గొడవలేమీ జరగలేదు గానీ .. మా పెళ్లి ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.. శ్రీమతి విజయ నిర్మల

2019 Latest Telugu Movie News, Actress Vijaya Nirmala movies, Actress Vijaya Nirmala professional life story, Telugu Film Udates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijaya Nirmala Biography Part 3, Vijaya Nirmala life story, Vijaya Nirmala real life story
Vijaya Nirmala Biography - Part 3

* అప్పట్లో మీ పెళ్లి చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది కదా…
మీ కుటుంబాలలో ఏవైనా అభ్యంతరాలు ఎదురయ్యాయా..? గొడవలు జరిగాయా ?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయనిర్మల: అభ్యంతరాలు లేకుండా ఎలా ఉంటాయి? ఇరు కుటుంబాలలో ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి…మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అయితే కాలక్రమంలో అవన్నీ  సద్దుమణిగాయి. అయితే మా పెళ్లి మా కుటుంబాలలో కంటే ఇండస్ట్రీ లోనే పెద్ద సంచలనం సృష్టించింది. ఇద్దరూ చాలా కామ్ గా    ఉండే వాళ్లే… ఇంత సెన్సేషనల్ డిసిషన్ ఎలా తీసుకున్న రబ్బా అన్నది అందరికీ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మీ పాత్రికేయులు మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు అంటూ ప్రశ్నల వర్షం కురిపించే వాళ్ళు. కొద్ది రోజుల తరువాత ఆ సందడి, సంచలనం తగ్గిపోయాయి. పెళ్లి అయ్యాక ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ” అమ్మ కోసం” సెట్లోకి అడుగుపెట్టాం. మమ్మల్ని చూడగానే పెద్దలు చిత్తూరు నాగయ్య గారు కంగ్రాట్స్ అంటూ వచ్చి చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. పెళ్లి అయ్యాక మేము కలిసి నటిస్తున్న  తొలి చిత్రం కావటంతో యూనిట్ మొత్తం మిమ్మల్ని చాలా ప్రత్యేకంగా ట్రీట్  చేసేవారు. ఒక సందర్భంలో వాళ్ల ప్రేమాభిమానాలు  మా ప్రాణాల మీదకు తెచ్చిన భయంకర సంఘటన
ఒకటి అమ్మ కోసం షూటింగ్ లో జరిగింది.

ఆ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి దగ్గర పాపికొండలలో 12 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. నేను కృష్ణ గారు ఒక జంట అయితే… కృష్ణం రాజు గారు, సుప్రసిద్ధ హిందీ హీరోయిన్ రేఖ ఒక జంట. ఇంకా చిత్తూరు నాగయ్య గారు, అంజలీ దేవి గారు, రాజబాబు, రమాప్రభ ఇలా చాలా మంది ఆర్టిస్టులతో మా యూనిట్ మొత్తం పాపికొండలలో దిగాం. అక్కడ అందరికీ వసతి ఏర్పాటు చేశారు. అయితే మీరు కొత్తగా పెళ్లయిన జంట కదా… మీరు స్పెషల్ గా గోదావరిలో తేలాడే’ హౌస్ బోట్’ లో ఉండండి అన్నారు.
అప్పుడు మాకు పి ఆర్ ఓ, సన్నిహిత మిత్రుడు మోహన్ కుమార్ రాజమండ్రి నుండి ఒక houseboat తెప్పించారు. దానికి ఇంజన్ ఉండదు. తాళ్లతో ఒడ్డు మీద చెట్లకు కట్టేసి ఉంచుతారు. యూనిట్ మొత్తం పాపి కొండల మీద ఉంటే మేమిద్దరం గోదావరి మధ్య నీళ్లలో ఉండేవాళ్ళం. వారం రోజులపాటు షూటింగ్ సజావుగా సాగింది. ఉన్నట్టుండి ఒకరోజు పెద్ద తుఫాను స్టార్ట్ అయింది. గోదావరి అల్లకల్లోలంగా మారిపోయింది. క్రమంగా గోదావరి నీటిమట్టం పెరగసాగింది. ఆ ఆటుపోట్ల వల్ల బోట్ కు ఎక్కడో రంధ్రం పడింది. పడవలోకి నీళ్లు రావడం స్టార్ట్ అయింది. నాకు ఈత రాదు… కృష్ణ గారికి ఈత రాదు. ఒడ్డున ఉన్నవాళ్లు అందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఎవరికి ఏం చేయాలో తోచటం లేదు. ఇక మేము ఆశలు వదులుకున్నాం. మా మీద యూనిట్ వాళ్లు ఆశలు వదులుకున్నారు. అలాంటి స్థితిలో ఫైట్ మాస్టర్ రాజు 4 గుర్రాలకు తాళ్లు కట్టి వాటిని బోటు కు బిగించి ఒడ్డుకు లాక్కొచ్చాడు. అందరం ఊపిరి పీల్చుకున్నాం. రాజు మాస్టర్ అంత సమయస్ఫూర్తిగా రియాక్ట్ అవ్వకపోతే ఏమయ్యేదో..!? ఇక అదే రోజు రేడియోలో తీవ్రమైన తుఫాను హెచ్చరిక చేయటంతో షూటింగ్ ప్యాకప్ చేసి యూనిట్ మొత్తం తిరిగి వచ్చేసాం. మేం అందరం వచ్చేసిన రోజు రాత్రే పాపికొండలు మునిగి పోయేంత ఎత్తుకు వరద నీరు చేరింది అన్న వార్త తెలిసింది. అక్కడే ఉంటే యూనిట్ మొత్తం గల్లంతు అయ్యేది. మొత్తానికి పెళ్లైన వెంటనే అలాంటి ప్రాణగండం నుండి బయట పడటం మా జీవితంలో ఎప్పటికీ మరపురాని సంఘటనగా మిగిలిపోయింది.

* కృష్ణ గారిని వివాహం ఆడిన తరువాత మీ నట జీవితం ఎలా సాగింది? హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే కెరీర్ ముగిసినట్లే అంటారు… మరి  పెళ్లి మీ కెరీర్ కు ప్రతిబంధకం కాలేదా?

విజయనిర్మల: సాధారణంగా పెళ్లి చేసుకున్నాక….అదీ సినిమా రంగంలోని వ్యక్తినే పెళ్లి చేసుకుంటే హీరోయిన్ల కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అన్నది చాలామంది అభిప్రాయమూ… అనుభవమూ. అయితే కృష్ణ గారు అనే ఒక సంస్కార శిఖరాన్ని పెళ్లి చేసుకున్న నాకు అలాంటి అవరోధాలేమీ  ఎదురుకాలేదు
సరి కదా ఆయన నుండి అద్భుతమైన ప్రోత్సాహం, సహకారం లభించడం నా అదృష్టం. అంతకుముందు ఇతర హీరోల పక్కన ఎలా నటించానో పెళ్లయ్యాక కూడా అంతకంటే ఎక్కువ గానే నటించాను. హీరోయిన్ గా నేను హీరోగా కృష్ణ గారు ఎవరి బిజీ లో వాళ్ళు ఉండేవాళ్లం. ముఖ్యంగా బహుభాషా నటి గా నేను ఇతర భాషల్లో కూడా విస్తృతంగా నటించేదాన్ని. అన్ని భాషల్లోని అగ్ర కథానాయకులు అందరితో నటించడం వల్ల నటిగా నా కెరీర్ కు ఒక వెర్సటాలిటీ ఏర్పడింది. హీరోయిన్ గా ఏ ఇతర హీరోయిన్ కు ఎదురవ్వని అనుభవాలు, పాత్రలు నాకు ఎదురయ్యాయి. నటనను నటనగా, పర్సనల్ జీవితాన్ని పర్సనల్ గా స్వీకరించే వ్యక్తిత్వం ఉన్న కృష్ణ గారితో పెళ్లయ్యాక కూడా ఆయనకు చెల్లెలు గా నటించటం తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది..

మంచి మిత్రులు లో నేను శోభన్ బాబు గారికి జంటగా కృష్ణ గారికి  చెల్లెలుగా నటించాను. ఇంకా బొమ్మలు చెప్పిన కథ, ముహూర్త బలం చిత్రాలలో కూడా మేము అన్నా చెల్లెల్లు గా   నటించడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారితో బాలనటిగా నటించిన నేను పెత్తందార్లు, మారిన మనిషి, చిత్రాలలో హీరోయిన్ గా నటించాను. బాలనటిగా  అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్లో చేయకపోయినా భూకైలాస్ చిత్రంలో ఒకే పాటలో ఇద్దరం కనిపిస్తాం. అలాంటి సీనియర్ అయిన నాగేశ్వర రావు గారికి పూలరంగడు, ఆత్మీయులు, బంగారు గాజులు చిత్రాలలో చెల్లెలుగా, బుద్ధిమంతుడు లో హీరోయిన్ గా నటించాను .
ఇక శోభన్ బాబు, చంద్రమోహన్, హర్ నాథ్, రామకృష్ణ, కాంతారావు, చలం, రాజబాబు వంటి ఆల్ కేటగిరి హీరోల సరసన హీరోయిన్ గా చేయటంతో పాటు నా నిజ జీవిత కథానాయకుడు కృష్ణ గారితో ఏ హీరో హీరోయిన్ ల కాంబినేషన్ లో చేయనన్ని చిత్రాలు చేశాను. మా కాంబినేషన్లో ఇప్పటికి నలభై మూడు చిత్రాలు వచ్చాయి. అలాగే తమిళంలో అప్పటి టాప్ హీరోలు అందరి సరసన నటించాను. ఎంజీఆర్, శివాజీ గణేషన్ ముత్తురామన్, రవిచందర్, ఏవియం రాజు, నగేష్ లతో నటించాను.ఇక  మలయాళంలో ప్రేమ నజీర్ తో ప్రారంభమై అప్పటి టాప్ హీరోలు అందరి సరసన నటించాను. ఇలా మూడు దక్షిణాది భాషల్లోని అగ్ర హీరోలు, క్యారెక్టర్ యాక్టర్లు, కమెడియన్లు, టాప్ టెక్నీషియన్స్ అందరితో పనిచేస్తూ 4 దశాబ్దాలుగా లైమ్ లైట్ లో కొనసాగటం నా  అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

* హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న టైం లోనే మీరు దర్శకురాలిగా టర్న్ అయ్యారు….   దర్శకత్వం వహించాలన్న ఆశయమే మిమ్మల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించింది కదా… ఆ ఆశయానికి అంకురార్పణ ఎలా జరిగింది? దర్శకురాలిగా మీ అనుభవాలు ఏమిటి?

( సశేషం)

(ఈ  ఇంటర్వ్యూ తరువాయి భాగం ఎల్లుండి జులై 5న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here