నటీనటులు : అఖిల్ రాజ్ , తేజస్విని , శివాజీ రాజా , చైతు జొన్నలగడ్డ
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ : నరేష్ అడపా
సినిమాటోగ్రఫీ : వాజిద్ బేగ్
దర్శకత్వం : సాయిలు కంభంపాటి
నిర్మాతలు : వేణు ఊడుగుల , రాహుల్ మోపిదేవి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో పెద్దగానే సౌండ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయి. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించగా, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయిలు కంభంపాటి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈరోజే ఈసినిమా థియేటర్లోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా వుందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ :
ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్-ఖమ్మం మధ్య ఉన్న ఒక పల్లెటూరి కథ. ఆ ఊరిలో బ్యాండ్ కొట్టడంలో సిద్ధహస్తుడైన రాజు (అఖిల్ రాజ్), అదే ఊరికి చెందిన రాంబాయిని (తేజస్విని రావు) చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు. మొదట్లో రాంబాయి అతని ప్రేమను అంగీకరించకపోయినా, రాజు ప్రేమలోని నిజాయితీని, బ్యాండ్ కొట్టే స్టైల్‌ను చూసి అంగీకారం తెలుపుతుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) మాత్రం తన కూతురును ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ సమస్యను దాటేందుకు రాజు, రాంబాయి ఒక దారి ఎంచుకుంటారు. పెళ్లికి ముందే ఆమెను గర్భవతిని చేస్తే, వెంకన్న చచ్చినట్లు తమ పెళ్లి చేస్తాడనుకుంటారు. వాళ్లు అనుకున్నట్లే చేశాక, వెంకన్న వల్ల వారి ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? రాజుకు బుద్ధి చెప్పేందుకు వెంకన్న ఎలాంటి దుర్మార్గానికి ఒడిగట్టాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
పరువు హత్యలు కేవలం అగ్రవర్ణాల్లోనే కాదు, అణగారిన వర్గాల్లోనూ జరుగుతాయనే పచ్చి నిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. అయితే, ఇందులో హింసాత్మక కోణం ఎక్కువగా ఉండదు, టైటిల్‌కు న్యాయం చేస్తూ సుఖాంతమైన ముగింపు ఉంటుంది. కానీ, ఆ ముగింపులో ఇంతవరకు ఏ ప్రేమికులకు ఎదురు కానీ ఓ దారుణ దుర్మార్గం ఉంటుంది. ఈ పతాక ఘట్టం ప్రతి ఒక్కరి మనసుల్ని మెలిపెడుతుంది. ఈ క్లైమాక్స్‌పై ఉన్న బలమైన నమ్మకంతోనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అర్థమవుతుంది.
పెళ్లికి ముందే గర్భవతి అయిన ప్రేమ జంట కథను పెళ్లి తంతుతో ప్రారంభించి, నాయకానాయికల పాత్రల్ని పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. రాజు ప్రేమలోని అమాయకత్వం, నిజాయితీ నవ్విస్తూనే మనసుల్ని హత్తుకుంటుంది. హీరో స్నేహితుల గ్యాంగ్ చేసే అల్లరి, ముఖ్యంగా డాంబర్ పాత్ర పంచే ఊర మాస్ కామెడీ చక్కటి కాలక్షేపాన్ని అందిస్తుంది.వెంకన్నకు తమ ప్రేమకథ గురించి తెలిసిన తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. అయితే, ప్రథమార్థంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త నెమ్మదిగా సాగిన అనుభూతి కలుగుతుంది. ఇందులో కొన్ని ఎపిసోడ్స్ వినోదం పంచినా, మరికొన్ని సాగదీతలా అనిపించినా ఓవరాల్ గా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ గా మిగిలిపోతుంది.
నటీనటులు విషయానికి వస్తే ఊరి కుర్రాడిగా రాజు పాత్రలో అఖిల్ రాజ్ ఒదిగిపోయాడు. భావోద్వేగభరిత సన్నివేశాల్లో కట్టిపడేశాడు. రాంబాయిగా తేజస్విని నటన, ఆమె పలికించిన హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. కథానాయిక తండ్రి వెంకన్నగా చైతన్య జొన్నలగడ్డ విలనిజం కట్టిపడేస్తుంది. హీరో స్నేహితుల గ్యాంగ్‌లో డాంబర్, మోహన్ పాత్రలు నవ్విస్తాయి.
టెక్నికల్ గా సినిమా మెప్పించింది. దర్శకుడు సాయిలు కంభంపాటి తాను రాసుకున్న కథను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు. తెలంగాణ యాసలోని సంభాషణలు అలరిస్తాయి. సురేశ్ బొబ్బిలి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజువల్స్ సహజంగా వున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు కథ కు తగ్గట్లు వున్నాయి.
ఓవరాల్ గా రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా వచ్చిన ఈ రాజు వెడ్స్ రాంబాయి ఆకట్టుకుందని చెప్పొచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే , నటీనటుల నటన, సంగీతం హై లైట్ అయ్యి మనసుల్ని హత్తుకునేలా వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























