విజయనిర్మల….
పేరులోని విజయాన్ని జీవితారంభం నుండి జీవితాంతం వరకు కొనసాగించిన అత్యంత విజయవంతమైన మహిళా రత్నం విజయనిర్మల. అలాగే పేరులోని నిర్మలత్వాన్ని , నిష్కల్మష ప్రేమను కూడా అందరికీ పంచిన ప్రేమమూర్తి ఆమె. సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో ఆమె సాధించిన విజయాలు, ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ఆమె నెలకొల్పిన రికార్డులు, ఆమె కురిపించిన ప్రేమాభిమానాలు , ఆమె చేసిన దాన ధర్మాలు ఆమెను ఒక విశిష్ట మహిళగా నిలబెట్టాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఆమె వజ్ర సంకల్పమే ఆమెను “ఉక్కు మహిళ” గా ఆవిష్కరించింది. సమర్థత, పట్టుదల, మొండితనం వంటి లక్షణాలతో గొప్పవాళ్లుగా ఎదగవచ్చునేమో కానీ మంచివాళ్లుగా నిలవలేరు. కానీ విజయనిర్మలను గొప్పతనం- మంచితనాల మేలు కలయికగా చెప్పుకోవచ్చు. అలాంటి విజయనిర్మల ఆకస్మిక నిష్క్రమణం తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అడుగులో అడుగుగా, మాటలో మాటగా , చూపులో చూపుగా, అణువణువు తానుగా బతికిన కృష్ణ జీవితంలో ఇప్పుడు కృష్ణపక్ష తిమిరం అలుముకుంది. ఆమె నిష్క్రమణం కొన్ని వందలాది కుటుంబాలకు, వేలాది వ్యక్తులకు, లక్షలాది అభిమానులకు ఒక శరాఘాతం. ఎవరూ పూడ్చలేని, తీర్చలేని ఈ ఆవేదన నుండి ఆమె జ్ఞాపకాల నెమరువేత ద్వారానైనా కొంత ఉపశమనం పొందుదాం. అందుకే ఆమె జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే మీ ముందు ఆవిష్కరిస్తుంది మీ “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఫిలిం జర్నలిస్టుగా ఈ ఇంటర్వ్యూను మీ ముందు ఆవిష్కరిస్తున్న నాకు విజయనిర్మల గారితో ముప్పై మూడు సంవత్సరాల అనుబంధం ఉంది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆమె జన్మదిన సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూ ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానానికి అద్దం పడుతుంది.
అందుకే ఆమె మాటల్లోనే “ఆమె కథ”
* విజయనిర్మల గారూ ! మీ చలనచిత్ర జీవితం ఇప్పుడు ఎలా ప్రారంభమైందో… బాలనటిగా కెరీర్ ప్రారంభించినప్పటి మీ బాల్య స్మృతులు ఏమిటో తెలియజేస్తారా ?
విజయనిర్మల: నేను 1944 ఫిబ్రవరి 20న మద్రాస్ లో పుట్టాను. మా నాన్నగారు ఎస్. రామ్మోహన్ రావు, అమ్మ శకుంతల దేవి. నాకు అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు. నాన్న గారు వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్. ప్రఖ్యాత సౌండ్ ఇంజనీర్ స్వామినాథన్, డైరెక్టర్ కె. విశ్వనాథ్ గార్ల సమకాలికులు. మాది ఉమ్మడి కుటుంబం. తొలి మహిళా ప్లేబ్యాక్ సింగర్ “రావు బాలసరస్వతి” మా నాన్నగారి అక్క కూతురు… అంటే నాన్నగారి మేనకోడలు. నాకు వదిన వరస అవుతారు. అలాగే జయసుధ మా పెదనాన్న గారి మనవరాలు. అంటే నా కజిన్ బ్రదర్ కూతురు.. నాకు మేనకోడలు వరస అవుతుంది. ఇక ఇతర బంధువర్గం మొత్తం ఉమ్మడిగానే ఉండేవాళ్ళం. నా బాల్యమంతా ఒక అందమైన జ్ఞాపకంగా సాగిపోయింది. నేను బాగా అల్లరి పిల్లను. నేను పుట్టింది మద్రాస్ మౌంట్ రోడ్డు ఏరియాలోనే అయినప్పటికీ మా ఫ్యామిలీ ట్రిప్లికేన్ ఏరియాకు షిఫ్ట్ అవ్వడంతో ఆ సమీపంలోని మెరీనా బీచ్ నాకు ఆటస్థలం అయింది. నేను, తమ్ముళ్లు, అన్నయ్య, మా బంధువుల పిల్లలం అందరం కలిసి బీచ్ లో చేరి నానా అల్లరి చేసేవాళ్లం. ఇప్పటికీ చెన్నై వెళితే ట్రిప్లికేన్, చేపాక్, వేల్స్ రోడ్ వెళ్లి ఆనందంగా గడిచిపోయిన నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటాను.
* బాల్యం అంత అందంగా గడిచిపోతున్న రోజుల్లోనే బాలనటిగా మీ కెరీర్ ప్రారంభమైంది కదా! అదెలా జరిగింది?
విజయనిర్మల: నేను సినిమాల్లో చేరటం చాలా కాకతాళీయంగా జరిగింది. అందుకు ముఖ్య కారణం రావు బాలసరస్వతి గారే. తొలి ప్లే బ్యాక్ సింగర్ అయిన బాల సరస్వతి గారికి చిత్ర పరిశ్రమలో మంచి గౌరవం ఉండేది. ఆమె 20 కి పైగా సినిమాలలో నటించారు కూడా. ఘంటసాల గారు, ఎస్ రాజేశ్వర రావు గారు.. వీళ్లంతా సమకాలికులు. ఆమె ప్రోద్బలంతో నేను మొదట తిరువెంకట మొదలియార్ గారి దగ్గర భరతనాట్యం, సుందరమ్మాల్ గారి దగ్గర ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను. అయితే నాకు భరతనాట్యం నేర్పించడంలో సినిమా రంగానికి పంపాలనే ఆలోచన ఏమీ లేదు. చురుకైన పిల్ల.. సంప్రదాయ నృత్యం నేర్చుకుంటే బాగుంటుంది అన్నదే ఇంట్లో వాళ్ల ఉద్దేశం. ఇక నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది బాలనటిగా నా సినీ రంగ ప్రవేశం. ఒక రోజు రాత్రి నేను మా ఇంట్లో నిద్ర పోయాను. పొద్దున్నే లేచి చూసేసరికి ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నాను. లేచి కళ్ళు నలుపుకుంటూ మంచం దిగి ఏడుపు లంకించుకునేలోపు ఎదురుగా బాల సరస్వతి గారు కనిపించారు. ఆమెను చూడగానే మనసు తేలిక పడింది. ఆమె నన్ను బుజ్జగిస్తున్నట్టుగా “ఇవ్వాల నిన్ను ఒక చోటికి తీసుకు వెళ్తున్నాను… అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీకు కావలసినవన్నీ కొనిపెడతారు. నువ్వు సినిమాలో యాక్ట్ చేయాలి”- అన్నారు. దానికి నేను” చేస్తాను నాకేం భయమా? ” అన్నాను. ఆ రోజు మధ్యాహ్నం నన్ను సినిమా షూటింగుకు తీసుకువెళ్లారు బాల సరస్వతి గారు. అక్కడ ఎవరెవరో పెద్దవాళ్ళు ఉన్నారు. నన్ను కెమెరా ముందు నిలబెట్టి పెద్దగా ఏడవమన్నారు. నేను ఏడవలేదు. నవ్వమన్నారు… నవ్వలేదు. చూసి.. చూసి… ఆయనేవరో పెద్దగా అరిచాడు… బూతులు లంకించుకున్నాడు…. నేను వెంటనే ఏడుపు లంకించుకున్నాను. ఆయన వెంటనే “స్టార్ట్ కెమెరా” అన్నాడు. నేను వెక్కివెక్కి ఏడ్చిన ఏడుపు నంతా షూట్ చేశారు. నేను మెల్లిగా ఏడుపు ఆపి వెక్కిళ్లు పెడుతున్నప్పుడు వచ్చి ప్రేమగా మాట్లాడాడు.
“నువ్వు చాలా బాగా ఏడ్చావు… ఇప్పుడు బాగా నవ్వాలి… నీకేం కావాలో చెప్పు” అన్నారు.
వెంటనే నాకు పూరి పొటాటో కావాలి అన్నాను. ఆ దగ్గరలో దొరకకపోతే కారులో పంపించి పూరి పొటాటో తెప్పించారు. సుష్టుగా తిన్నాను. ఇక ఇప్పుడు నువ్వు బాగా నవ్వే సీన్స్ తీద్దాం అన్నాడాయన . నేను ఆనందంగా సరే అన్నాను. అప్పుడు నవ్వుల సీన్స్ తీశారు.” వెరీ గుడ్ గర్ల్”- అంటూ బుగ్గ గిల్లారు ఆ పెద్దాయన.
అలా నన్ను బూతులతో హడలగొట్టి… తరువాత పూరి పొటాటోతో బుజ్జగించి… నా మీద తొలిసారిగా కెమెరా ఆన్ చేసిన ఆ దర్శకుడు పి.పుల్లయ్య గారు అనీ, నేను నటించిన ఆ సినిమాలో హీరో tr మహాలింగం గారు అనీ, హీరోయిన్ ఎస్. వరలక్ష్మి గారు అనీ… అది “మత్య రేఖ ” అనే తమిళ సినిమా అని నాకు తెలియదు. అలా బాల నటిగా నాకు తెలియకుండానే ప్రారంభమైంది నా సినిమా కెరీర్. ఆ తర్వాత సావిత్రి, జెమినీ గణేషన్ గార్ల కాంబినేషన్లో “మనం పోలే మాంగల్యం” అనే తమిళ చిత్రంలో రైల్లో అడుక్కునే అనాధ బాలిక లాగా నటించాను. అప్పుడే “సావిత్రి ”అనే మహానటితో పరిచయమైంది. మా ఇద్దరి మధ్య వయసు దృష్ట్యా చాలా తేడా ఉన్నప్పటికీ మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నటిగా ఆమె ఎంత గొప్పదో స్నేహానికి, హ్యూమన్ రిలేషన్స్ కు విలువనిచ్చే మానవతా మూర్తిగా కూడా అంత గొప్పది సావిత్రి గారు. తరువాత పద్మని నటించిన “సింగారి” అనే తమిళ చిత్రంలో చిన్నప్పుటి పద్మిని గా నటించాను. ఆ తరువాత
ఏ.వీ. ఎం. వారు నిర్మించిన ఒక బెంగాలీ చిత్రం లో కూడా నటించాను. తరువాత సావిత్రి గారు నటించిన విజయావారి” గుణసుందరి” హేమ సుందరిగా నటించాను. అందులో చిన్నప్పటి గుణసుందరిగా బి.ఎన్.రెడ్డి గారి అమ్మాయి శారద నటించింది. ఆ తరువాత భూకైలాస్ లో ” రాముని అవతారం రఘుకుల సోముని అవతారం” అనే పాటలో అక్కినేని నాగేశ్వరావు గారి కాంబినేషన్లో నటించాలని తీసుకువెళ్లారు. నేను రెండు రోజులు నటించినా నాగేశ్వరరావుగారు షూటింగ్ లోకి రాలేదు. ఆయన్ను చూడాలన్నది నా ఆరాటం. తర్వాత చెప్పారు… ఆ పాట నాగేశ్వరరావుగారి కాంబినేషన్లోదే అయినా అందులో మేమిద్దరం కలిసి నటించే సందర్భం లేదు అని.
ఆ తరువాత బాలనటిగా నాకు ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిన సినిమా ” పాండురంగ మహత్యం”. అందులో కృష్ణుడు వేషానికి సెలక్షన్స్ కోసం కొంతమంది అమ్మాయిలను, అబ్బాయిలను తీసుకెళ్లి ఎన్టీ రామా రావు గారు, డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు గార్ల ముందు నిలబెట్టారు. రామారావు గారు నన్ను చూసిన వెంటనే” ఈ అమ్మాయి బాగుంది” అని నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. నేను విడిగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను. కానీ కెమెరా ముందుకు వెళ్లే సరికి బిగుసుకు పోయేదాన్ని. రామారావు గారు చాలా అనునయంగా ‘చక్కగా నవ్వాలమ్మా’ అనేవారు. నాకు ఆయనే తిలకం దిద్ది దగ్గరుండి మేకప్ వేయించేవారు. ఆ పాట చిత్రీకరణ 12 రోజుల పాటు జరిగింది. రెండవ రోజున” నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం” అనే లిరిక్ ప్రకారం ముక్కు, కళ్ళు, చేతులు క్లోజప్ షాట్స్ తీయాలి. అంటే గంటల తరబడి అలా కదలకుండా నిలబడాలి. సెట్ నిండా జనం ఉన్నారు. షాట్ లోకి వెళ్లేముందే నా ఫేవరేట్ పూరి పొటాటో ఫుల్లుగా లాగించాను. మార్కస్ బార్ట్లే గారు కెమెరామెన్. రామారావు గారితో సజెషన్ షాట్స్ తీస్తున్నారు. ఆయన పువ్వులు, పండ్లు సర్దుతూ ఎదురుగా కదలకుండా కూర్చున్నారు. రెండు మూడు షాట్స్ అయ్యాక కడుపులో తిప్పటం ప్రారంభమైంది… ఉన్నట్టుండి భళ్ళున వామిటింగ్ చేసేసుకున్నాను. దేవుడు చుట్టూ చేసిన డెకరేషన్ మొత్తం కరాబు అయిపోయింది. రామారావు గారు తిడతారేమోనని భయపడిపోయాను. అయితే నా భయానికి భిన్నంగా ఆయనే నా మొహం మీద నీళ్లు చల్లి లేపారు. ” ఏం భయపడొద్దమ్మా.. అంటూనే ప్రొడక్షన్ వాళ్లకు చెప్పి పెద్ద గుమ్మడికాయ తెప్పించారు. సెట్ లో ఉన్న అందరి కళ్ళు ఈ అమ్మాయి మీదే ఉన్నాయి. దిష్టి తగిలింది. రేపటినుండి విజిటర్స్ ఎవరిని లోపలకి రానీయద్దు అని చెప్పి స్వయంగా ఆయనే నాకు దిష్టి తీసి ఇవాల్టికి షూటింగ్ పేకప్ అన్నారు. ఆ మరుసటి రోజు నుండి పది రోజుల పాటు సెట్లోకి ఎవరిని రానీయకుండా రామారావు గారే దగ్గరుండి ఆ పాట చిత్రీకరణ జరిపారు. అలా బాలనటిగా రామారావు గారు నా పట్ల చూపించిన వాత్సల్యం నాకొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది.
బాలనటిగా అదే నా ఆఖరి చిత్రం.
* మరి బాలనటి నుండి కథానాయికగా ఎదిగిన కథ ఏమిటి? హీరోయిన్ గా మీకు తొలి అవకాశం ఎలా వచ్చింది?
( సశేషం)
( ఈ ఇంటర్వ్యూ తరువాయి భాగం సోమవారం(1- జూలై) చదవండి.
[youtube_video videoid=Qrgyydpw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: