రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం” ఎన్టీఆర్- కథానాయకుడు” విడుదలైనప్పుడు తిరుగులేని ఆ జగద్విఖ్యాత నటసార్వభౌముడి నటజీవిత పరిణామక్రమంలోని ఒక్కో ఘట్టాన్ని చూస్తూ తాదాత్మ్యతకులోనై జనసామాన్యంతో పాటు విమర్శకులు కూడా చప్పట్లు కొట్టారు. తన సుదీర్ఘమైన, సుసంపన్నమైన నట జీవితంలో ఆ మహానటుడు పోషించిన పాత్రలు, దర్శక నిర్మాతగా చేసిన సాహసాలు, చిత్ర పరిశ్రమలో ఆయన నెలకొల్పిన క్రమశిక్షణ, సంప్రదాయాల వంటి విశేషాలను చూస్తున్నప్పుడు
చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన మేలు, తెచ్చిన ప్రతిష్ట స్పురణకు వచ్చి గుండె బరువెక్కింది. తెలుగు చలనచిత్ర రంగం వరకు తిరుగులేని ఆ కథానాయకుడి జీవిత చరిత్రలో ప్రశంసార్హమైన విశేషాలే తప్ప ఆక్షేపణీయ అంశాలు ఏమీ లేవు. అందుకే ఆయన సినీ జీవిత విశేషాల ఆవిష్కరణ వరకు పరిమితమైన తొలి భాగం “ఎన్టీఆర్- కథానాయకుడు” కు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా రెవెన్యూ పరమైన ఫలితం ఎలా ఉన్నప్పటికీ బాగుంది అనే ప్రశంసలకు కొరత లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు విడుదలైన రెండవ భాగం ” ఎన్టీఆర్- మహానాయకుడు” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తొలి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు ను సమీక్షిస్తూ “ఇలాంటి అరుదైన ప్రయత్నాన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను సమీక్షించినట్టు కాకుండా ఒక ప్రత్యేక ప్రశంసా దృష్టితో చూడాలి” అని రాయటం జరిగింది. అయితే రెండవ భాగమైన “ఎన్టీఆర్- మహా నాయకుడు” చిత్రాన్ని అలాంటి సానుకూల కోణంలో సమీక్షించే పరిస్థితి కనపడటంలేదు.
” ఎన్టీఆర్- మహానాయకుడు” చిత్రాన్ని అసంపూర్ణంగా, అసమగ్రంగా రూపొందించడమే అందుకు ప్రధాన కారణం. జీవిత చరిత్ర అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క జనన మరణాల మధ్య కాలంలోని అన్ని ప్రధాన ఘట్టాలను, విషయాలను, విశేషాలను సాధ్యమైన మేరకు స్పృశించగలగాలి. అలా కాకుండా ఒక particular time period కు మాత్రమే పరిమితమై అంతవరకే చూపిస్తాం అని దర్శక నిర్మాతలు నిర్ణయించుకుని ఆ మేరకే చిత్ర కథా వస్తువును కుదించి ఇదే ఆ మహానుభావుడి జీవిత చరిత్ర అని ముగించేస్తే ఎలా? దీన్ని బయోపిక్ అని ఎలా అనుకోవాలి ? ఎప్పుడో అనంత కాల ప్రవాహంలో శతాబ్దాల క్రితం జరిగిపోయిన చరిత్ర అయితే తెలిసింది ఇదే కదా… జరిగింది ఇదేనేమో అని సరిపుచ్చుకోవచ్చు … మేకర్స్ కూడా సమర్ధించుకోవచ్చు.
కానీ నిన్న గాక మొన్న అన్నట్లు పాతికేళ్ల క్రితం జరిగిన విషయాలను కూడా ప్రస్తావించకుండా కథను ఒక కాలపరిమితికే పరిమితం చేసి ఇదే ఆ మహామహుడి జీవిత చరిత్ర అని సరిపుచ్చుకోమంటే ఎలా ?
అసలు ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలి అని తీసుకున్న నిర్ణయమే ఒక పెద్ద గ్రేవ్ మిస్టేక్. రాజకీయపరంగా తొలి ఘన విజయము, ఆ తరువాత తీసుకున్న కొన్ని పరిపాలనాపరమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు తప్పిస్తే ఆయన రాజకీయ ప్రస్థానంలో వివాదాస్పదమైన విషయాలే ఎక్కువ. ముఖ్యంగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా బయటకు చెప్పుకోలేని విషయాలు ఉన్నప్పుడు బయోగ్రఫీ పేరుమీద సగం చరిత్రను చూపాల్సిన అగత్యం ఎందుకు?
ఒక మహోన్నత నటుడిగా ఆయన చలనచిత్ర జీవిత విశేషాల వరకు తీసిన మొదటిభాగంతోనే ముగించి ఉంటే ఆ మహానటుడికి నిజమైన నివాళి అర్పించినట్లుగా ఉండేది.అలా కాకుండా రాజకీయపరమైన రచ్చలో రొచ్చులో ఆయన, ఆయన ప్రతిష్ట ఎంతగా నలిగిపోయాయో జనానికి గుర్తు చేసినట్లుందే తప్ప “మహా నాయకుడు” అనే ద్వితీయ భాగం వల్ల ఎన్టీఆర్ గౌరవానికి గాని, ఆయన అభిమానుల సంతృప్తికి గాని కొత్తగా ఒరిగింది ఏమీ లేదు. ఇక తీశారు కాబట్టి సమీక్షించుకోవాల్సి వస్తే” ఎన్టీఆర్ మహా నాయకుడు” ఆయన రాజకీయ ప్రస్థానంలో చాలా స్వల్ప భాగానికి మాత్రమే పరిమితమైన అసంపూర్ణ చరిత్ర అని చెప్పక తప్పదు.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ జెండాను రూపొందించడంతో ప్రారంభమై, ఆయన ధర్మపత్ని నందమూరి బసవతారకం మరణించిన మధ్యకాలంలో జరిగిన రాజకీయ, కుటుంబపరమైన కొన్ని ఎంపిక చేసుకున్న సంఘటనల నేపథ్యంలో రూపొందించిన చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు సంఘటన, తదనంతర పోరాటం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజ్ భవన్ కుట్రలు, ప్రజా ప్రతిఘటన వంటి ఘట్టాలను చక్కగా చిత్రీకరించారు.మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి.
ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రధానంగా ఫోకస్ అయ్యే పాత్రలు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బసవతారకం, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ, నాదెండ్ల భాస్కర్ రావు, నందమూరి త్రివిక్రమరావు.
ఇక ఈ ప్రధాన పాత్రలలో పెర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్కరు గొప్పగా నటించారు. ముఖ్యంగా తొలిభాగంలోని తొలి ఘట్టాలలో బాలకృష్ణకు వేసిన ఎన్టీఆర్ గెటప్ బాగాలేదనే అసంతృప్తి బాగా వినిపించింది. కానీ ఎన్టీఆర్ మహా నాయకుడు లో బాలకృష్ణ ఆంగిక ఆహార్యాలు అచ్చుగుద్దినట్లు గా ఎన్టీరామారావును పోలి ఉండటం అభినందనీయం. ఇక నటన పరంగా ఎన్టీరామారావు పాత్రలో బాలకృష్ణ గొప్పగా ఒదిగిపోయారు. నటన విషయంలో బాలకృష్ణ తరువాత మార్కులు దగ్గుబాటి రానా కు దక్కుతాయి. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుపాటి అద్భుతంగా రాణించాడు. మాట, చూపు, బాడీ లాంగ్వేజి మొత్తం సేమ్ టు సేమ్ అన్నట్లుగా ఉన్నాయి రానా గెట్ అప్ అండ్ పర్ఫార్మెన్స్. ఇక నాదెండ్ల భాస్కరరావు పాత్రను పోషించిన సచిన్ ఖేడ్కర్ చాలా పాత్రోచితంగా నటించారు. బసవతారకంగా విద్యాబాలన్, దగ్గుబాటి వెంకటేశ్వర రావుగా ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ భరత్ రెడ్డి, హరికృష్ణగా ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ తదితరులు ఆయా పాత్రలకు న్యాయం చేశారు.
ఇక దర్శకుడు ‘క్రిష్’ విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీయాలి అనే రాంగ్ డిసిషన్ ఎవరిదైనప్పటికీ దర్శకుడిగా తన క్రియేటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలి భాగమే లాగేయడంతో క్రిష్ క్రియేటివిటీ రెండవ భాగంలో పెద్దంతగా కనిపించలేదు. తన కష్టం, శ్రమ, డెడికేషన్ అన్నీ కనిపించాయి గానీ తన ‘మార్క్’ మాత్రం మిస్ అయింది.ఇక టెక్నికల్ గా, సంగీతపరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా మంచి ప్రమాణాలతో రూపొందిన “ఎన్టీఆర్-మహానాయకుడు” ఒక సినిమాగా బాగున్నప్పటికీ ఒక మహా నాయకుడు జీవిత చరిత్రగా మాత్రం అసంపూర్ణము- అసమగ్రము అని చెప్పక తప్పదు.
[wp-review id=”15956″]
[youtube_video videoid=RAV-tqdT450]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: