ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన ట్రెండ్ కల్ట్ సినిమా. ఎమోషన్స్ ను సహజంగా, రఫ్ గా, కొంత మొరటుగా చెప్పడం, చూపించడమే కల్ట్ సినిమా లక్షణంగా భావించబడుతోంది. ఇలాంటి కథాంశాలకు వర్తమానం కన్నా రెండు మూడు దశాబ్దాల నాటి ఫ్లాష్ బ్యాక్ తో సాగే పిరియడ్ స్టోరీలు అయితేనే మంచి నాస్టలాజికల్ ఫీలింగ్ తో నాచురల్ గా చిత్రీకరించొచ్చు అన్నది కొందరు దర్శక నిర్మాతల అభిప్రాయం.
సంవత్సరం క్రితం రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో చేసిన ‘రంగస్థలం ‘ అద్భుత విజయాన్ని సాధించడంతో ఈ సహజ నేపథ్య చిత్రాల పట్ల సరికొత్త ఆసక్తి ఏర్పడింది. అలాంటి ఆసక్తి నుండి పుట్టినదే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన’ పలాస – 1978 ‘ చిత్రం. బడుగు బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిని ఎదిరించే కథాంశంతో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. తక్కువ జాతి మీద ఎక్కువ జాతి ఎక్కుపెట్టే వివక్ష చివరకు తిరుగుబాటు గా పరిణమిస్తే ఏం జరుగుతుంది…? ఏలాంటి పరిణామాలు ఎదురౌతాయి అనే కథాంశంతో రూపొందిన కల్ట్ అండ్ పీరియడ్ ఫిల్మ్ ‘పలాస 1978’ ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉత్తరాంధ్రలో జీడిపప్పు ఉత్పత్తికి, ప్రాసెసింగ్ కు పెట్టింది పేరైన పట్టణం పలాస. ఆ ఊరిలో అన్నదమ్ములైన రంగారావు( తిరువీర్) , మోహన్ రావు (రక్షిత్) ఉత్తరాంధ్ర సంప్రదాయ జానపద కళాకారులు. పండుగలు పబ్బాలకు పాటలు పాడుకుంటూ , చిందేస్తూ అదే జీవనభృతిగా బతుకుతుంటారు. ఆ వూరి పెద్ద షావుకారు, అతని తమ్ముడైన చిన్న షావుకారు( రఘు కుంచే) మధ్య ఆధిపత్యపోరు నడుస్తూ ఉంటుంది. అన్నదమ్ముల్లో చిన్నవాడైన మోహన రావు మంచి ఆటగాడు పాటగాడు… అంతకుమించి ఆవేశపరుడు కూడా. ఆ వూరి మంచి నీళ్ల బావిలో నీళ్లు తోడుకున్న పాపానికి తమ ఆడవాళ్లను అవమానించిన పెద్ద షావుకారు కొడుకు మీద తిరగబడతాడు మోహన్ రావు. మరోమారు సినిమా హాలు వద్ద టికెట్ల విషయంలో తమ ఆడవాళ్లను నీచంగా మాట్లాడటంతో పెద్ద షావుకారు కొడుకును చితక్కొట్టాడు. బైరాగి అనే రౌడీ అండతో పెత్తనం చెలాయిస్తున్న పెద్ద షావుకారు కొడుకునే కొట్టడంతో మోహన్ రావు, అతని అన్న రంగారావులకు ఊర్లో పాపులారిటీ పెరుగుతుంది. ఆ తరువాత బైరాగినే లేపేసాడు మోహన్ రావు. దాంతో ఈ అన్నదమ్ములు ఇద్దరిని దగ్గరకు తీస్తాడు చిన్న షావుకారు. ఎన్నికల్లో చిన్న షావుకారు పక్షాన నిలబడి గెలుపు కోసం కృషి చేసినందుకు తనకు కూడా పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ ఇమ్మని అడుగుతాడు రంగారావు…
ఆఫ్ట్రాల్ మా వెనక తిరిగే బానిస గాడివి… నీకు పదవి కావాలా అని అవమానిస్తాడు చిన్న షావుకారు. ఆ అవమానం నుండి ప్రారంభమైన అన్నదమ్ముల అంతర్మధనం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది… చివరకు ఏం జరిగింది? పలాస లో ఎవరిది పైచేయి అయింది? 1978 నుండి జరిగిన ఈ పరిణామాల పర్యవసానం ఏమిటి అన్నది మిగిలిన కథాంశం. ఈ కథాంశం లోనే అంతర్భాగంగా సాగుతుంది బావా మరదళ్లయిన మోహన్ రావు , లక్ష్మి( నక్షత్ర) ల ప్రేమ కథ.
కారంచేడు, నీరు కొండ వంటి చోట్ల దళితులపై జరిగిన అగ్రవర్ణాల దౌర్జన్య కాండను తలపించే సంఘటనలు కూడా ఇందులో ఉంటాయి.
దర్శకత్వం ఎలా ఉంది:
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కరుణ కుమార్ తొలి ప్రయత్నంలోనే మంచి పరిణితి కనిపించింది. రొటీన్ కు భిన్నంగా ఒక వినూత్న ప్రయత్నం చెయ్యాలి అన్న తపన కరుణ కుమార్ లో నిండుగా కనిపించింది. ఈ చిత్రానికి మాటల రచయిత కూడా తానే కావటంతో డైలాగుల్లో ఉత్తరాంధ్ర యాసను చాలా సహజంగా పలికించాడు. ఒక పీరియడ్ ఫిలిం తీస్తున్నప్పుడు ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు, అప్పటి జీవన ప్రమాణాలు, పరిస్థితుల పట్ల పూర్తిస్థాయి అవగాహన, ఆకలింపు దర్శకుడి లో ఉండాలి. అలాంటి అబ్జర్వేషన్ తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను చాలా సహజంగా చిత్రీకరించాడు కరుణ్ కుమార్ . అయితే గతంలో ఇలాంటి కథాంశాలు చాలా వచ్చి ఉండటంతో దర్శకుడిగా కొత్తగా చెప్పటానికో, ప్రతిపాదించడానికో అవకాశం కొరవడింది. దానికి తోడు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి.. సాధారణంగా దర్శకులకు తమ అవుట్పుట్ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది.. అందుకే ఎడిటింగ్ టేబుల్ వద్ద ప్రతి షాట్ అపురూపంగా అనిపించి కత్తెర పెట్టనివ్వరు. అందువల్ల సినిమా నిడివి విషయంలో నియంత్రణ లోపిస్తుంది. ఇందులో కూడా కొన్ని రిపీటెడ్ సీన్స్, షాట్స్ వల్ల లెంగ్తీ ఫీలింగ్ కలుగుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఒక కొత్త దర్శకుడు నుండి ఇలాంటి వైవిధ్య చిత్రం రావటం నిజంగా అభినందనీయం.
పర్ఫార్మెన్స్:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రతి ఆర్టిస్ట్ నుండి చాలా చక్కని పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. హీరో రక్షిత్ 4 వేరియేషన్స్,4 ఏజ్ గ్రూపులకు చెందిన మోహన్ రావు పాత్రను చాలా చక్కగా పోషించాడు. లవర్ బాయ్ క్యారెక్టర్స్ చేయాల్సిన ఏజ్ అండ్ స్టేజిలో ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ ను వెల్కమ్ చేయటం సాహసమే. డబ్బింగ్ పరంగా, ఎక్స్ప్రెషన్స్ పరంగా కొంచెం బెటర్ మెంట్ కు ప్రయత్నించాలి రక్షిత్.
ఇక ఇందులో మెయిన్ విలన్ గా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రఘు కుంచే నటించటం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ఇక మిగిలిన అందరూ కొత్త వాళ్లు కావటంతో పేర్లు ప్రస్తావించలేము గానీ పెద్ద షావుకారు, బైరాగి, మోహన్ రావు ఫ్రెండ్, ఇన్స్పెక్టర్ తదితర పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరూ up to the mark అన్నట్లుగా నటించారు. ఇక హీరోయిన్ లక్ష్మీ పాత్రలో నక్షత్ర ఒదిగిపోయింది. క్యారెక్టర్ నటిగా మంచి గుర్తింపు పొందిన మిర్చి మాధవి ఇందులో పెద్ద షావుకారు భార్యగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
టెక్నికల్ అండ్ మేకింగ్ హైలెట్స్ :
మెయిన్ విలన్ గా తెరమీద మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మూడు పాటల మంచి ఆడియో ఇచ్చిన రఘు కుంచే రీరికార్డింగ్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళారు. విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇక నిర్మాతలు అట్లూరి వర ప్రసాద్, ధ్యాన్ అట్లూరిల మేకింగ్ స్టాండెడ్ ను ప్రత్యేకంగా అభినందించాలి. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కూడా డేర్ చేయలేని ఇలాంటి రేర్ అటెంప్ట్ తో తమ అభిరుచిని ఆవిష్కరించుకున్నారు నిర్మాతలు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రూపొందిన ‘పలాస 1978 ‘ ఆర్థిక విజయం ఎలా ఉంటుందో చెప్పలేం గానీ నైతికంగా ఇదొక అభినందనీయ ప్రయత్నం అని చెప్పవచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: