది.

తిన్నడికి శివుడు గురించి అనుభవంలోకి రావడం, అప్పటివరకూ పోరాటయోధుడిగా కనిపించే అతడు భక్తుడిగా మారే సీన్స్ అద్భుతంగా చూపించారు. శివుడికి పూజలు చేయడం, నైవేద్యం సమర్పించడం వంటివి రంజింపజేస్తాయి. రుద్ర-తిన్నడు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు.. అలాగే శివుడు-తిన్నడు మధ్య సీన్స్ సినిమాకే హైలైట్. ఇక క్లైమాక్స్ ఎలాఉంటుందో ముందే తెలిసినా ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. ఆ సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 15 నిముషాలు ఆడియెన్స్ ఒక విధమైన ట్రాన్స్‌లో ఉండిపోతారు. చెమర్చిన కళ్ళతో, తృపి నిండిన మనస్సుతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విష్ణు మంచు గురించి. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు, ఎంతో ధైర్యంతో ఈ పాత్రను సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా ఆయనకు అభినందనలు చెప్పితీరాలి. కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన చేసినవాటికి ఈ పాత్రకు అస్సలు సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం. ఈ క్యారక్టర్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించడం అంటే కత్తి మీద సాము చేయడమే.

ట్రైబల్ గెటప్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ.. ఇలా వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫలితం తేడా కొట్టేస్తుంది. మరోవైపు విష్ణు ఏంటి? భక్తుడి క్యారక్టర్ ఏంటి? ఆయన ఈ పాత్ర చేయగలడా? కృష్ణంరాజు గారిని మ్యాచ్ చేయగలడా? అని అందరిలో సందేహాలు. అయితే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికి తాను వెండితెర రూపం ఇస్తానని విష్ణు గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆయన ప్రయత్నానికి ఆ పరమ శివుడి ఆమోదం కూడా లభించినట్టుంది. అందుకే అన్ని అవరోధాలను అధిగమించి ముందడుగు వేశాడు.

అయితే విష్ణు మొత్తానికి అనుకున్నది సాధించాడు. తిన్నడిగా ఆటవికుడి పాత్రలో అమాయకత్వం, వీరత్వం చూపాడు. అలాగే శివుడి గురించి తెలుసుకుని ఆయనకు భక్తుడిగా మారే క్రమంలో ఆయన నటన అద్భుతం. చివరకు తన కళ్ళను సైతం శివుడికి అర్పించి భక్త కన్నప్పగా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో విష్ణు జీవించేశాడు. ఆ పాత్రను అవగాహనా చేసుకుని అందులోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తాయి. కన్నప్ప ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక మిగతా పాత్రధారులలో ప్రభాస్‌ది ఇంపార్టెంట్ రోల్. ఉండేది కొద్దిసేపే అయినా ఆడియెన్స్‌ని అలరిస్తుంది. ఆయన ఉన్నంతసేపు థియేటర్ మొత్తం అభిమానుల ఈలలు, కేరింతలతో ఊగిపోతుందంటే అతిశయోక్తిలేదు. రుద్ర పాత్రలో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ అమేజింగ్. ఇక అక్షయ్ కుమార్ పరమ శివుడిగా సరికొత్తగా కనిపించాడు. దాదాపుగా కథ మొత్తం నడిచేది కన్నప్ప మరియు శివుడి పాత్రలతోనే. గరళకంఠుడిగా అక్షయ్ దైవికత ఉట్టిపడేలా అద్భుతంగా నటించాడు. ఆ పాత్రకు ఆయన పర్‌ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు.

మిగిలిన వారిలో పార్వతీదేవిగా కాజల్, కథానాయిక నెమలిగా ప్రీతి ముకుందన్ నటన బావుంది. అలాగే మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల పాత్రలు కీలకమైనవి. ఈ సీనియర్స్ తమ నటనానుభవాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి కామెడీ వర్కవుట్ అయింది. ఇక మంచు మూడోతరం వారసులు అరియానా, వివియానా, మాస్టర్ అవ్రామ్ తమ నటనతో మెప్పించారు. మిగిలినవారు వారి పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక సాంకేతికంగా చూస్తే, సినిమా చాలా బావుంది. టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. స్టీఫెన్ దేవస్సీ అందించిన మ్యూజిక్ సినిమాకి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా చాలా బావుంది. చాలా సన్నివేశాలను బీజీఎమ్ ఎలివేట్ చేసింది. ప్రధానంగా యాక్షన్ సీన్స్‌, అలాగే క్లైమాక్స్ లోని భావోద్వేగ సన్నివేశాలను స్టీఫెన్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో హృద్యంగా ఆవిష్కరించారు. ఇది ఆయనకు బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

అలాగే షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఇలాంటి సినిమా ఆడియెన్‌కి కనెక్ట్ కావాలంటే ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో షెల్డన్ చౌ మ్యాజిక్ చేశాడనే చెప్పొచ్చు. థియటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయేలా చేసి కన్నప్ప కాలానికి తీసుకెళ్లగలిగాడు. కొన్ని వందల ఏళ్లనాటి వాతారవరణం, ప్రకృతి అందాలను ఆయన కెమెరా చక్కగా ఒడిసిపట్టింది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉండి విజువల్స్ అద్భుతంగా వున్నాయి.

ఇక కన్నప్ప నిడివి ఎక్కువే వున్నా, ఆంథోనీ ర్‌మాత్రం తన ప్రతిభతో ఎక్కడా ఆ ఫీల్ కలుగకుండా చేశాడు. ఆయన ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా చేసింది. అలాగే నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు దీనిని సూపర్ క్వాలీటీతో సినిమాను నిర్మించారు. హీరోయే స్వయంగా నిర్మాత కావడంతో కథకి తగ్గట్టుగా ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతోంది. దాదాపు 85% సినిమా న్యూజిలాండ్‌లో చిత్రీకరించడం విశేషం. మొత్తానికి ఈ మూవీ టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు.

ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన కన్నప్ప చిత్రం వాటిని అందుకుందనే చెప్పొచ్చు. విష్ణు నటన, ప్రభాస్, అక్షయ్ కుమార్ పాత్రలు, స్టీఫెన్ సంగీతం, ముఖేష్ డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది డివోషనల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. దీనికితోడు డైరెక్టర్ తనదైన ట్రీట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి కన్నప్ప సినిమాతో విష్ణు మంచు చాలా రోజుల తర్వాత సరైన హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.