ఫిష్ వెంకట్: చేపల మార్కెట్ నుండి వెండితెర వరకూ..

Fish Venkat The Journey Ends From Fish Market to Film Industry

టాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రత్యేకమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్) ఇక లేరు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతూ 53 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా వారు పేర్కొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చేపల మార్కెట్ నుండి వెండితెర వరకు ప్రస్థానం..

ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. స్వస్థలం ఏపీ లోని మచిలీపట్టణం. ఆయన కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. మొదట్లో ముషీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్‌లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. అయితే సినిమాలపై ఆసక్తితో వేషాలకోసం ప్రయత్నించేవారు. ఈ క్రమంలో 1991లో ‘జంతర్ మంతర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. దర్శకుడు వి.వి. వినాయక్‌ను ఆయన తన గురువుగా భావిస్తారు. అలాగే వెంకట్‌ని ప్రముఖ దివంగత నటుడు శ్రీహరి బాగా ప్రోత్సహించారు.

ప్రత్యేకమైన నటనా శైలి..

ఫిష్ వెంకట్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడే హాస్య, ప్రతినాయక పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. చిన్న పాత్ర అయినా సరే, తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. నవ్వించే విలన్‌గా ఆయనను చెప్పొచ్చు. కామెడీ, విలనీ కలగలసిన విలక్షణ నటుడు.

కొన్ని ముఖ్యమైన చిత్రాలు, పాత్రలు..

ఖుషి (2001): “గుడుంబా సత్తి” గ్యాంగ్‌లో భాగంగా ఆయన చేసిన పాత్ర బాగా పాపులర్ అయింది. ఈ సినిమాతోనే ఆయనకు “ఫిష్” అనే బిరుదు వచ్చిందని చెబుతారు.

ఆది (2002): ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్ అద్భుతంగా పండింది. ఈ సినిమా ఆయనకు మంచి ప్రజాదరణ తెచ్చిపెట్టింది.

బన్నీ (2005): ఈ సినిమాలో ఆయన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గబ్బర్ సింగ్ (2012): ఇందులో సిద్ధప్ప నాయుడు గ్యాంగ్‌లో ఒకరిగా నటించి నవ్వించారు. అందులో ‘అంత్యాక్షరి’ ఎపిసోడ్‌లో ఆయన చేసిన సందడి థియేటర్లలో నవ్వులు పూయించింది.

డిజె టిల్లు (2022): హెడ్ కానిస్టేబుల్\u200cగా ఆయన చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఇవే కాకుండా దిల్, కింగ్, అత్తారింటికి దారేది, మిరపకాయ్, శౌర్యం, రెడీ, సామాన్యుడు, హుషారు వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

వ్యక్తిగత జీవితం, ఆఖరి రోజులు..

ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయనకు సహాయం అందించారు. అయినప్పటికీ, మెరుగైన చికిత్స అందక, ఆరోగ్యం విషమించి ఆయన కన్నుమూశారు.

తెలుగు ప్రేక్షకుల మదిలో..

ఫిష్ వెంకట్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. తెరపై ఆయన పోషించిన పాత్రలు, పండించిన హాస్యం, తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.