రివ్యూ: కొరియన్ కనకరాజు

Korean Kanakaraju Movie Review

నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, తులసి, వీటీవీ గణేష్ తదితరులు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీతం: ఎస్.ఎస్. తమన్

సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి

ఎడిటింగ్: సత్య జి

నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. తెలుగు తెరపై ఇంతవరకు రాని వినూత్నమైన ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన యువకుడు కనకరాజు (వరుణ్ తేజ్). తన స్నేహితుడు కిష్టప్ప (సత్య)తో కలిసి చెక్కభజనలు చేస్తూ, ఊరిలోని చెంగారెడ్డి (సునీల్) గ్యాంగ్‌తో గొడవలు పడుతూ కాలాన్ని వెళ్లదీస్తుంటాడు. అదే ఊరి పక్కనున్న కియా కార్ ఫ్యాక్టరీలో పనిచేసే, కొరియన్ కల్చర్, కె-పాప్ అంటే పిచ్చిగా ఇష్టపడే ఛైత్ర (రితికా నాయక్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు కనకరాజు. అయితే అనుకోకుండా కొరియా నుంచి వచ్చిన ఓ పురాతన వస్తువు ద్వారా ‘చో స్వాంగ్’ అనే కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది.

అసలు ఆ కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ పెనుగొండలోని కనకరాజు శరీరంలోకే ఎందుకు ప్రవేశించింది? ఆత్మ వహించిన తర్వాత కనకరాజు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని ప్రేమ కథ ఏమైంది? ఆ ఆత్మను వదిలించడానికి కిష్టప్ప, ఛైత్ర చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :

హారర్ కామెడీ జోనర్‌తో పాటు విదేశీ బ్యాక్‌డ్రాప్‌ను ముడిపెట్టి పూర్తిగా నవ్వించడమే లక్ష్యంగా దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రథమార్థంలో కథానాయకుడి పరిచయం, ప్రేమ సన్నివేశాల వరకు సినిమా టైం పాస్ చేపించగా.. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన దగ్గర నుంచి సినిమా అసలు ట్రాక్‌లోకి వస్తుంది.

కొరియన్ ఆత్మ వహించిన కనకరాజు ప్రవర్తన, దానికి సత్య ఇచ్చే కౌంటర్లు, బార్ సీన్ తదితర సన్నివేశాల్లో నవ్వుల పువ్వులు పూస్తాయి. ద్వితీయార్థంలోనూ వినోదం మోతాదు తగ్గకుండా చూసుకున్నారు. ముఖ్యంగా వీడియో కాల్ ద్వారా క్షుద్రపూజలు చేసే ఎపిసోడ్, సత్య మరియు మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ఆత్మల కథల్లో లాజిక్‌ను వెతకకూడదనే విషయాన్ని పక్కన పెడితే.. క్లైమాక్స్ సన్నివేశాలు అలరిస్తాయి. లాజిక్స్ పక్కనబెట్టి కేవలం వినోదం కోసం చూస్తే ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది.

నటీనటుల పనితీరు :

వరుణ్ తేజ్: కనకరాజు పాత్రలో, రెండు వైవిధ్యమైన కోణాల్లో (పల్లెటూరి యువకుడిగా & విదేశీ గ్యాంగ్‌స్టర్‌గా) చాలా చక్కగా నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో, డిఫరెంట్ మేకోవర్‌తో ఆకట్టుకున్నాడు.

సత్య: ఈ సినిమాకి మరో ప్రధాన బలం సత్య. తన మార్క్ డైలాగ్ డెలివరీ, వన్-లైనర్లు మరియు ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించాడు.

రితికా నాయక్: తన పాత్ర పరిధి మేర గ్లామరస్‌గా నటిస్తూ మెప్పించింది.

ఇతర నటీనటులు: పూజారిగా మురళీధర్ గౌడ్ కామెడీ బాగా వర్కౌట్ అవ్వగా, సునీల్, తులసి, వీటీవీ గణేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:

తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. ప్రతి కామెడీ అండ్ యాక్షన్ సన్నివేశాన్ని తన ఆర్ఆర్ తో బాగా ఎలివేట్ చేశాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా చాలా బాగుంది. మేర్లపాక గాంధీ కథనం కంటే కూడా హాస్య సన్నివేశాల రచనపైనే ఎక్కువగా దృష్టి పెట్టి విజయవంతమయ్యారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.

లాజిక్స్ పక్కనబెట్టి కేవలం వినోదం కోసమే చూస్తే ‘కొరియన్ కనకరాజు’ మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్. వరుణ్ తేజ్ వైవిధ్యమైన మేకోవర్, సత్య అందించే అవుట్ అండ్ అవుట్ హెవీ కామెడీ ఈ సినిమాకి ప్రధాన బలం. థియేటర్‌లో హాయిగా నవ్వుకోవడానికి ఒకసారి ఖచ్చితంగా చూడదగ్గ చిత్రం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.