నటీనటులు: సూర్య, దిశా పటాని, బాబీడియోల్, యోగి బాబు, కెఎస్ రవికుమార్, హరీష్ ఉత్తమన్, కోవై సరళ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిసామి
ఎడిటింగ్: నిషాద్ యూసుఫ్
నిర్మాణం: స్టూడియో గ్రీన్ బ్యానర్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం: శివ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డ్యూయల్ రోల్స్‌లో నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కంగువా’. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. సూర్యకు ఇది 42వ సినిమా కాగా, శివకు 10వ చిత్రం. ఇప్పటికే కంగువా నుంచి రిలీజైన మూవీ గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.
ఈ నేపథ్యంలో కంగువ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 భాషల్లో 3డీ వర్షెన్ సహా గ్రాండ్‌గా విడుదలయింది. కాగా ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయగా.. ఓవర్సీస్‌లో ‘ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ సంస్థ విడుదల చేస్తోంది. ఇక ఇదిలావుంటే, మరోవైపు కోలీవుడ్ మీడియా ఈ సినిమాను తమిళ బాహుబలిగా పోలుస్తోంది.
ఈ నేపథ్యంలో అభిమానుల భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగువా ఆశించిన విజయం అందుకుందా? తొలిసారి ట్రైబల్ క్యారక్టర్‌లో కనిపించిన సూర్య మెప్పించాడా? దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమా తీశానని చెప్పిన దర్శకుడు శివ మరి ఆ స్థాయి హిట్ కొట్టాడా? 1,000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్‌గా బరిలోకి దిగిన కంగువా ఇంతకూ ఏమేరకు సక్సెస్ అయింది? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ:
ఒక ల్యాబ్‌లో రహస్యంగా మనుషులపై రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ ల్యాబ్ నుంచి ఒక పిల్లవాడు తప్పించుకుంటాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా జీవితం గడుపుతుంటారు. పోలీసులు పట్టుకోలేని క్రిమినల్స్‌ని వీరు చాకచక్యంగా పట్టుకుని బౌంటీ తీసుకుంటూ ఉంటారు.
ఇక ఏంజెలినా (దిశా పటానీ) ఫ్రాన్సిస్ ఒకప్పుడు లవర్స్. కానీ, బ్రేకప్ కావడంతో ప్రస్తుతం బద్ధశత్రువులుగా మారతారు. ఈ క్రమంలో ల్యాబ్ నుంచి తప్పించుకున్న ఆ పిల్లవాడు గోవాకు చేరుకుని ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఫ్రాన్సిస్ కూడా అతడిని చూడగానే ఏదో తెలియని కనెక్షన్ ఫీల్ అవుతాడు.
ఇంతలో సడెన్‌గా ఆ బాలుడి ఆచూకీ తెలుసుకుని తీసుకెళ్లడానికి ల్యాబ్ నుంచి మనుషులు వస్తారు. ఫ్రాన్సిస్ వారితో పోరాడుతూ ఉండగా కథ ఒక్కసారిగా క్రీస్తు శకం 1070కి వెళ్తుంది. అయితే ఆ పిల్లవాడికీ, ఫ్రాన్సిస్‌కి సంబంధం ఏంటి? సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన ఆదివాసీ నాయకుడు (కంగువా) ఎవరు? ఫ్రాన్సిస్‌కి, ఆదివాసీల తెగకూ కనెక్షన్ ఉందా? అసలు ఈ కథలోని ట్విస్టులేంటి? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
2 గంటల 34 నిముషాలు నిడివి కలిగిన ఈ సినిమా కథను సోషియో ఫాంటసీగా తెరకెక్కించడంలో దర్శకుడు శివ ట్యాలెంట్ కనిపిస్తుంది. తొలుత కథ కొన్ని దశాబ్దాల క్రితం ఓ మారుమూల ప్రాంతంలో మొదలవుతుంది. ఆ తర్వాత ఇండియాలో ప్రస్తుత కాలానికి షిఫ్ట్ అవుతుంది. సూర్య, దిశా పటాని లవ్ ట్రాక్, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీతో ఫస్టాఫ్ బావుంటుంది.
అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషనల్ కంటెంట్ మరియు వార్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఓ భారీ యాక్షన్ ఫైట్‌తో కంగువా పాత్రలో సూర్య ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా మంచు కొండల్లో వచ్చే ఒక ఎపిసోడ్, ఆ తర్వాత అడవిలో వచ్చే సూర్య వర్సెస్ ఆర్మీ వార్ సీన్ ఆడియన్స్‌కు ఓ రేంజ్‌లో హై ఇస్తాయి.
ఒక ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమా ఎండ్ అవుతుంది. అయితే క్లైమ్యాక్స్‌లో రెండు ట్విస్టులతో సెకండ్ పార్ట్‌కు లీడ్ ఇచ్చాడు డైరెక్టర్ శివ. ఇక మూవీ చివరిలో ఓ స్టార్ హీరో క్యామియో పాత్రలో కనిపించి ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ చేస్తాడు. దీంతో కంగువా సెకండ్ పార్ట్‌పై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేశారు. ఇక మొత్తంగా చూస్తే, కంగువా అనే యోధుడు, పులావా అనే బాలుడు కలిసి అనేక జన్మల పాటు చేసే ఎమోషనల్ జర్నీనే ‘కంగువా’ కథ.
ఇక నటీనటుల విషయానికొస్తే, సూర్య అద్భుతమైన నటుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయే నటులలో సూర్య ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన డబ్బింగ్ ఫిల్మ్ ‘కుంతీ పుత్రుడు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ఆ తర్వాత ‘గజినీ, ‘సింగం’ సిరీస్, ఆకాశమే హద్దురా’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
సూర్య యాక్టింగ్‌లో ఒక ఈజ్ ఉంటుంది. ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి ఇష్టపడే ఆయన ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించారు. డ్యూయల్ రోల్స్ లో దేనికదే అన్నట్టు కంప్లీట్ వేరియేషన్ చూపించారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్లలో తనదైన నటనతో మెప్పించారు సూర్య. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకుని వన్ మ్యాన్ షో చేశారు.
ఇక హీరోయిన్ దిశా పటానికి మంచి ప్రాధాన్యమున్న పాత్రే లభించింది. తెరపై ఆమె అందంగా కనిపించింది. ఉన్నంతవరకూ పర్వాలేదనిపించేలా నటించింది. ఇక ‘యానిమల్’ తర్వాత ఫామ్ లోకి వచ్చిన బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ క్రూరమైన విలన్ క్యారక్టర్‌లో అదరగొట్టాడు. ట్రైబల్ పాత్రలలో సూర్యతో ఢీ అంటే ఢీ అనేలా నటించాడు. యోగి బాబు కామెడీ బాగా వర్కవుట్ అయింది. అలాగే జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే, ఈ మూవీ హై స్టాండర్డ్స్‌లో రూపొందింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇంతకుముందు సూర్య సింగం సిరీస్ చిత్రాలకు దేవీ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన విషయం తెలిసిందే. ఇందులోనూ అందుకు తగ్గట్టే అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసింది. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ వస్తాయి. అలాగే పాటలు కూడా స్క్రీన్‌పై చాలా బావున్నాయి.
ఇక వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ అమేజింగ్ అని చెప్పాలి. ఇటీవలికాలంలో మనం చూడని విజువల్స్ ఇందులో కనిపిస్తాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండి మూవీ ఎంగేజ్ చేసేలా ఉంది. అయితే ఇటీవలే ఈ యంగ్ ట్యాలెంటెడ్ ఎడిటర్ మృతి చెందడం తెలిసిందే. అలాగే నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మేకర్స్ ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.
కిమ్ చో-హీ, మిలన్ ద్వయం రూపొందించిన కళా దర్శకత్వం అద్భుతం అనే చెప్పాలి. 1,000 ఏళ్ల నాటి కాలాన్ని కళ్ళముందు ఆవిష్కృతం చేయడంలో సక్సెస్ అయ్యారు. చూస్తుంటే, ఎక్కడా సెట్స్ వేసినట్టుగా కాకుండా రియల్ లొకేషన్స్‌లో ఉన్న ఫీల్ కలుగుతుంది. అలాగే దట్షా ఎ. పిళ్లై మరియు అను వర్ధన్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా అమేజింగ్ అనిపిస్తుంది. ఆటవిక పాత్రధారులు ధరించిన దుస్తులు మునుపెన్నడూ చూడనివిధంగా ఉన్నాయి.
ఇక వీరితోపాటుగా ఈ సినిమాకు పనిచేసిన మేకప్ ఆర్టిస్ట్ కుప్పుసామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సూర్య సహా పలువురి వేషధారణ నిజమైన ట్రైబల్స్ మాదిరి కనిపించారంటే అందుకు కుప్పుసామి ప్రతిభే కారణం. సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో పూర్తి వైరుధ్యం కలిగిన పాత్రలలో ఆయన మేకోవర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. కంగువాలో కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ ఆల్ టైమ్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అపోకలిప్టో’ సినిమాను గుర్తుకుతెస్తాయంటే అతిశయోక్తి లేదు.
ఓవరాల్‌గా కంగువా ఆడియెన్స్‌కి ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా డిఫరెంట్ ఫార్మాట్‌లో సాగుతుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ మూవీని ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే వారిని కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి కంగువా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది. సూర్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: