నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్ నాథన్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాణం: హాస్య మూవీస్ బ్యానర్
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఇంతకూ ఈ బచ్చల మల్లి ఎవరు? బచ్చల మల్లిగా అల్లరి నరేష్ నటన ఎలా ఉంది? గత కొంతకాలంగా తన పంథా మార్చి సీరియస్ టైప్ క్యారెక్టర్స్ పోషిస్తున్న ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించారు? రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
కథ:-
కథానాయకుడైన బచ్చల మల్లి (అల్లరి నరేష్) ఆంధ్రప్రదేశ్ లోని తుని ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. తల్లి (రోహిణి) అంటే చాలా ప్రేమ. అయితే కుటుంబంలో కలతల వల్ల చిన్నప్పటినుంచే తండ్రి (బలగం జయరాం)పై ద్వేషం పెంచుకుంటాడు. దీంతో వ్యసనాలకు లోనవుతాడు. పెద్దయ్యాక కూడా తండ్రి పట్ల అదే కోపంతో ఉంటుంటాడు. మరోవైపు ఆ ఊరి ఎస్సై (రావు రమేష్ రావు) కూతురు కావేరి (అమృత అయ్యర్)తో ప్రేమలో పడతాడు.
కావేరిపై ఇష్టంతో అన్ని వ్యసనాలను వదిలేస్తాడు. కష్టపడి పనిచేస్తుంటాడు. అయితే తనలోని కోపం మాత్రం అప్పుడప్పుడూ బయటపడుతుంది. దీంతో ఊరిలో అనేక గొడవల్లో చిక్కుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఒకసారి అనుకోకుండా ఆ ఊరి పెద్ద (కాంతార అచ్యుత్)తో జరిగిన ఘర్షణ అతడి జీవితంలో పెనుమార్పులు తెస్తుంది.
అయితే తండ్రి అంటే బచ్చల మల్లికి ఎందుకు అంత కోపం? తండ్రి చేసిన తప్పేంటి? తన తమ్ముడి(అంకిత్ కొయ్య)తో అతడికి ఎలాంటి అనుబంధం ఉంది? కావేరితో పెళ్ళికి ఆమె తండ్రి పెట్టిన షరతులేంటి? అందుకోసం బచ్చల మల్లి ఏం చేశాడు? ఇంతకూ వారి ప్రేమ ఫలించి పెళ్ళిపీటల వరకూ వెళ్ళింది? ఊరి పెద్దతో ఘర్షణ చివరికి దేనికి దారితీసింది? ఇవన్నీ తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:-
2004లో కథ ప్రారంభం కాగా.. అనంతరం 1980, 90 దశకాల్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఈ మధ్య కాలాలను కథానుగుణంగా చూపించాడు దర్శకుడు సుబ్బు మంగాదేవి. ప్రతి వ్యక్తి తప్పులు చేస్తుంటాడు.. అయితే కొన్ని తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇతివృత్తమే ప్రధానంగా తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ప్రేరణతో కథ రాసుకున్న ఆయన దీనిని నిజాయితీగా తెరకెక్కించడానికి చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే.. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అల్లరి నరేష్. అయితే కెరీర్ ప్రారంభంలోనే ‘నేను’, ‘ప్రాణం’ సినిమాలతో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన ఆయన ఆ తరువాత ఎక్కువగా హాస్యప్రధాన చిత్రాలలోనే నటించారు. ఇక గత కొంతకాలంగా తన పంథా మార్చుకున్నారు నరేష్. ‘నాంది, ఉగ్రం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌లో నటించి మెప్పించారు. ఇదేకోవలో ఇప్పుడు ఈ సినిమా చేశారు.
బచ్చల మల్లి పాత్రలో నరేష్ ఒదిగిపోయారు. వ్యసనాలకు అలవాటుపడి, బాధ్యత లేకుండా అల్లరిచిల్లరగా తిరిగే పల్లెటూరి యువకుడిగా ఆయన నటన అద్భుతం. కంప్లీట్ రస్టిక్‌గా ఉండే క్యారక్టర్‌ను అల్లరి నరేష్ అలవోకగా చేశారు. అలాగే అమృత అయ్యర్ ‘హనుమాన్’ తర్వాత మరోసారి గుర్తుండిపోయే పాత్రలో నటించింది. ఆమెకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది.
మిగిలిన నటీనటులలో రావు రమేష్, కాంతార అచ్యుత్, బలగం జయరాం ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ పోషించారు. ముఖ్యంగా జయరాంకు బలగం తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో మంచి పాత్ర లభించిందని చెప్పొచ్చు. అలాగే సీనియర్ నటి రోహిణి, యువ నటుడు అంకిత్ కొయ్య నిడివి తక్కువ ఉన్నా కీలక పాత్రల్లో నటించారు. అలాగే హర్ష చెముడు ఒక చిన్న పాత్రలో మెరిశాడు. ఇతర నటులు వారి పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.
ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కేవలం పాటల్లోనే కాకుండా యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. దీనికి రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ అదనపు బలమైంది. విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇక ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమాపై నుంచి ఆడియెన్స్ దృష్టిని డైవర్ట్ చేయనీయలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతోంది.
బచ్చల మల్లి సినిమా కేవలం మాస్ ప్రేక్షకులనే కాకుండా కథలోని ఎమోషన్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేలావుంది. ఓవరాల్‌గా అన్ని వర్గాలవారిని అలరించేలావుందని చెప్పొచ్చు. మొత్తానికి అల్లరి నరేష్ ఖాతాలో మంచి హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఈ బచ్చల మల్లి ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా, మరియు పాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్‌ను అన్ని తరహా పాత్రలను పోషించే దమ్మున్న నటుడిగా ప్రేక్షకులు కూడా గుర్తిస్తారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: