నటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు
సంగీతం: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాణం: స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్
నిర్మాత: పృథ్వీ పొలవరపు
దర్శకత్వం: ధన్‌రాజ్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఒకవైపు చిన్నచిన్న వేషాలు వేస్తూనే తరువాత హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు.
తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా ‘రామం రాఘవం’ అనే సినిమా తెరకెక్కించాడు. ఇందులో ప్రముఖ తమిళ దర్శక,నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటించాడు. డిఫరెంట్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎనర్జిటిక్ హీరో రామ్ విడుదల చేసిన గ్లింప్స్ మరియు నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో రామం రాఘవం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? తన సహచరుడు వేణు యెల్దండి మొదటి చిత్రం (బలగం)తో సూపర్ హిట్ అందుకున్న మాదిరిగా ధనరాజ్ కూడా హిట్ కొట్టాడా? దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడా? ఇంతకూ రామం రాఘవం కథేంటి? అనే విషయాలు తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.
కథ:-
రామం (సముద్రఖని) నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి. భార్య కమల (వినోదిని), ఏకైక కుమారుడు రాఘవ (ధనరాజ్)తో కలిసి జీవిస్తుంటాడు. కొడుకుపై ఇష్టంతో ఈ దంపతులు చిన్నప్పటినుంచీ రాఘవను అల్లారు ముద్దుగా పెంచుతారు. దీంతో అతడు చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. మరోవైపు తండ్రి నిజాయితీని చేతకానితనంగా భావిస్తుంటాడు.
జీవితంలో స్థిరపడాలని తండ్రి పదేపదే పోరుతుండటంతో స్నేహితుడు అంజి (సత్య)తో కలిసి ఫుడ్ కోర్ట్ పెడతానంటూ తండ్రి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. అయితే ఆ డబ్బుని బిజినెస్ కోసం ఉపయోగించకుండా క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి మొత్తం పోగొట్టుకుంటాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిరోజులు పెట్రోల్ బంకులో పని చేస్తాడు.
కానీ తప్పుడు పద్ధతులకు అలవాటుపడిన రాఘవ డబ్బు కోసం అక్కడా ఫ్రాడ్ చేయడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతాడు. గత్యంతరం లేని స్థితిలో చివరకు తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తాడు. కొడుకు రోజు రోజుకు దిగజారిపోతున్నాడని గుర్తించినా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతారు రాఘవ తల్లిదండ్రులు.
అయితే ఏం చేసినా ఆర్ధిక కష్టాలనుంచి బయటపడలేకపోతున్న రాఘవ ఏకంగా తండ్రినే చంపడానికి దేవా (హరీశ్ ఉత్తమన్)తో కలిసి ప్లాన్ చేస్తాడు. ఈ అమానుష చర్యకి పథకం వేసిన రాఘవ దానిని అమలు చేయగలిగాడా? తండ్రినే హతమార్చాలని చూస్తున్న రాఘవ కుట్రకు దేవా సహకరించాడా? రాఘవలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదా? చివరికి ఏం జరిగింది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:-
రామం రాఘవం కథగా చూసుకుంటే.. కొత్తదేమీ కాదు. చెడు వ్యసనాలకు బానిసగా మారిన కొడుకు తండ్రిని హతమార్చాలనే పాయింట్ ఇంతకుముందు అనేక సినిమాల్లో చూసిందే. కాకపోతే అందుకోసం కొడుకు రకరకాల పథకాలు వేయడం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అలాగే తండ్రిని చంపాలనుకునే స్థాయికి కొడుకు ఎలా దిగజారిపోయాడు అనేదానిని బాగా చూపించగలిగారు.
మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు జీవితంలో గొప్పగా ఎదగాలని ఆశించే తండ్రి.. చివరికి అతడి పతనాన్ని చూడటం అనేది హృద్యంగా ఉంది. ఇంకోవైపు తన తప్పులు తెలుసుకోలేక, నాన్నే తనను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ కొడుకు పడే సంఘర్షణ నేపథ్యంలో భావోద్వేగాల సమాహారంగా రూపొందింది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో మరోసారి ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. సముద్రఖని కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే పాత్ర అని చెప్పొచ్చు. అలాగే ధనరాజ్ ఎంత చక్కగా హాస్యం పండిస్తాడో మనందరికీ తెలుసు. అయితే ఇందులో తను కొంచెం సీరియస్ టైప్ క్యారక్టర్ చేశాడు. మోక్ష, ప్రమోదిని పాత్రలకు కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
టెక్నికల్ విషయానికొస్తే.. అరుణ్ చిలువేరు అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గట్టుగా ఉంది. ఇలాంటి స్టోరీకి ఎలాంటి సంగీతం కావాలో అరుణ్ అదే చేసాడు. దుర్గా ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. అలాగే ఎడిటింగ్‌లో మార్తాండ్ కె వెంకటేష్ అనుభవం కనిపిస్తుంది. ఎప్పటిలాగే షార్ప్‌గా ఉంది. ఆయన ఇంకా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.
ఓవరాల్‌గా చూస్తే, రామం రాఘవం మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆడియెన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ మూవీతో దర్శకుడిగా ధనరాజ్ మంచి ప్రయత్నమే చేసాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది. ఈ చిత్రంతో ధనరాజ్ హిట్ అందుకున్నట్టే అని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: