మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల స్ఫూర్తిదాయక ప్రస్థాన విశేషాల ప్రత్యేక కథనం

#HBDChiranjeevi, #HBDMegastarChiranjeevi, Birthday Wishes to Megastar Chiranjeevi, Happy Birthday Megastar Chiranjeevi, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Telugu FilmNagar Wishes Chiranjeevi A Very Happy Birthday, The Successful Journey of Megastar Chiranjeevi in Tollywood, Tollywood Cinema Updates
ఆగస్టు 22…కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వాడుకగా జరుగుతున్న వేడుక మెగాస్టార్ చిరంజీవి జన్మదినం.
ఈ సందర్భంగా మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది… ప్రసారం చేస్తుంది. అయితే ఎన్నిసార్లు ఎన్ని కోణాలలో విశ్లేషించినా ఇంకెన్నో స్ఫూర్తిదాయక విశేషాల” మిగులు సబ్జెక్ట్” చిరంజీవి కెరీర్ లో కనిపిస్తుంది. పునరావృతమే అయినప్పటికీ చదివిన ప్రతిసారీ  హృదయాలను పులకింప చేసే స్ఫూర్తి కథకు పునరావృత దోషం అంటదు. అందుకే ఇండియన్ ఫిలిం హిస్టరీలో” వన్ అఫ్ ద వెరీ ఫ్యూ ఇన్క్రెడిబుల్ మ్యాట్నీ ఐడాల్స్” లో ఒకరిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి  జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ
“దతెలుగుఫిలింనగర్ డాట్ కాం” అందిస్తున్న అక్షర అభినందన ఇది.
“ఎగాదిగా మెగాస్టార్
జగత్ చిరంజీవి
బాక్సాఫీస్ నిర్మాతల
బంగారపు దీవిఎంత గొప్ప వారికైన
తప్పవు చిరు ఫ్లాపులు
చిటికె వేసి లేప గలడు
తిరిగి సుమా టాపులు” -ఇది సుప్రసిద్ధ రచయిత దేవి ప్రియ Mid 90’s లో మెగాస్టార్ చిరంజీవి మీద రాసిన ఒక రన్నింగ్ కామెంటరీ. ” హిట్లర్” సినిమాకు ముందు కొన్ని వరుస పరాజయాలు ఎదురైన నేపథ్యంలో దేవీప్రియ రాసిన ఈ రన్నింగ్ కామెంటరీ లోని ” చిటిక వేసి లేప గలడు తిరిగి సుమా టాపులు” అన్న అభినందనను అక్షర సత్యం చేస్తూ” హిట్లర్” తో మరొక ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి ఆ విజయ పరంపరను నేటికీ అదే స్థాయిలో కొనసాగిస్తూ 41 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని సుసంపన్నం చేసుకోవటం అభినందనీయం. రిలీజ్ దృష్ట్యా 1978లో తొలి చిత్రంగా విడుదలైన” ప్రాణం ఖరీదు” మొదలుకొని రానున్న అక్టోబర్ 2న విడుదల కానున్న” సైరా” వరకునలుదిశలుగా వికసించి, విస్తరించి, విజృంభించి విశ్వవ్యాప్తమైన చిరంజీవి సినీ జీవిత ప్రస్థానాన్ని నాలుగు భాగాలుగా, నాలుగు దశలుగా వర్గీకరించవచ్చు.తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’  నుండి 62 వ చిత్రం’ఖైదీ’వరకు ఒక దశ, ఖైదీ నుండి ‘హిట్లర్’ వరకు రెండవ దశ, హిట్లర్ నుండి’ శంకర్ దాదా జిందాబాద్’ వరకు మూడవ దశ శంకర్దాదా జిందాబాద్ నుండి ‘సైరా’ వరకు నాలుగవ దశగా వర్గీకరించవచ్చు.నలబదేళ్ల పైబడిన ఈ నాలుగు దశల కెరీర్లో ఒక్కో దశలో చిరంజీవి అత్యంత ప్రజాదరణ పొందిన ఆరాధ్య తారగా ఎదిగిన వైనంలో ఎన్నెన్నో స్ఫూర్తిదాయక  లక్షణాలు, లక్ష్యాలు, కార్యసాధన, కార్యదక్షత కనిపిస్తాయి. కొణిదెల శివశంకర ప్రసాద్ అనే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా, అందనివాడుగా, అందరివాడుగా ఎదిగిన పరిణామక్రమాన్ని పరిశీలిస్తే ” గ్రేట్ మెన్ ఆర్ నాట్ బోర్న్… బట్ మేడ్”- అన్నది ఎంత అక్షర సత్యమో అర్థమవుతుంది.

ఉనికి కోసం పోరాటం –

ప్రాణం ఖరీదు నుండి ఖైదీ దాకా సాగిన చిరంజీవి ప్రస్థానంలోని తొలి దశను పరిశీలిస్తే అవకాశాల వేటలో ఎదురైన ఆశ నిరాశలు, ఒడిదుడుకులు, ఆరాటం, పోరాటం, అద్భుత విజయాలు, అనూహ్య పరాజయాలు వంటి ” స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టన్స్” కనిపిస్తుంది.
ఆ దశలో నేనెవరు?
నేనేమిటి?
నేనెక్కడ?
నా ముందు ఎవరు?
నా వెనక ఎవరు?
నా మెరిట్స్ ఏమిటి ?
నా డీ మెరిట్స్ ఏమిటి?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా అనే ఈ గ్లామర్ ప్రపంచంలో నిలబడాలి, నిలదొక్కుకోవాలి … విజయబావుటా ఎగురవేయాలి అంటే ఏం చేయాలి?
ఎవరితో ఎలా మసలాలి?
ఎవరితో ఎంతలో ఉండాలి?
ఎవరిని ఎంతలో ఉంచాలి?
ఎంత కష్టపడాలి?
ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి?
వంటి ఆలోచనలు- వాటి ఆచరణయే మార్గంగా సాగింది చిరంజీవి తొలి దశ. అయితే పైన చెప్పినట్లుగా సాగిన అంతర్మథనంలో ఏ ప్రశ్నకు చిరంజీవి దగ్గర సమాధానం లేదు.

నేనెవరు? అంటే ‘జీరో’ అన్నదే సమాధానం…
నేనేమిటి? అంటే’ ఒకానొక వర్ధమాన నటుడు’…
నేనెక్కడ? అంటే’ ఎక్కడో అడుగున…
నా ముందు ఎవరు? అంటే
‘ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు, రంగనాథ్, శ్రీధర్… ఇంకెందరో.
నా వెనుక ఎవరు అంటే- నా ‘నీడ’ అన్నదే సమాధానం.

ఇలాంటి స్థితి నుండి’ ఖైదీ’ దాకా ఎగ్జిస్టన్స్ కోసం చేసిన  పోరాటంలో చిరంజీవి ప్రదర్శించిన సహన, సంయమన, సామర్థ్య, సాహస,చాతుర్యాలు  సత్ఫలితాలను ఇచ్చి ఆయన్ను ఒక ప్రామిసింగ్ స్టార్ గా నిలబెట్టాయి. అలా తొలిదశలో ఒక్కొక్క మెట్టుగా ఎదిగిన చిరంజీవి పరిణామక్రమాన్ని ఇప్పుడున్న యంగ్ హీరోలలో ఎంతమంది అనుసరిస్తున్నారు అని తులనాత్మకంగా పరిశీలిస్తే వీళ్ళ పట్ల జాలి, కోపం, ఆవేదన కలుగుతాయి. మా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని మాటల్లో చెప్పడమే తప్ప పని పట్ల ఆయన సిన్సియారిటీని, డెడికేషన్ ను అలవరచుకుని ఆచరించే వాళ్ళు తక్కువ. వరుసగా రెండు విజయాలు వస్తే భూమి మీద నిలవని ‘అతివిశ్వాసం’ రెండు మూడు ప్లాపులు వస్తే భూమి కంపించిపోయేంత ఆత్మన్యూనత తప్ప ఆత్మవిశ్వాస ప్రపూరితంగా  ముందుకు సాగే విజ్ఞత కొరవడిన నేటి జనరేషన్ కు చిరంజీవి ప్రస్థానంలోని తొలి దశయే ఒక పాఠ్యాంశంగా నిలుస్తుంది. ఎవరో చెక్కితే గానీ శిల శిల్పం గా మారదు. దర్శక నిర్మాతలు, రచయితలు అనే శిల్పులు ఎంత చెక్కినా కొన్ని శిలలు శిలలు గానే మిగిలిపోతాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తమను తాము శిల్పాలుగా మలుచుకుంటారు … చరిత్రలో నిలిచిపోతారు.

అలా తొలిదశలో తనను తాను చెక్కుకున్న చెక్కుచెదరని శిల్పమే చిరంజీవి.

నిప్పులు చిమ్ముకుంటూ….

ఇక   ‘ఖైదీ’నుండి ప్రారంభమైన  రెండవ దశను  విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన అగ్ని క్షిపణి లోని వేడి- వాడి- వేగం- తేజం చిరంజీవిలో కనిపించాయన్నది అప్పటి దర్శక నిర్మాతలు, 24 శాఖల టెక్నీషియన్స్ ముక్తకంఠంతో చెప్పిన వాస్తవం. కళ్ళు మిరిమిట్లు గొలిపే చిరంజీవి వేగానికి తెలుగు సినిమా గమనగతి మారిపోయింది. కొత్త దారులు, కొత్త పుంతలు, కొత్త పంధాలు, కొత్త పోకడలతో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త శకం ఆవిష్కృతమైంది. సీనియర్ హీరోలు పశ్చిమాద్రికి చేరువవుతుంటే నెక్స్ట్ జనరేషన్ కు వారధిగా, సారధిగా నిలిచేవాడు ఎవరైనా ఒక్కడు కావాలి.. రావాలి అనుకుంటున్న తరుణంలో  he came.. he saw and he conquered అన్నట్లు అలెగ్జాండ్రియన్  స్పిరిట్ తో వచ్చిన చిరంజీవికి యావదాంధ్ర దేశం జేజేల స్వాగతం పలికిన ఆ స్వర్ణ సంధి సమయాన్ని తెలుగు సినీ ధరిత్రీ, సినీ చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేవు. తన చిరుత కళ్ళ నటనతో, ఎలక్ట్రిఫయింగ్  డాన్స్ తో, డాజిలింగ్ ఫైట్స్ తో , డైనమిక్ మూమెంట్స్ తో రాజమండ్రి ప్యాసింజర్ రైలులా  పరిగెడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమను రాజధాని ఎక్స్ప్రెస్ లాగా ఉరకలెత్తించిన చిరంజీవి చిత్తరువు ప్రతి తెలుగు వాడి గుండెల్లో ఆముద్రితమైంది.  చిరంజీవి పేరు చెప్తే చాలు యావదాంధ్ర యువత ఉర్రూతలూగి పోయిన ఆనాటి  స్వర్ణయుగ ఆస్వాదన, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ  అపురూపంగా అనిపిస్తుంటాయి. ఆ అద్భుత విజయాల ప్రవాహ ఉదృతి నుండి ఎన్ని రికార్డులు, ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు, ఎన్ని ప్రశంసలు ,ఎంతటి కితాబులు ఉద్భవించాయో.

బాక్సాఫీస్ రికార్డులు, అశేష జనవాహిని రివార్డులతో పాటు ‘ ఇండియా టుడే’ వంటి నేషనల్ మేగజైన్ “Bigger than BACHAN” అనే headline తో రాసిన కవర్ స్టోరీ చూసి  యావద్భారత చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షేక్ అయిన సందర్భం గుర్తుకొస్తే ఇప్పటికి మనసు పులకిస్తుంది. దక్షిణ భారతానికి సంబంధించిన ఒక  రీజనల్ స్టార్ సాధించిన ఆ స్థాన విశిష్టతను చూసి ప్రతి తెలుగు వాడి గుండె ఉప్పొంగింది. తొలిసారిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1కోటి 25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి స్టార్ గా  చరిత్ర సృష్టించిన చిరంజీవిని హైయెస్ట్ టాక్స్ పేయర్ గా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సన్మానించడం గొప్ప గౌరవం. అలాగే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వంటి జాతీయ పత్రిక రాసిన ఇంట్రో లో చిరంజీవిని” ద న్యూ మనీ మిషన్” అని అభివర్ణించడం ఒక మరపురాని అనుభూతి. ఇలా ఎన్నెన్నో అఖండ విజయాలు, అద్భుత ప్రశంసలతో సాగిన చిరంజీవి ప్రస్థానంలోని రెండవ దశ వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకే  ఒక చారిత్రాత్మక పరిణామ దశగా చెప్పుకోవాలి. స్లాబ్ సిస్టం ప్రవేశపెట్టబడిన తరువాత ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో చెప్పటానికి చిరంజీవి ‘ఖైదీ’ తొలి ఉదాహరణగా నిలిస్తే… 10 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది ‘ఘరానా మొగుడు’.

ఇలా రెండవ దశలో అప్రతిహతంగా సాగుతున్న చిరంజీవి విజయ విజృంభణకు  కొన్ని సినిమాలు బ్రేక్ వేశాయి. అభిమానం హిమాలయాల ఎత్తులకు పెరిగిపోయి అంచనాలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో కొన్ని సినిమాలు అనూహ్యంగా పరాజయాన్ని చవిచూశాయి.మెగాస్టార్ గా తన మీద ఉన్న నమ్మకం, తన పేరు మీద జరుగుతున్న వ్యాపారం, తన మీద పెరుగుతున్న అంచనాల స్థాయిని నిలబెట్టుకోవాలంటే కథల విషయంలో  కొంచెం నిలబడి ఆలోచించుకోవాలి. అందుకే ఒక ‘బ్రీత్ టేకింగ్ గ్యాప్’ తీసుకోవటం అనివార్యమని భావించారు చిరంజీవి. అదే అయన 40 ఏళ్ల కెరీర్లో తొలి గ్యాప్.

చిరంజీవికి బ్రేక్ ఏంటి? ఆయన నెలల తరబడి ముఖానికి రంగేసుకోకుండా ఖాళీగా ఉండటం ఏమిటి? అని ఆశ్చర్యపోయింది ఫిలిం ట్రేడ్. తనకున్న అపారమైన డిమాండ్ ను , క్రేజ్ ను, బిజినెస్ ను పక్కన పెట్టి అంచనాలకు తగిన అద్భుత విజయాన్ని ఇవ్వాలి అన్న అంతర్మధనం నుండి పుట్టిన తొలి విజయమే’ హిట్లర్’. మరలా అక్కడి నుండి అందుకున్న విజయపరంపరలో మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, అన్నయ్య, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్ వంటి హిట్స్ ఉన్నాయి. మధ్యలో ఒకటి అరా ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ హిట్లర్ తరువాత ప్రారంభమైన మూడవ దశలో చిరంజీవి చేసిన సినిమాలలో కథాపరంగా, పాత్రల పరంగా, సామాజిక బాధ్యత పరంగా గొప్ప సినిమాలు ఉన్నాయి.

హిస్టారికల్ హిట్ తో కం బ్యాక్

ఇక తన 4 దశాబ్దాల ప్రస్థానంలోని చివరిదైన నాలుగవ దశలో సినీ రాజకీయ రంగాల మిశ్రమ ప్రయాణం కనిపిస్తుంది.2007లో విడుదలైన ‘శంకర్ దాదా జిందాబాద్’ తరువాత రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో అప్రతిహతంగా సాగిన చిరంజీవి మూడు దశాబ్దాల సినీ ప్రస్థానానికి లాంగ్ బ్రేక్ పడింది. అయితే రాజకీయ రంగ ప్రవేశ ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావటంతో చిరంజీవి పొలిటికల్ కెరీర్ 9 సంవత్సరాలకే పరిమితమైంది. మరలా అభిమానుల అభీష్టం మేరకు తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల గ్యాప్ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ అనే టైటిల్ తో ‘The Boss is Back’ అనే ట్యాగ్ లైన్ తో చిరంజీవి పునః విజృంభన ప్రారంభమైంది. తొమ్మిది సంవత్సరాల విరామం తరువాత మరలా  హీరోగా రీఎంట్రీ ఇచ్చి 150 కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని సాధించిన వన్ అండ్ ఓన్లీ ‘కం బ్యాక్ హీరో’గా చరిత్ర సృష్టించారు చిరంజీవి. ఇక ఇప్పుడు 151వ సినిమాగా రానున్న ‘సైరా’ పాత్రపరంగా, చరిత్రపరంగా, నిర్మాణపరంగా, ప్రతిష్ట పరంగా ఒక చారిత్రక విజయాన్ని అందిస్తుండటంలో సందేహం లేదు.

ఇది మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల అప్రతిహత విజయాల అద్భుత విజయగాథ. విజయాలు సాధించడమే కాదు… అవి సాధించ బడిన విధానాలు కూడా ఆచరణ యోగ్యంగా, ఆదర్శప్రాయంగా ఉండాలి అంటారు. అలాంటి ఆదర్శప్రాయమైన చిరంజీవి నాలుగు పదుల ప్రయాణమే యువతకు ఒక అధ్యయన గ్రంథంగా ఉపకరిస్తుంది.

” స్ఫూర్తిదాయకమైనదే నిజమైన కీర్తి” అన్నది నిజమైతే చిరంజీవి విజయ విహార విశేషాల ప్రస్థానమే భావితరాలకు ఒక పాఠ్యాంశంగా చరిత్రలో నిలుస్తుంది. అందుకే ఆయన నాలుగు దశాబ్దాల అలుపెరుగని ప్రస్థానానికి  ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం” చేస్తున్న ఈ అక్షర సన్మానం సరితూగుతుందేమో చూడండి.

నిన్న మొన్న లాగున్నది
తొలి అడుగుల సవ్వడి
కనుల ముందు కదులుతోంది
నలబదేళ్ల అలజడి

అర పాత్రల చిరు పాత్రల
తొలి రోజుల వేగము
ఇంతింగ వటుడింతగ
ఎదిగి నట్టి తేజము

కసి నిండిన కన్నులలో
కనిపించిన కళలెన్నో
ఆశయాల పయనంలో
నెరవేరిన కలలెన్నో

అవకాశమె ముద్దంటే
ఆకాశమె హద్దంట
అభినయంలో దిట్టంట
అభిజాత్యం సున్నంట

కొణిదెలింటి కుర్రాడితో
అల్లు వారు వియ్యమంద
శుభలేఖలు పంచిపెట్టి
సురేఖల చేయి పట్టి

విధ్వంసక విజయాలతో
బాక్సాఫీస్ బద్దలంట
విజృంభణ తీరు చూసి
మతులు గతులు తప్పెనంట

డాన్సుల్లో మెరుపులు
ఫైటుల్లో ఉరుములు
ఆంగికాన విరుపులు
అభినయాన వెలుగులు

జనమంతా మెచ్చగా
జగమంతా తానుగా
ఎదిగినట్టి కీర్తి అతను
ఎందరికో స్ఫూర్తి అతను

మెగాస్టార్ బిరుదాంకిత
మేనమామ ఇంటింటా
పసిపాపలనలరించే
చందమామ తీరంట

అభిమానుల గుండెల్లో
లైఫ్ టైమ్ జైలు
ఈ జీవితాంత ఖైదీకిక
దొరకదంట బైలు

వెన్నుతట్టి ప్రోత్సహింప
వెనుక ముందు లేరెవ్వరు
స్వయంకృషితో సాగించెను
నాల్గు పదుల పోరు

కోట్లాది అభిమానుల
కేరింతల హోరు
150 అయ్యాకిక
పెరిగిందట జోరు

నవరసాల సమ్మిళితం
నలబదేళ్ల ప్రస్థానం
చిత్రసీమ చరితలోన
స్వర్ణాక్షర లిఖితార్హం

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =