దక్షిణ భారతానికి చెందిన జాతీయ ఉత్తమ నటి పద్మభూషణ్ వహిదా రెహ్మాన్

ఈ రోజున ఏ తెలుగు సినిమా చూసినా ఉత్తరాది భామల ఆధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ఉత్తరాదిని ఏలిన అగ్ర కథానాయికలు అందరూ దక్షిణాదికి చెందిన వారే కావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆలిండియా బ్యూటీ క్వీన్ హేమమాలిని, రేఖ, శ్రీదేవి, జయప్రద వంటి దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్ ను శాసించారన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అలా ఉత్తరాదిని ఊపేసిన దక్షిణాది కథానాయికల్లో వైజయంతిమాల తరువాత స్థానం వహిదా రెహ్మాన్ దే అని చెప్పుకోవాలి. దక్షిణాదికి చెందిన ఒక హీరోయిన్ కు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కటం ఒక అరుదైన విజయ విశేషం. బాలీవుడ్ ను విశేషంగా ప్రభావితం చేసిన ఆనాటి హీరోయిన్స్ లో ఒకరైన వహీదా రెహమాన్ జన్మదినం ఈ రోజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

1938 ఫిబ్రవరి 3వ తేదీన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చెంగల్పట్టు లో జన్మించారు వహీదా రెహమాన్. అయితే వహీదా రెహమాన్ తెలుగు అమ్మాయా… తమిళ అమ్మాయా అనే మీమాంస చాలా మందిలో ఉంది. నిజానికి ఆమె పుట్టింది తమిళనాడుకు చెందిన ముస్లిం కుటుంబంలోనే అయినప్పటికీ పెరిగింది, చదివింది, నృత్య ప్రదర్శనలు ఇచ్చింది, నాటకాలు ఆడింది తెలుగులోనే. ఆమె తండ్రి మొహమ్మద్ అబ్దుల్ రహమాన్ విశాఖపట్నం, విజయవాడ తదితర పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. వహిదా రెహ్మాన్ చదివింది విశాఖపట్టణం సెంట్ ఆన్స్ కాన్వెంట్లో. అయితే చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో డాక్టర్ కావాలి అన్న తన ఆశయాన్ని వదులుకొని నాటక రంగ ప్రవేశం చేసింది వహీదా రెహమాన్.1956లో వచ్చిన ” రోజులు మారాయి” సినిమాలో” ఏరువాక సాగారోరన్నో చిన్నన్న” పాటతో విశేషమైన పాపులారిటీని సాధించిన వహిదా రెహ్మాన్ ను ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ హిందీ దర్శక నిర్మాత గురుదత్ చూడటం తటస్థించింది. వెంటనే ఆమెను బాలీవుడ్ కి తీసుకువెళ్లి తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇచ్చారు.1957 లో విడుదలైన “ప్యాసా” చిత్రంతో వహీదా రెహమాన్ వైభవం ప్రారంభమైంది. వరుసగా కాగజ్ కా పూల్,చౌద్విన్ కా చాంద్,గైడ్,నీల్కమల్, రామ్ ఔర్ శ్యామ్, కామోషి చిత్రాలతో అగ్రశ్రేణి కథానాయికగా ఎదగడమే కాకుండా బాలీవుడ్ లో థర్డ్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది వహిదా రెహ్మాన్. అలా 1955 నుండి 75 వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు టాప్ ర్యాంక్ హీరోయిన్ గా వెలిగిన వహీదా రెహమాన్ కు ప్రేక్షకుల రివార్డుల తో పాటు అవార్డులు కూడా ఘనంగా దక్కాయి. గైడ్, నీల్ కమల్ చిత్రాలకు గాను ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న వహిదా రెహ్మాన్ తర్వాతి కాలంలో ఫిలిం ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా దక్కించుకున్నారు.1971 లో ” రేష్మ అవుర్ షేరా” చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న వహిదా రెహ్మాన్ ను 2011లో మూడవ అత్యున్నత భారత పౌర పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.

[custom_ad]

ఇక తెలుగు సినిమాతో వహీదా రెహ్మాన్ అనుబంధం గురించి చెప్పాలంటే ఆమె తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగు వారందరి అభిమానానికి పాత్రులయ్యారు. ఆమె యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది “రోజులు మారాయి” చిత్రంతో కాగా ఆ వెంటనే “జయ సింహ” సినిమా లో కూడా ఆమె ఒక పాటలో కనిపిస్తారు. ఆ తర్వాత హిందీ ఫీల్డ్ కు వెళ్లి టాప్ హీరోయిన్ గా ఎదగటం తో తెలుగులో చేసే అవకాశం రాలేదు. అయితే 1974లో అనూహ్యంగా బంగారు కలలు చిత్రంలో నటించారు వహిదా రెహ్మాన్.

అదెలా జరిగిందంటే….

అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన దుక్కిపాటి మధుసూదనరావుకు అనుకోకుండా మద్రాసు ఎయిర్పోర్టులో తారసపడ్డారు వహిదా రెహ్మాన్. వారిద్దరికీ పూర్వ పరిచయం ఉంది.1951లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు తెనాలి లో నిర్వహించిన పరిషత్తు నాటకాలలో ఒక డాన్స్ ప్రోగ్రాం చేసినప్పుడు బాలనటిగా ఆమెను చూశారు మధుసూదనరావు. ఆంధ్ర నాటక కళా పరిషత్తుతో దుక్కిపాటి మధుసూదన రావుకు విశేషమైన అనుబంధం ఉంది. అప్పట్లో విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఆమె తండ్రి కూడా మధుసూదన్ రావుకు బాగా తెలుసు. పలకరింపులు అయ్యాక తను వివాహం చేసుకోబోతున్నట్లుగా చెప్పారు వహీదా రెహమాన్. అయితే పెళ్లికి ముందు ఒక తెలుగు సినిమా చేయొచ్చు కదా అన్నారు మధుసూదన రావు. వై నాట్… తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించినదాన్ని మీరు చెయ్యమంటే చేయనా ? అన్నారు వహిదా రెహ్మాన్. అప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తను నిర్మిస్తున్న “బంగారు కలలు” చిత్రంలో హీరోయిన్ గా వహిదా రెహ్మాన్ ను ఖరారు చేసుకున్నారు దుక్కిపాటి మధుసూదనరావు. అయితే అందులో చెల్లెలు వేషానికి బుక్ అయిన లక్ష్మి అంతకుముందే సినిమాలో అలాంటి ఒక వేషం వేసి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను హీరోయిన్ గా మార్చి వహిదా రెహ్మాన్ తో చెల్లెలు వేషం వేయించవలసి వచ్చింది. ఈ విషయం వహిదా రెహ్మాన్ కు చెప్పటానికి మధుసూదనరావు చాలా ఇబ్బంది పడ్డారు. చివరకు ఎలాగో ఆమెకు విషయం చెప్పగా “నేను ఆర్టిస్ట్ ను … నేను చేసే పాత్ర మంచిదై ఉండాలి కానీ అది చెల్లెలు పాత్రా ? హీరోయిన్ క్యారెక్టరా ? అన్నది ముఖ్యం కాదు… అంటూ ఆ పాత్రను స్వాగతించారు వహిదా రెహ్మాన్. ఇక ఆ షూటింగ్ లో వహీదా రెహమాన్ చూపించిన నిరాడంబరతను గురించి దుక్కిపాటి మధుసూదనరావు చాలా గొప్పగా చెప్పేవారు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ ను పంపించడం భావ్యం కాదని భావించిన మధుసూదనరావు స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లారట. బాగా మందీ మార్బలంతో ఐదారు మంది అసిస్టెంట్స్ ను వెంటబెట్టుకొని వస్తారెమో అనుకొని ఎదురుచూస్తున్న మధుసూదన రావుకు ఒకే ఒక అసిస్టెంట్ కం హెయిర్ డ్రెస్సర్ తో వచ్చిన వహిదా రెహ్మాన్ ను చూసి ఆశ్చర్యమేసిందట. అంతేకాకుండా తన పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్ మొత్తం తానే తెచ్చుకున్నారట. ఆమె స్టేటస్ కు తగినట్లుగా ఉంటుందని రిడ్జ్ హోటల్ లో రూమ్ బుక్ చేయగా” ఉదయం షూటింగ్ కు వెళ్లి రాత్రికి వస్తాము… కేవలం రాత్రి పడుకునేందుకు అంత ఖర్చు పెట్టి స్టార్ హోటల్ లో రూమ్ ఎందుకు? సరదాగా నేను కూడా అందరితో పాటే సారథి స్టూడియోలోనే ఉంటాను.. అన్నారట. అప్పుడు సారథి స్టూడియోలో రూమ్స్ ఖాళీ లేకపోవడంతో ఆమెను ఎలాగో ఒప్పించి దగ్గర్లో ఉన్న బ్లూ మూన్ హోటల్ లో బస ఏర్పాటు చేశారట మధుసూదనరావు. one of the top heroins of Indian screen అయిన వహీదా రెహమాన్ అంత సింపుల్ గా, డౌన్ టు ఎర్త్ గా ఉండటం చూసి మధుసూదన రావుకు చాలా ఆశ్చర్యమేసిందట.
నిజానికి తెలుగులో వహీదా రెహమాన్ ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన సినిమా “బంగారు కలలు” ఒక్కటే. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో “సింహాసనం” చిత్రంలో రాజమాతగా నటించారు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు 2006లో సిద్ధార్థ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించిన “చుక్కల్లో చంద్రుడు” చిత్రంలో గ్రాండ్ మదర్ గా నటించారు. ఇటీవల కమల హాసన్ హీరోగా రూపొందిన విశ్వరూపం 2 తర్వాత ఏ చిత్రంలోనూ కల్పించలేదు. ప్రస్తుతం “డెసర్ట్ డాల్ఫిన్” అనే హిందీ ఇంగ్లీష్ భాషల బైలింగ్వల్ చిత్రంలో నటిస్తున్నారు వహిదా రెహ్మాన్. ప్రస్తుతం ముంబై బాంద్రాలోని తన ఓషన్ వ్యూ బంగ్లాలో నివసిస్తున్న వహీదా రెహమాన్ ఆస్తుల విలువ దాదాపు 126 కోట్లు గా అంచనా వేయబడింది. సంపాదనే లక్ష్యంగా కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న గొప్ప ఔదార్య వాదిగా కూడా గుర్తింపు పొందారు వహిదా రెహ్మాన్.

[custom_ad]

తన ఏడు దశాబ్దాల నట జీవితంలో హిందీ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో 200కు పైగా చిత్రాలలో నటించి భారతదేశపు ఉన్నత శ్రేణి నటీమణుల్లో ఒకరుగా వెలుగొందుతున్న వహీదా రెహమాన్ కు తన పక్షాన, తన పాఠకుల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు పలుకుతుంది
‘ ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం’.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =