రివ్యూ: లక్కీ భాస్కర్

Lucky Baskhar Review in Telugu

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, అయేషా ఖాన్, పి. సాయి కుమార్‌, హైపర్ ఆది తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్ర‌ఫీ: నిమిష్ రవి
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకీ అట్లూరి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ మలయాళ నటుడు, ‘మహానటి’, ‘సీతారామం’ చిత్రాల ఫేమ్ దుల్కర్ సల్మాన్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. 1990వ దశకంలో ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితంలో ఆర్ధికంగా ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నాడన్న నేపథ్యంలో తెరకెక్కింది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

దీంతో ‘కింగ్ ఆఫ్ కోథా’ తర్వాత దుల్కర్ 32వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. అయితే క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సక్సెస్ అయిందా? దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో మరో హిట్ పడిందా? వెంకీ అట్లూరి టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:

1992లో హర్షద్ మెహతా అనే ఇండియన్ స్టాక్ బ్రోకర్ ఆనాటి బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని భారీ మోసానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ స్కామ్ ని బేస్ చేసుకునే ‘లక్కీ భాస్కర్’ కథ రాసుకున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

కథ 1990లో ముంబైలో ప్రారంభమవుతుంది. భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) మగధ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజ‌ర్‌. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు (మాస్టర్ రిత్విక్)తో కలిసి జీవిస్తుంటాడు. బ్యాంక్‌లో వచ్చే రూ.19వేల జీతం సరిపోక అవసరాల కోసం ఊరంతా అప్పులు చేస్తాడు.

వీరిది ప్రేమ వివాహం కావడం వల్ల సుమతి ఇంట్లో వాళ్ళకి భాస్కర్ అంటే అయిష్టత. పైగా డబ్బు లేదని చిన్న చూపు చూస్తుంటారు. దీనికి తోడు బ్యాంక్‌లో అతడికి దక్కాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించాలని నిశ్చయించుకున్న భాస్కర్ అందుకు ఓ పథకం వేస్తాడు.

అయితే ఆ బ్యాంక్ లో జరిగిన స్కామ్ లో అతడి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అతడిని విచారణ నిమిత్తం భాస్కర్ ని అదుపులోకి తీసుకుంటారు. విచారణలో భాగంగా భాస్కర్ అకౌంట్ చూసి షాక్ తింటారు అధికారులు. ఎందుకంటే? అతడి అకౌంట్ లో రూ.100 కోట్లు వుంటాయి.

అయితే రెండేళ్ళ క్రితం కేవలం 9వేల జీతానికి పని చేసే భాస్కర్ కి అంత డబ్బు ఎలా వచ్చింది? మగధ బ్యాంక్ లో జరిగిన స్కామ్ ఏమిటి? అసలు ఈ స్కామ్ కి హర్షద్ కి వున్న లింక్ ఏమిటి? భాస్కర్ నిజంగానే ఈ స్కామ్ చేశాడా? చివరికి ఈ స్కామ్ నుంచి అతను సేఫ్ గా బయటపడ్డాడా లేదా? అనేది తక్కిన కథ.

విశ్లేషణ:

కథగా చెప్పాలంటే, ఇదొక కామన్ మ్యాన్ స్టోరీ. సినిమా ఆరంభంలోనే హీరో పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిడిలు అన్నీ చాలా సహజంగా చూపించాడు. దీంతో ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో రిలేట్ అవుతారు. ఇక్కడినుంచే చూసే ప్రేక్షకుడు కూడా భాస్కర్ పాత్రతో ప్రయాణిస్తారు. అందుకే ఒకదశలో తను తప్పుదారిలో నడుస్తున్నట్టు అనిపించినా అతడే గెలవాలని కోరుకుంటారు.

భాస్కర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేయడం, విచారణలో భాస్కర్ వారికీ తన కథను వివరించడంతో సినిమా ప్రారంభం అవుతుంది. డబ్బు లేక పోవడం వలన భాస్కర్ కుటుంబం ఎన్ని కష్టాలు పడింది? ఎన్ని అవమానాలు ఎదుర్కొంది? అనే విషయాలను చాలా ఎఫెక్టివ్‌గా, ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు.

ఎప్పుడైతే భాస్కర్ ఇల్లీగల్‌గా డబ్బు సంపాదించాలని డిసైడ్ అవుతాడో అక్కడినుంచి మూవీలో ఉత్కంఠ పెరుగుతుంది. ఈ క్రమంలో ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఒక హై ఇచ్చే సీన్, లేదా ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఈ సన్నివేశాలు ఆడియన్స్‌ను థ్రిల్ కి గురిచేస్తాయి. భాస్కర్ చేసే ప్రతి పని ఒక అడ్వెంచర్ లా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్‌ అయితే మైండ్ బ్లోయింగ్ అన్నట్టు ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో కథ మరో మరో టర్న్ తీసుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అసలైన స్టాక్ మార్కెట్ స్కామ్ అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అయాచితంగా వచ్చి పడే డబ్బు భాస్కర్‌ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? మితిమీరిన ధనంతో అతడి ప్రవర్తన ఎలా మారింది? భాస్కర్‌ను తిరిగి నేల మీదకు తీసుకువచ్చింది ఏంటి? అనే వాటిని ఎమోషనల్ గా బాగా ప్రజెంట్ చేసారు.

సాధారణంగా ఫైనాన్షియల్ క్రైమ్ సబ్జెక్ట్‌ నేపథ్యంలో వచ్చే సినిమాల్లో హీరో క్యారక్టర్ రైజ్, ఫాల్, మళ్లీ రైజ్.. ఇలా ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ ఉంటుంది. కానీ లక్కీ భాస్కర్‌లో మాత్రం రైజ్, రియలైజేషన్ మాత్రమే ఉంటాయి. క్లైమాక్స్ లో మళ్లీ ఒక హై పాయింట్‌తో మూవీ ఎండ్ అవుతుంది.

అయితే సినిమాలో ఒక్క ఫైట్ సీన్ లేకపోయినా కూడా ప్రేక్షకుడికి ఆ లోటు తెలియదు. చాలా చోట్ల హీరోయిజం ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా పడ్డాయి. దుల్కర్ ఫ్యామిలీ పేస్ చేసిన ప్రతి అవమానానికి తర్వాతి సీన్లలో సమాధానం ఉంటుంది. అలాగే డబ్బు వచ్చాక దుల్కర్ చేసిన ప్రతి అవమానానికి ఒక క్షమాపణ కూడా ఉంటుంది.

అతను చేసిన తప్పును గుర్తించి రియలైజ్ అయ్యి తను చేసిన తప్పులకు సారీ చెప్పినా కూడా ఆడియన్స్ శాటిస్‌ఫ్యాక్షన్ ఫీల్ అవ్వడం విశేషం. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ హైలైట్ అని చెప్పొచ్చు.. ‘వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడో ఒకసారి మనిషిని కింద పడేస్తాయి’ వంటి మాటలు మనసుని తాకుతాయి. భాస్కర్ కొడుకు బర్త్‌డే తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ అయితే మరో హైలెట్.

ఇక నటీనటుల విషయానికొస్తే, దుల్కర్ సల్మాన్ గురించి ప్రేక్షకుల్లో ఒక ఫీల్ గుడ్ భావన ఉంది. దీనికి కారణం ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలే. నటనలో ఈజ్‌తో పాటు తనకి నప్పే కథలను ఎంచుకోవడం దుల్కర్ బలం అని చెప్పొచ్చు. ఇదేకోవలో తాజాగా ఈ సినిమా కూడా అతని కథల ఎంపికలో ఉండే వైవిధ్యత ఏంటో మరోసారి నిరూపించింది. మహానటి, సీతారామం చిత్రాల తరహాలో మరోసారి విలక్షణ పాత్రలో కనిపించి మెప్పించాడు దుల్కర్. మిడిల్ క్లాస్ వ్యక్తి పాత్రలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో తన ప్రతిభ కట్టిపడేస్తుంది.

ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరికి కథ ప్రకారం, సినిమాలో కీలక పాత్ర లభించిందని చెప్పొచ్చు. తన పాత్రకు న్యాయం చేసింది. కెరీర్ ప్రారంభంలోనే గృహిణిగా, ఒక బిడ్డకు తల్లిగా బరువైన పాత్ర పోషించింది. సుమతి పాత్రలో తను పర్ఫెక్ట్‌గా ఇమిడిపోయింది. ఇక అయేషా ఖాన్, పి. సాయి కుమార్‌, హైపర్ ఆది తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

అలాగే టెక్నికల్ విషయానికొస్తే, లక్కీ భాస్కర్ హై స్టాండర్డ్స్‌లో రూపొందింది. టెక్నికల్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. కేవలం పాటలే కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో వచ్చే బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

సినిమాటోగ్ర‌ఫర్ నిమిష్ రవి పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 90ల నాటి ప్రజల జీవన విధానాన్ని, అప్పటి బ్యాంకు వాతావరణాన్ని ఆయన మంచి కెమెరా ఒడిసిపట్టింది. సినిమాలో విజువల్స్ ఆకట్టుకుంటాయి, లొకేషన్స్ బావున్నాయి. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్టయిల్లో చాలా షార్ప్‌గా ఉంది. అలాగే నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మేకర్స్ ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా లక్కీ భాస్కర్ ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్ కాన్సెప్టుతో సాగుతుంది. ముఖ్యంగా ఫామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.