రివ్యూ: దేవర

Devara Part 1 Review in Telugu

నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్,ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో త‌దిత‌రులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్ర‌ఫీ: రత్నవేలు
ఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె
సమర్పణ: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్
దర్శకత్వం: కొరటాల శివ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌కు తోడు ట్రైలర్స్, సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. మరి ఈసినిమా ఎలా వుంది?రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందా? కొరటాల శివ తారక్‌ మరోసారి ‘జనతా గ్యారేజ్’ మ్యాజిక్ రిపీట్ చేయగలిగారా? అలాగే  తెలుగులో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నారు? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ:

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో రత్నగిరి అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ సముద్రం సమీపంలోని నాలుగు గ్రామాలను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఈ పేరు వెనుక బ్రిటీష్ వారి పరిపాలన నుంచి ఓ చరిత్ర ఉంటుంది. తమ జీవనోపాధికై ఈ గ్రామాల ప్రజలు మురుగ (మురళీ శర్మ) వద్ద పని చేస్తుంటారు. వీరికి దేవర (ఎన్టీఆర్), బైరా (సైఫ్ అలీఖాన్) నాయకత్వం వహిస్తుంటారు.

వీరి పని సముద్రంలోని కార్గో షిప్పుల్లో అక్రమంగా వచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తీసుకు రావడం. కానీ, అందులో ఏముందనేది వీరు పట్టించుకోరు. అయితే ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ఇలా ఓసారి అక్రమంగా తాము తీసుకొచ్చిన సరుకు వల్ల ఒక ప్రాణం పోయిందని తెలిసిన దేవర ఇకపై మురుగ కోసం పని చేయకూడదని నిర్ణయిస్తాడు. బ్రతుకుదెరువుకు ఎన్నో మార్గాలున్నాయని, అంతగా అయితే చేపలు పట్టుకుని బతుకుదాం అని తన వాళ్ళకి నచ్చచెబుతాడు.

ఎర్ర సముద్రంలో దేవర మాటకు తిరుగుండదు, అతడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. దీంతో అతడి నిర్ణయం నచ్చకపోయినా మౌనంగా ఉండిపోతాడు బైరా. ఆ తర్వాత మరోసారి దీని గురించి మాట్లాడి దేవరను ఒప్పించాలని భావిస్తాడు. కానీ భైరా మాట దేవర వినిపించుకోకపోవడంతో ఇద్దరి మధ్య నెమ్మదిగా అంతరం పెరుగుతుంది. ఈ క్రమంలో దేవరను అడ్డు తొలగించుకోవడానికి పథకం వేస్తాడు.

తద్వారా సముద్రంపై తన ఆధిపత్యం పెంచుకోవాలని భావిస్తాడు. ఈ నేపథ్యంలో దేవర అనూహ్యంగా మాయం అవుతాడు. కానీ, తాను అజ్ఞాతంలో ఉంటూనే మిగతావారు సముద్రంపైకి వెళ్లాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. మరోవైపు దేవర కొడుకు వర (ఎన్టీఆర్) తండ్రి కోసం ఏం చేశాడు? తనని ఇష్టపడే తంగం (జాన్వీ కపూర్)తో ప్రేమ వ్యవహారం ఏమైంది? సింగప్ప (ప్రకాష్ రాజ్) ఎవరు?

అసలు దేవరను చంపడం కోసం బైరా ఏం చేశాడు? తండ్రి దేవర వీరుడు అయితే, అతని కొడుకు వర భయం భయంగా ఎందుకు తిరుగుతున్నాడు? సింగప్ప (శ్రీకాంత్), అతని కుమార్తె తంగం (జాన్వీ కపూర్) పాత్రలు ఏమిటి? ఇంతకూ ఎర్ర సముద్రంలో ఏం జరిగింది? ఎర్ర సముద్రం మీదకు స్మగ్లింగ్ కోసం వెళ్లడానికి భయపడేంతగా దేవర ఏం చేశాడు? ఈ భయం ఎంతకాలంపాటు కొనసాగింది? చివరకు ఏం తేలింది? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ:

1990 దశకంలో జరిగే ఇతివృత్తంతో సినిమా ప్రారంభవుతుంది. ఎర్ర సముద్రం ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు కొరటాల శివ. బ్రిటీష్ కాలం నాటి చరిత్ర కలిగిన ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడి ప్రజల జీవనశైలి ఎలా ఉంటుంది? ఆ ఎర్ర సముద్రానికి కాపలాగా ఉండే దేవర ఎవరు? వీటి గురించి ప్రకాష్ రాజ్ పాత్రతో చెప్పిస్తూ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టిన తీరు మెప్పిస్తుంది.

ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసిన సీన్స్ హైలైట్. ఇక్కడ దేవర పాత్రను చూపించిన విధానం, ఆ ఎలివేషన్స్ చూస్తుంటే ఒక సునామీని చూసినట్టు అనిపిస్తుంది. సంద్రంలోని నౌకలలోకి దేవర సైన్యం వెళ్లే తీరు, కంటైనర్లలోని సరుకును దొంగిలించడం ప్రేక్షకుడికి థ్రిల్ పంచుతుంది. ఆ సీన్స్ చూస్తుంటే, మనం కూడా నిజంగానే ఎర్ర సముద్రంలో ఉన్నామా? అన్న భ్రమ కలుగుతుంది.

ఫస్టాఫ్‌ అంతా ఎర్ర సముద్రం కథ, పోరాటాలు, దేవర- భైరా ఇంట్రడక్షన్, రత్నగిరిలో జాతర, ఆయుధ పూజ, ఈ నేపథ్యంలో వచ్చే కుస్తీపోటీలు సూపర్బ్ అనిపిస్తాయి. సమ ఉజ్జీల్లాంటి దేవర, భైర పాత్రల మధ్య అంతర్యుద్ధానికి దారితీసే పరిస్థితులు, ఈ నేపథ్యంలో వచ్చే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే, హై ఇచ్చే సీన్స్ లేకపోయినా స్టోరీ నేరేషన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. దేవర మాయమవడం, సముద్రంపై భైరా ఆధిపత్యం కోసం ప్రయత్నించడం, అజ్ఞాతంలో ఉండే దేవర భైరా ప్రయత్నాలను అడ్డుకోవడం వంటి సీన్స్ బావుంటాయి. ఇక క్లైమాక్స్ ముందు వచ్చే చివరి అరగంట ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుంది. ఆఖరులో దేవర పార్ట్ 2కి లీడ్ చేసే సన్నివేశంతో సినిమాను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా రావడం, అందులోనూ సోలో హీరోగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించడంతో ఇటు అభిమానుల్లోనూ అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ హైప్ నెలకొంది. ఎంటైట్ ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి క్యారక్టర్ ఇచ్చినా అద్భుతంగా నటించగలిగిన ఎన్టీఆర్.. దేవరతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు.

దేవర మరియు వర పాత్రలలో తండ్రీకొడుకులుగా విభిన్నమైన నటన కనబరిచాడు. తండ్రి పాత్రలో ఒకవైపు భయపెడుతూనే, ఇంకోవైపు పిరికివాడైన కొడుకు పాత్రలో అమాయకత్వంతో సున్నితమైన హాస్యం పండించాడు. ఇక జాన్వీతో రొమాన్స్ సీన్స్‌లో అయితే తారక్ లోని సరికొత్త యాంగిల్ కనిపిస్తుంది. తారక్ ఈ సినిమాలో నట విశ్వరూపం ప్రదర్శించాడు. సినిమా మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేసేశాడని చెప్పొచ్చు.

అలాగే ఈ చిత్రంతోనే తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అలనాటి అందాలతార శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ కేవలం అందంతోనే కాకుండా నటనలోనూ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. వుండేది కొద్దిసేపే అయినా తంగం పాత్రలో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో సున్నితమైన భావాలను అలవోకగా పలికించింది. సీరియస్‌గా సాగే కథలో తారక్-జాన్వీ మధ్య లవ్ ట్రాక్ మెప్పిస్తుంది.

ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కి కూడా తెలుగులో ఇదే మొదటిచిత్రం. ‘భైరా’ పాత్రలో ఆయన క్రూరమైన విలన్‌గా భయపెట్టాడు. ఇప్పటివరకూ సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే చేసిన సైఫ్ తొలిసారి ‘ఆదిపురుష్’ చిత్రంలో రావణాసురుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే అందులోకంటే ఈ సినిమాలో ఆయన చాలా పవర్‌ఫుల్ రోల్‌ ప్లే చేశాడు. దేవరకి ధీటైన ప్రత్యర్థిగా సైఫ్ నటన బాగుంది.

ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, పాత్రలకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ లభించింది. దేవర కథను వివరించే ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ తన గంభీరమైన గాత్రంతో ఆకట్టుకున్నాడు. దేవర కొడుకు ‘వర’ కు అన్నింటా అండగా ఉండే పాత్రలో శ్రీకాంత్ నటన సినిమాలో గుర్తుండిపోతుంది. గురించి అలాగే ‘దసరా’ ఫేమ్ షైన్ టామ్ చాకో కూడా కీలక పాత్రలో మెరిశాడు. అజయ్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.

ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే.. దేవర మొత్తానికి బ్యాక్‌బోన్‌గా నిలిచింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అతను అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బీజీఎమ్ గూస్‌బంప్స్ తెప్పించేలావుంది. అలాగే పాటల్లోనూ అనిరుధ్ మ్యాజిక్ కనిపిస్తుంది. సినిమా చుసిన ప్రతిఒక్కరూ అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారంటేనే తెలుస్తోంది తను ఈ మూవీకి ఎంత ఎస్సెట్ అనేది.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. కొరటాల శివ రాసుకున్న కథను తెరపై విజువల్‌గా ప్రజెంట్ చేయడంలో తన మార్క్ చూపించాడు. సాబు శిరిల్ ఆర్ట్ వర్క్ అమేజింగ్‌గా ఉంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నిజంగానే వీటిని సముద్రంపై చిత్రీకరించారు అనేలా సూపర్ ఫీల్ కలగజేశారు. అలాగే నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారని అండర్‌ వాటర్‌ సీన్స్‌ చూస్తే అర్ధమవుతుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఇక దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ లేట్ అయినా సాలిడ్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఈ విజయంతో దేవర పార్ట్ 2పై ఇప్పటినుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. మొత్తానికి దేవర చిత్రం ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.