‘సైరా నరసింహారెడ్డి’ విజయ నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వగృహంలో కలిసి అభినందించారు. చరిత్ర విస్మరించిన ఒక స్వాతంత్ర పోరాట యోధుడి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనకు బొకే అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ ” సైరా” సినిమా చూసి నా సహా నటీనటులు, పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు అభినందిస్తుంటే చాలా ఆనందం వేసింది. అయితే నా కుటుంబ సభ్యుల్లాంటి ఫిల్మ్ జర్నలిస్ట్ ల నుండి ఇలాంటి అభినందన దక్కటంతో నేను పడిన శ్రమకు, తీసుకున్న రిస్కు కు తగిన గౌరవం లభించినట్లుగా భావిస్తున్నాను”- అన్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్టులతో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అనేక విషయాలను ముచ్చటించారు మెగాస్టార్ చిరంజీవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోల్డెన్ జూబ్లీ వేడుకలకు నేనున్నాను- నేనొస్తాను – మెగా హామీ:
“ 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి నాతో వ్యక్తిగతంగా 40 సంవత్సరాల అనుబంధం కలిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించండి. మీకు అండగా నేను ఉంటాను… నేను వస్తాను ” – అని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. “ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్” ఆవిర్భవించి ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము.. మీ సహకారం కావాలి” అని అడిగినప్పుడు పై విధంగా స్పందించారు మెగాస్టార్. ఇప్పుడు కొత్తగా వస్తున్న కొద్దిమంది జర్నలిస్టులు మినహా ఫిల్మ్ జర్నలిస్టులలో సీనియర్స్ అందరూ నాకు సుపరిచితులు. అందరితో మంచి అనుబంధం ఉంది. అలాంటి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు సహకరించటం నా బాధ్యతగా భావిస్తాను”- అన్నారు చిరంజీవి. దాదాపు గంటకు పైగా సాగిన ఆత్మీయ భేటీ లో చిరంజీవి కనబరిచిన సహృదయ స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిష్క్రమించారు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు.
మెగాస్టార్‌ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండేటి సురేష్, కార్యదర్శి ఇ. జనార్దన్‌రెడ్డి, గోల్డెన్‌జూబ్లీవేడుక ఛైర్మన్ బి.ఎ.రాజు, సీనియర్ జర్నలిస్టు ప్రభు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి.జి.భవాని, సజ్జావాసు, కోశాధికారి భూషణ్, పర్వతనేని రాంబాబు, మడూరి మధు, కార్యవర్గ సభ్యులు సాయిరమేష్, ముత్యాల సత్యనారాయణ, మురళి (శక్తిమాన్), చిన్నమూల రమేష్, జిల్లా సురేష్ తదితరులు వున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























