తెలుగునాట సుపరిచితమైన ఇంటిపేరు నందమూరి. ఇది వింటే ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలు ఆయనను ముద్దుగా ఎన్టీఆర్ అని పిలుచుకుంటుంటారు. అయితే ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా అద్భుతమైన ప్రతిభ చూపారు. అలాగే ఎన్నో పౌరాణిక, చారిత్రిక పాత్రలతో తెలుగు ప్రజల మదిలో దేవుడిగా కొలువుదీరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనని ఇంత పెద్ద స్టార్‌ని చేసిన తెలుగు ప్రజలకు తనవంతు బాధ్యతగా సేవ చేసుకుని ఎంతోకొంత రుణం తీర్చుకోవాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. దీనిలో భాగంగా ‘తెలుగుదేశం పార్టీ’ ని స్థాపించి కేవలం 9 నెలల కాలంలో అధికారం చేపట్టారు. అనంతరం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి నట వారసుడిగా ప్రేక్షకులముందుకొచ్చారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ.
నేడు బాలకృష్ణ 65వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆయన అభిమానులు, పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అనేకమంది నెటిజెన్లు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు ఆయనను ముద్దుగా ‘బాలయ్య బాబు’ అని పిలుచుకుంటుంటారనే విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణపై ‘తెలుగు ఫిల్మ్ నగర్’ స్పెషల్ స్టోరీ..
1974లో ‘తాతమ్మ కల’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసిన ఆయన ఇటీవలే చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. ఈ క్రమంలో 100కి పైగా సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. గత 50 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమ (టిఎఫ్‌ఐ)లో తన తండ్రి ఘన వారసత్వాన్ని అజేయంగా కొనసాగిస్తూ.. ఆరు పదుల వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు బాలకృష్ణ.
బాలకృష్ణ డైలాగ్స్ చెప్తుంటే ఫ్యాన్స్‌కి పూనకాలే. ఆయన తొడగొట్టాడంటే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు ఊగిపోతాయి. బాలయ్య రాజసంగా మీసం మెలేస్తే శూరత్వం తొణికిసలాడుతుంది. సినిమాలలో ఆయన దాదాపు అన్ని జానర్లలో నటించి మెప్పించారు. ఇక బాలయ్య మరే హీరోకూ సాధ్యంకాని రీతిలో అత్యధికంగా 17సార్లు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అలాగే ‘అధినాయకుడు’ సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఏకంగా 13 సినిమాలు చేయడం మరో విశేషం.
ఇక బాలకృష్ణ చేసిన చిత్రాలలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. వీటిలో.. ‘మంగమ్మ గారి మనవడు, ముద్దుల మామయ్య, ప్రెసిడెంటు గారి అబ్బాయి, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్, అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆయన చేసినవాటిలో ‘భైరవ ద్వీపం, ఆదిత్య 369, శ్రీరామ రాజ్యం’ చిత్రాలైతే ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇప్పటివరకూ 109 చిత్రాలలో నటించిన బాలయ్య ప్రస్తుతం 110వ సినిమా చేస్తున్నారు. తనకు ఇంతకుముందు హ్యాట్రిక్ హిట్స్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది ఈ చిత్రం. దీని తర్వాత ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. దీనితోపాటు తన ఆల్ టైమ్ హిట్ ‘ఆదిత్య 369’ కి సీక్వెల్‌గా స్వీయ దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ అనే ప్రాజెక్టును ఇప్పటికే అనౌన్స్ చేశారు.
ఇక బాలకృష్ణ మరోవైపు తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు తన మాతృమూర్తి పేరుమీద నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా బాలకృష్ణకు ఆయన అభిమానులు, పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అనేకమంది నెటిజెన్లు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
కాగా, సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా, సామాజికంగా ఆయన చేసిన సేవలకి గానూ కేంద్రప్రభుత్వం ఇటీవలే గొప్ప పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. అలాగే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు తొలి ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ని కూడా ప్రకటించింది. ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా బాలకృష్ణ దీనిని అందుకోనున్నారు. వీటితోపాటు తన సుదీర్ఘ 5 దశాబ్దాల కెరీర్‌లో బాలయ్య ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్నారు.
ఇక 65 ఏళ్ల వయస్సులోనూ ఫుల్ ఎనర్జీతో కనిపించే బాలయ్య బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనీ, మరిన్ని చిత్రాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను రంజింపజేయాలనీ, తన తండ్రి అడుగుజాడలలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడే కాదు, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనీ, ఇంకా ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలనీ ఆకాంక్షిస్తూ తెలుగు ఫిల్మ్ నగర్ తరపున బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.. జై బాలయ్య, జై జై బాలయ్య..
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: